మాల్దీవులు: ‘ఇండియా అవుట్’ అన్న ఆ ప్రభుత్వమే భారత్‌కు విదేశాంగ మంత్రిని ఎందుకు పంపింది, తెర వెనక ఏం జరుగుతోంది?

ఫొటో సోర్స్, ANI
- రచయిత, దీపక్ మండల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఇండియా, మాల్దీవుల మధ్య సంబంధాలు ఉద్రిక్తంగా మారిన వేళ మాల్దీవుల విదేశాంగ మంత్రి న్యూదిల్లీ పర్యటనకు వచ్చారు.
మాల్దీవులలోని భారత దళాల ఉపసంహరణకు మరో రోజు మాత్రమే గడువు ఉన్న నేపథ్యంలో ఆ దేశ మంత్రి మౌసా జమీర్ భారత్‌కు రావడం, ఇరుదేశాల సంబంధాలలో కొత్త మలుపుగా చూస్తున్నారు.
మౌసా జమీర్ ఇండియాకు రావడానికి ముందు మాల్దీవుల పర్యాటక శాఖామంత్రి భారతీయులు మాల్దీవులలో పర్యటించాలని విజ్ఞప్తి చేశారు.
ఇండియా, మాల్దీవుల సంబంధాలు చారిత్రాత్మకమైనవని ఆయన చెప్పారు. గతంలో ఇండియా తమ దేశానికి సాయమందించిందని, మరోసారి ఇరుదేశాలు పరస్పరం కలిసి పనిచేయాలనుకుంటున్నాయని చెప్పారు.
ఇటీవల ప్రధాని మోదీ లక్షద్వీప్‌ను సందర్శించినప్పుడు మాల్దీవుల మంత్రి మరియం షియునా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో భారత్‌లో ‘బాయ్‌కాట్ మాల్దీవ్స్’ అనే ప్రచారం సోషల్ మీడియాలో ముమ్మరంగా సాగడంతో మాల్దీవులను సందర్శించే భారతీయుల సంఖ్య భారీగా పడిపోయింది.
మాల్దీవులను సందర్శించే విదేశీయులలో రష్యా తరువాతి స్థానంలో భారతీయులు ఉండేవారు. కానీ ఈ వివాదం తరువాత భారతీయ పర్యాటకుల సంఖ్య ఐదవ స్థానానికి పడిపోయింది.
మాల్దీవుల జీడీపీలో పర్యాటకం వాట 30 శాతం. మాల్దీవుల విదేశీ మారకంలో 60 శాతం పర్యాటక పరిశ్రమ నుంచే లభిస్తుంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఈ పర్యటనను ఎలా చూడాలి?
ప్రస్తుతం మాల్దీవుల విదేశాంగ మంత్రి భారత పర్యటనతో ఇరుదేశాల మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నట్టుగా భావించాలా? లేక నష్టనివారణకు మాల్దీవులు తీసుకున్న తక్షణ వ్యూహంగా చూడాలా, లేదంటే భారతదేశంతో సంబంధాలను దీర్ఘకాల వ్యూహంతో మెరుగుపరుచుకోవడంగా చూడాలా?
జవహర్‌లాల్ నెహ్రు యూనివర్సిటీలో సెంటర్ ఫర్ చైనీస్ స్టడీస్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న అర్వింద్ యెల్లేరి మాట్లాడుతూ ఇప్పుడు మాల్దీవులు ఏం చేస్తోందనేది చూడకుండా, కొంతకాలం నుంచి మాల్దీవుల వ్యవహారశైలి ఇండియాతో ఎలా ఉందనేది చూడాలని చెప్పారు.
‘‘అధ్యక్షుడు మెహమ్మద్ ముయిజ్జు పార్టీ భారత్ వ్యతిరేకి. ఆ పార్టీ అదికారంలోకి రాగానే, మాల్దీవులు చైనాతో తన సంబంధాలు మరింత పటిష్ఠం చేసుకుంది. పైగా, హిందూ మహాసముద్రం, ఇండోపసిఫిక్ ప్రాంతంలో తామొక ముఖ్యమైన శక్తి అని పదే పదే చెప్పింది’’
‘‘మాల్దీవులు తాను హిందు మహాసముద్రం, ఇండో పసిఫిక్ ప్రాంతంలో కీలకమనిభావిస్తే , ఆ దేశం వ్యూహాత్మక పరిపక్వతను చూపించి ఉండాలి. కానీ తన ప్రవర్తన కారణంగా ఇండియాతో ఘర్షణ వాతావరణం సృష్టించుకుంది’’అని యెల్లేరి చెప్పారు.
‘‘రాబోయే ఒకటి రెండేళ్ళలో మాల్దీవులు ఇండియాతో మెతక వైఖరితో ఉండదు. దీనికితోడు ఇండియాకు వ్యతిరేకంగా కొత్త వ్యూహాలను అనుసరిస్తూనే ఉంటుంది’’ అని వివరించారు.
మరి మాల్దీవుల పర్యాటక మంత్రి ప్రకటనను, విదేశాంగ మంత్రి భారత పర్యటనను ఎలా చూడాలి?
ఈ ప్రశ్నకు యెల్లేరి బదులిస్తూ ఇరుదేశాల మధ్య సంబంధాలు ఎంత అధ్వాన్నంగా ఉన్నా, దౌత్యపరంగా ఇలాంటి లాంఛనప్రాయమైన తలుపులు తెరిచే ఉంచాలి. అయితే ఇరుదేశాల సంబంధాలను సాధారణీకరించడంలో దీన్నో పెద్ద విజయంగా చూడొచ్చు అని చెప్పారు.
ఇదిలా ఉండగా హిందూ మహాసముద్రంలో మాల్దీవులు తమకు ముఖ్యమైన పొరుగుదేశమని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ పేర్కొంది. జమీర్ భారతదేశ సందర్శన ఇరుదేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని తెలిపింది.

ఫొటో సోర్స్, GETTY IMAGES
భారత్ మెతక వైఖరి
జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో నెల్సన్ మండేలా సెంటర్ పర్ పీస్ అండ్ కాన్‌ఫ్లిక్ట్ రిజల్యూషన్ సెంటర్‌లో ఫ్యాకల్టీ మెంబర్‌గా ఉన్న ప్రేమానంద మిశ్రా మాట్లాడుతూ గత కొంత కాలం నుంచి మాల్దీవుల పర్యాటకశాఖ భారతీయులు తమ దేశాన్ని సందర్శించాలని పదేపదే విజ్ఞప్తి చేస్తోంది.
ఇటీవల కాలంలో మాల్దీవుల భారత వ్యతిరేక వైఖరిపై భారత్ నుంచి తీవ్ర ప్రతిస్పందన వచ్చే ప్రమాదముందనే భయం ఉంది. కానీ భారతదేశ ప్రతిస్పందన చాలా పరిమితంగానే ఉంది.
‘‘భారత్ తీవ్రంగా ప్రతిస్పందించకపోవడం వల్ల ఇరుదేశాల మధ్య సంబంధాలలోని విభేదాలు తగ్గడానికి దోహదపడింది’’ అని ప్రేమానంద మిశ్రా చెప్పారు.
‘ముయిజ్జు చైనా అనుకూల వైఖరిపై కూడా బారత్ పెద్దగా అభ్యంతరం వ్యక్తం చేయలేదు. పార్లమెంటరీ ఎన్నికలలో గెలిచిన తరువాత మయిజ్జు కూడా రాజకీయంగా స్థిరపడ్డారు. దీంతో ఆయన కూడా భారత్‌తో సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు ముందడుగు వేస్తున్నారు. మరోసారి మోదీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ముయిజ్జు భారత్‌కు వస్తారు. ఇంతకు ముందు కూడా ఆయన రావడానికి ప్రయత్నించారు. కానీ భారత్ అందుకు అనుమతించలేదన్నది వేరే విషయం’’ అని తెలిపారు.

ఫొటో సోర్స్, @NARENDRAMODI
క్షీణతకు కారణమేంటి?
ముయిజ్జు పార్టీ ‘పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ ‘ఇండియా అవుట్ ’ అంటూ ఇచ్చిన నినాదంతోనే ఈ గొడవంతా మొదలైంది.
ముయిజ్జు చైనాకు అనుకూలంగా ఉంటూ మాజీ అధ్యక్షుడు మహమ్మద్ సోలిహ్, ఆయన పార్టీ మాల్దీవీయన్ డెమెక్రటిక్ భారత్ అనుకూల విధానాలను వ్యతిరేకించేవారు.
‘ఇండియా అవుట్’ అనే నినాదంతోనే ముయిజ్జు ఎన్నికలలో గెలిచారు.
ఆయన అధ్యక్షుడు కాగానే, ముందు భారత్‌ను సందర్శించే సంప్రదాయాన్ని కాదని తొలుత తుర్కియేకు, అక్కడి నుంచి చైనాకు వెళ్ళారు.
దీనికితోడు నవంబర్ 2023లో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాకా, మాల్దీవులలోని 88మంది భారతీయ సైనికులను వెనక్కి వెళ్ళిపోవాలని ఆదేశించారు.
ఈ నేపథ్యంలో ఈ ఏడాది జనవరిలో ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ ప్రకృతి సౌందర్యాన్ని పొగుడుతూ కొన్ని వీడియోలు పోస్టు చేయడంతో ఇరుదేశాల మధ్య సంబంధాలలో మరింత ఉద్రిక్తత నెలకొంది.
దీనిపై మాల్దీవుల ప్రభుత్వంలోని ముగ్గురు సహాయ మంత్రులు కొన్ని అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు.
ఈ కామెంట్ల తరువాతే ఇండియాలో ‘బాయ్‌కాట్ మాల్దీవ్స్’ అనే ప్రచారం సోషల్ మీడియాలో ఊపందుకుంది. దీంతో మాల్దీవులు సందర్శించే భారతీయుల సంఖ్య బాగా తగ్గిపోయింది. ఈ ట్రెండ్ ఇంకా కొనసాగుతూనే ఉంది.

మాల్దీవులకు భారత్ సాయం
ఈ ఏడాది ఫిబ్రవరిలో చైనా పరిశోధన నౌక షియాంగ్ యాంగ్ హాంగ్ 3ని మాలేలో హాల్ట్‌కు ముయిజ్జు ప్రభుత్వం అంగీకరించింది. మాల్దీవుల చర్యను భారత్ అంగీకరించలేదు. అది మిలటరీ నౌక కాదని మాల్దీవులు చెప్పింది.
కానీ భారత నిపుణులు మాల్దీవుల మాటలతో ఏకీభవించినట్టు కనిపించలేదు.
ఆ నౌక సేకరించే సమాచారాన్ని చైనా తరువాత ఉపయోగించుకుంటుందని భారత్ భావిస్తోంది.
ముయిజ్జు భారత్‌కు దూరం జరగుతున్నట్టు కనిపిస్తున్నప్పటికీ మల్దీవులకు భారత్ సాయం చేస్తూనే ఉంది.
మాల్దీవుల ఆర్థిక రంగంలో పర్యాటకానిదే కీలక పాత్ర. మాల్దీవులను సందర్శించేవారిలో భారతీయులు అధిక సంఖ్యలో ఉంటారు.
ఔషధాలు, ఆహారం, నిర్మాణ సంబంధిత వస్తువుల కసం మాల్దీవులు భారత్‌పై ఆధారపడుతోంది.
కరోనా తరువాత ఇండియా మాల్దీవులకు భారీగా వ్యాక్సీన్లు పంపింది. ఏప్రిల్ 10న భారత ప్రధాని మోదీ ముయిజ్జుకు ఓ ప్రత్యేక సందేశం కూడా పంపారు.
‘‘సంప్రదాయ ఉత్సాహంతో ఈద్-ఉల్-ఫితర్‌ను జరుపుకుంటున్నప్పుడు, శాంతియుత సమ్మిళిత ప్రపంచాన్ని నిర్మించడానికి అవసరమైన కరుణ, సోదరభావం, సంఘీభావ విలువలను ప్రపంచవ్యాప్తంగా ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ఇది అవసరం. మేం దానిని కోరుకుంటున్నాము.’’ అనే సందేశం పంపారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














