షుగర్ ఉన్న వాళ్లు మామిడి పండ్లు తినొచ్చా, తినకూడదా? డాక్టర్లు ఏం చెప్పారంటే..

మామిడి పండ్లు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, రుచిత
    • హోదా, బీబీసీ గుజరాతీ

రుచి మాత్రమే కాకుండా మామిడి పండ్లలో పోషకాలు ఉంటాయి.

మామిడి పండ్లలో సహజ చక్కెరలు ఉంటాయి. ఇవి శరీరంలో చక్కెర స్థాయిలని పెంచుతాయి.

అందుకే, షుగర్ వ్యాధి ఉన్నవాళ్లు మామిడి పండ్లు తినొద్దని కొందరు చెబుతుంటారు.

అసలు మామిడి పండ్లు తింటే రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుందా? మధుమేహం ఉన్నవారు మామిడి పండ్లను ఎప్పుడు తినాలి? ఎప్పుడు తినకూడదు?

ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునేందుకు వైద్యులతో మేం మాట్లాడాం.

వీడియో క్యాప్షన్, షుగర్ ఉన్నవారు మామిడి పండ్లు తినొచ్చా?
మామిడి పండ్లు

ఫొటో సోర్స్, Getty Images

మామిడి పండ్లలోని పోషకాలు

మామిడి పండ్లలో అనేక సూక్ష్మ, స్థూల పోషకాలు ఉన్నాయి.

ఈ పండ్లలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, అమైనో ఆమ్లాలు, లిపిడ్లు, పీచు పదార్థం ఉంటాయి.

వీటితో పాటు కాల్షియం, పొటాషియం, ఐరన్, విటమిన్ ఎ, సి వంటి సూక్ష్మ పోషకాలు కూడా ఉంటాయి.

100 గ్రాముల మామిడిపండును తింటే 60-90 కిలో కెలోరీల శక్తి లభిస్తుంది.

దీనితోపాటు మామిడి పండ్లలో 75-85 శాతం నీరు ఉంటుంది.

100 గ్రాముల మామిడిలో కింది పోషకాలు లభిస్తాయి.

  • నీరు: 83 గ్రాములు
  • కెలోరీలు: 60 కిలోకెలోరీలు (శక్తి)
  • కార్బోహైడ్రేట్లు: 14.98 గ్రాములు
  • ప్రోటీన్: 0.82 గ్రాములు
  • పీచు: 1.6 గ్రాములు
  • చక్కెర: 13.66 గ్రాములు
  • కాల్షియం: 11 ఎంజీ
  • ఐరన్: 0.16 ఎంజీ
  • విటమిన్ సి: 36.4 ఎంజీ
  • మామిడి పండ్లలో కొలెస్ట్రాల్ ఉండదు.
మామిడి పండ్లు

ఫొటో సోర్స్, Getty Images

మామిడి పండ్లు బ్లడ్ షుగర్‌ను పెంచుతాయా?

డాక్టర్ మనోజ్ విఠలానీ అహ్మదాబాద్‌లో డయాబెటాలజిస్ట్.

మీకు డయాబెటిస్ ఉంటే మామిడి పండ్లను తినకూడదనేది పూర్తిగా అపోహ అని డాక్టర్ మనోజ్ బీబీసీతో చెప్పారు.

‘‘మామిడి పండ్లలోని చక్కెరలు ఫ్రక్టోజ్ రూపంలో ఉంటాయి. పండ్లలో ఉండే సహజ ఫ్రక్టోజులు శరీరానికి హాని కలిగించవు. అయితే, పరిమితంగా వాటిని తినాలనే విషయాన్ని మర్చిపోకూడదు’’ అని ఆయన వివరించారు.

మామిడి పండ్లలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఈ పండ్లలో జీర్ణక్రియకు సహాయం చేసే పీచు పదార్థాలతోపాటు పొటాషియం ఉంటుంది. ఈ రెండూ బీపీని నియంత్రించడంలో సహకరిస్తాయి.

మామిడి పండ్లలోని చక్కెరలు రక్తంలో కలిసే ప్రక్రియను పీచుపదార్థాలు నెమ్మదించేలా చేస్తాయి. కార్బోహైడ్రేట్ల ప్రవాహాన్ని నియంత్రించడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరించడానికి ఇది శరీరానికి సాయం చేస్తుంది.

మామిడి పండ్లలో గ్లైసెమిక్ ఇండెక్స్ మితంగా ఉంటుంది. ఈ పండ్లను పరిమితంగా తీసుకుంటే ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది.

తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండే ఆహారాలు చాలా నెమ్మదిగా జీర్ణమవుతాయి. ఫలితంగా శరీరంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా కాకుండా క్రమంగా పెరుగుతాయి.

మామిడి పండ్లు

ఫొటో సోర్స్, Getty Images

గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఏంటి?

డాక్టర్ మనోజ్ చెప్పిన వివరాల ప్రకారం గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది శరీరంలోని చక్కెర స్థాయిలపై చూపే ప్రభావం ఆధారంగా ఆహారపదార్థాలకు ఒక సంఖ్యను కేటాయిస్తుంది.

ఈ సూచికలో 0 నుంచి 100 వరకు సంఖ్యలు ఉంటాయి. 0 అనేది ఒక ఆహారం తీసుకుంటే శరీరంలోని చక్కెరలపై ఎలాంటి ప్రభావం చూపదని అర్థం. 100 స్కోరు ఉంటే ఆ ఆహారం చక్కెర స్థాయిలను పెంచుతుందని లెక్క.

గ్లైసెమిక్ ఇండెక్స్ స్కోరు 55 లేదా అంతకంటే తక్కువ ఉన్న ఏ ఆహారమైనా తినడానికి చాలా సురక్షితం. ఎందుకంటే ఈ ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచవు.

మామిడి పండ్ల గ్లైసెమిక్ ఇండెక్స్ స్కోరు 51. అంటే ఇది తినడానికి సురక్షితమైనది. ఇది రక్తంలోని చక్కెరలను ఎక్కువగా పెంచదని అర్థం.

అయితే, మామిడి పండ్ల గ్లైసెమిక్ స్కోరు సరిహద్దుల్లో ఉన్నందున ఇప్పటికే డయాబెటిస్ ఉన్నవారు, మధుమేహం బారిన పడే ప్రమాదం ఉన్నవారు కాస్త జాగ్రత్తగా ఉండాలి.

ఈ సూచిక ప్రకారం చూసుకుంటే పైనాపిల్ (అనాస), పుచ్చకాయ (వాటర్ మిలన్), బంగాళదుంపలు, బ్రెడ్ వంటి ఆహారపదార్థాల స్కోరు 70 కంటే ఎక్కువే. అంటే వీటిని తింటే తక్షణమే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయని అర్థం.

మామిడి పండ్లు

ఫొటో సోర్స్, Getty Images

డయాబెటిస్ ఉన్న వాళ్లు ఎన్ని మామిడిపండ్లు తినొచ్చు?

భారత్‌లోని వివిధ కాలేజీలకు చెందిన పరిశోధకులు ఇటీవలే ‘మామిడిపండ్లు, డయాబెటిస్’ అనే పరిశోధనా పత్రాన్ని విడుదల చేశారు.

ఈ పేపర్ ప్రకారం, డయాబెటిస్ ఉన్న వ్యక్తి మామిడిపండ్లను తినడం మానేయాల్సిన అవసరం లేదు. కానీ, వైద్యుల సిఫార్సుల మేరకు వారు తగు మోతాదులో వాటిని తినాలి.

మామిడి పండ్లను పరిమితంగా తింటే డయాబెటిస్, చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం లేదని డాక్టర్ మనోజ్, ఇతర పరిశోధకులు అంటున్నారు.

వారు చెప్పిన వివరాల ప్రకారం,

  • ఒకేసారి అతిగా మామిడి పండ్లను తినకూడదు. తక్కువ మోతాదులో మామిడి పండ్లను తినడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు.
  • ఒక వ్యక్తి రోజుకు 100-150 గ్రాముల మామిడి పండ్లను లేదా రోజులో మూడుసార్లు 50 గ్రాముల చొప్పున తినొచ్చు.
  • ఒక వ్యక్తి భోజనం చేసిన తర్వాత రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. అప్పుడే మామిడి పండ్లు కూడా తినడం వల్ల మరింతగా పెరుగుతుంది. కాబట్టి భోజనం చేసిన వెంటనే మామిడి తినడకూడదు. స్నాక్స్ సమయంలో చిరుతిండిగా మామిడి పండ్లను తినొచ్చు.
  • మామిడి పండ్లలోని గ్లైసెమిక్ సూచిని తగ్గించడానికి వాటిని ఇతర ఫైబర్ రిచ్ ఫుడ్స్‌తో కలిపి తినాలని పరిశోధకులు సూచిస్తున్నారు. అంటే సలాడ్స్, బీన్స్, తృణధాన్యాలతో పాటు మామిడి తినాలి. ఫైబర్ ఎంత ఎక్కువగా ఉంటే జీర్ణక్రియ అంత నెమ్మదిగా జరుగుతుంది. నెమ్మదిగా జీర్ణం కావడం వల్ల మీకు కడుపు నిండుగా ఉన్న భావన కలుగుతుంది. పైగా, పీచు పదార్థాలు రక్తంలో చక్కెర స్థాయిలను త్వరగా పెంచవు.
  • మామూలుగా మామిడి కాయలు అయితే ఒక్కటే తింటాం. జ్యూస్ రూపంలో అయితే 2 లేదా 3 పండ్లను పైగా అదనంగా చక్కెరను కూడా వాడతారు. కాబట్టి, మామిడిపండ్లను కోసుకొని ముక్కలుగా తినాలి. జ్యూస్ రూపంలో తాగకూడదు.

ముక్కలుగా తింటే కాస్త తిన్నప్పటికీ మీకు అధికంగా తిన్న భావన కలుగుతుంది.

కాబట్టి మధుమేహం ఉన్న వారు మామిడిపండ్లను మితంగా తీసుకోవాలి.

ఈ పండును తినేటప్పుడు కేలోరీల పరిమాణం, గ్లైసెమిక్ స్థాయి వంటివి గుర్తుంచుకోవాలి.

మామిడి పండ్లు

ఫొటో సోర్స్, Getty Images

భారత్‌లో మామిడి ఉత్పత్తి

భారత ఆర్థిక వ్యవస్థలో మామిడి అత్యంత ముఖ్యమైన పంట. మామిడి ఉత్పత్తిలో భారత్‌దే అగ్రస్థానం.

భారత్‌లో 21.79 మిలియన్ మెట్రిక్ టన్నుల మామిడి ఉత్పత్తి అవుతుంది.

భారత్‌లో 1000 రకాల మామిడి పండ్లను పండిస్తారు.

ఆంధ్రప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, కర్ణాటక, గుజరాత్, తెలంగాణ రాష్ట్రాలు ప్రధానంగా మామిడిని పండిస్తాయి.

(గమనిక - ఈ కథనం అవగాహన కోసం మాత్రమే. సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించండి.)

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)