RCB-CSK: IPL ప్లేఆఫ్స్‌లో స్థానం కోసం ఆర్సీబీ వ్యూహం ఏంటి?

ఐపీఎల్

ఫొటో సోర్స్, Getty Images

ఐపీఎల్ టీ20 2024 సీజన్‌లో ప్లేఆఫ్స్‌కు ఇప్పటివరకు కోల్‌కతా నైట్ రైడర్స్ స్థానం ఒక్కటే ఖరారైంది. మిగిలిన 3 స్థానాల కోసం 6 జట్ల మధ్య పోటీ నెలకొంది.

ఈ సీజన్‌లో 12 మ్యాచ్‌ల్లో 9 విజయాలు, 3 ఓటములు, 18 పాయింట్లు, 1.428 బలమైన నెట్ రన్ రేట్‌తో కోల్‌కతా నైట్ రైడర్స్ అగ్రస్థానంలో కొనసాగుతోంది.

మిగిలిన 2 మ్యాచ్‌లలో కోల్‌కతా సునాయాసంగా గెలిస్తే 22 పాయింట్లతో అగ్రస్థానాన్ని నిలుపుకుంటుంది. దీంతో కోల్‌కతాకు మొదటి లేదా రెండో స్థానం ఖరారైనట్లే.

మిగిలిన 3 స్థానాల కోసం 6 టీమ్‌ల మధ్య పోటీ నెలకొంది.

రాజస్థాన్ రాయల్స్‌కు 16 పాయింట్లు లభించినా, ప్లేఆఫ్స్ స్థానం ఇంకా ఖరారు కాలేదు. దాంతో ఏయే టీమ్‌లు ప్లేఆఫ్స్‌కు చేరుకుంటాయన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

రాజస్థాన్ రాయల్స్

ఫొటో సోర్స్, Getty Images

రాజస్థాన్ రాయల్స్ రెండో స్థానంలో నిలిచేనా?

ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ 12 మ్యాచ్‌ల్లో 8 విజయాలు, 4 ఓటములతో 16 పాయింట్లతో 2వ స్థానంలో కొనసాగుతోంది. వరుసగా 3 పరాజయాలను చవి చూసినా, రాజస్థాన్ 0.349 నెట్ రన్ రేట్‌తో, ఎలాంటి మార్పూ లేకుండా 2వ స్థానంలో ఉంది.

రాజస్థాన్‌ మరో 2 లీగ్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. పంజాబ్ కింగ్స్‌తో జరిగే మ్యాచ్‌లో గెలిచినా, కోల్‌కతాతో జరిగే మ్యాచ్ ఆ టీమ్‌కు సవాల్‌గా మారనుంది.

రాజస్థాన్ మిగిలిన రెండు మ్యాచ్‌లలో ఒక్క మ్యాచ్ గెలిచినా, 18 పాయింట్లతో ప్లే ఆఫ్స్ రౌండ్‌లో స్థానం ఖాయం చేసుకుంటుంది.

సన్‌రైజర్స్ తమ చివరి రెండు లీగ్ మ్యాచ్‌లలో ఒకదానిలో గెలిచి, మరొక దానిలో ఓడిపోతే, రాజస్థాన్ 2వ స్థానంలో నిలుస్తుంది.

సన్‌రైజర్స్ జట్టు చివరి 2 లీగ్ మ్యాచ్‌లు గెలిచి, రాజస్థాన్ ఒక్క మ్యాచ్‌లో మాత్రమే గెలిస్తే నెట్ రన్ రేట్ ఆధారంగా 2వ స్థానాన్ని నిర్ణయిస్తారు.

ధోని

ఫొటో సోర్స్, ANI

సీఎస్‌కే ప్లేఆఫ్ అవకాశాలు ఎలా ఉన్నాయి?

రాజస్థాన్‌పై సాదాసీదా విజయంతో సీఎస్‌కే 13 మ్యాచ్‌ల్లో 7 విజయాలు, 6 ఓటములతో 14 పాయింట్లతో 3వ స్థానానికి చేరుకుంది.

0.528తో సీఎస్‌కే నెట్ రన్ రేట్ వద్ద రాజస్థాన్ కంటే మెరుగ్గా ఉంది. చివరి లీగ్ మ్యాచ్‌లో సీఎస్‌కే మే 18న ఆర్సీబీతో తలపడనుంది.

సీఎస్‌కే ఈ మ్యాచ్‌లో గెలిస్తే 16 పాయింట్లతో ప్లేఆఫ్స్‌లో స్థానం దక్కించుకుంటుంది. సీఎస్‌కేకు ఇప్పటికే బలమైన నెట్ రన్ రేట్‌ ఉండటంతో సన్‌రైజర్స్, ఢిల్లీ, లక్నోల నుంచి పోటీ ఉన్నా ప్లేఆఫ్ రౌండ్‌లో 3 లేదా 4వ స్థానంలో నిలిచే అవకాశం ఉంది.

ఆర్సీబీతో జరిగే లీగ్ మ్యాచ్‌లో సీఎస్‌కే ఓడిపోయినా, పరుగుల తేడా స్వల్పంగా ఉంటే అది 4వ స్థానాన్ని పొందవచ్చు.

ఉదాహరణకు ఆర్సీబీ మొదట బ్యాటింగ్ చేసి 200 పరుగులు చేస్తే, సీఎస్‌కే 18 పరుగుల కంటే తక్కువ తేడాతో ఓడిపోవాలి.

లేదా సీఎస్‌కే ముందుగా బ్యాటింగ్ చేసి 200 పరుగులు చేస్తే, అది ఆర్సీబీ చేతిలో 10 కంటే తక్కువ బంతులు మిగిలి ఉండగా ఓడిపోవాలి. అప్పుడు, ఓడిపోయినా సీఎస్‌కే 4వ స్థానంలో నిలిచే అవకాశం ఉంది.

దిల్లీ కేపిటల్స్‌

ఫొటో సోర్స్, Getty Images

దిల్లీ కేపిటల్స్‌కు అవకాశం ఉందా?

ప్రస్తుతం దిల్లీ జట్టు 12 పాయింట్లతో 6వ స్థానంలో ఉంది. ఆ టీమ్ నెట్ రన్ రేట్ మైనస్ 0.482.

దిల్లీ ఇంకా లక్నో జట్టుతో తలపడాల్సి ఉండగా, ఆ జట్టు ఎక్కువ పరుగుల తేడాతో గెలిస్తే 14 పాయింట్లను సాధిస్తుంది. ఆ జట్టు నెట్ రన్ రేట్ పెంచుకుంటే ప్లే ఆఫ్ రౌండ్‌లో చివరి స్థానం కోసం పోరాడవచ్చు. కానీ దీనికి అవకాశాలు చాలా తక్కువ.

సన్‌రైజర్స్ హైదరాబాద్

ఫొటో సోర్స్, Getty Images

సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్ అవకాశాలు ఎలా ఉన్నాయి?

ప్రస్తుతం సన్‌రైజర్స్ 12 మ్యాచ్‌ల్లో 14 పాయింట్లతో 3వ స్థానంలో ఉంది. సన్‌రైజర్స్ 0.406 నెట్ రన్ రేట్‌తో బలంగా ఉన్నా, ఇది సీఎస్‌కే కంటే తక్కువ. సన్‌రైజర్స్ మరో రెండు మ్యాచ్‌లు ఆడాలి. ఆ రెండు మ్యాచ్‌లూ గెలిస్తే 18 పాయింట్లతో ప్లేఆఫ్స్‌లో చోటు దక్కించుకుంటుంది.

సన్‌రైజర్స్ ఒక మ్యాచ్ గెలిచి ఒక మ్యాచ్ ఓడిపోతే, ఆ జట్టు పాయింట్లు 16కు చేరతాయి. అదే సమయంలో, సీఎస్‌కే తమ చివరి మ్యాచ్‌లో గెలిస్తే, 16 పాయింట్లతో నెట్ రన్ రేట్‌లో సన్‌రైజర్స్‌ను 4వ స్థానానికి నెట్టి 3వ స్థానాన్ని పొందే అవకాశం ఉంది.

రాజస్థాన్ మిగిలిన 2 మ్యాచ్‌ల్లో ఒక మ్యాచ్ గెలిచి, మరొకటి ఓడి 18 పాయింట్లే సాధిస్తే, సన్‌రైజర్స్ రెండు మ్యాచ్‌లలో గెలిస్తే 18 పాయింట్లతో మెరుగైన నెట్ రన్ రేట్‌తో పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంటుంది. అప్పుడు కోల్‌కతా నైట్ రైడర్స్ 2వ స్థానంలో, రాజస్థాన్ 3వ స్థానంలో నిలుస్తాయి.

లక్నో సూపర్‌ జెయింట్స్ 12 పాయింట్లు సాధించినా, ఆ టీమ్ నెట్ రన్ రేట్ మైనస్ 0.769కి పడిపోయింది. లక్నో తదుపరి 2 మ్యాచ్‌లు గెలిచి 16 పాయింట్లు సాధించినా, నెట్ రన్ రేట్ ఆ జట్టుకు పెద్ద అడ్డంకిగా మారింది. దీంతో లక్నోకు ప్లేఆఫ్స్ తలుపులు మూసుకుపోయినట్లే.

ఐపీఎల్ మ్యాచ్‌

ఫొటో సోర్స్, Getty Images

ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కు చేరుతుందా?

13 మ్యాచ్‌లలో 5 వరుస విజయాలు, 0.387 నెట్ రన్ రేట్‌తో ఆర్సీబీ 12 పాయింట్లతో 5వ స్థానంలో ఉంది.

ఆర్సీబీ తమ చివరి లీగ్ మ్యాచ్‌లో గెలిస్తే, దాని పాయింట్లు 14కు చేరతాయి. ఆర్సీబీ ప్లేఆఫ్‌కు వెళ్లాలంటే - లక్నో ఒకటి కంటే ఎక్కువ మ్యాచ్‌లు గెలవకూడదు, ఆర్సీబీ భారీ తేడాతో సీఎస్‌కేను ఓడించాలి.

ఉదాహరణకు - ఆర్సీబీ మొదట బ్యాటింగ్ చేసి 200 పరుగులు చేస్తే, అది తప్పనిసరిగా 18 పరుగుల కంటే ఎక్కువ తేడాతో గెలవాలి. లేదా సీఎస్‌కే ముందుగా బ్యాటింగ్ చేసి 200 పరుగులు చేస్తే, కనీసం 10 కంటే ఎక్కువ బంతులు మిగిలి ఉండేలా విజయం సాధించాలి. అప్పుడు ఆర్సీబీకి 4వ స్థానం దక్కే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)