తుర్కియేలో మహిళల హత్యలు భారీగా పెరుగుతున్నాయి ఎందుకు? ఈ దేశంలో ఏం జరుగుతోంది?

ఫొటో సోర్స్, Getty Images
దక్షిణ తుర్కిష్ నగరమైన మెర్సిన్‌లో 2024 మార్చిలో 31 ఏళ్ల మెర్వ్ బెహెర్‌ను ఆమె మాజీ భర్త హత్య చేసిన సంఘటనపై ఆ రోజు మహిళలు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు.
మహిళల హత్యలకు వ్యతిరేకంగా జరిగిన ఈ నిరసన సందర్భంగా మెర్వ్ తల్లి తన పెళ్లి దుస్తులకు నిప్పుపెట్టారు.
పెళ్లి చేసుకునే ముందు మహిళలు పలుమార్లు ఆలోచించుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.
ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో తుర్కియేలో మెర్వ్ సహా కనీసం 92 మంది మహిళలు హత్యకు గురయ్యారు.
ఫిబ్రవరిలో ఒకే రోజు ఏడుగురు మహిళల హత్యకు సంబంధించిన వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఈ హత్యలన్నీ ఆ మహిళల మాజీ భర్తలు లేదా భాగస్వాములు చేసినవే.
మూడేళ్ల క్రితం, ఐరోపాలో మహిళలు, బాలికలపై హింసను నిరోధించడానికి ఏర్పాటు చేసిన ఇస్తాంబుల్ కన్వెన్షన్ నుండి వైదొలిగిన అనంతరం, లింగ ఆధారిత హింసను అంతం చేయడానికి తుర్కియే పోరాడుతోంది.
ఒట్టోమన్ సామ్రాజ్యం - మహిళల హక్కులు
ఈ కథ ఆధునిక తుర్కియే స్థాపనకు 100 సంవత్సరాల కంటే ముందు ప్రారంభమవుతుంది. ఆ సమయంలో తుర్కియే ఒట్టోమన్ సామ్రాజ్యంలో ఉండేది. ఈ సామ్రాజ్యం ఐరోపా నుంచి మధ్యప్రాచ్యం వరకు విస్తరించింది.
"ముస్లిం సామ్రాజ్యం అయినప్పటికీ, ఒట్టోమన్ సామ్రాజ్యంలో అనేక మతాలు, అనేక వర్గాల ప్రజలు ఉండేవాళ్లు" అని ఆగాఖాన్ విశ్వవిద్యాలయంలో జెండర్ స్టడీస్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సెవ్గి అడక్ చెప్పారు.
"తుర్కియే 1920లలో ఆధునిక దేశంగా ఉద్భవించడం ప్రారంభించినప్పుడు, ఒట్టోమన్ సామ్రాజ్యంలో మత, సామాజిక వైవిధ్యం చెక్కుచెదరకుండా ఉంది" అని అడక్ చెప్పారు.
తుర్కియేలో మహిళా సాధికారత విషయంలో ముస్తఫా కమాల్ అటాతుర్క్‌కు ప్రశంసలు దక్కాలి. రిపబ్లిక్ ఆఫ్ తుర్కియేని 1923లో ఆయన నాయకత్వంలో స్థాపించారు.
అయితే ముస్తఫా కమాల్ అటాతుర్క్ రాకముందే, ఒట్టోమన్ సామ్రాజ్య కాలంలో స్త్రీవాద మహిళల పోరాటం కారణంగా మహిళల హక్కుల కోసం ప్రచారం ప్రారంభమైందని డాక్టర్ సెవ్గి అడాక్ చెప్పారు.
ఒట్టోమన్ సామ్రాజ్యంలో చాలా మంది ముస్లిం మహిళలు, మహిళా సంఘాలను స్థాపించారని అడాక్ చెప్పారు.
మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో తుర్కియేలో పెద్ద మార్పు వచ్చింది. ఈ సమయంలో పురుషులు యుద్ధానికి వెళ్ళగా, మహిళలను విశ్వవిద్యాలయాలు, కళాశాలలకు వెళ్ళడానికి అనుమతించారు.
అంతే కాదు, వారు అనేక వృత్తులను ఎంపిక చేసుకునేందుకు అనుమతించారు.
దీని కారణంగా తుర్కియేలో 1926లో పౌరస్మృతి అమలులోకి వచ్చిందని డాక్టర్ సెవ్గి అడాక్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
కమాల్ అటాతుర్క్ - మహిళల హక్కులు
డా. అడాక్ దృష్టిల్లో ఇది ఒక విప్లవాత్మకమైన చర్య.
‘‘ఎందుకంటే ఒక ముస్లిం దేశంలో మొదటిసారిగా, కుటుంబానికి సంబంధించిన లౌకిక చట్టాలను చేశారు. దీని కింద స్త్రీలకు వివాహం, విడాకులు, వారసత్వ విషయాలలో సమాన హక్కులు లభించాయి. కానీ దానిలో కొన్ని పితృస్వామ్య అంశాలూ ఉన్నాయి. ఉదాహరణకు, సివిల్ కోడ్‌లో పురుషుడినే కుటుంబానికి అధిపతిగా పరిగణించారు’’ అన్నారు.
దేశాన్ని లౌకిక మార్గంలోకి తీసుకురావడానికి, ఆధునీకరించడానికి మొదటి అధ్యక్షుడు ముస్తఫా కెమాల్ అటాటర్క్ అమలు చేసిన అనేక విప్లవాత్మక సంస్కరణల్లో ఈ చట్టం ఒక భాగం.
డాక్టర్ సెవ్గి అడాక్ ప్రకారం, మహిళలకు సమాన హక్కులు ఇచ్చారు అనే అపోహ ఉన్నా, దీని కోసం మహిళలు చాలా కష్టపడాల్సి వచ్చిందన్నది నిజం.
ఏది ఏమైనా, మహిళలకు విద్యాహక్కు కల్పించడం, ప్రజా జీవితంలో వారిని భాగం చేయడంలో ముస్తఫా కమాల్ కీలకపాత్ర పోషించాడన్న మాట నిజం.
దేశంలోని లౌకిక, ప్రజాస్వామ్య భావజాలంతో మహిళల హక్కుల అంశం ముడిపడి ఉండడానికి ఇదే కారణం.
అయితే 80లలో పరిస్థితి మారిపోయింది. దేశంలో మహిళల పాత్ర గురించి సంప్రదాయవాదుల ఆలోచన బలపడటం ప్రారంభమైంది.
దీనికి ప్రతిస్పందనగా కొత్త స్త్రీవాద మహిళలు ఉద్భవించారు. పౌరస్మృతి మారుతున్న కాలానికి అనుగుణంగా లేదని ఈ మహిళలు అభిప్రాయపడ్డారు.
డాక్టర్ సెవ్గి అడాక్ మాట్లాడుతూ, "ఈ స్త్రీవాదులు మహిళలపై హింసను తీవ్రంగా పరిగణించారు. 2001లో పౌరస్మృతిలో మార్పులు చేసి, వివాహ కనీస వయస్సును 18 సంవత్సరాలకు పెంచారు.విడాకులు తీసుకుంటే భర్త పేరు మీద నమోదైన ఆస్తిలో సగం వాటా మహిళలకు ఇచ్చేలా ఏర్పాటు చేశారు" అని తెలిపారు.
ఈ మహిళా సాధికారత నేపథ్యంలో, అటాతుర్క్ సైద్ధాంతిక రాజకీయాలకు దూరంగా పెట్టిన సంప్రదాయవాద మహిళలను ఆకర్షించడానికి ప్రయత్నించిన ఒక నాయకుడు తుర్కియే రాజకీయాల్లోకి వచ్చారు.
బహిరంగ ప్రదేశాల్లో మహిళలు హిజాబ్ ధరించడాన్ని నిషేధించిన సమయం ఇది.
‘హిజాబ్ హీరో’
రజబ్ తయ్యిప్ ఎర్డోగన్ రాజకీయాల్లోకి ప్రవేశించడంతో, తుర్కియేలో మరోసారి సామాజిక మార్పు ప్రారంభమైంది.
ఎర్డోగన్ తుర్కియేలోని అతిపెద్ద నగరమైన ఇస్తాంబుల్‌కు మేయర్‌గా పనిచేశారు.
2001లో ఆయన ఇస్లామిక్ సూత్రాల ఆధారంగా కొత్త జస్టిస్ అండ్ డెవలప్‌మెంట్ పార్టీ (AKP)ని స్థాపించాడు.
ఏడాది తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఈ పార్టీ మెజారిటీ సాధించింది. ఒక సంవత్సరం తరువాత, ఎర్డోగన్ తుర్కియే ప్రధాన మంత్రి అయ్యారు.
తుర్కియేలోని ఇసాక్ యూనివర్శిటీలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ సెడా డెమిరాల్ప్ మాట్లాడుతూ, ఎర్డోగన్‌కు సంప్రదాయవాద మహిళల మద్దతు ఉందని, ఆయన హిజాబ్ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని చెప్పారు.
"ఏకేపీని స్థాపించినప్పుడు, ఆర్థిక సంక్షోభం కారణంగా అన్ని రాజకీయ పార్టీలు దాదాపుగా ప్రజల మద్దతును కోల్పోయాయి. కొత్త పార్టీ అధికారంలోకి రావడానికి అది చాలా అనుకూలమైన వాతావరణం. ఈ పార్టీ మొదట్లో సంప్రదాయవాద విలువలు, ఉదారవాదానికి ప్రాతినిధ్యం వహించింది" అని ఆమె తెలిపారు.
ఎర్డోగన్‌కు తుర్కియేలోని అన్ని వర్గాల నుండి మద్దతు ఉన్నా, వారిలో అధిక భాగం మహిళలే. ముఖ్యంగా హిజాబ్ ధరించే మహిళలు, ఆయనను తమ మద్దతుదారుగా చూసేవారు.
సెక్యులర్ తుర్కియేలో బహిరంగ ప్రదేశాల్లో హిజాబ్ ధరించడంపై నిషేధం కారణంగా, చాలా మంది మహిళలు ఉన్నత విద్యను పొందలేకపోయారు లేదా కార్యాలయాల్లో పని చేయలేకపోయారు.
అందుకే ఈ మహిళలు ఎర్డోగన్‌కు మద్దతుగా నిలిచారు. కానీ చాలా మంది ఉదారవాద, స్త్రీవాద మహిళలూ ఎర్డోగన్‌కు మద్దతు ఇచ్చారు. ఎందుకంటే, హిజాబ్‌పై నిషేధం సంప్రదాయవాద మహిళల హక్కులను ఉల్లంఘించడమేనని వారు భావించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఏకేపీ మహిళలను ఎలా కూడగట్టింది?
ఏకేపీ మహిళా సాధికారత, సమాజంలో వారి పాత్ర గురించి మాట్లాడింది. పార్టీ కార్యక్రమాలలో పాల్గొనడానికి మహిళలను ఆహ్వానించింది. దీంతో దేశంలో అనేక మహిళా సంఘాలు ఆవిర్భవించడం ప్రారంభించాయి.
ఇది సంప్రదాయవాద మహిళలను శక్తివంతం చేసేందుకు సహాయపడిందని సెడా డెమిరాల్ప్ అభిప్రాయపడ్డారు.
తుర్కియేలో మహిళల మరో పెద్ద సమస్య గృహ హింస.
2011లో ఇస్తాంబుల్ కన్వెన్షన్‌పై సంతకం చేసిన మొదటి దేశం తుర్కియే. ఇది లింగ-ఆధారిత హింసను నిరోధించడానికి చట్టాలు, చర్యలను రూపొందించే లక్ష్యం కలిగిన యూరోపియన్ యూనియన్ ఒప్పందం.
ఆ సమయంలో యూరోపియన్ యూనియన్‌లో చేరాలనేది తుర్కియే ఆశయం. దీనికి అవసరమైన షరతులన్నీ నెరవేర్చడానికి ఎర్డోగన్ సిద్ధంగా ఉన్నారు.
ఆయన అంతర్జాతీయ సమాజంలో సంస్కర్తగా కనిపించినా, ఆయన ప్రకటనలు కొన్ని సెక్యులర్ మహిళలకు కోపం తెప్పించాయి.
ఒక ప్రసంగంలో ఆయన మహిళలు పురుషులతో సమానం కాదని, మరో ప్రసంగంలో తల్లి కావడమే మహిళకు ఉన్న అతి పెద్ద బాధ్యత అని అన్నారు.
2013లో ఇస్తాంబుల్ మధ్యలో ఒక పార్కును నిర్మించే ప్రభుత్వ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా భారీ నిరసనలు జరిగాయి.
ఆందోళనకారులపై పోలీసులు పాశవికంగా దాడి చేయడంతో పరిస్థితి మరింత దిగజారింది.
‘‘నియంతృత్వ పద్ధతులను అవలంబించడం ప్రారంభించిన ఎర్డోగన్, నిరసనలకు మద్దతు ఇచ్చే మహిళలను లక్ష్యంగా చేసుకున్నారు. మరోవైపు, సంప్రదాయవాద మహిళలకు ఆర్థిక సహాయం చేయడం, ప్రభుత్వ రంగంలో ముఖ్యమైన పాత్రలు ఇవ్వడం ప్రారంభించారు. దీని కారణంగా లౌకిక మహిళలు ఆయనను మరింత వ్యతిరేకించడం ప్రారంభించారు" అని సెడా డెమిరాల్ప్ వివరించారు.
మహిళల హక్కులపై దాడి
ఎజెల్ బూస్ సోన్మెజోసెక్ అంతర్జాతీయ మానవ హక్కుల న్యాయవాది, ఆమెకు తుర్కిష్ మానవ హక్కుల బృందాలతో సంబంధాలున్నాయి.
గెజి పార్క్ నిరసనలు లైంగిక సమానత్వాన్ని దెబ్బ తీసే కొత్త అధ్యాయానికి నాంది పలికాయని సోన్మెజోసెక్ అన్నారు.
2013 అనంతరం తుర్కియేలో శాంతియుత నిరసనలపై ఆంక్షలు విధించారని ఆమె చెప్పారు.
గెజి పార్క్ నిరసనల తర్వాత, లైంగిక సమానత్వం కోసం నిర్వహించిన ప్రదర్శనలో మహిళలు పాల్గొనడంపై నిరసనలు వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత 2015లో మరో మార్పు వచ్చింది.
‘‘ఆ సంవత్సరం అన్ని అధికారిక పత్రాల నుండి లింగ-నిర్దిష్ట సమాచారం తీసివేశారు" అని సోన్మెజోసెక్ చెప్పారు.
"ఆ తర్వాత అనేక లైంగిక పక్షపాత విధానాలు, ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే స్వచ్ఛంద సంస్థలను సృష్టించి, అప్పటికే మహిళలకు ఇచ్చిన అన్ని హక్కులపై దాడి చేయడం ప్రారంభించారు" అని తెలిపారు.
2020లో తుర్కియే ఇస్తాంబుల్ కన్వెన్షన్‌ను లక్ష్యంగా చేసుకుని ప్రచారాన్ని ప్రారంభించింది. అప్పటికే ఆ దేశం యూరోపియన్ యూనియన్‌లో సభ్యత్వం పొందే అవకాశాలు నిలిచిపోయాయి.
ఈ ఒప్పందం కుటుంబ విలువలకు విరుద్ధమని, స్వలింగ సంపర్కాన్ని ప్రోత్సహిస్తుందని తుర్కియే పేర్కొంది. ఇస్తాంబుల్ కన్వెన్షన్‌లో చేరిన 10 సంవత్సరాల తర్వాత, తుర్కియే ఈ ఒప్పందం నుండి వైదొలిగింది.
స్వలింగ సంపర్కులు స్వలింగ సంపర్కాన్ని సమర్థించుకోవడానికి ఇస్తాంబుల్ కన్వెన్షన్‌ను ఉపయోగించుకుంటున్నట్లు అధికారికంగా ఆరోపించారని డాక్టర్ ఎజెల్ సోన్మెజోసెక్ చెప్పారు.
ఒక దేశం మానవ హక్కుల ఒప్పందం నుండి వైదొలగుతుందని ఎవ్వరూ ఊహించలేదు. అయితే గృహ హింసను ఎదుర్కోవడానికి దేశంలో చట్టాలు సరిపోతాయని తుర్కియే ప్రభుత్వం చెబుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
గతేడాది 315 మంది మహిళల హత్య
అయితే తుర్కియే గృహ హింస చట్టాలు ఇస్తాంబుల్ కన్వెన్షన్‌కు అనుగుణంగా ఉన్నాయని, వాటిని ఈ ఒప్పందంతో కలిపి చూడాలని డాక్టర్ ఎజెల్ సోన్మెజోసెక్ అంటారు.
ఇస్తాంబుల్ కన్వెన్షన్ నుండి తుర్కియే వైదొలిగిన తరువాత, గృహ హింసపై చట్టం డొల్లగా మారిందని ఆమె అన్నారు.
చాలా మంది పోలీసు అధికారులు కూడా అసలు ఈ చట్టం ఉందా లేదా అనే అయోమయంలో ఉన్నారు.
ఇప్పుడు తుర్కియే ఇస్తాంబుల్ కన్వెన్షన్‌లో పార్టీ కాదు కాబట్టి, తమకెలాంటి ప్రమాదమూ లేదని భావించడం వల్ల మహిళలపై దాడి చేసే వారు చట్టం పట్ల భయాన్ని కోల్పోయారని చాలా నివేదికలు సూచిస్తున్నాయి.
ఇస్తాంబుల్ కన్వెన్షన్ నుండి తుర్కియే తుర్కియే వైదొలిగిన తర్వాత మహిళల హత్యల కేసులు ఎంత పెరిగాయో చెప్పడం కష్టమని డాక్టర్ సోన్మెజోసెక్ చెప్పారు. కానీ ప్రభుత్వం ఈ విషయంలో గణాంకాలను విడుదల చేయడం లేదు.
అంతర్జాతీయ వేదికపై తుర్కియే ప్రభుత్వాన్ని ఎవరూ వేలెత్తి చూపించకూడదని భావించడమే దీనికి కారణం. రెండో విషయం, అనేక స్త్రీవాద సంస్థలు ఈ గణాంకాల ఆధారంగా విధానాలను రూపొందించాలని పట్టుబట్టవచ్చు.
అయితే 'వి విల్ స్టాప్ ఫెమిసైడ్' అనే సంస్థ ఇలాంటి గణాంకాలపై నిఘా పెట్టింది, ఈ సంస్థను మూసివేయడానికి ప్రభుత్వం విఫలయత్నం చేసింది.
ఈ సంస్థ ప్రకారం, 2023లో 315 మంది స్త్రీలను పురుషులు హత్య చేశారు. వీటిలో 65 శాతం కేసులలో, మహిళలను వారి ఇంట్లోనే హత్య చేశారు.
అదే సంవత్సరం 248 మంది మహిళలు అనుమానాస్పద స్థితిలో మరణించారని, ఖచ్చితమైన సంఖ్యను కనుగొనడం అసాధ్యం అని డాక్టర్ ఎజెల్ సోన్మెజోసెక్ తెలిపారు.
“ఈ కేసులను హత్య కేసులుగా కాకుండా, ప్రమాదాలుగా నమోదు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా మహిళలు బాల్కనీలు, కిటికీలలో నుండి పడి చనిపోవడం, వారి సంఖ్య ఎక్కువగా ఉండటం దిగ్భ్రాంతికరం. కానీ ఇప్పుడు ఈ సమస్యపై అవగాహన కూడా పెరుగుతోంది. సంప్రదాయవాద మహిళలూ దీనికి వ్యతిరేకంగా తమ గళాన్ని వినిపిస్తున్నారు"

ఫొటో సోర్స్, Getty Images
రెడ్ కార్డ్
ఈ ఏడాది మార్చిలో, ప్రధాన ప్రతిపక్ష పార్టీ సీహెచ్‌పీ ఇస్తాంబుల్, అంకారాతో సహా అనేక ప్రధాన నగరాల్లో జరిగిన మున్సిపల్ ఎన్నికలలో అతి పెద్ద విజయాలు నమోదు చేసింది.
ఎర్డోగన్ మూడవసారి అధ్యక్ష ఎన్నికల్లో గెలిచినా, ఆయన పార్టీ 20 సంవత్సరాలలో మొదటిసారిగా భారీ నష్టాన్ని చవిచూసింది.
హ్యూర్కన్ అస్లి అక్సాయ్ బెర్లిన్‌లోని జర్మన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ అండ్ సెక్యూరిటీ అఫైర్స్‌లో టర్కిష్ స్టడీస్ విభాగపు అధిపతిగా ఉన్నారు.
"ఏడాది క్రితం పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు సుస్థిరతను కోరుకుంటున్నందున ఏకేపీకి ఓటు వేశారు. కాని స్థానిక ఎన్నికల్లో ప్రతిపక్షాన్ని గెలిపించడం ద్వారా వారు ప్రభుత్వం సరైన మార్గంలో లేదని హెచ్చరించారు. ఇది ప్రభుత్వానికి రెడ్ కార్డ్‌లాంటిది" ఆమె అన్నారు.
తుర్కియేలో ద్రవ్యోల్బణం 70 శాతానికి చేరుకుంది. ఇది ప్రజల ప్రధాన సమస్య. ద్రవ్యోల్బణం మహిళలను ఎక్కువగా ప్రభావితం చేస్తుందని అక్సాయ్ అభిప్రాయపడ్డారు.
"ప్రతిపక్ష పార్టీ సీహెచ్‌పీ అనేక నగరాల్లో మహిళా అభ్యర్థులను నిలబెట్టింది. ఇది ప్రజలు యువ, మహిళా రాజకీయ నాయకులకు మద్దతు ఇస్తున్నారని తెలుపుతుంది" అని ఆమె అన్నారు.
రాడికల్ పార్టీల నుంచి ఒత్తిడి
అధ్యక్షుడు ఎర్డోగన్ తన సంకీర్ణ ప్రభుత్వంలో రాడికల్ వర్గాల మీద ఆధారపడటం పెరిగింది. ఈ రాడికల్ పార్టీల ఆలోచన సంప్రదాయవాద మహిళలకూ ఆందోళన కలిగిస్తోంది.
అస్లి అక్సాయ్ మాట్లాడుతూ, "కూటమికి చెందిన సంప్రదాయవాద ఇస్లామిక్ పార్టీలు స్త్రీలను పురుషులతో సమానంగా పరిగణించవు. అవి మహిళలకు సమాన హక్కులు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నాయి. వీళ్లు తుర్కియేని ఒట్టోమన్ శకంలోకి తీసుకువెళుతున్నారు. ఎర్డోగన్‌కు చెందిన ఏకేపీ కూడా తన ప్రాథమిక సూత్రాలకు చాలా దూరంగా వెళ్లింది’’ అన్నారు.
ఇప్పుడు మన ప్రధాన ప్రశ్న, తుర్కియే మహిళలకు మరింత ప్రమాదకరంగా మారుతుందా? అన్నదానికి తిరిగి వస్తే, అధికారిక గణాంకాలు లేనందున ఈ ప్రశ్నకు నేరుగా సమాధానం ఇవ్వడం కష్టం. కానీ ఫిబ్రవరిలో ఒకే రోజులో ఏడుగురు మహిళలను వారి భర్తలు లేదా భాగస్వాములు చంపారు.
గృహహింసపై ఇస్తాంబుల్ కన్వెన్షన్‌కు అనుగుణంగా తుర్కియే చట్టాలు మహిళలకు రక్షణ కల్పించడం లేదని ఆందోళన వ్యక్తం అవుతోంది. కానీ తుర్కియే మహిళల సమాన హక్కులకు వ్యతిరేకంగా అనేక చర్యలు తీసుకుందని నిపుణులందరూ అంగీకరిస్తున్నారు. అదే సమయంలో, సమాన హక్కులకు వ్యతిరేకమైన ఆలోచనలు, ప్రసంగాలు ఇప్పుడు ప్రధాన స్రవంతి రాజకీయాల్లో భాగంగా మారాయి.
ఇవి కూడా చదవండి:
- అంతరించి పోయిందనుకున్న ఈ ‘పర్వత రత్నం’ మళ్లీ కనిపించింది, ఎక్కడంటే..
- బెంగళూరు రేవ్ పార్టీ కేసు: పోలీసులు ఏం చెప్పారు? అసలు రేవ్ పార్టీ అంటే ఏంటి? అందులో ఏం చేస్తారు?
- ఓవర్సీస్ హైవే: సముద్రంలో 182 కిలోమీటర్ల రోడ్డు.. ప్రపంచంలో 8వ వింత ఇదేనా?
- #UnseenLives: వెనక 40 మంది పురుషులున్నా, నేను ఆ మరకను దాచుకోలేదు
- చంద్రుడి మీద బతకాల్సి వస్తే అక్కడ తినడానికి ఏముంటుంది, సైంటిస్టులు చేస్తున్న ప్రయోగాలేంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














