ఏపీ, తెలంగాణ: సింగిల్ స్క్రీన్ థియేటర్లు కనుమరుగు, వెండితెర ఎందుకు మసకబారుతోంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో ఐటీ ఉద్యోగినిగా పనిచేసే కీర్తిప్రియకు సినిమాలంటే ఇష్టం. ఒకప్పుడు సినిమాలు చూడాలంటే తప్పకుండా థియేటర్‌కి వెళ్లాలని అనుకొనేవారు కీర్తిప్రియ.
‘‘నాకు థియేటర్‌కు వెళ్లడానికి ఇప్పుడు అంత టైం లేదు. అందుకే సినిమా అంటే ఓటీటీనే గుర్తుకు వస్తుంది. ఒకప్పుడు ఓటీటీలో కాదు, థియేటర్‌కు వెళితే సినిమా చూసినట్లుగా భావించేదాన్ని. కానీ, సినిమా చూసే విషయంలో నా ఆలోచన చాలా మారింది. థియేటర్‌కు వెళ్లి ఒక సినిమా చూసే ఖర్చుతో ఏడాదికి ఓటీటీ సబ్ స్క్రిప్షన్ తీసుకోవచ్చు. నాకు నచ్చిన టైంలో సినిమా చూడొచ్చు. కాసేపు పాజ్ (ఆపడం) చేయొచ్చు’’ అని బీబీసీతో చెప్పారామె.
ఒకసారి 30-40 ఏళ్లు వెనక్కి వెళదాం. సినిమా చూడాలంటే ఊళ్ల నుంచి ఎడ్లబండ్లు కట్టుకుని దగ్గర్లోని పట్టణానికి వచ్చి సినిమాలు చూసేవారు. థియేటర్లు అంతగా ప్రేక్షకులను లాగేవి.

కాలం మారింది..
ఇపుడు కాలం మారింది. ఓటీటీల ప్రభావం కావొచ్చు.. మల్టీప్లెక్స్ లు పెరగడం కావొచ్చు.. ఆకట్టుకునే సినిమాలు రాకపోవడం అయ్యుండొచ్చు.. పేరున్న నటులు తీసే సినిమాలు తగ్గిపోవడం కావొచ్చు. ఇలా కారణాలు ఏవైనా థియేటర్లు.. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లు క్రమేపీ మూతపడుతున్నాయి.
హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అనేది సినీ ప్రేమికులకు అడ్డా. శుక్రవారం వచ్చిదంటే కొత్త సినిమాల విడుదలతో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ కిక్కిరిసిపోతుంది. అలాంటి చోట ఉన్నదే శ్రీ మయూరి థియేటర్. 1968లో ప్రారంభమైంది. ఎన్నో విజయవంతమైన చిత్రాలు దానిలో ప్రదర్శితమయ్యాయి. ఆనందం సినిమా డైరెక్టుగా 200 రోజులు ఆడిందని థియేటర్ నిర్వహకులు తెలిపారు.
సీనియర్ ఎన్టీఆర్ మొదలుకుని అల్లు అర్జున్ వరకు ఎంతో మంది నటులు ఈ థియేటర్‌కు వచ్చారు. ఇలా ఒక వెలుగు వెలిగిన థియేటర్ కొవిడ్ సమయంలో మూతపడింది, మళ్లీ ఓపెన్ కాలేదు.

నిర్వహణ భారం పెరిగిపోవడంతో థియేటర్ మూసివేసినట్లు దాని మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.
ఆ తర్వాత దానిని స్టడీ సెంటర్, ప్రవచనాలు వినిపించే కార్యక్రమాలకు అద్దెకు ఇస్తున్నారు థియేటర్ నిర్వాహకులు.
బీబీసీ ఆ థియేటర్‌కు వెళ్లినప్పడు కుర్చీలు, సౌండ్ సిస్టం, తెర (స్క్రీన్) తొలగించి ఉన్నాయి.

ఫంక్షన్ హాల్స్, గోదాములుగా..
హైదరాబాద్‌లోనే కాదు, ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ పట్టణంలోనూ ఇదే పరిస్థితి.
అక్కడ ఒకే వీధిలో సినిమా హాళ్లు ఎక్కువగా ఉండటంతో దానికి సినిమా రోడ్డు అని పేరు వచ్చింది. ఈ వీధిలో సినిమా హాళ్లు వరుసగా మూతపడ్డాయి.
కల్పన థియేటర్ స్థానంలో పెట్రోల్ బంకు వచ్చింది.. దేవి, శ్రీదేవి థియేటర్ల స్థానంలో దేవి మల్టీ ప్లెక్స్ వచ్చింది.
ఇక పద్మనాభ సినిమా హాలును పద్మనాభ ఫంక్షన్ హాలుగా మార్చేశారు. స్వప్న థియేటర్‌ను గోడౌన్‌లుగా మార్చి అద్దెకు ఇవ్వాలని నిర్ణయించారు.

థియేటర్ నడిస్తే రూ.7 వేలు.. లేకపోతే 4 వేలు నష్టం
దేశంలోనే సింగిల్ స్క్రీన్ థియేటర్లకు అడ్డాగా మారిన ఏపీ, తెలంగాణలలో క్రమేపీ థియేటర్లు మూత పడుతున్నాయి.
తెలంగాణ తెలుగు ఫిలిం ఎగ్జిబిటర్స్ అండ్ కంట్రోలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.విజేందర్ రెడ్డి బీబీసీతో పంచుకున్న వివరాల ప్రకారం...రెండు దశాబ్దాల కిందట వరకు తెలుగు రాష్ట్రాల్లో 3,600 థియేటర్లు ఉండేవి. ఇప్పుడు ఆ సంఖ్య 1,400కు తగ్గిపోయింది. మల్టీప్లెక్స్ తెరలను కలుపుకొంటే 1,900 వరకు ఉన్నాయని చెప్పారు.
కరీంనగర్ జిల్లా కమలాపూర్‌లోని సారథి కళామందిర్ థియేటర్ మూతపడింది. హైదరాబాద్‌లోని శ్రీ రమణ, శ్రీ గంగ.. ఇలా ఒకప్పుడు వెలుగు వెలిగిన థియేటర్లెన్నో మూతపడ్డాయి.

ఇటీవల తెలంగాణలో థియేటర్ల యాజమాన్యాలు పది రోజులపాటు థియేటర్లు బంద్ చేశారు. థియేటర్ల నిర్వహణ కష్టంగా మారడంతో కుటుంబీకులు, భాగస్వాముల ఒత్తిడితో వాటిని మూసివేస్తున్నట్లు విజేందర్ రెడ్డి చెప్పారు.
‘‘ఒక థియేటర్ రోజులో నడపాలంటే సిబ్బంది జీతాలు, కరెంటు బిల్లులు కలిపి రూ.4-5వేలు అవుతాయి. ఇవి కాకుండా థియేటర్స్ పెట్టుబడి, వడ్డీలు, ట్యాక్సులు కలిపి రూ. 5 వేలు. ఈ రెండూ కలుపుకొంటే రూ.10 వేలు అవుతోంది. సినిమా నాలుగు ఆటలు ఆడిస్తే ఎలక్ట్రిసిటీ బిల్లులు, సిబ్బంది జీతాలకు రాకపోగా.. మాకు వచ్చిన గ్రాస్‌లోంచి మళ్లీ పంపిణీదారులకు సగం ఇవ్వాలి. అలాంటప్పుడు థియేటర్ నడిపితే రూ.7 వేలు నష్టం కనిపిస్తోంది. అదే బంద్ చేస్తే రూ.4వేలే నష్టం వస్తోంది. అందుకే థియేటర్లు బంద్ అవుతున్నాయి.’’ అని విజేందర్ రెడ్డి చెప్పారు.

రియల్ ఎస్టేట్ ప్రభావంతో భూముల రేట్లు పెరిగి..
నగరాలు, పట్టణాలకు సమీపంలో ఉన్న థియేటర్లపై రియల్ ఎస్టేట్ ప్రభావం పడిందని చెబుతున్నారు థియేటర్ యజమానులు. భూముల రేట్లు బాగా పెరిగాయి. దీనివల్ల థియేటర్ స్థానంలో ఫంక్షన్ హాళ్లు, రిటైల్ బజార్లు ఏర్పాటు చేసేందుకు మొగ్గుచూపారు యజమానులు.
హైదరాబాద్ సమీపంలోని శంకర్ పల్లిలో మాధవి థియేటర్ 42 ఏళ్ల పాటు నడిచింది. అక్కడ ఓవైపు భూములు రేట్లు పెరిగిపోవడం...మరోవైపు థియేటర్‌కు నష్టాలు రావడంతో దాన్ని ఫంక్షన్ హాలుగా మార్చేశారు. వికారాబాద్‌లోని మహాశక్తి థియేటర్ వద్ద కమర్షియల్ కాంప్లెక్సులు వెలిశాయి.
‘‘థియేటర్లను నడిపించడం వల్ల నష్టాలు వస్తున్నాయి. గతంతో పోల్చితే పట్టణాలు విస్తరించాయి. జనావాసాలు పెరిగిపోయాయి. దానివల్ల థియేటర్ స్థానంలో ఫంక్షన్ హాళ్లు ఏర్పాటు చేస్తున్నారు.’’ అని విజేందర్ రెడ్డి బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, HEMANT CHATURVEDI
దేశవ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉందంటే...
ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం 2010లో దేశంలో 10,600 సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఉన్నాయి. అయితే, ఇప్పుడు సగానికి తగ్గిపోయాయని ఎగ్జిబిటర్లు అంటున్నారు. అదే సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2,809 థియేటర్లు ఉండేవి. ఇప్పుడు వాటి సంఖ్య 1,400కు తగ్గినట్లు చెబుతున్నారు.
సింగిల్ స్ర్కీన్ థియేటర్లు మూతపడటమనేది ఒక్క తెలంగాణ, ఏపీకే పరిమితం కాలేదు. ముంబయికి చెందిన సినిమాటోగ్రాఫర్ హేమంత్ చతుర్వేది గతేడాది బీబీసీతో మాట్లాడారు.
ఆయన థియేటర్లు మూతపడుతుండటం తెలుసుకొని, దాదాపు 15 రాష్ట్రాలు తిరిగి 950 థియేటర్ల ఫోటోలు తీశారు.
‘‘ఈ థియేటర్లనేవి భారతీయ సినిమాను చూసేందుకు వేదికలు. చిన్న పట్టణాల్లోని ప్రజలు ఎంతో ఉత్సాహంగా సినిమా చూసేందుకు ఉపయోగపడ్డాయి’’ అని చతుర్వేది బీబీసీతో చెప్పారు.

మల్టీప్లెక్స్‌లుగా మార్చి..
సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూసివేసి గోడౌన్లు లేదా ఫంక్షన్ హాళ్లు, షాపింగ్ మాల్స్‌గా మార్చుతున్నారు నిర్వాహకులు. మరికొన్ని చోట్ల థియేటర్ల యాజమాన్యాలు ఇతర సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకొని మల్టీప్లెక్స్ లుగా మారుస్తున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్‌లో 30 వరకు మల్టీప్లెక్స్‌లు ఏర్పాటయ్యాయి. ఏషియన్ సంస్థతో కలిసి మహేష్ బాబు ఏఎంబీ, విజయ్ దేవరకొండ ఏవీడీ, అల్లు అర్జున్ ఏఏఏ, రవితేజ ఏఆర్టీ వంటి మల్టీప్లెక్స్‌లను ఏర్పాటు చేశారు.
హైదరాబాద్‌లోని అమీర్ పేటలో సత్యం థియేటర్ బాగా ప్రాచుర్యం పొందింది. ఇప్పుడు ఈ థియేటర్ ఏషియన్ సత్యం మాల్ గా మారింది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని ఒడియన్ థియేటర్‌ను నిర్వహకులు పూర్తిగా కూల్చివేసి ఒడియన్ షాపింగ్ మాల్ నిర్మిస్తున్నారు. అందులోనే మల్టీప్లెక్స్ రాబోతున్నట్లు బయట బోర్డులు ఏర్పాటు చేశారు.
స్టార్టప్ టాకీ అనే సంస్థ కథనం ప్రకారం.. దేశంలో పది సంస్థల చేతుల్లోనే 9,942 మల్టీప్లెక్స్ స్క్రీన్లు ఉన్నాయి.
సింగిల్ స్క్రీన్ థియేటర్లు తగ్గిపోతుండటంపై తెలుగు ఫిలిం డిస్ట్రిబ్యూటర్ కమ్ ఎగ్జిబిటర్ ఉదయ్ కుమార్ రెడ్డి బీబీసీతో మాట్లాడారు.
‘‘కంటెంట్ ఉన్నప్పుడు సినిమా బరాబర్ నడుస్తుంది. మంచి సినిమా లేకనే థియేటర్ల వ్యవస్థ చచ్చిపోతోంది. సీ క్లాస్ ఏరియాల్లోనూ థియేటర్లకు ప్రేక్షకులు రావడానికి సిద్ధంగా ఉన్నారు. కంటెంట్ లేకుండా సినిమా వస్తే ఎక్కడ ఆడుతుంది? ఒకప్పుడు నాలుగైదు ప్రింట్లతో సినిమాలు రిలీజ్ అయ్యేవి. ఇపుడు డిజిటల్ సిస్టం రాకతో కుగ్రామంలోనూ సినిమా రిలీజ్ అవుతోంది. కానీ దానికి తగ్గట్టుగా ప్రేక్షకులను రప్పించేలా సినిమాలు రావాలి’’ అని చెప్పారు.

ఓటీటీల ప్రభావం ఎక్కువే
ఓటీటీలకు అలవాటు పడటంతో సినిమా థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు తగ్గిపోతున్నారని నిర్మాతలు కూడా అంటున్నారు.
‘‘సినిమాలు కొన్ని నెలలపాటు విడుదల కాకపోవడంతో థియేటర్లపై ప్రభావం పడుతోంది. అదేవిధంగా ఓటీటీలు రావడం కూడా థియేటర్లను దెబ్బతీస్తున్నాయి. సినిమా చూడటం లేదు. పెద్ద సినిమా అయితే నాలుగైదు వారాల తర్వాత ఓటీటీలోకి వస్తుంది. అప్పుడు చూద్దాం...అనే ధోరణిలోకి ప్రేక్షకులు వెళుతున్నారు ’’ అని వైజయంతి మూవీస్ వ్యవస్థాపకులు, నిర్మాత సి.అశ్వనీదత్ బీబీసీతో అన్నారు.
థియేటర్లు మూత పడటం కారణంగా ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో దానిపై ఆధారపడిన కుటుంబాలపై ప్రభావం పడుతోంది.
సింగిల్ స్క్రీన్ థియేటర్‌లో బుకింగ్ క్లర్కులు, మేనేజర్, ప్రొజెక్టర్ ఆపరేటర్, గేట్ కీపర్లు, క్యాంటీన్ సిబ్బంది ఇలా సగటున 25-30 మంది సిబ్బంది పనిచేస్తుంటారు. వీరు కాకుండా పట్టణాల్లో థియేటర్ ముందు చిన్న బండి పెట్టుకుని అమ్ముకునేవారు ఉంటారు. వీరు పరోక్షంగా ఉపాధి పొందుతుంటారు. ఇలా వీరందరి ఉపాధికి దెబ్బ పడుతోంది.
‘‘థియేటర్ ముందు బజ్జీలు బండి పెట్టుకుని జీవించే వాళ్లం. రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు రూ.3-4వేలకు పైగా సంపాదించుకుని ఇంటికి వెళ్లేవాళ్లం. ఇప్పుడు థియేటర్ మూత పడటంతో వేరొక చోట పెట్టుకున్నప్పటికీ, అంతగా గిరాకీ లేదు’’ అని రమణ అనే వ్యక్తి బీబీసీతో చెప్పారు. రమణకు ఒకప్పుడు హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో మూతపడిన శ్రీగంగ థియేటర్ ముందు బజ్జీల బండి ఉండేది.

థియేటర్ల యాజమాన్యం డిమాండ్ ఏంటి?
సినిమా బడ్జెట్ ఆధారంగా థియేటర్లకు షేర్ ఇవ్వాలని థియేటర్ యాజమాన్యాలు కోరుతున్నాయి. ఈ విషయంపై ప్రెస్ మీట్లు పెట్టి మరీ తమ డిమాండ్లను వినిపించారు ఎగ్జిబిటర్లు. నిర్మాతలతోనూ చర్చించినట్లు వారు చెబుతున్నారు.
ఈ విషయంపై బీబీసీతో దేవి, సుదర్శన్ థియేటర్ల యజమాని బాలగోవింద్ రాజ్ మాట్లాడారు.
‘‘రెవెన్యూ షేర్ మెకానిజం మారాలనేది మా ప్రధాన ప్రతిపాదన. రెంట్ విధానం కాకుండా పర్సంటేజీ విధానం ప్రకారం షేర్ పంపిణీ చేయాలని అడుగుతున్నాం. రూ.30 కోట్లకుపైగా ఉన్న నైజాం హక్కుల సినిమాలు వసూళ్లలో 25 శాతం థియేటర్‌కు, 75 శాతం డిస్ట్రిబ్యూటర్‌కు ఇవ్వాలి. మధ్యంతర సినిమాలు.. అంటే రూ. 10-30 కోట్ల బడ్జెట్ సినిమాలు 60 శాతం డిస్ట్రిబ్యూటర్, 40 శాతం థియేటర్‌కు షేర్ ఇవ్వాలి. రూ. 10 కోట్లలోపు సినిమాలు చెరో 50 శాతం చొప్పున షేర్ పంపిణీ చేయాలని అడుగుతున్నాం’’ అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
కానీ, థియేటర్ యాజమాన్యాల ప్రతిపాదనను తోసిపుచ్చుతున్నారు నిర్మాతలు.
థియేటర్లు మనుగడ సాగించే విషయంపై ఎగ్జిబిటర్లు, నిర్మాతలు కలిసి సమస్యను పరిష్కరించుకోవాలని సూచిస్తున్నారు నిర్మాత సి.అశ్వనీదత్.
‘‘థియేటర్ యాజమాన్యాలు ఇబ్బందుల్లో ఉంటే డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతలతో కూర్చుని మాట్లాడుకోవాలి. అంతే తప్ప మాకు ఇంత షేర్ కావాలి, అంత కావాలంటే ఏ నిర్మాత కూడా ఒప్పుకోరు. అద్దె కాకుండా వేరొక విధానాన్ని నిర్మాతల తరఫున నుంచి ఆలోచన చేయాలి’’ అని అశ్వనీదత్ సూచించారు.
ఇవి కూడా చదవండి:
- వాజ్‌పేయికి ఇచ్చిన మాట తప్పామని నవాజ్ షరీఫ్ ఎందుకు అన్నారు?
- అంతరించి పోయిందనుకున్న ఈ ‘పర్వత రత్నం’ మళ్లీ కనిపించింది, ఎక్కడంటే..
- బెంగళూరు రేవ్ పార్టీ కేసు: పోలీసులు ఏం చెప్పారు? అసలు రేవ్ పార్టీ అంటే ఏంటి? అందులో ఏం చేస్తారు?
- ఓవర్సీస్ హైవే: సముద్రంలో 182 కిలోమీటర్ల రోడ్డు.. ప్రపంచంలో 8వ వింత ఇదేనా?
- #UnseenLives: వెనక 40 మంది పురుషులున్నా, నేను ఆ మరకను దాచుకోలేదు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















