కర్నూలు జిల్లాలోని ఈ ఊళ్లు ఎందుకు ఖాళీ అవుతున్నాయి, జనమంతా ఎక్కడికి వెళుతుంటారు?

ఫొటో సోర్స్, bbc
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
కర్నూలు జిల్లాలోని కోసిగి మండలం పల్లెపాడు గ్రామం. ఇంటి బయట పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేసుకుంటూ కనిపించారు నాగరాజు.
ఇంట్లో అతని భార్య రూతమ్మ సామగ్రి దుమ్ము దులుపుతున్నారు.
ఆటోలో తీసుకువచ్చిన సామగ్రిని సర్దుకుంటూ అన్నం వండేందుకు సిద్ధమవుతున్నారు.
అదే సమయంలో బీబీసీ ప్రతినిధిగా నేను అక్కడికి వెళ్లాను.
నాగరాజు కుటుంబం ఐదారు నెలల కిందట సొంతూరు, కట్టుకున్న చిన్న ఇంటిని విడిచి కడప వెళ్లింది. అక్కడే నిర్మాణ రంగంలో కూలీగా పనిచేసి తిరిగి వచ్చారు.
నాగరాజు కుటుంబం ఒక్కటే కాదు, నిర్మాణ రంగంలో వర్కర్లు, వ్యవసాయ కూలీలుగా వేలాది కుటుంబాలు కర్నూలు పశ్చిమ ప్రాంతం నుంచి బతుకుదెరువు కోసం వలస వెళుతున్నాయి.
పనులు కరవై, సొంతూరు బరువై, పొట్టచేత పట్టుకుని వేరొక ప్రాంతాలకు వెళ్లి నాలుగు డబ్బులు కూడబెట్టుకుంటున్నారు.
ఆ తర్వాత తిరిగి వచ్చి బతుకుబండి నడిపిస్తున్నారు.
ఇంతకీ కర్నూలు జిల్లాలో ముఖ్యంగా గ్రామాల్లోని ప్రజలు ఊళ్లు ఖాళీ చేసి ఎక్కడికి వెళుతున్నారు. వారి పరిస్థితికి కారణం ఏమిటి? వారు ఏం కోరుకుంటున్నారు?

కూలీ పనుల కోసం 300 కిలోమీటర్లు
కర్నూలు జిల్లాలోని కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, పత్తికొండ నియోజకవర్గాలు వెనుకబడి ఉన్నాయి.
ఇక్కడ చాలామందికి ఉపాధి మార్గాలు లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. దీనివల్ల ఆ నియోజకవర్గాలకు చెందిన ప్రజలు ఏటా పెద్దసంఖ్యలో వలసలు వెళుతున్నారు.
దాదాపు 300 కిలోమీటర్ల దూరంలోని గుంటూరు, కృష్ణా జిల్లాలకు వేలాది కుటుంబాలు వలస వెళుతున్నాయి.
తెలంగాణలోని జహీరాబాద్, సంగారెడ్డి ప్రాంతాలకూ తరలి వెళుతున్నారు. అక్కడ పత్తి కొట్టడం, మిర్చి కోయడం, చెరుకు నరకడం వంటి పనులకు వెళుతున్నారు.
ముంబయి, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాలకు వలస వెళ్తున్న వాళ్లూ ఉన్నారు. అక్కడ నిర్మాణ రంగ కూలీలుగా పనిచేస్తున్నారు.
‘‘సొంతూరులో ఉంటే మాకేం వస్తాయి. ఇక్కడ కూలీ కింద 200, 250 రూపాయలే ఇస్తున్నారు. అలా కాకుండా సుగ్గీ(వలస) పోతే రోజుకు 600 సంపాదించుకోవచ్చు. ఇంట్లో ఆడ, మగ ఇద్దరూ సుగ్గీలకు పోతే వేయి రూపాయలు సంపాదించుకునే వీలుంటుంది. అందుకే సొంతూరును వదిలి ఎక్కడో వేరొక చోటకు వెళ్లాల్సి వస్తోంది’’ అని ఎమ్మిగనూరు మండలం కందనాతి గ్రామానికి చెందిన రసూల్ బీబీసీతో చెప్పారు.

ఆరు నెలలు ఇక్కడ... ఆరు నెలలు అక్కడ..
ఇక్కడి ప్రజలు ఒక్కసారి సుగ్గీలకు పోతే ఆరు నుంచి ఏడు నెలల పాటు ఇంటి ముఖం చూడటం లేదు. ఏటా అక్టోబరు, నవంబరు నెలల్లో ఊళ్లను విడిచి వెళుతుంటారు.
కర్నూలు జిల్లా నుంచి బయల్దేరి గుంటూరు ప్రాంతానికి చేరుకుంటున్నారు. తెలంగాణలోని జహీరాబాద్, సంగారెడ్డి ప్రాంతాలకు వెళుతున్నారు. అక్కడ పత్తి కొట్టే పనిచేస్తున్నారు.
ఆ పనులు అయ్యాక మిర్చి కాయలు తెంపడానికి వెళుతున్నారు. అలా వెళ్లి కూలీ పనులు చేసుకుని మళ్లీ వేసవి కాలంలో ఇళ్లకు చేరుకుంటున్నారు.
ఏప్రిల్ నెలలో ఇళ్లకు చేరుకుని సంపాదించుకుని వచ్చిన డబ్బుతో అప్పులు కడుతూ, మిగిలిన సొమ్ముతో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.
వేసవికాలంలో ఉపాధి హామీ పనులకు వెళితే రోజుకు రూ.200 సంపాదించుకుంటామని, అదే జీవనాధారం అవుతోందని మంత్రాలయం నియోజకవర్గం చింతకుంట గ్రామానికి చెందిన మునుస్వామి బీబీసీతో చెప్పారు.
‘‘ఐదారు నెలలు ఊళ్లో ఉంటే.. మిగిలిన నెలలు సుగ్గీలకు పోవాల్సిందే. అక్కడ సంపాదించుకుని వస్తే మళ్లీ ఊరికి వచ్చి బతకగలం. ఇక్కడ పనులేమీ ఉండవు. పని దొరికినా పెద్దగా కూలీ రాదు. ఏడాదిలో సగం రోజులు ఇంటి ముఖం చూసేది ఉండదు’’ అని మునుస్వామి అంటున్నారు.
‘‘సంపాదనంటే పెద్దగా ఏమీ మిగలదు. మా కుటుంబం తినడానికే సరిపోతుంది. అక్కడ పది, ఇరవై వేలు తీసుకువస్తే, అప్పులు కట్టి మిగతాది బతకడానికి ఉంచుకోవాలి ’’ అని చింతకుంటకు చెందిన మహదేవప్ప చెప్పారు.
నాలుగైదు ఎకరాలు ఉన్నా వలసే..
వలస వెళ్లే వారిలో వ్యవసాయ కూలీలు, భూమి లేని నిరుపేదలే కాదు, వ్యవసాయ భూములున్న రైతులు కూడా ఉంటున్నారు. పంటలు పండకపోవడంతో అప్పుల పాలై.. వాటిని తీర్చడానికి ఊరు దాటుతున్నారు.
కోసిగి మండలం పల్లెపాడు మండలానికి చెందిన దావీద్‌ది ఇదే కథ. ఆయన గత ఖరీఫ్ సీజన్‌లో నాలుగు ఎకరాల్లో పత్తి పంట వేశారు. పెట్టుబడి కింద రూ.50 వేలు పెట్టినట్లు చెప్పారు. కానీ, ఎకరాకు కేవలం 38 కిలోల పత్తి మాత్రమే చేతికి వచ్చిందని తెలిపారు.
మొత్తం పెట్టుబడి నష్టపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆయన వ్యవసాయ కూలీగా గుంటూరుకు వలస వెళ్లారు. అలా వలస వెళ్లి వచ్చిన దావీద్ నేడు పల్లెపాడు గ్రామానికి చేరుకున్నారు.
‘‘మాకు భూములున్నా, పంటలు పండించే పరిస్థితి లేదు. నాలుగైదు ఎకరాలు ఉన్నా సరే, వలస వెళ్లి బతకాల్సిందే. ఇక్కడి నుంచి గుంటూరు జిల్లాకు వెళుతున్నాం. అక్కడ పత్తి తీసినందుకు కిలోకు 10, 12 రూపాయలు ఇస్తుంటారు. బతకడానికి అవి కూడా చాలడం లేదు. మళ్లీ సొంతూరుకు వస్తే అప్పులిచ్చిన వాళ్లు డబ్బులు అడుగుతారని కొన్ని నెలలు అక్కడే ఉండిపోయాను’’ అని బీబీసీతో చెప్పారు.
అదే గ్రామానికి చెందిన నాగరాజు ఊరికి తిరిగివచ్చిన సమయంలో బీబీసీ పలకరించింది.
‘‘నాకు మూడెకరాల భూమి ఉంది. అయినా కరువు కారణంగా పంటలు పండటం లేదు. నేను ఐదేళ్లుగా వలస వెళుతున్నాను. ఇక్కడ ఏం పనులు ఉండవు. వర్షాల సమయంలో వచ్చి మళ్లీ ఏవైనా పొలం పనులు చేసుకుని తిరిగి వెళుతుంటాం’’ అని చెప్పారు నాగరాజు.

ఇళ్లకు కాపలాగా పెద్దవాళ్లు..
కుటుంబంలోని భార్యభర్తలిద్దరూ వలసలు వెళుతుంటారు. ఇంట్లో వృద్ధులు, చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే అక్కడే వదిలేసి వెళుతుంటారు. వృద్ధులు ఇళ్లకు కాపలా కాసుకుంటూ గ్రామాల్లో మిగిలిపోతున్నారు.
చిన్నపిల్లలు ఉంటే వారిని ఇంటి వద్ద వదలి వెళ్లడం లేదా, బంధువుల ఇంట్లో వదిలి వెళ్లడం చేస్తున్నారు. బడికి వెళ్లడం లేదంటే వారిని వెంట తీసుకుని వెళుతున్నారు.
‘‘ఊళ్లో పొలం పనులు అయిపోగానే వెళ్లిపోతాం. మాతో పాటు పిల్లలను తీసుకెళ్లాల్సిందే. మాకు ముగ్గురు పిల్లలున్నారు. ఒకర్ని బంధువుల ఇంట్లో వదిలి పెడతాం. మరొకర్ని హాస్టల్లో చేర్పించాం. ఇంకొకర్ని మాతోపాటు తీసుకుని వెళతాం. ఐదారు నెలలు ఇంటికి తాళాలు వేసుకుని ఉంటాం’’ అని చెప్పారు పల్లెపాడుకు చెందిన రూతమ్మ.
ఊళ్లో వలసలపై కందనాతి గ్రామానికి చెందిన రంగన్న బీబీసీతో మాట్లాడారు.
‘‘ఒకప్పుడు కట్టెలు అమ్ముకుని కూడు తినేవాళ్లం. ఇప్పుడు సుగ్గీలకు పోయి వస్తున్నారు. ఇక్కడి ఊళ్లలో బతికేదే కష్టం. నీటి వసతి లేదు. తాగేందుకు నీరు దొరకదు. కుటుంబంలో కొడుకులు, కొడళ్లు వలసలు పోతుంటారు. మాలాంటి ముసలివాళ్లు ఊళ్లో ఉండిపోతారు’’ అని రంగన్న చెప్పారు.

తాగునీటికి ఇబ్బందులే
కర్నూలు పశ్చిమ ప్రాంతంలోని మండలాల్లో ఒక్క సాగునీటికే కాదు, తాగునీటికి ఇబ్బందిగా మారింది.
కడివెళ్ల గ్రామానికి బీబీసీ వెళ్లినప్పుడు అక్కడి ప్రజలు మూడు చక్రాల బండిపై బిందెలు పెట్టుకుని నీటిని తీసుకెళుతున్నారు. ఊళ్లో రోడ్డు పక్కన ఉన్న చిన్న గుంతలో దిగి అక్కడే నీటిని పట్టుకుని నింపుకోవాలి. ఆ నీరు కూడా చెరువు నుంచి వచ్చేదే. తెల్లగా నురగలు వస్తూ మురికిగా ఉన్నాయి.
ఆ నీటినే వడపోసి తాగుతుంటామని కడివెళ్ల గ్రామానికి చెందిన పద్మ బీబీసీతో చెప్పారు.
‘‘ఇక్కడ నీళ్లు సరిగా రావు. మేం వలస వెళ్లడానికి ఇది కూడా ఒక కారణం. కనీసం వలస వెళితే పొలాల దగ్గర యజమానులు తాగునీటి వసతి కల్పిస్తారు. ఊళ్లో ఉంటే తాగడానికి నీరు కూడా ఉండదు. ఇంటింటికి కుళాయిలు ఇవ్వాలని ఎన్నో ఏళ్ల నుంచి అడుగుతున్నా.. పట్టించుకోవడం లేదు. తాగడానికి నీరు కూడా లేకపోతే ఇక ఊళ్లో ఏం ఉండగలం?’’ అని అన్నారు పద్మ.
పశు సంపద మాయం
వలసల ప్రభావం గ్రామీణ జీవన విధానాన్నిదెబ్బతీస్తోంది. ప్రజలు వలస వెళుతుండటంతో ఊళ్లలో పెంచుకునే గేదెలు, ఆవులు, కోళ్లు, మేకలు, గొర్రెలు వంటి పశుసంపద మాయమవుతోంది.
ఆరు నెలలపాటు చూసుకునే వారు ఉండరు కనుక వాటిని ముందుగానే అమ్మేసుకుంటున్నారు. దీనివల్ల ఊళ్లలో పశువులు తగ్గి పాడిపరిశ్రమ తగ్గిపోతోంది.
‘‘వేసవి రెండు నెలలు ఊళ్లో ఉంటాం. ఈసారి తెలంగాణ, ఆంధ్రాలోనూ కరువు ఉండటంతో త్వరగా ఊళ్లకు చేరుకున్నాం. నాకు తెలివి వచ్చినప్పట్నుంచి నేను వలస వెళుతూనే ఉన్నాను. వలస వెళితే ఊళ్లో చూసుకునేందుకు ఇబ్బంది అని పశువులు ఎవరూ పెంచడం లేదు’’ అని కందనాతికి చెందిన ఇస్మాయిల్ అన్నారు.

వలసలు ఆగేదెలా..
సామాజిక ఉద్యమకారుడు నాగన్న చెప్పిన వివరాల ప్రకారం.. జిల్లాలోని పలు గ్రామాల నుంచి ఏటా సుమారు 3-4 లక్షల మంది వలస వెళుతుంటారు. వీరిలో 12వేల మంది మైనర్లు అంటే పిల్లలు ఉంటారని చెబుతున్నారు.
వలసలను నిరోధించాలంటే సాగు, తాగునీటి వసతి కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.
‘‘మాకు మరేమీ చేయవద్దు. కేవలం పంటలకు, తాగడానికి నీరు కల్పిస్తే చాలు. పంటలు పండించుకుంటూ ఊళ్లోనే ఉంటాం. అలా కాకుండా ఉపాధి అవకాశాలు కల్పించినా వలసలు ఆగేందుకు వీలుంటుంది’’ అని అంటున్నారు పల్లెపాడుకు చెందిన నాగరాజు.
కర్నూలు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు ఎక్కువగా పూర్తికాకపోవడమనేది ఈ ప్రాంతానికి సమస్యగా మారింది. తుంగభద్ర నది బేసిన్‌లో ఉన్న ప్రాంతాలకు నీరు అందడం లేదు. ఇక్కడ ఎత్తిపోతల పథకాలతో నీరు పంపింగ్ చేయాల్సి ఉంది. ప్రాజెక్టుల పనులు ఏళ్లుగా సాగుతున్నాయి.
వేదవతి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు నాలుగేళ్లుగా నిలిచిపోయాయి. రూ.1,924 కోట్లతో 2019లో చేపట్టిన ప్రాజెక్టు పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు. 80 వేల ఎకరాలకు సాగునీరు, 253 గ్రామాలకు తాగునీరు ఇవ్వాలనేది ఈ ప్రాజెక్టు లక్ష్యం.
దీని ద్వారా ఆదోని, అలూరు నియోజకవర్గాలకు సాగు, తాగునీరు అందుతుంది. అయితే, ఈ ప్రాజెక్టు కోసం దాదాపు 4,800 ఎకరాల భూమి అవసరం కాగా, ఇప్పటివరకు కేవలం 40 ఎకరాలు మాత్రమే సేకరించారు.
కర్నూలు పశ్చిమ ప్రాంతానికి సాగునీరు అందించేందుకు ఉద్దేశించిన మరో ప్రాజెక్టు రాజోలిబండ డైవర్షన్ కెనాల్ (కుడికాల్వ మళ్లింపు) పూర్తి కావడం లేదు.
తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు రూ.1,985 కోట్లతో ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించారు. 40,270 ఎకరాలకు సాగునీరు అందించాలనేది ప్రాజెక్టు ఉద్దేశం. ఇది పూర్తయితే 60 గ్రామాలకు తాగునీరు అందుతుంది.
కోసిగి మండలం బాత్ర బొమ్మలాపురం వద్ద ఒక రిజర్వాయర్ నిర్మించాల్సి ఉంది. ౩౦ నెలల్లో పూర్తి కావాల్సిన ఈ ప్రాజెక్టు.. భూసేకరణ కాకపోవడంతో ఐదేళ్లయినా పూర్తి కాలేదు.
గురు రాఘవేంద్ర ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన పులికనుమ ప్రాజెక్టులోకి నీరు సరిగా రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని రైతులు చెప్పారు.
1.63 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మించినా నీరు సరిగా రావడం లేదని కర్నూలు జిల్లాకు చెందిన సీపీఐ నాయకులు చెబుతున్నారు.
ఈ విషయంపై ఎమ్మిగనూరుకు చెందిన సీపీఐ నాయకులు రంగన్న బీబీసీతో మాట్లాడారు.
‘‘కర్నూలు జిల్లాలో వలసలు నివారించాలంటే సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలి. వేదవతి ప్రాజెక్టు పూర్తయితే అలూరు, డోన్, ఆదోని, పత్తికొండ నియోజకవర్గాలకు నీరు అందుతుంది. ఆర్డీఎస్ పూర్తి చూస్తే మంత్రాలయం నియోజకవర్గానికి నీరు అందుతుంది. దీనివల్ల రెండు పంటలు పండించేందుకు వీలుంటుంది. కోడుమూరు నియోజకవర్గంలో గుండ్రేవుల ప్రాజెక్టు పూర్తి చేస్తే సాగునీటితోపాటు కర్నూలు పట్టణానికి నీరు అందించే వీలుంటుంది’’ అని రంగన్న చెప్పారు.
అధికారులు ఏం చెబుతున్నారు?
వలసలు తగ్గించడానికి తీసుకుంటున్న చర్యలపై కలెక్టర్ జి.సృజనతో బీబీసీ మాట్లాడింది.
‘‘ఉపాధి హామీ పథకంలో వీలైనన్ని ఎక్కువ రోజులు పని కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాం. రహదారులు, సాగునీటి వసతి సదుపాయాలు కల్పిస్తే వలసలు తగ్గించేందుకు వీలుంటుంది.
ప్రాజెక్టులకు భూసేకరణ పెద్ద సమస్య కాదు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, చేనేత క్లస్టర్లు ఏర్పాటు చేస్తే కచ్చితంగా ప్రయోజనం ఉంటుంది.
ఈ దిశగా కొన్ని చర్యలు తీసుకున్నాం. ముఖ్యంగా ఉల్లి, టమాటా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నాం.
ఇవి పెద్దసంఖ్యలో ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రభుత్వాలు కూడా ఆలోచన చేస్తున్నాయి’’ అని కలెక్టర్ సృజన చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- బ్లూ కార్నర్: ప్రజ్వల్ రేవణ్ణ కోసం ఈ నోటీస్ ఎందుకు జారీ చేశారు, దీనివల్ల ఏమవుతుంది?
- పెనైల్ క్యాన్సర్: పురుషాంగం తొలగించడానికి కారణమవుతున్న ఈ క్యాన్సర్ ఎలా వస్తుంది?
- World Asthma Day: ఆస్తమా ఎందుకు వస్తుంది? రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- ‘మా నాన్న సీఎం’
- హీట్ వేవ్: ఉష్ణోగ్రత 37C దాటితే మన శరీరానికి ఏమౌతుంది? మెదడు ఎలా స్పందిస్తుంది?
బీబీసీ తెలుగును ఫేస్బుక్ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














