అఫ్గానిస్తాన్ వరదలు: ‘మా వాళ్ల మృతదేహాలు వీధుల్లో దొరికాయి’

నూర్ మొహమ్మద్
ఫొటో క్యాప్షన్, నూర్ మొహమ్మద్ తన భార్య, సోదరి, కుమారుడు సహా ఇద్దరు మనుమలను పోగొట్టుకున్నారు.
    • రచయిత, యమా బారిజ్, కరోలిన్ డేవీస్,
    • హోదా, బఘ్లాన్ ప్రావిన్స్, అఫ్గానిస్తాన్

తమ ప్రాంతంలో వరద పోటెత్తిన ఒకరోజు తరువాత నూర్ మొహమ్మద్ తన కుటుంబ సభ్యుల మృతదేహాలను వీధుల్లో, పంట పొలాల్లో గుర్తించారు.

వరద హెచ్చరిక చేసినప్పుడు నూర్ మొహమ్మద్ ఉత్తర అఫ్గానిస్తాన్‌లోని తన ఇంటికి 100 మీటర్ల దూరంలో ఉన్నారు.

భార్య, సోదరి, కొడుకు, తన ఇద్దరు మనవలు ఆ సమయంలో ఇంట్లో నిద్రపోతున్నారు. వరదల వార్త వినగానే ఆయన వేగంగా ఇంటికి పరిగెత్తారు.

కానీ, అప్పటికే ఆలస్యమైంది.

అకస్మాత్తుగా వచ్చిన వరద, ఆ కుటుంబాన్ని, ఇంటిని పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది.

అఫ్గానిస్తాన్‌లో భారీ వర్షాలు కురిశాయి. అక్కడి నేలలకు వర్షం నీటిని భూమిలోకి పీల్చుకునే సామర్థ్యం తక్కువగా ఉంటుంది. దీంతో, శుక్రవారం అసాధారణమైన రీతిలో వరద ఉత్తర అఫ్గానిస్తాన్‌ను ముంచెత్తింది.

వీడియో క్యాప్షన్, అఫ్గాన్ వరదల్లో ప్రాణాలకు తెగించి చిన్నారిని రక్షించిన స్థానికులు

300 మంది మృతి

ఉత్తర అఫ్గాన్ ప్రావిన్స్ బఘ్లాన్‌లోని ఐదు జిల్లాలు ఈ వరదలకు ప్రభావితమయ్యాయి.

వరదలతో 2 వేల ఇళ్లు ధ్వంసమయ్యాయి. 300 మందికి పైగా మరణించినట్లు వరల్డ్ ఫుడ్ ప్రొగ్రామ్ తెలిపింది.

బదక్షాన్, ఘోర్, హెరత్ ప్రావిన్స్‌లలో తీవ్ర నష్టం జరిగినట్లు రిపోర్టులు వచ్చాయి.

‘‘నేను నిస్సహాయుడిని అయ్యాను’’ అని నూర్ చెప్పారు.

నూర్, బఘ్లాన్‌లోని గాజ్‌ గ్రామంలో ఉన్న తన ఇంటి చుట్టూ తన కుటుంబీకుల కోసం వెతికేటప్పుడు సాయంత్రమైంది.

కానీ, ఆయనకు తన కుటుంబ సభ్యుల ఆనవాళ్లు ఎక్కడా కనిపించలేదు.

ఇక చేసేదేం లేక ఒంటి గంట సమయంలో అన్ని ఆశలు వదులుకుని, మూడు గంటల దూరంలో ఉన్న తన కూతురు సయీదా ఇంటికి వెళ్లారు.

ఆ తర్వాత రోజు తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు, తన కుటుంబ సభ్యుల మృతదేహాలను చూశారు.

‘‘ఇది తీవ్ర బాధాకరమైన విషయం’’ అని నూర్ అన్నారు.

తరచూ తమ ప్రాంతాన్ని దెబ్బతీసే ప్రకృతి వైపరీత్యాలైనా లేదా దేశాన్ని కుదిపేసే అంతర్యుద్ధమైనా.. ఇంత తీవ్ర స్థాయిలో విరుచుకుపడటాన్ని తన జీవితంలో ఎన్నడూ చూడలేదన్నారు.

ముంచుకొచ్చిన ఈ ప్రకృతి వైపరీత్యం తమకు రాక్షాసిలా అనిపించిందని సయీదా తెలిపారు. తాము చాలా భయపడినట్లు చెప్పారు.

ఇప్పటికీ రోడ్డుమార్గంలో చేరుకోలేని నూర్ గ్రామంలో చాలా కుటుంబాలు ఈ వరదలలో కనీసం ఇద్దరు లేదా ముగ్గురు సభ్యులను కోల్పోయాయి. వారంతా ప్రస్తుతం సాయం కోసం ఎదురుచూస్తున్నారు.

అఫ్గనిస్తాన్ వరదల చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వరదల వల్ల అనేక మంది నిరాశ్రయులుగా మారారు.

ప్రతి ఇల్లూ శోకసంద్రమే

‘పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన ప్రాంతాలను మేం సందర్శించాం’’ అని తన బృందంతో కలిసి వరద ప్రభావిత గ్రామాలలో ఒకటైన ఫుల్లోల్‌ను సందర్శించిన నర్సు రౌజతుల్లా చెప్పారు.

ఫుల్లోల్‌లో నేలకూలి బురద నీటిలో కూరుకుపోయిన చెట్లు, మట్టిగడ్డలు, ఇటుకలు, కార్లు కనిపిస్తున్నాయి.

బురదలో కూరుకుపోయిన వస్తువులు ఎండ వచ్చాక గట్టిపడిపోతాయి. ఆ బురదను తొలగించి, అందులోని వస్తువులను బయటకు తీయడం చాలా కష్టంతో కూడుకున్న పని.

బురద మట్టిలో కూరుకుపోయిన తన ఇంట్లో రెండు గదులను తవ్వేందుకు ముహమ్మద్ గుల్ పారను వాడుతున్నారు.

‘‘టీ తాగేందుకు కనీసం ఒక గ్లాసు కూడా మిగలలేదు’’ అని ఆయన బీబీసీకి చెప్పారు.

కొన్ని కుటుంబాలు తమ బంధువుల మృతదేహాల కోసం ఇంకా వెతుకుతున్నాయి. ఒక ఇంటి వద్ద పెద్ద ఎత్తున జనాలు గుమిగూడారు. ఒక చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు. ఆమెను ఒక గుడ్డతో కప్పి, అంబులెన్స్‌లో తరలించారు.

15 మంది నర్సులు, పారా మెడికల్ సిబ్బంది, వైద్యులతో పాటు నర్సు రౌజతుల్లా కూడా అక్కడకు వెళ్లారు.

గాయపడిన 200 మందికి సేవలందించారు.

వారిలో ఒక వ్యక్తి తన కుటుంబంలో 16 మందిని కోల్పోయారని రౌజతుల్లా చెప్పారు.

కానీ, ఎక్కువగా సాయం అవసరమైన కొన్ని మారుమూల ప్రాంతాలకు వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది, నర్సులు వెళ్లలేకపోతున్నట్లు చెప్పారు.

‘‘కనీసం మంచినీళ్లు కూడా లేవు’’ అని రౌజతుల్లా చెప్పారు.

టైఫాయిడ్, అతిసారం వంటి నీటి ద్వారా వచ్చే ఎన్నో రోగాలకు ఈ వరదలు కారణం కావొచ్చని హెచ్చరించారు.

వారు వెళ్లగలిగే ప్రాంతాలకు చేరుకుంటూ మొబైల్ ఎయిడ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. మృతదేహాలను కూడా తొలగిస్తున్నారు.

బీబీసీ వెళ్లిన ప్రతి గ్రామంలో ప్రజలకు ఎదురైన ప్రతి చేదు అనుభవాన్ని తెలుసుకుంది.

అంత్యక్రియలకు హాజరైన మహిళల ఫోటో
ఫొటో క్యాప్షన్, తమ ప్రాంతంలోని వారి అంత్యక్రియలకు హాజరైన మహిళలు

తల్లి ఎదుటే కొట్టుకుపోయిన కొడుకు

ఒక వ్యక్తి తన ఐదేళ్ల మేనల్లుడు అబు బాకర్ ఫోటోను చూపించారు.

వరద పోటెత్తినప్పుడు అబు బాకర్ తన తాతతో కలిసి ఆడుకుంటున్నాడు.

వరద నుంచి బయటపడేందుకు ప్రయత్నించినప్పటికీ, అబు బాకర్ మాత్రం వరదల్లో కొట్టుకుపోయారని ఆ వ్యక్తి చెప్పారు.

బాకర్ వరదలో కొట్టుకుపోకుండా తన తాత కాలిని గట్టిగా పట్టుకున్నాడు. కానీ వరద ఉధృతి ముందు అతను ఓడిపోయాడు. వరదలో కొట్టుకుపోతున్న అబు బాకర్‌ను అతని తల్లి నిస్సహాయంగా చూస్తూ నుంచొవాల్సి వచ్చింది.

వరదల గురించి విన్నప్పుడు అబ్దుల్ ఖాలిఖ్ తన పట్టణానికి దూరంగా ఉన్నారు. ఆయన తిరిగి వచ్చాకా పరిస్థితి చూసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

బాత్‌రూమ్ గోడ ముక్కలు తప్ప తమ ఇంటిలో మరేం మిగల లేదు. ఆయన కుటుంబంలోని 18 మందిలో 10మంది వరదల్లో కొట్టుకుపోయి చనిపోయారు.

‘‘మోకాల్లోతు బురదలో మా కుటుంబ సభ్యులను వెతకడానికి బూట్లు విప్పి, బురదలోకి దిగాం. వారి కోసం వెదుకుతూనే ఉన్నాం.’’ అని చెప్పారు.

చిట్టచివరికి తమ ఇళ్లకు మైళ్ల దూరంలో వారి మృతదేహాలను కనుగొన్నామని తెలిపారు.

ఈ ప్రకృతి బీభత్సం వచ్చిన క్షణాలను తలుచుకుని కొందరు భయబ్రాంతులకు గురవుతున్నారు.

వరద నీరు దూసుకొచ్చినప్పుడు, కొందరు ఎలాగోలా బయటపడగలిగారు కానీ, వారు తమకు చెందిన వస్తువులన్నింటిన్నీ కోల్పోయారు.

‘‘గందరగోళ పరిస్థితుల మధ్యనే పై అంతస్తుకు చేరుకునేందుకు తీవ్ర ఇబ్బంది పడ్డాం. మేము ఉండే ఇల్లు, పశువులు అన్నీ వరదల్లో కొట్టుకుపోయాయి’’ అని టార్పాలిన్ టెంట్ కింద పడుకున్న జుహ్రా బిబి తెలిపారు.

తన జీవితంలో ఇలాంటి వరద బీభత్సాన్ని తానెప్పుడూ చూడలేదన్నారు. వరదలు అసాధారణమైనవి ఏమీ కావు. కానీ, తమ ప్రాంతంలో ఇలాంటి వరదలను తామెప్పుడూ చూడలేదన్నారు.

వీడియో క్యాప్షన్, అఫ్గాన్ మహిళలు ఎప్పటికీ తలొంచరని నిరూపిస్తానంటున్న మనీజా తలాష్
అబ్దుల్ ఖాలిక్ ఫోటో
ఫొటో క్యాప్షన్, వరదకు ముందు ఇక్కడ అబ్దుల్ ఖాలిక్ ఇల్లు ఉండేది.

‘ఆశలన్నీ ఆవిరి’

గుడన్ బాల గ్రామంలో మొహమ్మద్ రసూల్ అనే రైతు ఒకనాడు పచ్చగా పండిన తన పొలం వద్ద సిగరెట్లు తాగుతూ కనిపించారు.

ఇప్పడాయన పొలం బురదనీటితో చెరువును తలపిస్తోంది.

పత్తి, గోదుమ పంటలు వేసిన పొలాలన్నీ పూర్తిగా నాశనమయ్యాయి. మేం గోదుమ పొలాల మీదుగా నడిచాం. నీటి ఒత్తిడికి గోదుమ కాండాలు రెండుగా చీలిపోయాయి.

తన కుటుంబ సభ్యులు బతికి బయటపడటం అదృష్టమని, కానీ సర్వం పోగొట్టుకున్నామని మొహమ్మద్ బాధపడ్డారు.

పంటలు దెబ్బతిన్న తన పొలాలను ఆయన చూపించారు.

‘‘ఇదొక్కటే నా జీవనాధారం, నిస్సహాయుడిని అయిపోయాననిపిస్తోంది’’ అని చెప్పారాయన.

అఫ్గానిస్తాన్‌లో 80 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడినట్టే మొహమ్మద్‌కు కూడా వ్యవసాయమే జీవనాధారం. ఎలా బతకాలో తమకు అర్థం కావడంలేదని చెప్పారాయన.

దూరంగా కనిపిస్తున్న తన ఇంటి శిథిలాలను చూపించారాయన.

వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తున్న కారణంగా ఆయన అక్కడకు వెళ్ళలేని స్థితిలో ఉన్నారు.

‘‘ఇప్పడు నా దగ్గర ఏమిలేదు, నేనిప్పుడు ఏం చేయాలి. నా కుటుంబాన్ని పోషించడానికి నా దగ్గరేమీ లేదు’’ అని చెప్పారు.

కేవలం పంట నష్టమే కాదని, తన పొరుగున ఉండే వ్యక్తికి చెందిన రెండు ఆవులు కూడా వరదల్లో కొట్టుకుపోయాయని మొహమ్మద్ చెప్పారు. ఆవుల పై ఆధారపడే ఆయన జీవితం సాగించేవారని తెలిపారు.

తన కుమార్తెతో కలిసి జీవిస్తున్న నూర్ మాట్లాడుతూ కట్టుబాట్టలు మాత్రమే మిగిలాయని , 65 ఏళ్ళ కిందట తన తండ్రి కట్టించిన ఇల్లు కూడా కొట్టుకుపోయిందని చెప్పారు.

‘‘గతంలో భవిష్యత్తుపై ఆశలు ఉండేవి.’’ అని ఆయన చెప్పారు.

‘‘మా అబ్బాయి, మనవరాలు టీచర్లు. దేశభవిష్యత్తుకు వారు చేయూతనిస్తారని గర్వంగా ఉండేది. కానీ వారిద్దరు ఇప్పుడు చనిపోయారు. వరదలు అన్నింటినీ తీసుకుపోయాయి’’ అని చెప్పారు నూర్.

వీడియో క్యాప్షన్, అఫ్గానిస్తాన్‌లో ఆకస్మిక వరదలు మిగిల్చిన విషాదం ఇది

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)