పర్వీన్ షేక్: సోషల్ మీడియా పోస్టులను లైక్ చేశారంటూ ప్రిన్సిపల్‌ను తొలగించిన స్కూల్ యాజమాన్యం... అసలేం జరిగింది?

పర్వీన్ షేక్

ఫొటో సోర్స్, PARVEEN SHAIKH

ఫొటో క్యాప్షన్, పర్వీన్ షేక్
    • రచయిత, భాగ్యశ్రీ రౌత్
    • హోదా, బీబీసీ కోసం

''స్కూల్ అభివృద్ధి కోసం పన్నెండేళ్లుగా కష్టపడి పనిచేశా. నాకు వ్యతిరేకంగా దుష్ప్రచారం జరుగుతున్న ఇలాంటి సమయంలో స్కూల్ యాజమాన్యం అండగా ఉంటుందని భావించా. కానీ, దానికి బదులుగా నన్ను బాధ్యతల నుంచి తొలగిస్తూ స్కూల్ యాజమాన్యం తీసుకున్న నిర్ణయం నిరాశకు గురిచేసింది. ఇది రాజకీయ ఒత్తిళ్లతో తీసుకున్న నిర్ణయంగా కనిపిస్తోంది''

సోషల్ మీడియా పోస్టులను లైక్ చేసినందుకు ఉద్యోగం కోల్పోయిన ముంబయిలోని సోమయ విద్యావిహార్ స్కూల్‌కి చెందిన పర్వీన్ షేక్ బీబీసీతో మాట్లాడారు.

సోమయ స్కూల్‌లో పర్వీన్ 12 ఏళ్లుగా పనిచేస్తున్నారు. ఆమె ఏడేళ్ల కిందట స్కూల్ ప్రిన్సిపల్‌గా పదోన్నతి పొందారు. అప్పటి నుంచి ఆమె స్కూల్ ప్రిన్సిపల్‌గా ఉన్నారు.

అయితే, సోషల్ మీడియా పోస్టును లైక్ చేశారనే ఆరోపణలతో ఆమెను బాధ్యతల నుంచి తొలగించారు. దీనికి సంబంధించి స్కూల్ యాజమాన్యం ఒక ప్రకటన చేసింది.

సోమయ స్కూల్ ప్రకటనలో ఏముంది?

''సోమయ స్కూల్‌లో నాయకత్వ బాధ్యతల్లో ఉన్న పర్వీన్ షేక్ వ్యక్తిగత సోషల్ మీడియా కార్యకలాపాలు స్కూల్ విలువలకు విరుద్ధంగా ఉన్నట్లు మా దృష్టికి వచ్చింది. భావప్రకటన స్వేచ్ఛను గౌరవిస్తాం, కానీ ఆ స్వేచ్ఛను ఇతరులను కించపరచని విధంగా ఉండాలి. పెరుగుతున్న ఆందోళనల దృష్ట్యా, ఈ విషయాన్ని నిశితంగా పరిశీలించిన అనంతరం పర్వీన్‌ను విధుల నుంచి తప్పించాం''

''మన యువత మనసు పాడవకుండా చూడడంతో పాటు ఐక్యత, సమగ్రత వంటి అత్యున్నత ప్రమాణాలు కలిగిన వాతావరణాన్ని అందించడం కీలకమని మేం భావిస్తున్నాం'' అని స్కూల్ యాజమాన్యం తన ప్రకటనలో పేర్కొంది.

ఉద్యోగం నుంచి తొలగించడంపై పర్వీన్ స్పందన..

''నోటీసు కూడా ఇవ్వకుండా స్కూల్ యాజమాన్యం నన్ను తొలగించిందన్న వార్త సోషల్ మీడియా ద్వారా తెలిసి షాక్ అయ్యా. ఆ నోటీసు చట్టవిరుద్ధం. నా పరువుకు భంగం కలిగించేలా ఓపీఇండియా, నుపూర్ శర్మ చెప్పిన అబద్ధాల ఆధారంగా ఆ నోటీసు ఉంది. ప్రిన్సిపల్‌గా నా బాధ్యతలు ఉత్తమంగా నిర్వర్తించా. అలాంటి కారణాలతో నన్ను తొలగించడం అన్యాయం'' అని పర్వీన్ అన్నారు.

పర్వీన్ షేక్

ఫొటో సోర్స్, TWITTER

''స్కూల్ అభివృద్ధి కోసం పన్నెండేళ్లపాటు కష్టపడి పనిచేశా. నాకు వ్యతిరేకంగా దుష్ప్రచారం జరుగుతున్న ఇలాంటి సమయంలో స్కూల్ యాజమాన్యం నాకు అండగా ఉంటుందని భావించా. కానీ, అందుకు బదులుగా కనీస సమాచారం కూడా ఇవ్వకుండా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం నిరాశ కలిగించింది.

ఇది రాజకీయ ఒత్తిళ్లతో తీసుకున్న నిర్ణయంగా కనిపిస్తోంది. న్యాయవ్యవస్థపై, భారత రాజ్యాంగంపై నాకు నమ్మకముంది. న్యాయపరమైన అవకాశాలను పరిశీలిస్తున్నా'' అని పర్వీన్ చెప్పారు.

అసలేం జరిగింది?

ఓపీఇండియా, నుపూర్ శర్మ తన పరువుకు భంగం కలిగించేలా అబద్ధాలు ప్రచారం చేశారని పర్వీన్ షేక్ అన్నారు. నిజానికి ఆ వెబ్‌సైట్ ఏం రాసింది?

పర్వీన్ షేక్ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు. ఆమె తన కెరీర్‌కు సంబంధించిన పోస్టులు చేస్తుంటారు.

అయితే, ఓపీఇండియా వెబ్‌సైట్ ఏప్రిల్ 24న ఒక కథనం ప్రచురించింది.

''పర్వీన్ షేక్ సోషల్ మీడియా వేదిక ఎక్స్‌(ట్విటర్)లో పాలస్తీనా అనుకూల పోస్టులకు లైక్స్, కామెంట్లు చేస్తుంటారు. హమాస్ సానుభూతిపరురాలు, హిందూ వ్యతిరేక పోస్టులను లైక్ చేస్తుంటారు, ప్రధాని మోదీపై దుర్భాషలాడుతుంటారు'' అని అందులో రాసింది.

ఆ కథనం ప్రచురితమైన తర్వాత స్కూల్ యాజమాన్యం ఆమెను పిలిపించి ప్రిన్సిపాల్ పోస్టు నుంచి తప్పుకోవాలని సూచించింది.

అయితే, రాజీనామా చేసేందుకు ఆమె నిరాకరించారు. రాజీనామా చేయాలని ఒత్తిడి చేయడం తన ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమేనని పర్వీన్ స్పష్టం చేశారు.

అనంతరం, రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని మే 4న స్కూల్ యాజమాన్యం పర్వీన్‌‌ను కోరింది. ఆ తర్వాత మూడు రోజులకు పర్వీన్‌ను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు సోమయ స్కూల్ ప్రకటన విడుదల చేసింది.

నుపూర్ శర్మ సవాల్

నుపూర్ శర్మ, ఓపీఇండియా వెబ్‌సైట్ తప్పుడు వార్తలు ప్రచారం చేశాయి, అదే ఈ పరిస్థితికి కారణమని పర్వీన్ షేక్ చెబుతున్నారు.

అయితే, సదరు వెబ్‌సైట్ ఎడిటర్, నుపూర్ శర్మ ఎక్స్‌లో ఆమెను సవాల్ చేశారు.

''మీ టెర్రరిజం అనుకూల అభిప్రాయాలపై కథనం ప్రచురించినందుకు కోర్టులో దావా వేయండి. నాపై కూడా దావా వేయండి. కోర్టులో కలుసుకుందాం'' అని నుపూర్ శర్మ రాశారు.

సోషల్ మీడియా పోస్టు ఆధారంగా తొలగించవచ్చా?

ఆమె సోషల్ మీడియా కార్యకలాపాలు తమ విలువలకు విరుద్ధంగా ఉన్నాయని సోమయ స్కూల్ యాజమాన్యం విడుదల చేసిన తన ప్రకటనలో పేర్కొంది.

అయితే, సోషల్ మీడియాలో పోస్టులకు, రాజకీయ అభిప్రాయాలకు సంబంధించి స్కూల్‌కి కచ్చితమైన విధానమంటూ ఏమీ లేదని పర్వీన్ అంటున్నారు.

కాబట్టి, సోషల్ మీడియాలో ఒక పోస్టును లైక్ చేసినంత మాత్రాన ఉద్యోగం నుంచి తొలగించవచ్చా? సోషల్ మీడియాలో పోస్టులకు సంబంధించిన చట్టం ఏదైనా ఉందా?

దీనిపై న్యాయవాది లిమాయె మాట్లాడుతూ, ప్రస్తుతానికి సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి ఎలాంటి చట్టం లేదని అన్నారు.

పర్వీన్ షేక్

ఫొటో సోర్స్, PARVEEN SHAIKH

''సోషల్ మీడియా పోస్టును లైక్ చేసినా, లేదా దానిపై కామెంట్ చేసినా గతంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్‌లోని 66 - ఏ కింద చర్యలు తీసుకునేవారు. కానీ, 2015 తర్వాత సుప్రీం కోర్టు ఆ సెక్షన్‌ను రద్దు చేసింది.

దీంతో ఎవరైనా సోషల్ మీడియా పోస్టును లైక్ చేసినా, లేదా కామెంట్ చేసినా ఎలాంటి చర్యలూ తీసుకోవడానికి అవకాశం లేదు.

పర్వీన్ షేక్ కోర్టును ఆశ్రయించవచ్చు. అయితే, ఆమెను తొలగించేందుకు స్కూల్ యాజమాన్యం ఇంకా ఏమేం కారణాలు చెప్పిందో కూడా పరిశీలించాల్సి ఉంటుంది. తమ విలువలకు భంగం కలిగిందని స్కూల్ యాజమాన్యం చెబితే, భంగం కలిగిందో లేదో నిర్ణయించే హక్కు కోర్టుకు ఉంటుంది'' అని ఆయన బీబీసీ మరాఠీతో చెప్పారు.

ఎవరీ పర్వీన్ షేక్

సోమయ విద్యా సంస్థలో పర్వీన్ షేక్ 12 ఏళ్లుగా పనిచేస్తున్నారు.

ఆమె ఏడేళ్ల కిందట పదోన్నతి పొంది స్కూల్ ప్రిన్సిపాల్‌ అయ్యారు. ఆమె ప్రిన్సిపాల్‌గా ఉన్న సమయంలో స్కూల్‌కి ఎన్నో అవార్డులు వచ్చాయి.

గత రెండేళ్లుగా పదో తరగతి ఫలితాల్లో స్కూల్ విద్యార్థులు ముంబయి టాపర్లుగా నిలుస్తున్నారని, వంద శాతం ఉత్తీర్ణత సాధిస్తున్నారని పర్వీన్ చెప్పారు.

స్కూల్ వెబ్‌సైట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం, పర్వీన్ ఎడ్యుకేషనల్ మేనేజ్‌‌మెంట్‌లో మాస్టర్స్ డిగ్రీతో పాటు హ్యూమన్ డెవలప్‌మెంట్‌లో డిప్లొమా చేశారు. అదనంగా బీఈడీ, ఎంఈడీ కూడా పూర్తి చేశారు. ఆమె నేషనల్ ఎలిజిబిలిటీ టెస్టులో కూడా ఉత్తీర్ణురాలు.

గతంలో జరిగిన ఘటనలు..

2019లో పుల్వామా దాడి, బాలాకోట్ వైమానిక దాడులపై రాజకీయ ప్రకటనలు చేసినందుకు ఉత్తర్‌ప్రదేశ్‌లో ఏడుగురు ప్రభుత్వ ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారు.

కొందరు టీచర్లు ఫేస్‌బుక్, వాట్సాప్ గ్రూపుల్లో తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. సర్వీస్ రూల్స్ నిబంధనలను ఉల్లంఘించారని చెబుతూ వారిని విధుల నుంచి సస్పెండ్ చేశారు. అప్పట్లో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ దీనిని రిపోర్ట్ చేసింది.

గత ఏడాది, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, సిద్ధరామయ్యపై విమర్శల కారణంగా ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు సస్పెండ్ అయ్యారు.

చిత్రదుర్గ జిల్లాకు చెందిన శంతనుమూర్తి కర్ణాటక ప్రభుత్వం ప్రకటించిన ఉచితాల వల్ల రాష్ట్రంపై భారం పడుతుందని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సిద్ధరామయ్య హయాంలో అప్పులు పెరిగిపోయాయని పేర్కొన్నారు.

ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ షేర్ చేసిన వెంటనే ఆయనకు సస్పెన్షన్ ఆర్డర్ వచ్చినట్లు హిందుస్థాన్ టైమ్స్ ప్రచురించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)