స్టాలిన్ రికార్డును బద్దలుకొట్టిన పుతిన్ పాలన పట్ల పశ్చిమదేశాల భయాలేంటి, రష్యా ప్రజల మాటేంటి?

రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోటో

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఐదోసారి అధ్యక్ష పగ్గాలు అందుకుంటున్న పుతిన్ రష్యాలో ప్రజాస్వామ్యాన్ని నియంత్రించి, యుక్రెయిన్‌పై యుద్ధానికి దిగారు.
    • రచయిత, స్టీవ్ రోసెన్‌బర్గ్,
    • హోదా, బీబీసీ రష్యా ఎడిటర్

వ్లాదిమిర్ పుతిన్ ఐదోసారి రష్యాకు అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. గ్రాండ్ క్రెమ్లిన్ ప్యాలెస్ నుంచి సెయింట్ ఆండ్రూస్ థ్రోన్ హాల్ వరకు నడుచుకుంటూ వెళ్లి, ఐదోసారి పగ్గాలు చేపట్టబోతున్నారు. మరో ఆరేళ్ల కాలానికి రష్యాకు ఆయనే అధ్యక్షుడు.

అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయడం ఆయనకు కొత్త కాదు. అయితే, పుతిన్ తొలి వేడుక నుంచి చాలా మార్పులు వచ్చాయి.

అప్పట్లో అధ్యక్షుడిగా ప్రజాస్వామ్యాన్ని కాపాడతానని, అభివృద్ధి చేస్తానని, రష్యాను సురక్షితంగా చూసుకుంటానని వాగ్దానం చేశారు పుతిన్.

ఈ 24 ఏళ్లలో క్రెమ్లిన్ లీడర్ పుతిన్, యుక్రెయిన్‌పై యుద్ధాన్ని ప్రారంభించారు. ఈ యుద్ధంలో రష్యా కూడా భారీ మొత్తంలో నష్టపోవాల్సి వచ్చింది.

ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి బదులు, దానిపై ఆంక్షలు విధిస్తూ వస్తున్నారు పుతిన్. విమర్శకులను జైలుకు పంపడం, తన అధికారానికి అడ్డుగా వస్తున్న వాటిని తొలగించడం లాంటివి చేస్తున్నారు.

‘‘పుతిన్ తనకు తాను ‘వ్లాదిమిర్ ది గ్రేట్’, ‘రష్యన్ రాజు’గా భావిస్తున్నారు’’ అని వైట్‌హౌస్ నేషనల్ సెక్యూరిటీ మాజీ అడ్వయిజర్ ఫియోనా హిల్ అన్నారు.

‘‘అధ్యక్షుడిగా పుతిన్ తొలి రెండు పర్యాయాలను తీసుకుంటే, దేశ రాజకీయ వ్యవస్థను స్థిరపరిచారు. ఆర్థిక సామర్థ్యాలను పెంచారు. రష్యా చరిత్రలో గతంతో పోలిస్తే ఆ దేశ ఆర్థిక, పాలనా వ్యవస్థలు చాలా మెరుగైన ప్రదర్శన కనబర్చాయి’’ అని తెలిపారు.

పదేళ్ల క్రితం క్రిమియాను కలుపుకోవడం, యుక్రెయిన్‌తో యుద్ధం, రష్యా పయనాన్ని పూర్తిగా మార్చేశాయి. కార్యసాధకుడిగా ఉండాల్సిన పుతిన్, సామ్రాజ్యవాదిగా మారిపోయారు.

వ్లాదిమిర్ పుతిన్ తొలిసారి అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అమెరికాకు ఐదుసార్లు అధ్యక్షులు మారారు. బ్రిటన్‌లో ఏడుగురు ప్రధానులు మారారు.

జోసెఫ్ స్టాలిన్

ఫొటో సోర్స్, HULTON ARCHIVE/GETTY IMAGE

ఫొటో క్యాప్షన్, రష్యా అధ్యక్షుడిగా జోసెఫ్ స్టాలిన్ రికార్డును పుతిన్ బద్దలు కొట్టారు.

స్టాలిన్‌ను మించి..

శతాబ్దంలో పావు వంతు కాలం పాటు రష్యాను పాలించిన తర్వాత, పుతిన్ తనకంటూ ఒక చెరగని ముద్ర వేసుకున్నారు. గతంలో ప్రజలు బ్రెజ్నెవిజం, గోర్బచేవిజం గురించి అరుదుగా మాట్లాడుకునేవారు. కానీ, పుతినిజం ఇప్పటి విషయం.

‘‘మన చరిత్రలో మరో ఇజం ఉంది. అదే స్టాలినిజం’’ అని కార్నెజీ యూరేసియా రష్యా సెంటర్ సీనియర్ ఫెలో ఆండ్రీ కోలెస్నికోవ్ అన్నారు.

‘‘పుతినిజం మరో స్టాలినిజ అవతారమని నేను చెప్పగలను. ఎందుకంటే, ఆయన స్టాలిన్(మాజీ సోవియట్ నియంత) లాగా ప్రవర్తిస్తున్నారు. స్టాలిన్ మాదిరి పుతిన్‌కు అధికారం పూర్తిగా వ్యక్తిగతంగా మారింది. ఆయన ఎన్నో రాజకీయ అణచివేతలకు దిగుతున్నారు. స్టాలిన్‌లానే చివరి వరకు అధికారంలో ఉండాలని పుతిన్ భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా బాటలు వేసుకుంటున్నారు’’ అని ఆండ్రీ చెప్పారు.

తాను భావిస్తున్న దానినే రష్యా గొప్పతనంగా పునరుద్ధరించాలని చూస్తున్న పుతిన్ నియంతృత్వ పోకడలతో ఎలా వ్యవహరించాలన్నదే ప్రస్తుతం పశ్చిమ దేశాల ముందున్న అసలైన సవాలు.

అణు ఆయుధాలతో రష్యాను ఆధునిక రాజ్యంగా పుతిన్ భావిస్తున్నారు.

యుక్రెయిన్‌లో యుద్ధానికి వ్యూహాత్మక అణ్వాయుధాల ప్రయోగానికి సిద్ధమవుతుండటంతో, చైనా, భారత్, జపాన్ వంటి కొన్ని దేశాలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నాయి. ఈ ప్రయోగాల నుంచి వెనక్కి తగ్గాలని కోరుతున్నాయి.

అణ్వాయుధాలను వినియోగంపై రష్యాను వెనక్కి తగ్గేలా చేయడానికి అంతర్జాతీయ ఒత్తిడి తెచ్చి, దానికి అడ్డుకట్ట వేయాలి.

అధికారికంగా వ్లాదిమిర్ పుతిన్ మార్చిలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో 87 శాతానికి పైగా ఓట్లు సాధించి, విజయం సాధించారు.

పుతిన్‌కు వ్యతిరేకంగా బలమైన ప్రతిపక్ష నేతలెవరినీ ఎన్నికలలో పోటీ చేయనీయలేదు.

పాశ్చాత్య దేశాలు రష్యా ఎన్నికల తీరును ఖండించాయి. "ఈ ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయంగా జరగలేదు" అని ఆరోపించాయి.

జోసెఫ్ స్టాలిన్ తరువాత అత్యధిక కాలం అధ్యక్షునిగా ఉన్నది పుతినే. ఇప్పుడు స్టాలిన్ రికార్డును కూడా ఆయన బద్దలు కొట్టారు.

పుతిన్ భారీ కుడ్య చిత్రం
ఫొటో క్యాప్షన్, క్రెమ్లిన్‌లో ఇప్పుడప్పుడే మార్పు వచ్చే అవకాశం లేదు.

రష్యా ప్రజల మాటేంటి?

జోసెఫ్ స్టాలిన్ నుంచి ఎక్కువ కాలం పాటు క్రెమ్లిన్ నేతగా ఉన్న పుతిన్‌పై రష్యన్ల అభిప్రాయం ఎలా ఉందో తెలుసుకోవడం కోసం మాస్కో నుంచి 70 మైళ్ల దూరంలో ఉన్న కాశీరా పట్టణానికి వెళ్లాను.

ఇక్కడ నేను ఓ అపార్ట్‌మెంట్‌ బ్లాక్‌ మొత్తాన్ని ఆక్రమించిన అతిపెద్ద పుతిన్ చిత్రాన్ని చూశాను.

కాషీరాలో ఈ పెద్దపుతిన్ బొమ్మ మిమ్మల్ని గమనిస్తుంటుంది.

‘‘ నేను ఆయన్న చాలా ఇష్టపడతాను’’ అని రోడ్డు పక్కన పూలు అమ్ముతున్న పెన్షనర్ వాలెంటనీ చెప్పింది.

‘‘పుతిన్ వద్ద చాలా మంచి ఆలోచనలు ఉంటాయి. అవి ఎంతో మందికి ఉపయోగపడతాయి. నిజమే, మా పెన్షన్లు అంత ఎక్కువేమీ కాదు. కానీ, ఒకేసారి అంతా చక్కపెట్టలేరు కదా’’ అని అన్నారు.

ఆయన 25 ఏళ్ల పాటు దేశాన్ని పాలించారు కదా.. అనే నేను ప్రశ్నించాను.

ఒకవేళ పుతిన్ వెళ్లిపోతే, అప్పుడు ఎవరొస్తారో తమకు తెలియదని వాలంటీనా అన్నారు.

‘‘రష్యాలో మేమందరం ఇదే విధంగా ఆలోచిస్తున్నాం’’ అని చెబుతూ పుతిన్ కుడ్యచిత్రం వైపు వేగంగా నడుచుకుంటూ వెళ్లారు విక్టోరియా.

‘ఒకవేళ పుతిన్‌కు వ్యతిరేకంగా తాను మాట్లాడితే, తన భర్త వెంటనే.. ‘నువ్వు పుతిన్‌ను విమర్శిస్తున్నావు. నేను నీకు విడాకులు ఇస్తాను అంటారు. అంత అభిమానం ఆయనకు. ఒకవేళ పుతిన్ లేకుంటే, 1990ల్లో లాగా జీవితం చాలా క్లిష్టంగా ఉండేదని నా భర్త అంటారు’ అని చెప్పారు.

అలెక్సాండర్ అనే మరో వ్యక్తిని అధ్యక్షుడి గురించి ఏం ఆలోచిస్తున్నావని అడగగా.. ‘ఏదైనా అభిప్రాయాన్ని చెప్పడం ఇప్పుడు ప్రమాదకరం. నో కామెంట్’ అని అన్నారు.

నేను మాట్లాడిన చాలామంది అక్కడి పుతిన్ చిత్రాన్ని గమనించకుండానే వెళుతున్నారు. అలా వెళ్లడానికి వారు అలవాటుపడ్డారు.

అలాగే రష్యాలోనూ వారు ఒక వ్యక్తి పరిపాలనకు అలవాటు పడ్డారు. ఇప్పుడప్పుడే క్రెమిన్ల్‌లో మార్పు వచ్చే అవకాశం లేదు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)