క్యాన్సర్ రోగులు ఇంట్లోనే పరీక్షలు చేసుకునేందుకు సరికొత్త పరికరం, ఇదెలా పనిచేస్తుందంటే..

- రచయిత, షియోనా మెకల్లమ్
- హోదా, బీబీసీ టెక్నాలజీ రిపోర్టర్
క్యాన్సర్ రోగులు ఆసుపత్రిలో గడిపే సమయాన్ని తగ్గించడంలో సహాయపడే కొత్త పరికరానికి బ్రిటన్‌లో చట్టపరమైన ఆమోదం లభించింది.
వైద్యుల పర్యవేక్షణ లేకుండానే ఈ పరికరంతో క్యాన్సర్ రోగులు తమ ఇంట్లోనే రక్త పరీక్షలు చేసుకోవచ్చు. ఆ పరీక్షల ఫతాలను ఈ మెషీన్ రోగి ఎంచుకున్న ఆస్పత్రికి ఆన్‌లైన్‌లో పంపిస్తుంది.
రోగులు తరచూ ఆసుపత్రులకు వెళ్లాల్సిన ఆవశ్యకతను తగ్గిస్తుందని వైద్యులు అంటున్నారు.
మాంచెస్టర్‌లోని క్రిస్టీలో ఈ పరికరంతో ట్రయల్స్ నిర్వహించారు. ఇప్పుడు నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్‌హెచ్ఎస్)కు చెందిన 12 కేంద్రాల్లో దీనిని అందుబాటులోకి తీసుకొస్తున్నారు.
అయితే, ఇప్పటివరకు కొద్ది మందితో మాత్రమే ఈ పరికరం ట్రయల్స్ జరిగాయని యూకే క్యాన్సర్ రీసెర్చ్ అంటోంది.
దీనిని మరింత విస్తృతంగా ఉపయోగించవచ్చో లేదో తెలుసుకునేందుకు ఈ పరికరం పనితీరును మరింత నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని ఈ స్వచ్ఛంద సంస్థ అభిప్రాయపడింది.

'ఇది చాలా గొప్ప విషయం'
క్యాన్సర్‌కు చికిత్స విధానంలో చాలాసార్లు రక్త పరీక్షలు చేస్తారు. ఎందుకంటే వైద్య సిబ్బంది హిమోగ్లోబిన్ స్థాయిలు, మొత్తం తెల్ల రక్త కణాల సంఖ్య వంటి చాలా ఆరోగ్య సూచికలను పర్యవేక్షించాలి.
లిన్ థాంప్సన్ అనే మహిళ, 2017 నుంచి అండాశయ, పేగు క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఆమె ఈ పరికరం కోసం ఎంపిక చేసిన ట్రయల్ పేషెంట్లలో ఒకరు.
ఆ పరీక్షలలో కొన్నింటిని ఇంట్లో చేయడం గొప్ప ఉపశమనమని లిన్ థాంప్సన్ అంటున్నారు.
"నిజాయితీగా చెప్పాలంటే నేను ఆ మెషీన్‌తో ప్రేమలో పడ్డాను. దానిని ఉపయోగించడం చాలా సులభం" అని 52 ఏళ్ల లిన్ థాంప్సన్ చెప్పారు.
ఆసుపత్రికి షెడ్యూల్ ప్రకారం వెళ్లే బాధ తప్పిందని ఆమె అంటున్నారు. సిరంజీల పట్ల తనకున్న భయం కారణంగా శారీరకంగా, మానసికంగా చాలా అలసిపోయానని లిన్ థాంప్సన్ చెప్పారు.
"ఇంతకుముందు రక్త నమూనాలు ఇవ్వాలంటే భయమేస్తుండేది. కానీ, ఈ పరికరం చాలా బాగుంది. దీనికి రక్తం ఇవ్వడం వేలిముద్ర వేసినట్టుగానే ఉంటుంది. కొంచెం రక్తం తీసుకొని దాచేస్తుంది. ఎలాంటి ఆందోళనా లేదు" అని లిన్ థాంప్సన్ వివరించారు.
'ఫలితాన్ని ఆసుపత్రికే పంపిస్తుంది'
చిన్న ప్రింటర్ పరిమాణంలో ఉండే ఈ పరికరం నేరుగా ఆసుపత్రికి రక్త నమూనా విశ్లేషణను అందిస్తుంది.
రోగుల రక్త పరీక్ష ప్రక్రియను ఆసుపత్రి నుంచి ఇంటికి మార్చడం, వారికి మరింత సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్‌హెచ్ఎస్)కు పొదుపుగా కూడా ఉంటుందని మాంచెస్టర్ విశ్వవిద్యాలయంలో మెడికల్ ఆంకాలజీలో సీనియర్ లెక్చరర్ సచా హోవెల్ అభిప్రాయపడ్డారు.
యూరప్‌లోని అతిపెద్ద క్యాన్సర్ చికిత్సా కేంద్రాల్లో ది క్రిస్టీ ఒకటి. ఇంటి దగ్గరికే రక్తమనే ఉద్దేశంతో ఆయా ప్రాంతాల్లో ఫ్లేబోటోమీ యూనిట్‌లను ది క్రిస్టీ ఏర్పాటు చేసింది.
"అయితే పేషెంట్లకు రక్త పరీక్షలు చేయగలిగేలా, ఆ యూనిట్లలో సిబ్బంది ఉండాలి" అని డాక్టర్ హోవెల్ అంటున్నారు.
రోగులు ఇంట్లోనే పరీక్షలు చేయించుకోగలిగితే, అది మంచి పరిణామమని హోవెల్ అభిప్రాయపడ్డారు.
జాగ్రత్త అవసరం: క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్
రోగుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ, క్రిస్టీలో నిర్వహించిన ట్రయల్స్ మంచి ఫలితాలను ఇచ్చాయి.
లిన్ వంటి 22 మంది రోగులు ఇంటి వద్ద చేసిన ట్రయల్‌లో పాల్గొంటున్నారు. రెగ్యులేటరీ ఆమోదం కోసం మరో 470 మంది రోగులను ప్రత్యేకంగా సిద్ధం చేస్తున్నారు.
ఇంత తక్కువ మందిపైనే ట్రయల్స్ జరుగుతున్నాయి కాబట్టి, జాగ్రత్త అవసరమని క్యాన్సర్ రీసెర్చ్ సూచిస్తోంది.
ఈ సాంకేతికతకు ఇది ప్రారంభం మాత్రమేనని, మరింత పరిశోధన అవసరమని ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.
రెగ్యులేటరీ ఆమోదం ఇచ్చినప్పటికీ, ఆ పరికరం ప్రభావవంతంగా లేదా వైద్యపరంగా ఉపయోగకరమని నిరూపితమైనట్లు సూచించదని తెలిపింది.
పరికరం మరింత విస్తృతంగా ఉపయోగించడానికి ముందు, ఎదురయ్యే సమస్యలు పరిష్కరించడానికి మరిన్ని క్లినికల్ ట్రయల్స్ అవసరమని క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ తెలిపింది.
ఈ పరికరాన్ని ఎన్టియా అనే కంపెనీ తయారుచేసింది. దీని పట్ల ఆ కంపెనీ బాస్ డా. టోబీ బేసే ఫిషర్ ఆశాజనకంగా ఉన్నారు.
'ఇది రోగులు ఇంట్లో ఉపయోగించగల ప్రపంచంలోనే మొదటి బ్లడ్ కౌంట్ ఎనలైజర్' అని టోబీ పేర్కొన్నారు.
ఈ పరికరం ద్వారా రోగి ఆరోగ్య పరిస్థితిని తెలియజేయడం ద్వారా, ఆరోగ్య సంరక్షణ నిపుణులకు ముందుగానే పేషెంట్ సమస్యను అంచనా వేసి, పరిష్కరించేందుకు వీలు కల్పిస్తుందని అన్నారు.
ఇది ఆసుపత్రుల అవసరాన్ని, చికిత్సలో అంతరాన్ని తగ్గించగలదని టోబీ అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
- Northern Lights: ఆకాశంలో ఈ రంగుల తుపాను మీకెప్పుడైనా కనిపించిందా?
- స్కార్పియన్: మానవ అక్రమ రవాణాలో ఆరితేరిన ఈ యూరప్ మోస్ట్‌వాంటెడ్ క్రిమినల్ బీబీసీ జర్నలిస్టుకు ఎలా దొరికాడంటే....
- ఈ ఊరిలో ఫోన్లు, టీవీలు లేవు, ఇంటర్నెట్ లేదు, అసలు కరెంటే లేదు... మరి ప్రజలు ఎలా జీవిస్తున్నారు?
- పాకిస్తాన్ ఆర్థికసంక్షోభం: ఈసారి చైనా, సౌదీ అరేబియా కూడా కాపాడలేవా
- జేపీ నడ్డా మీద నరేంద్ర మోదీ, అమిత్ షాలకు ఎందుకంత నమ్మకం?
- జల్లికట్టు, కోడి పందేలు తరహాలో కుక్కల కొట్లాటలు... జంతువులతో ఇలా ఎన్ని రకాల పోటీలు జరుగుతున్నాయో మీకు తెలుసా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














