ఐపీఎల్ 2024: దూకుడు మీదున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఎలా చెక్ పెట్టింది?

ఐపీఎల్ 2024, రజిత్ పాటిదార్, కోహ్లీ ఫోటో

ఫొటో సోర్స్, YEARS

ఫొటో క్యాప్షన్, కోహ్లీ, రజిత్ పాటిదార్ ఆర్సీబీ గెలుపులో కీలక పాత్ర పోషించారు
    • రచయిత, సంజయ్ కిషోర్
    • హోదా, స్పోర్ట్స్ జర్నలిస్ట్, బీబీసీ కోసం

నెలరోజుల ఎదురుచూపులకు తెరదించుతూ ఐపీఎల్ 2024లో ఎట్టకేలకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రెండో విజయాన్ని నమోదు చేసింది.

డుప్లెసిస్ సారధ్యంలో ఆర్సీబీ మార్చి 25న తొలి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. మళ్ళీ నెలరోజుల తరువాత గురువారం రాత్రి సూపర్ ఫామ్‌లో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 35 పరుగుల తేడాతో ఓడించింది.

గెలుపు తరువాత డుప్లెసిస్ మాట్లాడుతూ ‘‘గత రెండు మ్యాచులలో మేం గట్టిగానే పోరాడాం. విజయానికి దగ్గరగానూ వచ్చాం. కానీ ఆత్మవిశ్వాసం రావాలంటే మ్యాచ్‌లు గెలవాల్సిందే. ఈరోజు రాత్రి హాయిగా నిద్రపోవచ్చు. మన ఆట తీరే మనకు విశ్వాసాన్ని అందిస్తుంది’’ అని చెప్పారు.

ఆర్సీబీ గెలుపులో విరాట్ కొహ్లీ, రజిత్ పాటీదార్ కీలకపాత్ర పోషించారు.

వరుసగా నాలుగు మ్యాచ్‌ల గెలుపు తరువాత సన్ రైజర్స్ హైదరాబాద్‌కు ఇది తొలి ఓటమి. మరోపక్క ఆర్సీబీకి ఆరు వరుస ఓటముల తరువాత దక్కిన తొలి గెలుపు ఇది.

హైదరాబాద్‌లోని ఉప్పల్‌‌లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు హమ్‌గ్రౌండ్. ఈ స్టేడియంలో గురువారం ఆ జట్టుతో తలపడిన ఆర్సీబీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

విరాట్ కొహ్లీ, డుప్లెసిస్ చక్కని ఆరంభాన్ని ఇచ్చారు. ఇద్దరూ తొలివికెట్‌కు 48 పరుగులను జోడించారు.

విరాట్ కొహ్లీ

ఫొటో సోర్స్, YEARS

ఫొటో క్యాప్షన్, విరాట్ కోహ్లీ ఈ సీజన్‌లో ఇప్పటికే 400 పరుగులు దాటేశాడు

కొహ్లీ, పాటిదార్ హాఫ్ సెంచరీలు

సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్ తన తొలి ఓవర్‌లోనే 19 పరుగులు సమర్పించుకున్నాడు. అయితే నాలుగో ఓవర్లలో టి. నటరాజన్ సన్‌రైజర్స్‌కు బ్రేక్ ఇచ్చాడు. మిడ్ ఆఫ్‌లో డుప్లెసిస్ ఇచ్చిన క్యాచ్‌ను మక్రం తేలికగానే పట్టేయడంతో 25 పరుగుల స్కోరుమీద డుప్లెసిస్ వెనుదిరిగారు.

తరువాత వచ్చిన విల్ జాక్స్ ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. కేవలం 6 పరుగలకే ఔటయ్యాడు. తరువాత రజిత్ పాటిదార్ రావడంతో ఒక్కసారిగా మ్యాచ్ స్వరూపం మారిపోయింది.

రజిత్ పాటిదార్, విరాట్ కొహ్లీ కలిసి కేవలం 34 బంతులలోనే 65 పరుగులు జోడించారు. 11వ ఓవర్లలో నాలుగు సిక్సర్ల సాయంతో రజిత్ పాటిదార్ 27పరుగులు చేశారు. అలాగే 19 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు.

మరోపక్క కోహ్లీ 37 బంతుల్లో అర్థశతకం సాధించాడు. అయితే 51 పరుగులపైన కొహ్లీ అవుటయ్యాడు.

జయదేవ్ ఉనద్కత్ వేసిన ఓ స్లో డెలివరీకి కోహ్లీ బ్యాక్‌వర్డ్ స్క్వేర్ లెగ్ బౌండ్రీ వద్ద అబ్దుల్ సమాద్ చేతికి చిక్కడంతో ఆయన ఇన్నింగ్స్ ముగిసింది.

ఐపీఎల్2024, కోహ్లీ, డుప్లెసిస్ ఫోటో

ఫొటో సోర్స్, YEARS

ఫొటో క్యాప్షన్, మ్యాచ్‌లు గెలిస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుందని డుప్లెసిస్ చెప్పారు

నెమ్మదిగా విరాట్ ఇన్నింగ్స్

మొత్తం 43 బంతుల్లో విరాట్ కొహ్లీ 51 పరుగులు చేశాడు. రజిత్ పాటిదార్‌తో కలిసి జోడించిన 65 పరుగుల భాగస్వామ్యంలో కోహ్లీ ఎక్కువగా సింగిల్స్, డబుల్స్‌కే పరిమితమయ్యాడు.

పాటిదార్‌కు ఎక్కువగా స్ట్రైకింగ్ ఇవ్వడానికే కోహ్లీ ప్రాధాన్యమిచ్చాడు. ఈ క్రమంలో ఐపీఎల్‌లో ఈ సీజన్‌లో 400 పరుగుల మార్కును అందుకున్న తొలిబ్యాటర్‌గా నిలిచాడు.

కామెరున్ గ్రీన్, దినేష్ కార్తిక్, ఇంపాక్ట్ ప్లేయర్ స్వప్నీసింగ్ కొన్ని చక్కని షాట్లు ఆడి తమ జట్టును 206 పరుగుల స్కోరు వద్దకు తీసుకువెళ్ళారు. మొత్తం 7 వికెట్ల నష్టానికి రెండు వందలు దాటిన స్కోరులో కామెరున్ గ్రీన్ 20 బంతుల్లో 37 పరుగులు చేశాడు.

సన్‌రైజర్స్ జట్టులో జయదేవ్ ఉనద్కత్ 30 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసుకోగా, టి.నటరాజన్ 39 పరుగులకు రెండు వికెట్లు, మయాంక్ మార్కండే 42 పరుగులకు ఒక వికెట్ తీశారు.

ఐపీఎల్ 2024 ఉనద్కత్ ఫొటో

ఫొటో సోర్స్, YEARS

ఫొటో క్యాప్షన్, జయదేవ్ ఉనద్కత్

తడబడిన హైదరాబాద్

గత మ్యాచ్‌లలో దుమ్ము దులిపేసి 300 పరుగులు కూడా చేయగలదనే పేరు తెచ్చుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ మ్యాచ్‌లో మాత్రం తడబడింది. ఇన్నింగ్స్‌ మొదట్లోనే ఆ జట్టు తడబడి పవర్ ప్లేలో 4 వికెట్లు పోగొట్టుకుంది.

సన్‌రైజర్స్‌కు తొలిఓవర్లోనే ఎదురుదెబ్బ తగిలింది. జాక్ వేసిన మొదటి ఓవర్ చివరి బంతికి ట్రావిస్ హెడ్ వెనుదిరిగాడు. అతని స్థానంలో వచ్చిన అభిషేక్ శర్మ 13 బంతుల్లో 31 పరుగులు చేసి యశ్ దయాళ్ చేతిలో ఔటయ్యాడు. తరువాత మార్‌క్రమ్, క్లాసెన్ ఇద్దరూ చెరో ఏడు పరుగులు చేసి ఔటయ్యారు. ఇంపాక్ట్ ప్లేయర్ స్వప్నీ సింగ్ ఖాతాలోనే ఈ రెండు వికెట్లు చేరాయి.

నితీష్ రెడ్డి కరణ్ శర్మ బౌలింగ్‌లో 13 పరుగులకే ఔటయ్యాడు. తరువాత కరణ్ శర్మ 10 పరుగులు చేసిన అబ్దుల్ సమద్‌ను కాట్ అండ్ బౌల్డ్‌ చేశాడు.

పాట్ కమిన్స్ 15 బంతుల్లో 31 పరుగులు చేసి కామెరున్ గ్రీన్ చేతికి చిక్కాడు. సన్‌రైజర్స్‌లో షాబాజ్ అహ్మద్ ఒక్కడే 40 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

మొత్తం మీద ఆ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 171 పరుగులకే పరిమితమై 35 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

ఈ సీజన్‌లో మూడుసార్లు 250కుపైగా పరుగులుచేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ మ్యాచ్‌లో మాత్రం ఆర్సీబీ విధించిన 206 పరుగుల లక్ష్యాన్ని చేధించలేకపోయింది.

మరోపక్క బెంగళూరు తన 250వ ఐపీఎల్ మ్యాచ్‌ను ఓ చక్కని జ్ఞాపకంగా మార్చుకుంది.

ఆర్సీబీలో స్వప్నీ సింగ్ , కరణ్ శర్మ, కామెరూన్ గ్రీన్ తలో రెండు వికెట్లు తీయగా, విల్ జాక్స్, యశ్ దయాళ్ చెరో వికెట్ తీశారు.

9 మ్యాచ్‌లలో ఆర్సీబీకి ఇది రెండో గెలుపు కాగా, హైదరాబాద్‌కు 8 మ్యాచ్‌లలో ఇది మూడో ఓటమి.

అయితే ఈ గెలుపుతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో పైకేమీ ఎగబాకలేదు. కానీ ఈ గెలుపు వారిలో కచ్చితంగా ఆత్మవిశ్వాసాన్ని నింపి, మరికొన్ని మ్యాచ్‌లు గెలిచేందుకు బాటలు వేయవచ్చు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)