జార్జియా మరో యుక్రెయిన్‌గా మారనుందా?

జార్జియా నిరసనలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, కటెరినా కింక్లోవా
    • హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్

జార్జియాలో ‘రష్యన్ చట్టం’గా అభివర్ణిస్తున్న ‘ఫారిన్ ఇన్‌ఫ్లూయెన్స్’ బిల్లుపై భారీ నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

జార్జియా ప్రజలు రష్యాకు దూరం జరిగి యూరప్‌కు సన్నిహితం కావడం యుక్రెయిన్ తరహా యుద్ధానికి కారణమవుతుందేమోననే ఆందోళనలు పెరుగుతున్నాయి.

తూర్పు యూరప్, పశ్చిమ ఆసియా మధ్యన ఉండే దక్షిణ కాకసస్‌ ప్రాంతంలో జార్జియా దేశం ఉంది. ఈ దేశ జనాభా 37 లక్షలు.

జార్జియా పూర్వపు సోవియట్ యూనియన్‌లో భాగంగా ఉండేది. దీర్ఘకాలంగా జార్జియాపై రష్యా ప్రభావం తీవ్రంగా ఉందని భావిస్తున్నారు. 1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తరువాత, యూనియన్‌లోని అనేక దేశాలకు తాము కోరుకున్న రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడానికి, తాము ఎంచుకున్న కూటమిలోకి చేరడానికి ఓ చారిత్రక అవకాశాన్ని కల్పించారు.

అయితే, యుక్రెయిన్ కథ వేరు. జార్జియాతో పోలిస్తే యుక్రెయిన్ చాలా పెద్ద దేశం. పైగా రష్యా నీడన ఉండే దేశంగా పరిగణించేవారు. అయితే 2014లో యూరోపియన్ అనుకూల నిరసనల కారణంగా రష్యా ఆర్థిక మండలి నుంచి వైదొలగాలని యుక్రెయిన్ నిర్ణయించుకుంది.

దీని ఫలితంగా రష్యా క్రైమియాను, తూర్పు యుక్రెయిన్‌లోని కొన్ని ప్రాంతాలను కలుపుకుంది. పదేళ్ళ తరువాత ఇప్పుడు రష్యా యుక్రెయిన్‌పై పూర్తిస్థాయి యుద్ధానికి దిగింది. పైగా అనేక యుక్రెనియన్ ప్రాంతాలు రష్యా ఆధిపత్యం కిందకు వచ్చాయి.

మరి జార్జియా కూడా ఇటువంటి సమస్యనే ఎదుర్కొంటుందా?

జార్జియాలో నిరసనలు

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, జార్జియాలో ‘ఫారిన్ ఇన్‌ఫ్లుయెన్స్’ బిల్లుకు వ్యతిరేకంగా ప్రజలు వీధుల్లోకి వచ్చారు.

జార్జియాలో నిరసనలు ఎందుకు?

ఈవారం ప్రారంభంలో జార్జియా పార్లమెంట్ ఓ బిల్లును ఆమోదించింది. విదేశాల నుంచి 20శాతానికి పైగా నిధులు తీసుకునే సంస్థలు ‘‘ఏజెంట్స్ ఆఫ్ ఫారిన్ ఇన్‌ప్లుయెన్స్’గా నమోదు చేసుకోవాల్సిందేనని ఈ బిల్లులో పేర్కొన్నారు. ఈ చట్టం ప్రకారం ఆర్థిక సమాచారాన్ని వెల్లడించాల్సి ఉంటుంది. ఉల్లంఘనలు జరిగితే జరిమానాలు విధిస్తారు.

జార్జియాలో ఎన్జీఓలు, స్వతంత్ర మీడియా సంస్థలు విదేశీ గ్రాంట్లు, ఇతర నిధుల కోసం దరఖాస్తు చేసుకోవడం సాధారణమని, జార్జియా రాజధాని టిబ్లిసీలోని బీబీసీ కరస్పాండెంట్ నినా అక్మడెలి చెప్పారు. ఈ సంస్థలు చేసే పనులు జార్జియా పౌర సమాజంలో అంతర్భాగంగా ఉన్నాయి.

జార్జియా అధికార పార్టీ ‘జార్జియన్ డ్రీమ్’ ఈ బిల్లును పార్లమెంట్‌లో ప్రతిపాదించింది. ప్రభుత్వంపై విమర్శలను అణిచివేయడానికి ఈ బిల్లును తీసుకురాలేదని, వివిధ సంస్థల వెనుక ఎవరున్నారనే విషయాన్ని ప్రజలకు తెలియజేసి, పారదర్శకతను తీసుకురావాలనే లక్ష్యంతోనే ఈ బిల్లును తీసుకువచ్చినట్టు తెలిపింది.

అయితే పారదర్శకత అనేది కేవలం పేరుకే అని టిబ్లిసీ లోని ఇలియా యూనివర్సిటీలో పబ్లిక్ పాలసీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న హన్స్ గట్‌బార్ట్ చెప్పారు.

‘‘ఇది గత కొంతకాలంగా జార్జియాలో పౌరసమాజంపై వివిధ రూపాలలో జరుగుతున్న దాడులలో భాగం. ఈ చట్టం ఎవరినైనా అణిచివేసే చట్టం. ప్రభుత్వానికి నచ్చని ఏ పౌర సమాజ సంస్థనైనా అణిచివేసే వెసులుబాటు ఈ చట్టం కల్పిస్తోంది’’ అని 1990ల నుంచి కాకసస్ ప్రాంతంలో రిపోర్టింగ్ చేస్తున్న గుడ్‌బ్రాడ్ చెప్పారు.

ఈ బిల్లు ఆమోదం పొందగానే యురోపియన్ యూనియన్, అమెరికా హెచ్చరికలు చేశాయి. ‘‘యురోపియన్ యూనియన్ మార్గంలో జార్జియా ప్రగతిని ఈ చట్టం ప్రభావితం చేస్తుంది’’ అని ఈయూ విదేశీ విధానాల ముఖ్యుడు బోరెల్ ఓ ప్రకటనలో తెలిపారు.

జార్జియా రాజధాని టిబ్లిసీలో వేలాదిమంది ప్రజలు వీధులలోకి వచ్చి ఈ బిల్లును నిరసించారు. ఈ బిల్లు ఏకపక్షమని, రష్యా అనుకూలమని నిరసించారు. నిరసనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

నిరంకుశ సోవియట్ యూనియన్‌లో భాగమైన జార్జియా చరిత్రను ప్రస్తావిస్తూ ఓ నిరసనకారుడు మేమెక్కడి నుంచి వచ్చామో, అక్కడకు తిరిగి మమ్మల్ని నెట్టకుండా ఉండేందుకు మేం పోరాడుతున్నామని చెప్పారు.

ఇవనిష్విలి

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, 'జార్జియన్ డ్రీమ్' పార్టీకి గౌరవ నాయకుడు బిడ్జినా ఇవనిష్విలి అనే కోటీశ్వుడు

రష్యాతో పోరాటమేంటి?

అసమ్మతిని నియంత్రించేందుకు రష్యా వినియోగిస్తున్న చట్టం మాదిరిగానే జార్జియా చట్టం కూడా ఉంది. మరో ఆరునెలల్లో జార్జియా పార్లమెంట్ ఎన్నికలు జరగనుండగా, ఇప్పుడీ బిల్లును పాస్ చేశారు.

జార్జియాలో 2012 నుంచి అధికారంలో ఉన్న ‘జార్జియన్ డ్రీమ్’ పార్టీని దించేయడానికి ఈ ఎన్నికలు ప్రజలకు ఒక అవకాశం ఇస్తాయి. రష్యా తరహాలోనే అధికారం ఒకే రాజకీయపక్షం చేతిలో ఉండాలన్నదే జార్జియన్ డ్రీమ్ పార్టీ పంథా కూడా.

జార్జియన్ డ్రీమ్ పార్టీ గౌరవ నాయకుడు ఓ కోటీశ్వరుడు. ఆయన పేరు బిడ్జినా ఇవనిష్విలి.

ఆయన ఆస్తుల నికర విలువ భారతీయ కరెన్సీలో 40,905 కోట్లరూపాయలు (4.9 అమెరికన్ బిలియన్ డాలర్లు ). ఇది జార్జియా బడ్జెట్ కన్నా ఎక్కువ. మొత్తం జీడీపీలో 20శాతం. ఆయన వ్యాపారాలలో అనేకం రష్యాతో సంబంధాలు కలిగినవే.

‘‘పౌర సమాజాన్ని అణచివేయడానికి జార్జియా ప్రభుత్వం అధికారాన్ని పెంచుకోవడమే కాక, రష్యాను అనుసరిస్తున్నట్టుగా కనిపిస్తోంది’’ అని పొలిటికో వార్తా సంస్థకు దక్షిణ కాకసస్ కరస్పాండెంట్‌గా ఉన్న గాబ్రియెల్ కెవిన్ చెప్పారు.

‘‘అదే సమయంలో రష్యన్ అధ్యక్షుడు పుతిన్ ఈ విషయంపై ఇవాన్షివిలికి సలహా ఇస్తారని నేనుకోవడం లేదు. ఎందుకంటే పుతిన్ తరహాలోనే ఇవాన్షివిలికి కూడా విదేశీ ప్రభావ భయం ఉంది’’ అని చెప్పారు.

నిరసనకారులు, పోలీసుల ఫోటో

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, నిరసనకారులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది.

ప్రపంచ రాజకీయాలలో జార్జియా

దక్షిణ కాకసస్‌లో జార్జియా కొలువైన ప్రాంతం యూరప్, ఆసియాకు ద్వారంగా చెబుతారు. ప్రాచీన ప్రపంచ వాణిజ్య మార్గానికి ఇది నెలవుగా ఉండేది. ఇప్పటికీ జార్జియాకు ఆ ప్రాముఖ్యం ఉంది. చారిత్రాత్మకంగా ఇరాన్, తుర్కయే, రష్యా ఈ ప్రాంతంపై పట్టుకోసం పోరు సల్పాయి. అలాగే తమ ప్రభావం ఈ ప్రాంతంపై ఉండేలా ప్రయత్నిస్తున్నాయి. ఇటీవల కాలంలో చైనాయే కాకుండా పశ్చిమ దేశాలు కూడా ఈ ప్రాంతంపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నాయి.

జార్జియా 19వ శతాబ్దంలో రష్యన్ సామ్రాజ్యంలో భాగమైంది. ఈ రెండుదేశాల మధ్య సంబంధాలు ఎప్పుడూ అంతంతమాత్రంగానే ఉండేవి.ఎందుకంటే కొన్నిసార్లు రష్యాతోనూ, మరికొన్నిసార్లు ఇతర దేశాలతోనూ జార్జియా విభేదిస్తుండేది.

1918లో స్వతంత్రం పొందిన జార్జియా 1991వరకు రష్యా ఆధిపత్యం ఉన్న సోవియట్ యూనియన్‌లో ఉండేది. 1980లలో జాతీయవాద అస్తిత్వాన్ని చవిచూసిన దేశం జార్జియానే. ఇది దేశవ్యాప్తంగా జరిగిన సంఘటనల సమాహారంలో భాగమైంది.ఇది సోవియట్ యూనియన్ పతనానికి కూడా దారితీసింది. రోజ్ విప్లవం ద్వారా 2003లో ప్రజాస్వామ్యంలోకి పరివర్తన చెందిన తొలి మాజీ సోవియట్ దేశం కూడా జార్జియానే.

దీని ద్వారా సోవియట్ చారిత్రక పెత్తనాన్ని జార్జియా సవాలు చేసింది. దీనివల్ల రష్యాను కన్నెత్తిచూడని ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. యురోపియన్ యూనియన్‌లోనూ, నాటోలోనూ చేరేందుకు చురుకుగా ప్రయత్నించింది. 2008లో రష్యా జార్జియాలోని కొన్ని భాగాలను ఆక్రమించింది. ఇప్పటికీ జార్జియా రాజధాని టిబ్లిసీకి 130 కిలోమీటర్ల దూరంలో రష్యన్ దళాలు ఉన్నాయి.

రష్యన్ యుద్ధ ట్యాంకులు

ఫొటో సోర్స్, Getty Images

యుక్రెయిన్‌తో పోలిక సబబేనా?

గత కొన్ని వారాలుగా చాలా మంది విశ్లేషకులు చరిత్ర పునరావృతం గురించి మాట్లాడుతున్నారు. ఒక రాజ్యంలో నియంతృత్వ ధోరణులు తీవ్రతరమైనప్పుడు, ఆ ప్రభుత్వం ప్రజాస్వామ్య పంథా నుండి పక్కకు మళ్లుతుంది, నిరసనలు చెలరేగుతాయి. చివరకు రష్యా జోక్యం చేసుకుని పట్టు సాధిస్తుంది.

యుక్రెయిన్‌లో 2013-2014లో ఇలాంటి ఘటనలే చోటు చేసుకుని 2022లో మరింతగా దిగజారాయి. ఫలితంగా 1945 తరువాత యూరప్‌లోనే అతిపెద్ద యుద్ధం మొదలైంది. కానీ జార్జియా విషయంలో చాలా తేడాలు ఉన్నాయి.

జార్జియాలో కూడా యుక్రెయిన్ తరహా ఘటనలు 2003 నుంచి 2008 మధ్య జరిగాయి. అనంతరం నిరసనలు వెల్లువెత్తాయి. రష్యా ఆక్రమణ మొదలైంది. జార్జియాలోని 20శాతం ప్రాంతం రష్యా ఆక్రమణలో ఉంది. ఒకవేళ రష్యా అనుకూల ప్రభుత్వం నియంత్రణ కోల్పోతే రష్యా జార్జియాను ఆక్రమిస్తుందా అన్నదే అసలు ప్రశ్న. అయితే ఈ అవకాశాన్ని కొట్టిపారేయలేం. కానీ ‘జార్జియన్ డ్రీమ్ పార్టీ’ పట్టుకోల్పోతుందని చెప్పడం అనుమానమే.

బీబీసీకి చెందిన నినా అఖ్మెడెలి చెప్పినట్లుగా, జార్జియా ఒక విభజిత సమాజం. పరిస్థితులు దిగజారుతున్నాయని అక్కడి మెజార్టీ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కొంతమంది అధికార పార్టీని సమర్థిస్తున్నారు కూడా. జార్జియాలాంటి చిన్నదేశం రష్యాను అంటిపెట్టుకుని ఉండటం ఆచరణాత్మక ఎంపిక అని కొందరు నమ్ముతున్నారు. జార్జియా ఆర్థికపరిస్థితి పొరుగుదేశాల వాణిజ్యంపై ఆధారపడి ఉంది. పైగా రష్యాతో పోరాడటానికి జార్జియా సైన్యం చాలా చిన్నది అని కూడా వారు వాదిస్తున్నారు.

వివాదాస్పద ‘ఫారిన్ ఇన్‌ఫ్లుయెన్స్ బిల్లు’ ఆమోదానికి ముందు ఇవాన్షివిలి చేసిన ప్రసంగంలో రష్యాతో ఘర్షణలో జార్జియా ప్రజలను బలి చేయాలనే పశ్చిమ దేశాల ప్రయత్నాలను అడ్డుకోవడానికి ఈ చట్టం అవసరమని ఆయన పేర్కొన్నారు.

టిబ్లిసీ వీధులు నిరసనకారులతో నిండిపోయాయి. వీరిలో ఎక్కువ మంది 35 ఏళ్ల లోపు వారే. జార్జియా భవిష్యత్తు ఊగిసలాడుతోంది.యుక్రెయిన్ ఎదుర్కొన్న విధ్వంసం, ప్రాణనష్టాన్ని చవిచూడాల్సి వస్తుందేమోనని పలువురు భయపడుతున్నారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)