భారత్, జపాన్‌లకు విదేశీయులంటే గిట్టదని జో బైడెన్ ఎందుకన్నారు?

జో బైడెన్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, బెర్న్డ్ డిబస్‌మన్ జూనియర్
    • హోదా, బీబీసీ న్యూస్ వాషింగ్టన్

భారత్, జపాన్‌‌లను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ జెనోఫోబిక్‌గా అభివర్ణించారు. వాటిని రష్యా, చైనాలతో పోలుస్తూ 'వలసదారులను ఇష్టపడని' దేశాలుగా పేర్కొన్నారు.

విదేశీయులపై తీవ్రమైన అయిష్టత చూపడాన్ని జెనోఫోబిక్‌గా వ్యవహరిస్తారు.

జపాన్ ప్రధాన మంత్రి ఫుమియో కిషిడా పర్యటన సందర్భంగా, అమెరికా - జపాన్ సంబంధాలు 'విడదీయరానివి'అని పేర్కొన్న కొద్దివారాలకే జపాన్‌పై ఆయన ఈ విమర్శలు చేశారు.

భారత్‌లో మానవ హక్కులు, మత స్వేచ్ఛ గురించి అమెరికా ఆందోళన చెందుతున్నప్పటికీ, అమెరికాకు భారత్ కీలక భాగస్వామి.

అయితే, ఏ దేశాన్నీ తప్పుబట్టడం బైడెన్ వ్యాఖ్యల ఉద్దేశం కాదని వైట్‌హౌస్ పేర్కొంది.

బుధవారం సాయంత్రం జరిగిన ఎన్నికల ప్రచార నిధుల సేకరణ కార్యక్రమంలో, ప్రధానంగా ఆసియా - అమెరికన్లను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ నవంబర్‌లో జరగనున్న అమెరికా ఎన్నికలు 'స్వేచ్ఛ, అమెరికా, ప్రజాస్వామ్యానికి' సంబంధించినవని బైడెన్ అన్నారు.

'ఎందుకంటే, మేం వలసదారులను స్వాగతిస్తాం' అన్నారాయన.

''ఒకసారి ఆలోచించండి. చైనా ఆర్థికంగా ఎందుకు దెబ్బతింటోంది? జపాన్ ఎందుకు ఇబ్బందుల్లో ఉంది? అలాగే, రష్యా? భారత్? ఎందుకంటే, అవి జెనోఫోబిక్. వాళ్లు వలసదారులను ఇష్టపడరు.''అన్నారు.

ఈ వ్యాఖ్యలపై స్పందన కోసం బీబీసీ జపాన్, భారత్, చైనా, రష్యాలోని అమెరికా రాయబార కార్యాలయాలను సంప్రదించింది. కానీ, వెంటనే స్పందన రాలేదు.

జో బైడెన్

ఫొటో సోర్స్, Getty Images

అయితే, ఈ వ్యాఖ్యలపై అమెరికాకు చెందిన కొందరి నుంచి విమర్శలు వచ్చాయి.

''జపాన్, భారత్ మాకు అత్యంత దృఢమైన, ముఖ్యమైన మిత్రదేశాలు'' అని ట్రంప్ ప్రభుత్వంలో యూఎస్ డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్‌గా పనిచేసిన ఎల్‌బ్రిడ్జ్ కాల్బీ సోషల్ మీడియా వేదిక ఎక్స్‌(ట్విటర్‌)లో రాశారు.

''మనం వారితో గౌరవంగా మాట్లాడాలి. అందుకు వారు అర్హులు. మన మిత్రదేశాలకు సంకుచిత భావాలను ఆపాదించడం అన్నది మనల్ని మనం ఎక్కువగా ఊహించుకోవడం, మూర్ఖత్వం'' అన్నారు.

జపాన్, భారత్, చైనాలో వలస కార్మికుల సంఖ్య చాలా తక్కువే అయినప్పటికీ, రష్యా మాత్రం వలస కార్మికులపై ఎక్కువగా ఆధారపడుతోంది. వారిలో మధ్య ఆసియా నుంచి వచ్చిన వారే ఎక్కువ.

జపాన్, చైనాలో ఆర్థిక వృద్ధి మందగించినప్పటికీ, రష్యా పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంది. అంతర్జాతీయ ఆంక్షలు, యుక్రెయిన్‌తో యుద్ధం కొనసాగుతున్నప్పటికీ రష్యా ఆర్థిక వ్యవస్థ గతేడాది కొద్దిగా పుంజుకుంది.

అదే సమయంలో భారత్ స్థిరమైన వృద్ధిని సాధించింది. 2023లో యూకేని అధిగమించి ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది.

బైడెన్ వ్యాఖ్యలు అవమానకర రీతిలో ఉన్నాయనే వాదనలను వైట్ హౌస్ తోసిపుచ్చింది. అమెరికా ఇమ్మిగ్రేషన్ విధానాన్ని వివరించే క్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారని నేషనల్ సెక్యూరిటీ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ అభిప్రాయపడ్డారు.

''వారికి, వారి స్నేహానికి, వారి సహకారానికి అధ్యక్షుడు బైడెన్ ఎంత విలువ ఇస్తారో మా మిత్రదేశాలు, భాగస్వాములకు బాగా తెలుసు.'' అన్నారు.

నరేంద్ర మోది

ఫొటో సోర్స్, Getty Images

బైడెన్ వ్యాఖ్యలు జాతీయవాద భావజాలం విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న భారత్‌లో ఆమోదయోగ్యం కాకపోవచ్చని వాషింగ్టన్ డీసీకి చెందిన అమెరికన్ ఎంటర్‌ప్రైజెస్ ఇన్‌స్టిట్యూట్‌‌లో దక్షిణాసియా వ్యవహారాల నిపుణులు సదానంద ధూమే బీబీసీతో మాట్లాడుతూ అన్నారు.

''బైడెన్ భారత్‌తో స్నేహపూర్వకంగా లేడనే భావన భారతీయుల్లోని ఒక వర్గంలో స్థిరపడుతుంది'' అని ఆయన చెప్పారు. ''చైనా వంటి నిరంకుశ దేశాల సరసన భారత్‌ను చేర్చడాన్ని వారు అంగీకరించరు.'' అన్నారు.

యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ ఏప్రిల్ చివర్లో విడుదల చేసిన నివేదికలో భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నాయని పేర్కొంది. అయితే, ''ఇది పూర్తిగా పక్షపాత వైఖరితో రూపొందిన నివేదిక, ఇది భారత్‌పై అవగాహనాలేమిని ప్రతిబింబిస్తోంది'' అని భారత ప్రభుత్వం పేర్కొంది.

అయితే, దీర్ఘకాలిక ప్రయోజనాలపరంగా చూస్తే, ''ఇవి టీ కప్పులో తుపాను లాంటివి, అమెరికా - భారత్ సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం లేదు'' అని ధూమే అన్నారు.

జపాన్ దశాబ్దాలపాటు వలసదారులను పరిమితంగానే అనుమతించింది. అయితే, క్రమంగా తగ్గిపోతున్న దేశ జనాభా సమస్యను పరిష్కరించేందుకు ఇటీవల విదేశీ కార్మికుల రాకకు సంబంధించిన ఇమ్మిగ్రేషన్ విధానాలను సులభతరం చేసే దిశగా ప్రయత్నాలు చేసింది.

20020లో తన ఎన్నికల ప్రచారంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను పదేపదే జెనోఫోబిక్‌గా అభివర్ణించారు జో బైడెన్‌. అయితే, ఆ తర్వాత అమెరికా - మెక్సికో సరిహద్దు నిర్వహణలో వ్యవహరించిన తీరుపైన, రాజకీయపరంగానూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం కావడంతో వలసల నియంత్రణకు కఠిన విధానం తీసుకొచ్చారు.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)