‘వాంపైర్ ఫేషియల్’ వల్ల ముగ్గురు మహిళలకు హెచ్ఐవీ.. అసలేంటి ఈ ఫేషియల్?

వాంపైర్ ఫేసియల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అమెరికాలో కాస్మోటిక్ చికిత్స ద్వారా హెచ్‌ఐవీ వ్యాధి సోకిన తొలి కేసులు నమోదు
    • రచయిత, నదైన్ యూసిఫ్
    • హోదా, బీబీసీ న్యూస్

‘వాంపైర్ ఫేషియల్’ చేయించుకున్న తర్వాత ముగ్గురు మహిళలకు హెచ్ఐవీ సోకిందని ఇటీవల ఒక రిపోర్టు వెలువడటంతో, కొన్ని కాస్మోటిక్ ప్రొసీజర్ల (సౌందర్యం కోసం చేయించుకునే చికిత్సలు) భద్రతపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

2018లో న్యూ మెక్సికోలోని ఒక స్పాలో ‘వాంపైర్ ఫేషియల్’ చేయించుకున్న ముగ్గురు మహిళలకు హెచ్ఐవీ సోకినట్లు సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) రిపోర్టు తెలిపింది.

సీడీసీ రిపోర్టు విడుదలైన తర్వాత ఈ వైరస్ సోకుతున్న సరికొత్త మార్గాలు వెలుగులోకి వచ్చాయి.

అమెరికాలో కాస్మోటిక్ చికిత్స ద్వారా హెచ్ఐవీ సోకడం ఇదే తొలిసారని సీడీసీ భావిస్తోంది.

అయితే, అసలు ఈ ‘‘వాంపైర్ ఫేషియల్’’ ఏమిటి? ఈ ఫేషియల్ చేయించుకున్న తర్వాత మహిళలకు హెచ్ఐవీ ఎలా సోకింది? కాస్మోటిక్ చికిత్స తీసుకుంటున్నప్పుడు వ్యాధులు సోకుండా తమకు తాము ఎలా సంరక్షించుకోవాలి? అనే విషయాలపై నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం..

కిమ్ కర్దాషియన్

ఫొటో సోర్స్, Instagram/Kim Kardashian

ఫొటో క్యాప్షన్, 2013లో వాంపైర్ ఫేసియల్ చేయించుకున్న తర్వాత ఫోటో పోస్టు చేసిన కిమ్ కర్దాషియన్

వాంపైర్ ఫేషియల్ అంటే ఏమిటి?

ప్లేట్‌లెట్ రిచ్ ప్లాస్మా(పీఆర్‌పీ) ఫేషియల్స్‌కు వ్యావహారిక పదమే వాంపైర్ ఫేషియల్.

ఈ ఫేషియల్‌లో తొలుత రోగి నుంచి రక్తాన్ని తీస్తారు. సెంట్రిఫ్యూజ్‌ను వాడుతూ దాని నుంచి ప్లేట్‌లెట్ అధికంగా ఉండే ప్లాస్మాను వేరు చేస్తారు. చిన్న సూదితో గుచ్చుతూ ఆ ప్లాస్మాను తిరిగి ముఖంలోకి చొప్పిస్తారు.

కొత్తగా కొలాజెన్, ఎలాస్టిన్ ఉత్పత్తిని ఉత్తేజం చేయడం ద్వారా ముఖంపై ఉన్న లోపాలను సవరించి, సౌందర్యవంతంగా మార్చేందుకు ఈ చికిత్స సాయం చేస్తుంది. దీని ద్వారా ముడతలు, మొటిమల మచ్చలు తగ్గుతాయి.

రియాల్టీ టీవీ నటి కిమ్ కర్దాషియన్ కూడా గత కొన్నేళ్ల క్రితం ఈ చికిత్స చేయించుకున్నారు. ఈ చికిత్స చేయించుకున్న తర్వాత తన ముఖమంతా ఎర్రగా మారిపోయిన సెల్ఫీని 2013లో కిమ్ కర్దాషియన్ తన ఫాలోవర్స్‌తో పంచుకున్నారు.

ఆ తర్వాత కొన్నేళ్లకు, మళ్లీ తానెప్పుడూ ఈ చికిత్స తీసుకోనని కిమ్ కర్దాషియన్ చెప్పారు. ఇది చాలా క్లిష్టమైనదని, తనకు చాలా బాధాకరంగా అనిపించిందని తన వెబ్‌సైట్‌లో పోస్టు చేశారు.

లైసెన్స్ ఉన్న మెడికల్ స్పాలో ఈ చికిత్స ధర 1000 డాలర్ల నుంచి 2000 డాలర్ల మధ్యలో అంటే భారతీయ కరెన్సీలో రూ.83,455 నుంచి రూ.1,66,911 మధ్యలో ఉంటుందని అంచనాలున్నాయి.

వాంపైర్ ఫేసియల్

ఫొటో సోర్స్, Getty Images

న్యూమెక్సికో మహిళలకు హెచ్ఐవీ ఎలా సోకింది?

2018 వేసవి కాలంలో 40 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న ఒక అమెరికా మహిళకు విదేశాల్లో ఉన్నప్పుడు హెచ్‌ఐవీ పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని సీడీసీకి తెలిసింది.

ఔషధ ఇంజెక్షన్ తీసుకున్నట్లు కానీ లేదా రక్తం ఎక్కించుకున్న దాఖలాలు కానీ లేనట్లు ఆ మహిళ తెలిపారు. అంతేకాక, తన ప్రస్తుత భాగస్వామితో కాకుండా మరెవరితో లైంగిక సంబంధాలు లేవని చెప్పారు.

అయితే, న్యూమెక్సికోలో ఒక స్పాలో ఆ ఏడాది ప్రారంభంలో వాంపైర్ ఫేసియల్ చేయించుకున్నట్లు తెలిపారు.

బొటాక్స్ లాంటి ఇతర ఇంజెక్షన్ సేవలను అందిస్తున్న ఈ స్పా వద్దకు వెళ్లి సీడీసీ విచారణ చేపట్టినప్పుడు, అవన్నీ లైసెన్స్ లేకుండా జరుగుతున్నట్లు గుర్తించింది.

ఇలా పలురకాల అసురక్షితమైన వ్యాధుల సంక్రమణ నియంత్రణ విధానాలను ఇది అనుసరిస్తున్నట్లు తేలింది.

దీనిలో కిచెన్‌ ఫ్రిడ్జ్‌లో తినే పదార్థాలకు పక్కనే లేబుల్ లేని బ్లడ్ ట్యూబ్‌లు, ఇంజెక్షన్లు పెట్టినట్లు సీడీసీ గుర్తించింది. అంతేకాక, డ్రాయర్లలో, కౌంటర్లలో అలా పడేసిన సిరంజీలు కనిపించాయి.

కొన్ని రక్త సీసాలను తిరిగి వాడుతున్న సంకేతాలు కనిపించాయి.

హెచ్‌ఐవీ సోకిన వారిలో ఒక క్లయింట్‌కు స్పాకు రాకముందే హెచ్ఐవీ పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని సీడీసీ గుర్తించింది.

ఈ స్పాతో లింక్ అయి హెచ్ఐవీ నమోదైన ఐదు కేసులలో నలుగురు మహిళలు 2018లో మే నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో వాంపైర్ ఫేసియల్ ట్రీట్‌మెంట్ తీసుకున్నారని హెల్త్ ఏజెన్సీ చెప్పింది. ఈ మహిళలలో ఒకరితో ఒక వ్యక్తి లైంగికంగా సంబంధాన్ని కలిగి ఉన్నాడు.

ఆ మహిళకు, పురుషునికి హెచ్ఐవీ ఇన్‌ఫెక్షన్ చివరి దశలో ఉండటంతో, ఫేసియల్‌ చేయించుకోవడాని కంటే ముందే ఈ వ్యాధి బారిన పడినట్లు వారి సంబంధం తెలియజేస్తుందని సీడీసీ తెలిపింది.

ఈ స్పాను 2018లో మూసివేయించారు. దీని మాజీ యజమాని, 62 ఏళ్ల మారియా డి లౌర్డ్స్ రామోస్ డి రుయీజ్‌కు మూడేళ్లన్నర ఏళ్ల జైలు శిక్ష పడింది. లైసెన్స్ లేకుండా వైద్యాన్ని చేస్తున్నట్లు ఆమె 2022లో నేరాన్ని అంగీకరించారు.

వాంపైర్ ఫేసియల్

ఫొటో సోర్స్, Getty Images

వాంపైర్ ఫేసియల్స్ లాంటి కాస్మోటిక్ ప్రొసీజర్స్ సురక్షితమేనా?

కొన్ని స్పోర్ట్స్ గాయాలకు, మొటిమలు, తామర, ఇతర చర్మ సంబంధిత సమస్యలకు ఈ చికిత్స సమర్థమంతమైనవని వందలాది వైద్య పరిశోధన పేపర్లు, ప్రయోగాలు సూచించాయి.

ఈ చికిత్సను సరిగ్గా చేపడితే, ఇది సురక్షితమైనదేనని అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ అసోసియేషన్ పేర్కొంది.

‘‘ఈ చికిత్స మీకు కాస్త నొప్పిగా అనిపించవచ్చు. చేయించుకున్న తర్వాత ముఖం వాయవచ్చు’’ అని ఈ అసోసియేషన్ తెలిపింది. అయితే, ఇవన్నీ కొన్ని రోజుల వ్యవధి వరకే. ఆ తర్వాత మాయమవుతాయి.

ఈ చికిత్స అందించే సదుపాయం ద్వారా రక్తాన్ని ఎలా నిర్వహిస్తున్నారో దాన్ని బట్టి అతిపెద్ద ప్రమాదం ఉంటుంది.

మీ శరీరం నుంచి తీసిన రక్తాన్ని ఒక స్టెరైల్‌లో ఉంచడం అత్యవసరం.

లేదంటే, దీనిలో ఇన్‌ఫెక్షన్లు వృద్ధి చెందుతాయని అసోసియేషన్ తెలిపింది.

రక్తాన్ని తిరిగి ఎవరి నుంచైతే తీశారో వారికే ఎక్కించాల్సి ఉంటుంది. మరొకరికి కాదు. ఒకవేళ అలా చేస్తే, రక్తాన్ని తిరిగి పొందిన వ్యక్తి తీవ్ర అనారోగ్యానికి గురవుతాడు.

కాస్మోటిక్ ట్రీట్‌మెంట్ తీసుకోవాలనుకునే వారు, ఆ వైద్య కేంద్రానికి లైసెన్స్ ఉందో లేదో ముందు తనిఖీ చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. సూదులు లాంటి వైద్య పరికరాలను వారెలా నిర్వహిస్తున్నారో చూడాలి.

వాంపైర్ ఫేసియల్స్ కేవలం కాస్మోటిక్ ట్రీట్‌మెంట్‌గా కాక, తీవ్ర ప్రమాదాలకు కారణమవుతున్నట్లు ఇటీవల చర్చనీయాంశంగా నిలుస్తోంది.

నకిలీ బొటాక్స్‌తో అనుసంధానమై బొటులిజం వ్యాధి వచ్చిందని గత వారం అమెరికా వైద్య అధికారులు చెప్పారు. ఈ మహమ్మారి బారిన పడి 11 రాష్ట్రాల్లో 22 మంది అస్వస్థతకు గురయ్యారు. వారిలో కొందరు ఇప్పటికీ ఆస్పత్రుల్లోనే చికిత్స పొందుతున్నారు.

బొటులిజం వ్యాధి అనేది తీవ్రమైన అస్వస్థత. కళ్లు సరిగ్గా కనిపించకపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, సరిగ్గా మాట్లాడలేకపోవడం, అలసట వంటివి దీని లక్షణాలు.

ముఖంపై ముడతలు తగ్గించడానికి ప్రధానంగా బొటాక్స్ ఇంజెక్షన్ తీసుకుంటారు. చర్మం ముడతలు పడడానికి కారణమైన ధమనులను ఇది నాశనం చేస్తుంది. చర్మాన్ని యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. ఈ ట్రీట్‌మెంట్ కోసం వాడే ఇంజెక్షన్ల ధర సుమారు 530 డాలర్లుగా ఉంటుంది.

వాంపైర్ ఫేసియల్స్ మాదిరిగానే, బొటాక్స్ ఇంజెక్షన్లు తీసుకునే ముందు కూడా ఈ ట్రీట్‌మెంట్ అందించే ప్రొవైడర్‌పై పరిశోధన చేసిన తర్వాతనే, చికిత్స తీసుకోవాలని సీడీసీ సూచించింది. చికిత్సలో వాడే బొటాక్స్ ఎఫ్‌డీఏ అనుమతి పొందిందా, విశ్వసనీయమైన సంస్థల నుంచి దీన్ని కొనుగోలు చేశారో చూసుకోవాలి.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)