కడుపు ఉబ్బరంగా ఎందుకు అనిపిస్తుంది, ఎలా తగ్గించుకోవచ్చు?

ఫొటో సోర్స్, Getty Images
కడుపు ఉబ్బరంగా అనిపించడం సాధారణం.
పెద్దగా ఏమీ తినకపోయినా పొట్ట ఒక బెలూన్‌లా మారి, కడుపు నిండిపోయినట్లుగా చాలామందికి అనిపిస్తుంటుంది.
కడుపు ఉబ్బినప్పుడు పొత్తికడుపు పరిమాణం పెరగడంతో కడుపు నిండుగా మారి ఇబ్బందిగా మారుతుంది.
దీనితో పాటు కడుపు నొప్పి, అసౌకర్యం, పొట్టలో శబ్దాలు వస్తుంటాయి.
ఈ సమస్య రావడానికి చాలా కారణాలు ఉండొచ్చు. వీటిలో కొన్నింటిని సులభంగా ఎదుర్కోవచ్చు.
తినే ఆహారంలో మార్పులు చేయడం ద్వారా వీటిని అధిగమించవచ్చు.
కానీ, కొన్ని సంక్లిష్టమైన కారణాలతో కూడా పొట్ట ఉబ్బరం ఏర్పడవచ్చు.
రోగ నిరోధక వ్యవస్థలో సమస్యల నుంచి ఒక రకమైన క్యాన్సర్ సంకేతాల వరకు ఈ కారణాల్లో ఉండొచ్చు.
ఇక్కడ మనం కొన్ని కారణాల గురించి తెలుసుకుందాం.
శరీరంలో ఎలాంటి సంకేతాలు కనిపిస్తే అప్రమత్తం కావాలి? మనకున్న అలవాట్లలో వేటిని మార్చుకోవాలో చూద్దాం.

ఫొటో సోర్స్, Getty Images
గ్యాస్
పొట్ట ఉబ్బరానికి అత్యంత సాధారణ కారణం పేగుల్లో ఎక్కువగా గ్యాస్ నిండటం.
కొన్ని రకాల ఆహారాలు, పానీయాలు లేదా తినేటప్పుడు గాలిని మింగడం వల్ల ఇలా జరుగుతుందని యునైటెడ్ కింగ్‌డమ్ నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్‌హెచ్‌ఎస్) తెలిపింది.
మలబద్ధకం దీనికి మరో కారణం. మల విసర్జన చేయడానికి మీరు ఇబ్బందిపడితే, మలం గట్టిగా లేదా రాళ్ల మాదిరిగా ఉంటే, మలవిసర్జన తర్వాత కూడా మీకు పొట్ట ఖాళీ అయిన భావన కలగకపోతే మీరు మలబద్ధకంతో బాధపడుతున్నట్టు లెక్క అని జాన్స్ హాప్కిన్స్ మెడిసిన్ సెంటర్ సూచిస్తోంది.
ఈ కారణాలన్నీ పొత్తికడుపు నొప్పికి, ఉబ్బరానికి దారి తీస్తాయి. ఎందుకంటే, ఎక్కువకాలం మలం బయటకు రాకుండా పొట్టలోనే ఉండిపోతే బ్యాక్టీరియా దాన్ని పులియబెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఫలితంగా పొట్టలో మరింత గ్యాస్ ఏర్పడటంతో పాటు ఉబ్బరంగా అనిపిస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
అధిక బ్యాక్టీరియా, కదలికలు లేకపోవడం
కడుపు ఉబ్బరానికి మరో కారణం చిన్న పేగుల్లో బ్యాక్టీరియా అధికంగా పెరగడం. దీన్నే సంక్షిప్తంగా సిబో అంటారు.
పెద్ద పేగు నుంచి అధిక మోతాదులో ఈ బ్యాక్టీరియా చిన్నపేగుల్లోకి చేరుతుంది. అధిక మోతాదులోని ఈ బ్యాక్టీరియా, శరీర వ్యవస్థను సమతుల్యం చేసే వాయువులను పీల్చుకునే ఇతర బ్యాక్టీరియాపై పేరుకుపోతుంది.
పొత్తికడుపు సర్జరీలో ఏదైనా సమస్య తర్వాత లేదా జీర్ణవ్యవస్థలో కొన్ని సమస్యల కారణంగా సిబో సంభవించవచ్చని మయో క్లినిక్ చెప్పింది.
ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ వల్ల కూడా జీర్ణవ్యవస్థ ప్రభావితం అవుతుంటుంది.
ఈ పరిస్థితి వల్ల పొత్తికడుపు ఉబ్బరంతో పాటు పొట్టలో గ్యాస్ ఏర్పడటం, నొప్పి, క్రాంప్స్, డయేరియా, మలబద్ధకం వంటి ఇబ్బందుల తలెత్తే అవకాశం ఉంటుంది.
ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ రావడానికి కచ్చితమైన కారణాలు ఇంకా తెలియవు.
కానీ, ఇది పేగుల్లోనుంచి చాలా నెమ్మదిగా లేదా చాలా త్వరగా వెళ్లే ఆహారం, పేగుల్లోని అతి నున్నితంగా ఉండే నరాలు, ఒత్తిడి, కుటుంబ చరిత్ర వంటి పలు అంశాలతో ముడిపడి ఉంటుందని ఎన్‌హెచ్‌ఎస్ పేర్కొంది.
గ్యాస్ట్రోపెరేసిస్ వల్ల కూడా కడుపు ఉబ్బరం కలుగుతుంది. గ్యాస్ట్రోపెరేసిస్ అనేది పొట్టలోని కండరాలను ప్రభావితం చేసి వాటి చలనాన్ని మార్చుతుంది. దీనివల్ల వాటి చలనం మందగించవచ్చు, పనిచేయకపోవచ్చు, కడుపు ఖాళీ అయ్యేందుకు ఎక్కు వ సమయం తీసుకుంటుంది.
గ్యాస్ట్రోపెరేసిస్‌కు కూడా కచ్చితమైన కారణాలు తెలియవు. కానీ, మయో క్లినిక్ సూచించిన ప్రకారం సర్జరీ తర్వాత, డయాబెటిస్ సమస్యల వల్ల, డిప్రెషన్ వంటి వాటికి వాడే మందుల వల్ల, హైబీపీ, అలెర్జీలు వంటి వాటితో ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి.

ఫొటో సోర్స్, Getty Images
నప్పని ఆహారం, హార్మోన్లు
కొన్నిసార్లు మనకు పడని ఆహారం తీసుకున్నప్పుడు కూడా కడుపు ఉబ్బరంగా అనిపించవచ్చు.
కార్బోనేటెడ్ డ్రింకులు మాత్రమే కాదు, మనకు జీర్ణం అయ్యేందుకు ఎక్కువ సమయం తీసుకునే ఆహారాల వల్ల ఈ పరిస్థితి తలెత్తవచ్చు.
లాక్టోజ్, ఫ్రక్టోజ్‌లతో పాటు కార్బోహైడ్రేట్లు ఉండే గోదుమలు, చిక్కుళ్లు వంటివి కూడా కడుపు ఉబ్బరానికి దారి తీస్తాయని చెబుతుంటారు.
సెలియాక్ అనే వ్యాధి వల్ల కూడా ఈ పరిస్థితి తలెత్తవచ్చని ఎన్‌హెచ్‌ఎస్ సూచించింది. ఈ వ్యాధి ఉన్నవారు గ్లూటెన్‌ను తీసుకున్నప్పుడు రోగనిరోధక వ్యవస్థ తన సొంత కణజాలంపై దాడి చేస్తుంది. గ్లూటెన్ అనే ప్రోటీన్ ముఖ్యంగా గోదుమ, బార్లీ, రై అనే తృణధాన్యాల్లో ఉంటుంది.
ఈ వ్యాధి చిన్నపేగులను దెబ్బతీసి ఆహారంలోని పోషకాలు శరీరానికి అందకుండా చేస్తుంది. పైగా డయేరియా, పొత్తికడుపు నొప్పి, ఉబ్బరం వంటి లక్షణాలను కలుగజేస్తుంది.
గ్యాస్ తరహాలోనే రుతుచక్రానికి కారణమయ్యే హార్మోన్లు కూడా కడుపు ఉబ్బరానికి దారితీస్తాయి. ప్రతీ నలుగురిలో ముగ్గురు మహిళలు పీరియడ్స్ సమయంలో పొత్తికడుపు ఉబ్బరంతో బాధపడుతున్నారని క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ పేర్కొంది.
ఆడ హార్మోన్లు చాలా రకాలుగా పొట్ట ఉబ్బరానికి కారణమవుతాయి. ఉదాహరణకు ఈస్ట్రోజన్ హార్మోన్ ద్రవాలను నిలిపేస్తుంది. ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్లు కలిసి పొట్ట కండరాల చలనం వేగాన్ని పెంచడం లేదా తగ్గించడం చేస్తాయి. దీనివల్ల గ్యాస్ తయారవుతుంది. రుతుక్రమానికి ముందు గర్భాశయం పరిమాణం పెరుగుతుంది.
ఎంతకూ తగ్గని కడుపు ఉబ్బరం కొన్నిసార్లు అండాశయాలు, గర్భాశయానికి సంబంధించిన తీవ్రమైన సమస్యలకు సంకేతం కావొచ్చు. కొన్నిసార్లు అండాశయ క్యాన్సర్‌కు దారి తీయొచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
కడుపు ఉబ్బరాన్ని ఎలా నివారించాలి?
మీకు కడుపు ఉబ్బరంగా ఎందుకు అనిపిస్తుందో ఇంకా తెలియకపోతే, కారణాలు తెలుసుకోవడానికి చిన్న మార్పులు చేయడం చాలా ముఖ్యం.
జీర్ణక్రియను మెరుగుపరుచుకోవడానికి క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడంతో పాటు, పొట్టలో ఉన్న గ్యాస్‌ను బయటకు పంపించడానికి పొట్టపై కుడి నుంచి ఎడమకు మసాజ్ చేయాలని నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్‌హెచ్‌ఎస్) సూచించింది.
మలబద్ధకం ఉన్నట్లయితే పీచు పదార్థాలు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. నీరు ఎక్కువగా తాగడం మంచిది.
కార్బోనేటెడ్ డ్రింక్స్, ఆల్కహాల్, కెఫిన్ అధికంగా ఉండే కాఫీ, టీ, కొవ్వు పదార్థాలు, ప్రాసెస్ చేసిన ఎక్కువ మోతాదులో చక్కెరలు ఉండే ఆహారాలు, మసాలా పదార్థాలను మానేయాలి. వాత గుణం ఎక్కువగా ఉండే క్యాబేజీ, బీన్స్, లెంటిల్స్‌కు దూరంగా ఉండాలి.
ఎలా తినాలనే అంశంపై కూడా సిఫార్సులు ఉన్నాయి. ఒకేసారి అతిగా తినడం కంటే కొంచెం, కొంచెంగా ఎక్కువసార్లు తింటే మేలని సూచిస్తున్నారు. నమిలేటప్పుడు గాలిని మింగేయకుండా నోటిని మూయాలి. నిద్రకు ముందు ఎక్కువగా తినొద్దు.
మీకు పడని ఆహారపదార్థాలను గుర్తించి, వాటిని తినడం మానేయాలి. ప్రతీ భోజనం తర్వాత పొట్టలో సౌకర్యంగా ఉందో లేదో పరిశీలించుకుంటూ క్రమంగా మీకు నప్పని ఆహారాలకు దూరంగా ఉండాలి.

ఫొటో సోర్స్, Getty Images
డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
సాధారణంగా కడుపు ఉబ్బరం కొద్దిసేపటి తర్వాత లేదా కొన్ని చిన్న ప్రయత్నాల తర్వాత తగ్గుముఖం పడుతుంది. ఇది కాస్త ఇబ్బందిపెట్టినా పెద్దగా ఆందోళన పడాల్సిన పనిలేదు.
కానీ, ఇతర లక్షణాలతో కలిసి కడుపు ఉబ్బరంగా అనిపించినా, లేదా కొన్ని ప్రయత్నాల తర్వాత కూడా కడుపు ఉబ్బరం తగ్గకుండా ఇబ్బంది పెడుతుంటే డాక్టర్‌ను సంప్రదించడం ఉత్తమం.
డయేరియా, పొత్తికడుపులో తీవ్ర నొప్పి, రక్తంతో కూడిన విరేచనాలు, మలం రంగులో మార్పు, బాత్రూంకు వెళ్లే సంఖ్యలో మార్పు రావడం, అకారణంగా బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం, చాలా త్వరగా కడుపు నిండిన భావన కలగడం, పొట్టలో, ఛాతీలో అసౌకర్యం వంటి లక్షణాలు ఉంటే వెంటనే అప్రమత్తం కావాలని మయో క్లినిక్ సూచించింది.
(గమనిక - ఇది అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యలు ఉంటే వైద్యులను సంప్రదించండి.)
ఇవి కూడా చదవండి:
- మాల్దీవులు: ‘ఇండియా అవుట్’ అన్న ఆ ప్రభుత్వమే భారత్‌కు విదేశాంగ మంత్రిని ఎందుకు పంపింది, తెర వెనక ఏం జరుగుతోంది?
- పెనైల్ క్యాన్సర్: పురుషాంగం తొలగించడానికి కారణమవుతున్న ఈ క్యాన్సర్ ఎలా వస్తుంది?
- World Asthma Day: ఆస్తమా ఎందుకు వస్తుంది? రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- ‘మా నాన్న సీఎం’
- హీట్ వేవ్: ఉష్ణోగ్రత 37C దాటితే మన శరీరానికి ఏమౌతుంది? మెదడు ఎలా స్పందిస్తుంది?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














