గాజాలో బయటపడ్డ సామూహిక సమాధులు, వందల శవాలు ఎవరివి?

నాజర్ ఆసుపత్రి

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, నాజర్ ఆసుపత్రి ప్రాంతంలో సామూహిక సమాధి గుర్తించామని పాలస్తీనా అధికారులు తెలిపారు.
    • రచయిత, డేవిడ్ గ్రిటెన్
    • హోదా, బీబీసీ న్యూస్

గాజాలోని నాజర్, అల్-షిఫా ఆసుపత్రుల పరిసరాల్లో బయటపడిన సామూహిక సమాధుల రిపోర్టులు చూస్తే భయం వేసిందని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంస్థ చీఫ్ వోల్కర్ టర్క్ అన్నారు. ఆ మరణాలపై స్వతంత్ర దర్యాప్తునకు వోల్కర్ టర్క్ డిమాండ్ చేశారు.

నాజర్ ఆస్పత్రి దగ్గర దాదాపు 300 మృతదేహాలను వెలికితీసినట్లు పాలస్తీనా అధికారులు తెలిపారు. అయితే, వారు ఎలా మరణించారు? ఎప్పుడు పూడ్చిపెట్టారు? అనే దానిపై స్పష్టత లేదు.

మరోవైపు అక్కడ మృతదేహాలను పూడ్చిపెట్టినట్లుగా వస్తున్న వాదనలు నిరాధారమైనవని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.

ఫిబ్రవరిలో ఖాన్ యూనిస్ ప్రాంతంలోని ఓ ఆసుపత్రిలో 'రెండు వారాల ఆపరేషన్' జరిగిందని, ఆ సమయంలో పాలస్తీనియన్లు ఖననం చేసిన మృతదేహాలను పరీక్షించినట్లు ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది.

ఆ ప్రాంతంలో ఇజ్రాయెలీ బందీలున్నట్లు ఇంటెలిజెన్స్ సమాచారం ఉందని తెలిపింది.

గాజాపై ఇజ్రాయెల్ దాడి

ఫొటో సోర్స్, Reuters

ఆసుపత్రి పరిసరాల్లోనే ఎందుకు ఖననం చేశారు?

అక్టోబర్ 7న హమాస్ ఫైటర్లు దక్షిణ ఇజ్రాయెల్‌లోకి చొరబడి దాడి చేశారు. ఈ ఘటనలో 1,200 మంది వరకు పౌరులు చనిపోయారు. 253 మందిని బందీలుగా చేసుకొని గాజాకు తీసుకెళ్లడంతో, ఇజ్రాయెల్ నుంచి దాడులు ప్రారంభమయ్యాయి.

గాజా నుంచి ఇటీవల విడుదలైన పది మంది ఇజ్రాయెలీ బందీలు చాలాకాలం పాటు నాజర్ ఆసుపత్రిలోని బందీఖానాలో ఉన్నామని చెప్పారు.

ఇజ్రాయెల్ ఆపరేషన్‌కు ముందు శ్మశాన వాటికల వైపు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో నాజర్ ఆసుపత్రి ప్రాంగణంలోనే మృతదేహాలను ఖననం చేయాల్సి వస్తున్నదని అక్కడి సిబ్బంది చెప్పారు.

నవంబర్‌లో ఆసుపత్రిపై ఇజ్రాయెల్ మొదటి దాడి జరగడానికి ముందు అల్-షిఫా నుంచి ఇలాంటి రిపోర్టులు వచ్చాయి.

యుద్ధం సమయంలో గాజాలోని అనేక ఆసుపత్రుల్లో హమాస్ ఫైటర్లు ఉన్నందున తమ సైన్యం దాడి చేసినట్లు ఇజ్రాయెల్ చెప్పింది. అయితే, ఈ ఆరోపణలను హమాస్, అక్కడి వైద్య బృందాలు ఖండించాయి.

విచారణ జరగాల్సిందే: ఐక్యరాజ్య సమితి

ఇజ్రాయెల్ దాడిలో గాజాలో 34 వేల మందికి పైగా చనిపోయారని, అందులో అత్యధికులు పిల్లలు, మహిళలేనని హమాస్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆరోగ్య శాఖ తెలిపింది.

నాజర్ ఆసుపత్రి ప్రాంతంలో 283 మృతదేహాలు లభ్యమయ్యాయని, అందులో 42 మృతదేహాల వివరాలు గుర్తించామని పాలస్తీనా అధికారుల నుంచి వచ్చిన రిపోర్టులను ధృవీకరించే పనిలో ఉన్నామని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయం ప్రతినిధి రవినా శ్యాందాసాని తెలిపారు.

"మృతదేహాలను భూమిలో లోతుగా పాతిపెట్టారని, వాటిని వ్యర్థాలతో కప్పేశారని రిపోర్టు వచ్చింది." అని జెనీవాలో విలేఖరులతో అన్నారు రవినా.

"మరణించిన వారిలో వృద్ధులు, మహిళలు, గాయపడినవారు ఉన్నారు, కొందరి చేతులు కట్టేశారు, బట్టలు విప్పినట్లు కనిపిస్తోంది" అని రవినా తెలిపారు.

మరణాలపై స్వతంత్ర, ప్రభావవంతమైన, పారదర్శక పరిశోధన జరగాలని వోల్కర్ టర్క్ సూచించారు. ఈ బృందంలో అంతర్జాతీయ పరిశోధకులూ ఉండాలని డిమాండ్ చేశారు.

అక్టోబర్ 7న హమాస్‌కు చెందిన సాయుధులు ఇజ్రాయెల్‌లోకి చొరబడ్డారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అక్టోబర్ 7న హమాస్‌కు చెందిన సాయుధులు ఇజ్రాయెల్‌లోకి చొరబడి దాడులు చేశారు.

ఆసుపత్రులకు ప్రత్యేక రక్షణ ఉన్నా..

అంతర్జాతీయ మానవతా చట్టం ప్రకారం ఆసుపత్రులకు ప్రత్యేక రక్షణ ఉంటుంది. పౌరులు, ఖైదీలు, ఇతరులను ఉద్దేశపూర్వకంగా చంపడం యుద్ధ నేరం.

యుద్ధ సమయంలో హత్య చేసి, పాతిపెట్టిన మృతదేహాలను పెద్దసంఖ్యలో కనుగొన్నామని పాలస్తీనియన్ల నుంచి రిపోర్టులు అందాయని హమాస్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న సివిల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రతినిధి మహమూద్ బసల్ బీబీసీ అరబిక్ గాజా టుడేతో తెలిపారు. ఇజ్రాయెల్ దాడి సమయంలో ఆసుపత్రి ప్రాంగణంలోని స్మశానవాటికను మరొక ప్రదేశానికి మార్చారని చెప్పారు.

''అక్కడి ప్రాంతాన్ని నిశితంగా పరిశీలించిన తర్వాత ఇజ్రాయెల్ సైన్యం ఒక సామూహిక సమాధి ఏర్పాటు చేసింది, నాజర్ ఆసుపత్రిలోని మృతదేహాలను ఆ సమాధిలో పాతి పెట్టిందని మేం తెలిసింది.'' అని మహమూద్ బసల్ ఆరోపించారు.

ఇద్దరి బంధువుల మృతదేహాలను ఖాన్ యూనిస్‌ నుంచి ఇజ్రాయెల్ దళాలు తీసుకెళ్లాయని, ఆ మృతదేహాల కోసం వెతుకుతున్నానని గాజా టుడేతో మరో వ్యక్తి తెలిపారు.

"నేను వారి మృతదేహాలను ఒక అపార్ట్‌మెంట్‌లో పాతిపెట్టిన తర్వాత ఇజ్రాయెల్ దళాలు వచ్చి, వారి మృతదేహాలను తీసుకెళ్లాయి" అని ఆయన అంటున్నారు.

"ప్రతిరోజు మేము వారి శరీరాల కోసం వెతుకుతున్నాం, కానీ దొరకడం లేదు" అని అన్నారు.

మృతదేహాలను పరిశీలించాం: ఇజ్రాయెల్

"పాలస్తీనా మృతదేహాలను ఐడీఎఫ్ ఖననం చేసిందనే వాదన నిరాధారమైనది" అని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.

"నాజర్ హాస్పిటల్ ప్రాంతంలో ఐడీఎఫ్ ఆపరేషన్ సమయంలో బందీలను, తప్పిపోయిన వ్యక్తులను గుర్తించడానికి అక్కడ పాలస్తీనియన్లు పాతిపెట్టిన శవాలను పరిశీలించారు'' అని తెలిపింది.

"బందీలున్నారని ఇంటెలిజెన్స్ సూచించిన ప్రదేశాలలో ఆ పరీక్షలు చేశాం. మరణించిన వారి గౌరవాన్ని కాపాడుతూ అది జరిగింది. మృతదేహాలను పరీక్షించిన అనంతరం, ఇజ్రాయెల్ బందీలకు చెందని వాటిని తిరిగి అప్పగించాం" అని ఐడీఎఫ్ తెలిపింది.

దాడి సమయంలో ఆసుపత్రిలో ఉన్న దాదాపు 200 మంది ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నామని ఐడీఎఫ్ తెలిపింది.

ఇజ్రాయెల్ బందీల కోసం దాచిన మందుగుండు సామగ్రితో పాటు ఉపయోగించని మెడిసిన్లను స్వాధీనం చేసుకున్నామని చెప్పింది.

ఈ ఆపరేషన్ ఆసుపత్రికి, రోగులకు, వైద్య సిబ్బందికి హాని కలిగించకుండా జరిగిందని ఐడీఎఫ్ తెలిపింది.

గాజాలో ఇజ్రాయెల్ దాడులు

ఫొటో సోర్స్, EPA

అంతర్జాతీయ సంస్థలు ఏమంటున్నాయి?

అయితే, తమను అవమానించారని, కొట్టారని, చల్లటి నీళ్లను మీద పోశారని గత నెలలో ముగ్గురు వైద్య సిబ్బంది బీబీసీతో తెలిపారు. దాడి సమయంలో నిర్బంధించి గంటల తరబడి మోకాళ్లపై నిలబెట్టారన్నారు.

నాజర్ ఆసుపత్రిని ఐడీఎఫ్ అదుపులోకి తీసుకోవడంతో రోగులను చూసుకోలేకపోయామని, నీరు, విద్యుత్, ఇతర సామగ్రి లేకపోవడంతో 13 మంది మరణించారని వైద్యులు చెప్పారు.

ఏప్రిల్ 1న గాజా నగరంలోని అల్-షిఫా ఆసుపత్రి నుంచి ఇజ్రాయెల్ దళాలు ఉపసంహరించుకున్నాయి, రెండు వారాల పాటు సాగిన దాడిలో ఆసుపత్రి చుట్టుపక్కల 200 మంది ఉగ్రవాదులను చంపేశామని ఐడీఎఫ్ తెలిపింది. మరో 500 మందికి పైగా అదుపులోకి తీసుకున్నామని, ఆసుపత్రిలో ఇంటెలిజెన్స్ ఆయుధాలూ కనుగొందని చెప్పింది.

ఐదు రోజుల తర్వాత అల్ షిఫా ధ్వంసమైందని, అక్కడి చాలా భవనాలు దెబ్బతిన్నాయని, అత్యధిక సంఖ్యలో పరికరాలు ఉపయోగించలేకుండా నాశనమయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

''అత్యవసర విభాగం, అడ్మినిస్ట్రేటివ్, సర్జికల్ భవనాల వెలుపల సమాధులు తవ్వారు, చాలా మృతదేహాలను వాటి అవయవాలు కనిపించేలా పాక్షికంగా ఖననం చేశారు'' అని కూడా పేర్కొంది.

ఇజ్రాయెల్ ఆసుపత్రిని ముట్టడించిన సమయంలో రోగులను అధ్వాన్నమైన పరిస్థితులలో ఉంచారని, సంరక్షణ లేకపోవడం, వైద్యులపై ఆంక్షలతో దాదాపు 20 మంది రోగులు మరణించినట్లు హాస్పిటల్ యాక్టింగ్ డైరెక్టర్‌ను ఉదహరిస్తూ డబ్ల్యూహెచ్‌వో తెలిపింది.

రెండు సమాధుల్లో మొత్తం 30 మృతదేహాలను పూడ్చిపెట్టారని, వాటిలో 12 మృతదేహాల ఆనవాళ్లు గుర్తించామనే రిపోర్టులను ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయం పరిశీలించిందని రవినా శ్యాందాసాని తెలిపారు.

అల్-షిఫా పరిసరాల నుంచి 381 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని, అయితే ఆసుపత్రి మైదానంలో ఖననం చేసిన మృతదేహాల సంఖ్యను అందులో చేర్చలేదని గాజా సివిల్ డిఫెన్స్ ప్రతినిధి ఏప్రిల్ 9న సీఎన్ఎన్ వార్తాసంస్థతో చెప్పారు.

గత కొన్నిరోజులుగా రఫాపై జరుగుతున్న ఇజ్రాయెల్ దాడులు, యుద్ధాన్ని మించిపోయిందని, ఎక్కువగా పిల్లలు, మహిళలను చంపారని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల చీఫ్ అన్నారు.

యుద్ధ బాధితుల్లోని 15 లక్షల మంది పౌరులు ఆశ్రయం పొందుతున్న రఫాపై ఇజ్రాయెల్ భూ దాడిపై టర్క్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది అంతర్జాతీయ మానవతా చట్టం, మానవ హక్కుల చట్టాన్ని ఉల్లంఘించడమేని తెలిపారు.

దీనిపై స్పందించిన ఐడీఎఫ్.. అక్కడి హమాస్ సైనిక, పరిపాలనా స్థావరాలను నాశనం చేస్తున్నట్లు తెలిపింది. ఐడీఎఫ్ అంతర్జాతీయ చట్టాలను అనుసరిస్తుందని, పౌరులకు హాని జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటుందని తెలిపింది.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)