ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్‌లకు చేరాక ఏం జరుగుతుంది, భద్రత ఎలా ఉంటుంది? లోపలికి ఎవరెవరు వెళ్లొచ్చు?

ఫొటో సోర్స్, GETTY IMAGES
సార్వత్రిక ఎన్నికల 4వ దశలో భాగంగా సోమవారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పోలింగ్ పూర్తయింది.
ఆంధప్రదేశ్‌లో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ సీట్లకు ఎన్నికలు జరిగాయి.
తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలకు ఒక అసెంబ్లీ స్థానానికి పోలింగ్ ముగిసింది.
ఏపీలో కొన్ని చోట్ల అల్లర్లు జరిగినప్పటికీ మొత్తం మీద పోలింగ్ ప్రశాంతంగానే ముగిసింది.
ఏపీలో అధికార వైసీపీ, విపక్ష ఎన్డీయే (తెలుగుదేశం, జనసేన, బీజేపీ) కూటమి, కాంగ్రెస్, తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడిన ఈ ఎన్నికల్లో ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు.
జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది.
అప్పటిదాకా ఓటర్లు ఇచ్చిన తీర్పు ఈవీఎంలలో భద్రంగా ఉంటుంది.
మరి, పోలింగ్ ముగిసిన తరువాత ఈవీఎంలను ఎలా భద్రపరుస్తారు? ఈవీఎంలలో ఓట్లను ఎలా లెక్కిస్తారో తెలుసుకుందాం.

ఈవీఎంలను ఎక్కడ, ఎలా భద్రపరుస్తారు?
ఓట్లు పోలైన ఈవీఎంలు, వీవీప్యాట్‌లను భద్రపరిచే గదులను స్ట్రాంగ్ రూమ్‌లు అంటారు. ఆయా జిల్లా కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేస్తారు. పోలింగ్ ముగిసిన వెంటనే ఈవీఎంలను స్ట్రాంగ్ రూంలకు తరలిస్తారు. కౌంటింగ్ రోజు ఉదయం మాత్రమే ఆ గదులను తెరిచి ఈవీఎంలను కౌంటింగ్ కేంద్రాలకు తరలిస్తారు. అప్పటివరకు ఈవీఎంలు స్ట్రాంగ్‌రూంలోనే ఉంటాయి.
స్ట్రాంగ్‌రూమ్‌లకు రెండు తాళాలు వేయాలి. ఒక కీ (తాళం చెవి) జిల్లా ఎన్నికల అధికారి వద్ద, రెండోది నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి వద్ద ఉంటుంది.
స్ట్రాంగ్‌రూం తలుపులు, కిటికీలు పూర్తిగా మూసివేయాలి. ఎవరూ లోపలికి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలి. స్ట్రాంగ్‌రూమ్‌ల దరిదాపులకు ఎవరూ రాకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేయాలి. దీనికోసం మూడెంచల భద్రత ఉంటుంది.
గది బయట మొదటి అంచెలో ఒక ప్లాటూన్ కేంద్ర బలగాలు రక్షణగా ఉంటాయి. ఒక ప్లాటూన్‌లో 30 నుంచి 50 మంది సైనికులు ఉంటారు. వీరి విధులకు సంబంధించి లాగ్‌బుక్ నిర్వహించాలి.
ఆ తర్వాత రెండు అంచెల్లో రాష్ట్ర పోలీసులు పహారా కాస్తుంటారు. భద్రతా సిబ్బంది మూడు షిఫ్టుల్లోనూ పని చేయాల్సి ఉంటుంది.

ఫొటో సోర్స్, GETTY IMAGES
స్ట్రాంగ్‌రూంల దగ్గర సీసీటీవీ నిఘా
స్ట్రాంగ్‌రూం లోపల, బయటా సీసీటీవీ కెమేరాలు ఏర్పాటు చేయాలి. స్ట్రాంగ్ రూం పక్కనే 24 గంటలూ పనిచేసే కంట్రోల్ రూమ్ ఉండాలి.
స్ట్రాంగ్ రూమ్ ప్రవేశమార్గాన్ని నిరంతరం సీసీటీవీ కెమేరాల నిఘాలో ఉంచాలి. స్ట్రాంగ్ రూంకి ఒకటి కంటే ఎక్కువ ప్రవేశ మార్గాలు ఉంటే వాటిని కూడా వీడియో చిత్రీకరించాలి.
స్ట్రాంగ్‌రూం భద్రతా ఏర్పాట్లను 24 గంటలూ పరిశీలించేందుకు ఒక సీనియర్ అధికారితో పాటు ఒక గెజిటెడ్ అధికారిని నియమించాలి.
అగ్నిప్రమాదం జరిగితే వెంటనే ఆర్పివేసేలా స్ట్రాంగ్‌రూం లోపల, వెలుపల తగినన్ని అగ్నిమాపక యంత్రాలు ఏర్పాటు చేయాలి.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ప్రతీ ఒక్కరి వివరాలు నమోదు
స్ట్రాంగ్ రూం పరిశీలనకు వచ్చే అధికారులు మినహా మరెవరినీ అక్కడికి అనుమతించరు. స్ట్రాంగ్ రూంలకు వెళ్లే మార్గం మొత్తం నిఘా నీడలో ఉంటుంది.
స్ట్రాంగ్ రూం ద్వితీయ భద్రతా వలయాన్ని దాటే ప్రతీ వ్యక్తి వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలి. జిల్లా ఎన్నికల అధికారులు, జిల్లా ఎస్పీ, అభ్యర్థులతో పాటు పోలింగ్ ఏజెంట్లందరికీ ఈ నిబంధన వర్తిస్తుంది.
రిటర్నింగ్ అధికారి ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో స్ట్రాంగ్‌రూం ప్రాంగణాన్ని సందర్శించి, లాగ్ బుక్‌ను, సీసీటీవీ ఫుటేజ్‌ని పరిశీలించాలి.
ఒకవేళ స్ట్రాంగ్‌రూంలు జిల్లా కేంద్రంలో ఉంటే జిల్లా ఎన్నికల అధికారి ఆ బాధ్యత తీసుకోవాలి. ఏ రోజు ఎవరు వచ్చి తనిఖీ చేశారన్నది లాగ్‌బుక్‌లో నమోదు చేయాలి.
ఈవీఎంలు స్ట్రాంగ్‌రూంలో ఉన్నంత కాలం అక్కడ నిరంతరాయ విద్యుత్ సరఫరా ఉండాలి. స్టాండ్‌బైగా జనరేటర్లను అందుబాటులో ఉంచుకోవాలి.
పోటీ చేసిన అభ్యర్థులందరికీ ఉన్నతాధికారుల ఫోన్ నెంబర్లు ఇవ్వాలి. అభ్యర్థులు ఆ నెంబర్లను స్ట్రాంగ్ రూంల వద్ద ఉన్న తమ ఏజెంట్లకు అందించాలి. అత్యవసర పరిస్థితుల్లో ఈ నెంబర్లను సంప్రదించమని చెప్పాలి.

ఫొటో సోర్స్, GETTY IMAGES
వాహనాలకు నో ఎంట్రీ
మంత్రులు, అభ్యర్థులు, అధికారుల వాహనాలను మూడో అంచెలోకి రాకముందే నిలిపివేయాలి. ఆ తర్వాత ఎవరైనా సరే అక్కడి నుంచి నడుచుకుంటూనే స్ట్రాంగ్ రూం వరకు వెళ్లాలి. వాహనాల పార్కింగ్ మార్కింగ్ స్పష్టంగా కనిపించేలా ఉండాలి.
ఓట్ల లెక్కింపు రోజున స్ట్రాంగ్‌రూంని అభ్యర్థులు లేదా వారి ప్రతినిధులు, రిటర్నింగ్ అధికారి, పరిశీలకుడి సమక్షంలో వీడియో చిత్రీకరణ మధ్య తెరవాలి.
స్ట్రాంగ్ రూం నుంచి కంట్రోల్ యూనిట్లను కౌంటింగ్ కేంద్రాలకు తరలించడాన్ని వీడియో చిత్రీకరణ చేయాలి. అభ్యర్థుల ఏజెంట్లు సీసీటీవీ ద్వారా స్ట్రాంగ్‌రూంని గమనించేందుకు అనుమతించాలి.
ఓట్ల లెక్కింపు తర్వాత కంట్రోల్ యూనిట్లకు సీల్ వేయాలి.
ఈ ప్రక్రియ అనంతరం ఈవీఎంలను తిరిగి స్ట్రాంగ్‌రూంకి తరలించాలి.

ఫొటో సోర్స్, ECI
ఈవీఎంలలో ఓట్లు ఎలా లెక్కిస్తారంటే..
ఓట్ల లెక్కింపు ప్రక్రియ అంతా రాజకీయపార్టీలు, ఏజెంట్ల సమక్షంలో జరుగుతుంది. ప్రతి రౌండ్‌లోనూ వారు సంతృప్తి చెందిన తర్వాతే ఫలితాలను అధికారులు వెల్లడిస్తారు.
ఓట్లను లెక్కించేందుకు ముందుగా ఈవీఎంలోని ఫలితాల విభాగానికి ఉన్న సీల్‌ను తొలగిస్తారు.
ఈవీఎం బయటి కప్పు మాత్రమే తెరుస్తారు. లోపలి భాగాన్ని తెరవకుండా అలాగే ఉంచుతారు.
తర్వాత ఈవీఎం పవర్ ఆన్ చేస్తారు.
బ్యాటరీలో ఛార్జింగ్ తక్కువగా ఉంటే ఆ మెషీన్‌కి ఉండే డిజిటల్ తెర మిణుకుమిణుకుమని వెలుగుతుంది. లేదంటే ఖాళీగా కనిపిస్తుంది. అప్పుడు కొత్త బ్యాటరీ అమర్చాలి.
అనంతరం లోపల బటన్ మాదిరిగా కనిపించే సీల్‌ను తొలగిస్తే లోపల రిజల్ట్స్ మీట కనిపిస్తుంది. ఆ మీట నొక్కగానే ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు పోలయ్యాయో తెరపై కనిపిస్తుంది.
ఆ వివరాలను జాగ్రత్తగా నోట్ చేసుకుంటారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 లోని సెక్షన్ 64 ప్రకారం ఓట్ల లెక్కింపు నుంచి ఎన్నికల ఫలితాల వెల్లడి వరకు బాధ్యత అంతా రిటర్నింగ్ అధికారిపైనే ఉంటుంది. పార్టీ అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు, ఎలక్షన్ ఏజెంట్లను ఆయనే లెక్కింపు కేంద్రంలోకి అనుమతిస్తారు.
ఎన్నికల సంఘం నిబంధన 51ని అనుసరించి పార్టీ అభ్యర్థులకు కౌంటింగ్ కేంద్రం, లెక్కించే సమయం తదితర వివరాలను రిటర్నింగ్ అధికారి తెలియజేస్తారు.
నిబంధన 52 ని అనుసరించి రిటర్నింగ్ అధికారి ఒక్కో కౌంటింగ్ కేంద్రంలో 14కు మించకుండా కౌంటింగ్ ఏజెంట్లను అనుమతించవచ్చు.
నిబంధన 55(సీ) ప్రకారం ఈవీఎంలు టాంపర్ కాలేదని, దాని సీల్ సక్రమంగా ఉందని లెక్కింపు సిబ్బంది, కౌంటింగ్ ఏజెంట్లు నిర్ధారించుకోవాలి. ఒక వేళ ఈవీఎంలు సక్రమంగా లేవని భావిస్తే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలి.
ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాతే ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది. ప్రతి కౌటింగ్ టేబుల్ మీద బ్లూపాయంట్ పెన్. ఫారం 17(సీ)లోని పార్ట్ 2 పేపర్ ఉంచాలి.
కౌంటింగ్‌కు ముందు 17(సీ) ఫారం ఆధారంగా పోలైన ఓట్లు, ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లు సమానంగా ఉన్నాయో లేదో సరి చూసుకుంటారు. వాటిని నోట్ చేసుకోవడంతో పాటు వివిధ పార్టీల ఏజెంట్లకు కూడా చూపించి వారి సంతకాలు కూడా తీసుకుంటారు. తర్వాత ఈవీఎంల సీల్‌ను తొలగించి రిజల్ట్ బటన్‌ను నొక్కుతారు.
అప్పుడు ఒక్కో అభ్యర్థికి ఆ ఈవీఎంలో ఎన్ని ఓట్లు వచ్చాయో తెలుస్తుంది. ఆ గణాంకాలను నోట్ చేసుకుంటారు.
ఒక్కో రౌండ్లో ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బోర్డుపై రాసి ప్రకటిస్తారు.
ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద సూపర్ వైజర్, అసిస్టెంట్ సూపర్ వైజర్, మైక్రో అబ్జర్వర్‌లు ఉంటారు.
ఎన్నికల సంఘం లెక్కింపును వీడియో తీస్తుంది. దాన్ని సీడీలలో భద్రపరిచి ఉంచుతుంది.
కౌంటింగ్ మగిశాక అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో ఏదైనా ఒక వీవీ ఫ్యాట్‌లోని ఓటర్ స్లిప్పులను లెక్కించి ఆ ఈవీఎంలలో పోలైన ఓట్లతో సమానంగా ఉన్నాయా లేదా అని సరిచూస్తారు.
తుది ఫలితాలకు సంబంధించిన పత్రాన్ని ఫారం 20గా పిలుస్తారు. దీన్ని సిద్ధం చేయడానికంటే ముందు రీకౌంటింగ్‌కు ఏ అభ్యర్థి అయినా కోరుతున్నారా అనేది రిటర్నింగ్ అధికారి తెలుసుకుంటారు. వారి లిఖితపూర్వక ఫిర్యాదును ఎన్నికల పరిశీలకుడితో చర్చించి అవసరం ఉంటే రీకౌంటింగ్ చేపడుతారు. అవసరం లేదని భావిస్తే ఫారం 20పై సంతకం చేసి విజేతను ప్రకటిస్తారు.
ఎన్నికల సంఘం నిబంధన 67ను అనుసరించి రిటర్నింగ్ అధికారి గెలిచిన అభ్యర్థి వివరాలను ఎన్నికల సంఘానికి, శాసన సభకు అందిస్తారు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు 2024: మీరు ఎవరికి ఓటేశారో తెలుసుకోవడమెలా?
- ‘నాకు పెళ్లి కావడం లేదు, సెక్స్ వర్కర్ల దగ్గరకు వెళుతుంటాను. ఇలా ఎన్నాళ్లంటే...
- ‘మా నాన్న సీఎం’
- స్కోపోలమైన్: డెవిల్స్ బ్రీత్‌గా పిలుచుకునే ఈ డ్రగ్ వాసన చూస్తే ఎదుటివాళ్లు ఏం చెబితే అది చేస్తారు..ఏమిటిది?
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎన్నికల పోలింగ్: నిబంధనల ఉల్లంఘన, అధికారుల నిర్లక్ష్యంపై ఈసీ హెచ్చరికలు..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














