ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎన్నికల పోలింగ్: నిబంధనల ఉల్లంఘన, అధికారుల నిర్లక్ష్యంపై ఈసీ హెచ్చరికలు..

సార్వత్రిక ఎన్నికలు

ఫొటో సోర్స్, I &PR Ranagareddy

ఫొటో క్యాప్షన్, తెలంగాణలో ఎన్నికల ఏర్పాట్లలో సిబ్బంది

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతుండగా, తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు, ఒక అసెంబ్లీ స్థానానికి (కంటోన్మెంట్) ఉపఎన్నిక జరుగనుంది.

సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది.

పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, అవకతవకలు జరుగకుండా ఎన్నికల అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నారు. వీటికి సంబంధించి హెచ్చరికలు జారీ చేశారు.

పోలింగ్ ముంగిట నిర్లక్ష్యంగా వ్యహరించిన పోలీసు అధికారులపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది.

తెలంగాణలో కేసీఆర్ కుటుంబ సభ్యులెవరూ పోటీ చేయకుండా జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవి.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, ఎన్నికల విధులకు చేరుకున్న మహిళా సిబ్బంది.

సిరా గురించి సీరియస్

ఓటర్ల చేతి వేలికి వేసిన సిరా గుర్తు చెరిపేసి, మరోసారి ఓటు వినియోగించుకోవాలని ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా హెచ్చరించారు.

ఎన్నికల అధికారులు ఉపయోగించే చెరగని సిరా ఇతరులకు కూడా అందుబాటులో ఉందని సాగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. అది పూర్తిగా తప్పుడు ప్రచారం అని, ఇతర సిరాను ఉపయోగించి ఓటర్లకు మార్కు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఎన్నికలు

ఫొటో సోర్స్, Laxman

ఫొటో క్యాప్షన్, కాకినాడ హోప్ ఐలాండ్ లో ఓటింగ్ కోసం పడవలపై ఈవీఎంల తరలింపు.

చెరగని సిరా ప్రభుత్వం మాత్రమే తయారు చేస్తుందని స్పష్టం చేశారు. ఈ సిరా భారత ఎన్నికల సంఘం వద్ద మాత్రమే అందుబాటులో ఉంటుందని, ఇతరులెవరూ దీన్ని పొందలేరని ఆయన స్పష్టం చేశారు.

ఎవరైనా ఇతర సిరాల ద్వారా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే అటువంటి వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు

ఫొటో సోర్స్, I &PR Ranagareddy

ఫొటో క్యాప్షన్, పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్న సిబ్బంది.

పోలీస్ అధికారులపై చర్యలు

పోలింగ్ ముంగిట ఎన్నికల విధుల నిర్వహణలో అలసత్వం చూపారంటూ పలువురు పోలీస్ అధికారుల మీద ఈసీ కన్నెర్ర చేసింది.

నంద్యాల జిల్లా కేంద్రంలో అల్లు అర్జున్ పర్యటన సందర్భంగా నిబంధనలు పాటించలేదంటూ జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డిపై సీరియస్ అయ్యింది. ఆయనపై చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.

ఎన్నికల కోడ్ అమలు చేయడంలో విఫలమైన ఎస్పీపై ఛార్జెస్ ఫైల్ చేయాలని ఈసీ ఆదేశించింది. ఎస్పీతో పాటు ఎస్‌డీపీవో రవీంద్రనాథ్, సీఐ రాజారెడ్డిపై కూడా శాఖాపరమైన విచారణ జరపాలని డీజీపీకి ఉత్తర్వులు అందాయి.

ఎన్నికలు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, అనకాపల్లి జిల్లా చోడవరంలో ఎన్నికల విధుల్లో సిబ్బంది.

ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత డీజీపీ, విజయవాడ సీపీ, గుంటూరు ఐజీ, అనంతపురం డీఐజీ సహా పలువురు ఎస్పీలను విధుల నుంచి బదిలీ చేశారు.

ఈ నేపథ్యంలో తాజాగా నంద్యాల ఎస్పీ మీద చర్యలు, తిరుపతి జిల్లాలో ఒకేసారి పలువురు ఇన్ స్పెక్టర్లను బదిలీ చేయడం కీలక పరిణామంగా మారింది.

ప్రశాంతంగా పోలింగ్ ముగించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని ఈసీ చెబుతోంది.

సార్వత్రిక ఎన్నికలు

ఫొటో సోర్స్, TelanganaCEO

ఫొటో క్యాప్షన్, జగిత్యాలలో ఎకోఫ్రెండ్లీ మోడల్ పోలింగ్ కేంద్రం

కేసీఆర్ కుటుంబం పోటీలో లేని తొలి ఎన్నిక

తెలంగాణలో 3 కోట్లకు పైగా (3,32,32,318) ఓటర్లు ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించేందుకు అవకాశం ఉంది. వీరిలో ఇప్పటివరకు 20,163 మంది ఇంటి వద్దనే ఓటు వేయగా, 1.88లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ ఓటును వినియోగించుకున్నారు

మొత్తం తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాల పరిధిలో 525 మంది బరిలో ఉన్నారు.

అత్యధికంగా సికింద్రాబాద్ లోక్ సభ స్థానం నుంచి 45 మంది పోటీ పడుతున్నారు.

అత్యల్పంగా ఆదిలాబాద్ లోక్ సభ నుంచి 12 మంది పోటీ పడుతున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.

టీఆర్ఎస్ (ఇప్పుడు బీఆర్ఎస్) ఆవిర్భావం తర్వాత కేసీఆర్ కుటుంబం నుంచి ఒక్కరు కూడా పోటీలో లేకుండా చట్టసభలకు జరుగుతున్న తొలి ఎన్నిక ఇదే కావడం విశేషం.

ఎన్నికలు

ఫొటో సోర్స్, I & PR, RangaReddy

ఫొటో క్యాప్షన్, హైదరాబాద్‌లో ఎన్నికల ఏర్పాట్లలో సిబ్బంది

ఇక ప్రముఖుల విషయానికి వస్తే సికింద్రాబాద్ నుంచి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి, హైదరాబాద్ నుంచి ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ, నాగర్ కర్నూలు నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కరీంనగర్ నుంచి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ పోటీలో ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)