నైరుతి రుతుపవనాలు వచ్చేది ఎప్పుడంటే.. చల్లటి కబురు చెప్పిన వాతావరణ శాఖ

ఫొటో సోర్స్, GETTY IMAGES
ఎండలు మండుతున్న వేళ భారత వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రుతుపవనాలు దేశంలోకి ఎప్పుడు ప్రవేశిస్తాయో వెల్లడించింది.
మే 31నాటికల్లా రుతుపవనాలు కేరళను తాకుతాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఈ తేదీకి నాలుగు రోజులు అటు ఇటు కావచ్చని కూడా పేర్కొంది.
మే 19 నాటికి నాలుగు రోజులు ముందు వెనుకా రుతుపవనాలు అండమాన్ వద్ద సముద్రంలోకి ప్రవేశిస్తాయని చెప్పింది.
ఈ ఏడాది రుతుపవనాలు రాక, వాటి గమనం ఎలా ఉంటుందో చూద్దాం.

ఫొటో సోర్స్, GETTY IMAGES
రుతుపవనాలు రాక ఎలా?
భారత్‌లో జూన్ నుంచి సెప్టెంబర్ దాకా నైరుతి దిశగా గాలులు వీస్తాయి.
అంటే అరేబియా సముద్రం మీదుగా హిమాలయల వైపు గాలులు వీస్తాయి.
ఈ గాలుల్నే నైరుతి రుతుపవనాలుగా పిలుస్తారు.
ఇక అక్టోబరు మాసంలో ఈ గాలులు వ్యతిరేక దిశలో వీస్తాయి.
వీటిని ఈశాన్య రుతుపవనాలని పిలుస్తారు.
వీటి కారణంగా దక్షిణ భారతదేశంలో అక్టోబరు నుంచి డిసెంబర్ మధ్యలో వానలు కురుస్తాయి.
రుతుపనవాలు ఏర్పడటంపై అనేక సిద్ధాంతాలు ఉన్నాయి.
భూమి 23.5 డిగ్రీలు వంగి ఉండటంతో దాని ఉత్తరార్థ గోళం సూర్యుడి వైపు ఉంటుంది. దీనివల్ల ఉత్తరార్థగోళంలో వేసవి, దక్షిణార్థగోళంలో చలి ఉంటాయి.
ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నచోట గాలి పీడనం తక్కువగానూ, ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నచోట గాలిపీడనం ఎక్కువగా ఉంటుంది.
గాలులు అధిక పీడనం నుంచి తక్కువ పీడనం వైపు వీస్తాయి.
సముద్రంపై ఉష్ణోగ్రత భూమిపై కన్నా కొంచెం చల్లగా ఉంటుంది. ఆ సమయంలో సముద్రంపై నుంచి గాలులు వీచడం మొదలవుతుంది. ఈ గాలులు తమతోపాటు సముద్రపు ఆవిరిని కూడా తీసుకురావడంతో అది వానగా మారుతుంది.
భూమిపైన చాలా చోట్ల ఇలాగే జరుగుతుంది కానీ, భారత ఉపఖండంలో మాత్రం ఇది కొంత ప్రత్యేకంగా జరుగుతుంది.
భారత ద్వీపకల్ప పరిమాణం పెద్దది. ఇక్కడ, వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి.
భూమి కూడా వేడెక్కతుంది. ప్రత్యేకించి మే వరకు రాజస్తాన్‌లోని ఎడారిలో వేడి పెరుగుతుంది.
అదే సమయంలో అరేబియా సముద్రం చుట్టుపక్కల అంటే ఆఫ్రికా, సౌదీ అరేబియా ద్వీపకల్ప ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి.
దీని ఫలితంగా ఉత్తరార్థ గోళంలోని హిందూ మహాసముద్రం నుంచి గాలులు భారత ద్వీపకల్పం వైపు వీస్తాయి.
ఈ గాలులతో పాటు పెద్ద ఎత్తున ఆవిరి కూడా వస్తుంది. ఆ అవిరి కారణంగా మేఘాలు ఏర్పడి వానలు పడతాయి.
అయితే అక్టోబరు నాటికల్లా ఉష్ణోగ్రతలు, గాలుల దిశ మారుతుంది. ఈశాన్యం నుంచి గాలులు వీచడం మొదలవుతుంది.

ఫొటో సోర్స్, BBC WEATHER
రుతుపవనాల రాక ఎలా తెలుస్తుంది?
నైరుతి రుతుపవనాల వల్ల 80శాతం, ఈశాన్య రుతువపనాల 11 శాతం వర్షపాతం భారత్‌లో నమోదవుతుందని వాతావరణ శాఖ తెలిపింది.
జూన్ నుంచి సెప్టెంబర్ దాకా భారతదేశంలో 87శాతం వర్షపాతం నమోదవుతుంది.
కేవలం వానలు పడగానే రుతుపవనాలు ప్రారంభమయ్యాయని కాదు.
ఓ నిర్ణీత ప్రాంతంలోని వర్షపాతం, గాలుల వేగం, ఉష్ణోగ్రతలు ఆధారంగా వాతావరణశాఖ నిపుణులు ఆ ప్రాంతంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని ప్రకటిస్తారు.
కేరళ, లక్షద్వీప్‌లోని 14 వాతావరణ కేంద్రాలలో మే 10వ తేదీ తరువాత కనీసం 60 శాతం అంటే 9 స్టేషన్లు వరుసగా రెండు రోజులపాటు 2.5 మిల్లీమీటర్ల కన్నా ఎక్కువగా వర్షాన్ని నమోదు చేస్తే రుతుపవనాలు వచ్చాయని వాతావరణ శాఖ ప్రకటిస్తుంది.
సహజంగా రుతుపవనాలు కేరళను జూన్ 1న తాకుతాయి. అక్కడి నుంచి జూన్ 7 నుంచి 10వ తేదీ మధ్యన ముంబైకి విస్తరిస్తాయి. జులై 15 నాటికల్లా దేశమంతటా వ్యాపిస్తాయి.
నైరుతి రుతుపవనాలు రెండు పక్కల నుంచి వస్తాయి. ఒకటి అరేబియా సముద్రం మీదుగా, మరొకటి బంగాళాఖాతం మీదుగా వస్తాయి. అయితే అక్టోబరు 20 నాటికి నైరుతి రుతుపవనాలు తమ ప్రభావాన్ని చూపుతాయి.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ఆర్థిక రంగానికి జీవనాడి
సాధారణంగా వార్షిక వర్షపాతంలో 70 శాతం జూన్, సెప్టెంబర్ మధ్యన రుతుపవనాల సమయంలోనే కురుస్తుంది.
వ్యవసాయంతోపాటుగా నదులు, డ్యామ్‌లు, చెరువులు, బావులు నిండటానికి ఈ రుతుపవనాలే కీకలం.
ఉష్ణతాపం నుంచి రుతుపవన వానలు ఉపశమనాన్ని ఇస్తాయి. ఆర్థిక రంగానికి కూడా రుతుపవనాలు చాలా కీలకం. దక్షిణాసియా ఆర్థిక వ్యవస్థ దానిపైనే ఆధారపడింది.
ఈరోజుకి కూడా ఇండియా లాంటి వ్యవసాయాధార దేశంలో అనేక లెక్కలు వర్షపాతంపైనే ఆధారపడి ఉంటాయి.
ఓ నివేదిక ప్రకారం భారతదేశంలో సగానికి పైగా వ్యవసాయం రుతుపవనాలు తెచ్చే వానలపైనే ఆధారపడ్డాయి.
భారత వ్యవసాయ ఆర్థిక రంగానికి రుతుపవనాలను జీవనాడిగా పరిగణిస్తారు. అతి వృష్ఠి, అనావృష్ఠి వ్యవసాయానికి నష్టం కలిగిస్తాయి.
భారత ఆర్థిక రంగం ఓ రుతుపవన జూదం అని 1925లో వ్యవసాయంపై బ్రిటన్ రాయల్ కమిషన్ ఇచ్చిన ఒక నివేదిక పేర్కొంది. ఇప్పటికీ కూడా ఈ పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ఎల్ నినో, లా నినో
పసిఫిక్ సముద్ర ప్రవాహాల ప్రత్యేక పరిస్థితులకు ఎల్‌నినో, లానినో అని పేర్లు.
దక్షిణ అమెరికా పరిసరాల్లోని పసిఫిక్ సముద్రంలో ఉష్ణోగ్రతలు పెరిగి, ఉష్ణజలాలు పశ్చిమం వైపుగా అంటే ఆసియా వైపు కదలడాన్ని ఎల్‌నినో అంటారు. లా-నినో దీనికి వ్యతిరేకం.
ఎల్‌నినో, లానినో ప్రవాహాలు ప్రపంచ వాతావరణాన్ని ప్రభావితం చేయడమే కాదు, భారత్‌లో రుతుపవనాలపైనా ప్రభావం చూపుతాయి.
సాధారణంగా భారత్‌లో ఎల్‌నినో సమయంలో తక్కువ వర్షాలు, లానినో సమయంలో ఎక్కువ వర్షాలు కురుస్తాయి.
అయితే ఎల్‌నినో ఒక్కటే రుతుపవనాలను ప్రభావితం చేయదు. ఎల్‌నినో తరహాలో హిందూ మహాసముద్రంలోని ద్విధృవ (డైపోల్) ప్రవాహం కూడా ముఖ్యమైనదే.
ఇండియన్ ఓషన్ డైపోల్ సానుకూలంగా ఉన్నప్పుడు అంటే పశ్చిమ హిందూ మహాసముద్ర ఉష్ణోగ్రత తూర్పు కన్నా ఎక్కువగా ఉంటే, ఈ పరిస్థితి భారత్‌లోని రుతుపవనాలుకు మేలు చేస్తుంది.
దీంతోపాటుగా వాతావరణ పై పొరలోని గాలి ప్రవాహం కూడా రుతుపవనాలను ప్రభావితం చేస్తుంది.

ఫొటో సోర్స్, IMD
ఈ ఏడాది వానలే వానలు
మూడేళ్ళ విరామం తరువాత, 2023లో ఎల్‌నినో ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో రికార్డుస్థాయిలో ఎండలు నమోదయ్యాయి.
కానీ ఎల్‌నినో ఇప్పుడు వెనక్కి తగ్గుతోందని ప్రపంచ వాతావరణ సంస్థ నిపుణులు ప్రకటించారు.
భారత వాతావరణ శాఖ కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. ప్రస్తుతం ఎల్‌నినో సాధారణ రూపంలో ఉందని, రానున్న వారాలలో అది మరింత బలహీనపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది.
రుతుపవనాల మధ్యలో లానినో మొదలవుతుందని చెప్పింది.
ప్రస్తుతం హిందూ మహాసముద్రంలోని డైపోల్ తటస్థంగా ఉందని, రుతుపవనాలు ప్రవేశించాకా ఇది సానుకూలంగా మారుతుందని వాతావరణ శాఖ పేర్కొంది.
ఈ రెండు అంశాలు రుతుపవనాలకు మేలు చేసేవే. దీంతో ఈ ఏడాది వర్షపాతం సగటు వర్షపాతం కన్నా ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
దేశవ్యాప్తంగా 106శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చీఫ్ డాక్టర్ మృత్యుంజయ మహాపాత్ర తెలిపారు.
ఇది నైరుతి రుతుపవనాలకు సంబంధించిన అంచనా.
అంచనాల కంటే వర్షపాతం ఐదుశాతం అటు ఇటుగా ఉండొచ్చని ఆయన చెప్పారు. అలా చూసినా సగటు కంటే వర్షపాతం ఈసారి ఎక్కువగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- షుగర్ ఉన్న వాళ్లు మామిడి పండ్లు తినొచ్చా, తినకూడదా? డాక్టర్లు ఏం చెప్పారంటే..
- ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెరిగిన పోలింగ్ శాతం దేనికి సంకేతం, ఎవరికి అనుకూలం?
- పెద్దక్కగా పుట్టడం శాపమా, అది ఒక మానసిక సమస్యగా మారుతోందా?
- ‘మా నాన్న సీఎం’
- ఏపీలో మే 13న ఎన్నికలు పూర్తయితే జూన్ 1 వరకు ఎగ్జిట్ పోల్స్ ఎందుకు ఇవ్వకూడదు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














