వాజ్‌పేయికి ఇచ్చిన మాట తప్పామని నవాజ్ షరీఫ్ ఎందుకు అన్నారు?

నవాజ్ షరీఫ్, అటల్ బిహారి వాజ్‌పేయి

ఫొటో సోర్స్, Getty Images

భారత్‌తో జరిగిన ఒప్పందంలో తాను చేసిన తప్పు గురించి పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ మంగళవారం ఒక కార్యక్రమంలో ప్రస్తావించారు.

భారత్‌కు ఇచ్చిన వాగ్దానాన్ని ఉల్లంఘించడం తాము చేసిన తప్పు అని మే 28న నిర్వహించిన పాకిస్తాన్ ముస్లిం లీగ్ (నవాజ్) పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశంలో నవాజ్ షరీఫ్ అన్నారు.

1998లో ఇదే తేదీన పాకిస్తాన్ తొలి అణుపరీక్ష నిర్వహించింది.

1998 మే 14న భారత్ తమ రెండో అణు పరీక్ష జరిపిన 14 రోజుల తర్వాత పాకిస్తాన్ తమ మొదటి అణుపరీక్ష చేపట్టింది.

ఈ పరీక్ష తర్వాత, అప్పటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 1999 ఫిబ్రవరిలో లాహోర్‌ వెళ్లారు.

‘‘అణు విస్పోటనాలు జరపడం చాలా పెద్ద విషయం. పాకిస్తాన్ అయిదు పేలుళ్లతో స్పందించిందంటూ భారత పార్లమెంట్‌లో వార్తలు వచ్చిన విషయం మీకు తెలిసిందే. ఆ తర్వాత వాజ్‌పేయి లాహోర్‌ వచ్చారు. ఈ విషయాలు మీకు గుర్తున్నాయా? లేదా?’’ అని షరీఫ్ ప్రశ్నించారు.

‘‘వాజ్‌పేయి వచ్చారు. ఓ వాగ్దానం చేశారు. ఆ వాగ్దానానికి వ్యతిరేకంగా వెళ్లింది మనమే. అది వేరే విషయం. అలా చేయడం మా తప్పు. ఆ విషయంలో మనమే దోషులం’’ అని షరీఫ్ అన్నారు.

అటల్ బిహారీ వాజ్‌పేయి, లాహోర్ పర్యటన తర్వాత కార్గిల్‌లో భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధం జరిగింది.

ఆ సమయంలో పాక్ ప్రధానిగా షరీఫ్ ఉన్నారు. జనరల్ పర్వేజ్ ముషారఫ్, పాక్ ఆర్మీ చీఫ్‌గా పనిచేశారు. ఆ తర్వాత ముషారఫ్ తిరుగుబాటు చేసి అధికారాన్ని తన చేతుల్లోకి తీసుకున్నారు.

నవాజ్ షరీఫ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పర్వేజ్ ముషారఫ్‌తో నవాజ్ షరీఫ్

నవాజ్ షరీఫ్ ఇంకా ఏమన్నారు?

పాకిస్తాన్ ముస్లిం లీగ్ (నవాజ్) పార్టీ మీటింగ్‌లో షరీఫ్ తమ ప్రభుత్వం సాధించిన విజయాలను గుర్తు చేశారు.

పాకిస్తాన్ అణుపరీక్ష తర్వాత జాతిని ఉద్దేశించి షరీఫ్ చేసిన ప్రసంగాన్ని కూడా ఈ కార్యక్రమంలో చూపించారు.

‘‘భారత్ ఎన్నో అగ్ని, పృథ్వీ క్షిపణులను ప్రయోగించింది. కానీ, మనం ఒకటి ప్రయోగిస్తే ఏం జరిగిందో మీకు తెలుసు. గతంలో భారత్ అణు పరీక్షలు నిర్వహించింది. ఈరోజు మనం అయిదు అణు పరీక్షలు నిర్వహించి ఆ లెక్క సరిచేశాం. పాకిస్తాన్ ప్రజల నిర్ణయానుసారమే మేం ఇదంతా చేశాం’’ అని 1998లో అణు పరీక్ష అనంతరం షరీఫ్ అన్నారు.

1998 నాటి కొన్ని ఘటనల గురించి మంగళవారం జరిగిన పార్టీ కార్యక్రమంలో షరీఫ్ ప్రస్తావించారు.

నవాజ్ షరీఫ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, లాహోర్‌లో వాజ్‌పేయితో నవాజ్ షరీఫ్‌

లాహోర్ ఒప్పందం ఏమిటి?

ఏ ఒప్పందం ప్రకారం వాజ్‌పేయికి ఇచ్చిన హామీలను తాము అమలు చేయలేదని నవాజ్ షరీఫ్ చెబుతున్నారో ఆ ఒప్పందాన్ని లాహోర్ ఒప్పందం అని పిలుస్తారు.

1999 ఫిబ్రవరి 21న భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఈ ఒప్పందం కుదిరింది.

ఈ ఒప్పందం ప్రకారం, రెండు దేశాల మధ్య శాంతి, స్థిరత్వం గురించి చర్చించారు.

ప్రమాదవశాత్తు లేదా అనుకోకుండా అణ్వాయుధాల వాడకాన్ని నివారించాలని ఈ ఒప్పందం ప్రకారం హామీ కుదుర్చుకున్నారు.

ఇరు దేశాల పార్లమెంట్‌లు కూడా ఈ ఒప్పందాన్ని ఆమోదించాయి.

వివిధ స్థాయిల్లో చర్చల ద్వారా రెండు దేశాల మధ్య వివాదాలను పరిష్కరించుకునేందుకు ఒక ప్రణాళికను రూపొందించడంపై ఇరు దేశాలు మాట్లాడుకున్నాయి.

అదే సమయంలో వాజ్‌పేయి రాసిన ఒక పద్యాన్ని కూడా షరీఫ్ చదివారు.

‘‘యుద్ధాన్ని రానివ్వం, మేం యుద్ధాన్ని జరుగనివ్వం’’ అంటూ ఈ పద్యం సాగుతుంది.

వాజ్‌పేయి బస్సులో పాకిస్తాన్‌కు వెళ్లారు. వాజ్‌పేయి చేసిన ఈ పనిపై అప్పట్లో పాకిస్తాన్‌లో చాలా ప్రశంసలు వచ్చాయి. ఇరు దేశాల మధ్య వివాదాలను పరిష్కరించడానికి ఇదొక చొరవగా చాలా రాజకీయ పార్టీలు భావించాయి.

ఈ ఒప్పందం కుదిరిన కొన్ని నెలల తర్వాత కార్గిల్, జమ్మూకశ్మీర్‌లోకి పాకిస్తాన్ చొరబాటు గురించి వార్తలు వచ్చాయి.

తాషి నామ్‌గ్యాల్ అనే గొర్రెల కాపరి పాకిస్తాన్ చొరబాటుకు సంబంధించిన సమాచారాన్ని అందించారు.

ఈ ఘటన తర్వాత, కార్గిల్‌లో ఇరు దేశాల మధ్య కాల్పులు మొదలయ్యాయి.

భారత్‌లో దీనికి ‘ఆపరేషన్ విజయ్’ అని, పాకిస్తాన్‌లో ‘ఆపరేషన్ కోహ్-ఎ-పైమా’ లేదా ‘ఆపరేషన్ మౌంటెనీరింగ్’ అని పేరు పెట్టారు.

ఈ యుద్ధంలో 500 మందికి పైగా భారతీయ సైనికులు చనిపోయారు. తమ వైపు చనిపోయిన సైనికులకు సంబంధించిన అధికారిక గణాంకాలను పాకిస్తాన్ వెల్లడించలేదు.

పాకిస్తాన్ ఆర్మీ, కార్గిల్‌ నుంచి తమ సైనికుల మృతదేహాలను తీసుకెళ్లదనే వార్తలు కూడా వచ్చాయి.

వాజ్‌పేయి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మినార్-ఎ-పాకిస్తాన్ స్మారకం వద్ద వాజ్‌పేయి

వాజ్‌పేయి పర్యటనపై పాకిస్తాన్‌లో నిరసనలు

కార్గిల్ యుద్ధం వెనుక పర్వేజ్ ముషారఫ్ కీలక పాత్ర పోషించారని చెబుతారు.

'తన పేరు మీద ఆర్మీ జనరల్స్ ఏం చేస్తున్నారో షరీఫ్‌కు తెలియదు' అని గ్యాలెంట్రీ అవార్డ్స్ వెబ్‌సైట్‌లోని ఒక దస్తావేజులో పేర్కొన్నారు.

వాజ్‌పేయి లాహోర్‌లో మూడు రోజుల పాటు పర్యటించినప్పుడు, షాహీ ఖిల్లాలో నిర్వహించిన స్వాగత వేడుకలో ఆర్మీ చీఫ్ పర్వేజ్ ముషారఫ్ పాల్గొనలేదు.

భారత ప్రధానమంత్రికి సెల్యూట్ చేయడానికి పర్వేజ్ ముషారఫ్ ఇష్టపడలేదని అప్పట్లో పాకిస్తాన్‌లో పుకార్లు వచ్చాయని బీబీసీ ప్రతినిధి ఆసిప్ ఫరూఖీ చెప్పారు.

ఓవైపు షాహీ ఖిల్లాలో యుద్ధం వద్దంటూ చర్చలు జరుగుతుండగా, మరోవైపు జమాత్-ఎ-ఇస్లామీ పార్టీ సభ్యులు వీధుల్లో రాళ్లు రువ్వుతున్నారు.

వాజ్‌పేయి కూడా ఈ వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చింది.

ఆ పర్యటనలో వాజ్‌పేయి, ‘మినార్-ఎ-పాకిస్తాన్’ స్మారకాన్ని కూడా సందర్శించారు.

అక్కడికి వెళ్లే ముందు వాజ్‌పేయి మాట్లాడుతూ, ‘‘ఒకవేళ నేను ‘మినార్-ఎ-పాకిస్తాన్‌’ వద్దకు వెళితే పాకిస్తాన్ మనిషిని అయ్యాననే ముద్ర పడుతుందని నాతో కొందరు అన్నారు. అరే భాయ్, పాకిస్తాన్ ఏర్పడింది. ఇది నిజం. ఇంకా ఇప్పుడు ఏ ముద్ర వేయాల్సిన అవసరం లేదు’’ అని అన్నారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)