బొటాక్స్: ‘ముఖంపై ముడతలు తొలగించేందుకు వాడే ఈ ఇంజెక్షన్ ఒక దేశ జనాభానే చంపగలదు’

ప్రస్తుత కాలంలో వివిధ ఆరోగ్య సమస్యలకు, నొప్పులకు అనేక రకాల ఔషధాలు అందుబాటులో ఉన్నాయి.
అయితే, వీటిలో చాలా రకాల మందులను ప్రమాదకరమైన విషాల నుంచి తయరు చేస్తారన్న సంగతి మీకు తెలుసా?
అలాంటి విషాలు, వాటి నుంచి తయారయ్యే మందుల గురించి ‘మైఖేల్ మోస్లీ’ వివరిస్తున్నారు.
బొటాక్స్
కొన్ని రకాల ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి కలిగించేందుకు ముఖంపై ఇచ్చే ఈ ఇంజక్షన్ ఖరీదు వేలల్లో ఉంటుది. నిజానికి ఇది బోట్యులైనమ్ టాక్సిన్ అనే అత్యంత విషపూరితమైన పదార్థం.
కొన్ని చెమ్చాల బోట్యులైనమ్ టాక్సిన్ ఒక దేశ జనాభానే చంపగలదు.
కొన్ని కిలోల బొటాక్స్ ఈ భూమి మీద నివసిస్తున్న సమస్త జనాభానూ సర్వనాశనం చేయగలదు.

ఫొటో సోర్స్, Science Photo Library
అనేక వ్యాధులకు చికిత్స
బోట్యులైనమ్ టాక్సిన్ చాలా ప్రమాదకరమైనది. దీన్ని ఇప్పటికీ సైనిక నియంత్రణలోనే ఉత్పత్తి చేస్తారు.
100 ట్రిలియన్ పౌండ్లకు (రూ.9938 ట్రిలియన్) ఒక కిలో చొప్పున ఉత్పత్తి చేసే ఈ పదార్థం అత్యంత ఖరీదైనది కూడా.
అయినాసరే, దీనికున్న డిమాండ్ తక్కువేమీ కాదు. బోటాక్స్ ఇంజక్షన్ నుదుటిపై పొడిపించుకోవడానికి భారీగా డబ్బు ఖర్చు చేసేందుకు ఎంతోమంది సిద్ధంగా ఉంటారు.
'బోట్యులస్' అనే బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే విషపదార్థమే ఈ బోటాక్స్. ఈ బ్యాక్టీరియాను తొలిసారిగా 18వ శతాబ్దంలో పాడైపోయిన సాసేజ్‌ల మీద కనుగొన్నారు. లాటిన్‌లో సాసేజ్‌ను బోట్యులస్ అంటారు.
ఎల్‌డీ50 టాక్సిసిటీ స్కేలుపై బోటోక్స్ విలువ కేవలం 0.000001 మి.గ్రా/కేజీ. అంటే 70 కేజీలున్న మనిషిని చంపడానికి 0.00007మి.గ్రా బోటాక్స్ చాలు.
ఎల్‌డీ50 టాక్సిసిటీ స్కేలు అనేది పదార్థాలలో విషాన్ని కొలిచే స్కేలు. ఎంత మొత్తంలో ఒక పదార్థాన్ని ఇస్తే, అది తీసుకున్నవారిలో సగం మంది చనిపోతారో తెలిపే ఒక కొలప్రమాణం.
బోట్యులైనమ్ టాక్సిన్ మనిషి శ్వాసకోశ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీన్లో న్యూరోటాక్సిన్ ఉంటుంది. అంటే ఇది నరాల్లోకి ప్రవేశించి, కీలకమైన ప్రొటీన్లను నాశనం చేస్తుంది. నరాలకు, కండరాలకు మధ్య సంబంధాన్ని హరిస్తుంది. కొత్తగా నరాల చివర్లు పెరిగితే తప్ప మళ్లీ కండరాల పనితీరు బాగుపడదు. దీనికి కొన్ని నెలల సమయం పడుతుంది.
ముఖంపై ముడతలను తొలగించేందుకు..
ముఖంపై ముడతలు తగ్గించడానికి ప్రధానంగా బొటాక్స్ ఇంజక్షన్ తీసుకుంటారు. చర్మం ముడతలు పడడానికి కారణమైన ధమనులను ఇది నాశనం చేస్తుంది.
ఈ చికిత్సలో భాగంగా దీన్ని అతి తక్కువ మోతాదులో తీసుకుంటారు. ఒక గ్రాములో కొన్ని కోట్ల వంతు బొటాక్స్‌ను సలైన్‌లో కలిపి ఇంజక్షన్ రూపంలో ఎక్కిస్తారు.
ఒక సైన్సు ప్రయోగంగా నేను కూడా కొన్ని సంవత్సరాల క్రితం బొటాక్స్ తీసుకున్నాను.
నా ముఖంపై ముడతలు పోయాయిగానీ కొత్త ధమనుల చివర్లు పుట్టుకొచ్చేవరకూ నా ముఖంపై భావాలు విచిత్రంగా అనిపించేవి.
బొటాక్స్‌ను సౌందర్య సాధనంగానే కాక అనేక రకాల ఆరోగ్య సమస్యలకు చికిత్సగా కూడా వాడతారు. మెల్లకన్ను తొలగించేందుకు, మైగ్రిన్స్ (తీవ్రమైన తలనొప్పులు) తగ్గించేందుకు, అధిక చెమట నుంచి విముక్తి కలిగించేందుకు, మూత్రాశయ ఇబ్బందులను తొలగించేందుకు కూడా వాడతారు.
వాస్తవానికి 20 కన్నా ఎక్కువ ఆరోగ్య సమస్యలకు చికిత్సలో భాగంగా బోటాక్స్ వాడతారు.

ఎన్నో ఔషధాలు విషాల నుంచి వచ్చినవే
ఇలాంటి ప్రమాదకరమైన విషపదార్థాలకు బోట్యులినమ్ ఒక ఉదాహరణ మాత్రమే.
కాప్టోప్రిల్ అనే యాంటీహైపెర్టెన్సివ్ డ్రగ్‌ను పాముల విషాల నుంచి తయారుచేస్తారు. దీని విలువ ఒక బిలియన్ డాలర్లు (సుమారు 74వేల కోట్ల రూపాయలు) ఉంటుంది.
టైప్-2 డయాబెటిస్ చికిత్సలో వాడే ఎక్సెనాటైడ్ (మార్కెట్లో ఇది బయేటా పేరుతో వస్తుంది)ను నైరుతి అమెరికా, మెక్సికోలలో నివసించే 'గిలా' అనే పెద్ద విషపు బల్లి లాలాజలం నుంచి తయారుచేస్తారు.
అయితే, ఆధునిక ఔషధ రంగంలో విషాల ప్రభావం కేవలం వ్యాధులకు చికిత్స అందించడంతోనే ఆగిపోదు.
ప్రత్యేకంగా ఒక రకమైన విషం, ఆధునిక ఔషధ పరిశ్రమకు కొత్త రూపాన్ని ఇచ్చిందనే చెప్పుకోవాలి.
విక్టోరియా కాలం బ్రిటన్‌లో 'జీవిత బీమా' అప్పుడే అభివృద్ధి చెందుతున్న ఒక పరిశ్రమ. బీమా ద్వారా సులువుగా వచ్చే డబ్బు కోసం అనేక హత్యలు జరిగాయి. వాటిల్లో చాలావరకు విషం ఇచ్చి హత్య చేసిన ఉదంతాలే ఎక్కువ.
మేరీ ఆన్ కాటన్ కేసు
ఇలాంటి హత్యల్లో హై ప్రొఫైల్ కేసు 1873లో వెలుగులోకి వచ్చిన మేరీ ఆన్ కాటన్ అనే మహిళది.
బీమా ద్వారా వచ్చే సొమ్ముకు ఆశపడి, ఆమె నాలుగు పెళ్లిళ్లు చేసుకుని, ముగ్గురు భర్తలను హత్య చేశారు. నాలుగో వ్యక్తి ఆమె చేతుల్లోంచి తప్పించుకోవడానికి కారణం, ఆయన బీమా తీసుకోకపోవడమే.
ఆమెకు పుట్టిన పిల్లల్లో 10 మంది గ్యాస్ట్రిక్ సమస్యల కారణంగా మరణించారు. ఇది చాలా బాధాకరమైనదే కానీ చనిపోయిన పిల్లలందరి పేరు మీద జీవిత బీమా ఉంది.
మేరీ కాటన్ తల్లి, ఆడపడుచు, ఆమె ప్రియుడు అందరూ మరణించారు. వీరందరి విషయంలో కూడా ఆమెకు లాభమే కలిగింది.

1872 నాటికల్లా మేరీ కుటుంబంలో, స్నేహితుల్లో మొత్తం 16 మంది మరణించారు. ఒక్క సవతి కొడుకు ఏడేళ్ల చార్లెస్ మాత్రం బతికాడు. ఆ బాబును కూడా స్థానిక అనాథశరణాలయానికి అప్పజెప్పేందుకు ప్రయత్నించారు కానీ వాళ్లు తీసుకోలేదు. దాంతో, చిన్న బాబు చార్లెస్ కూడా కొద్ది రోజుల్లోనే మరణించాడు.
అనాథశరణాలయం మేనేజర్‌కు ఎందుకో అనుమానం వచ్చి పోలీసులకు ఈ విషయాన్ని తెలియజేశారు.
మేరీ కాటనే ఆ బాబుకు విషం ఇచ్చి చంపేసి ఉంటారని పోలీసులు అనుమానించారు. ఆ విషం 'ఆర్సెనిక్' అయుంటుందని కూడా సందేహపడ్డారు.
ఆర్సెనిక్ ఆక్సైడ్స్ అనేవి మినరల్స్ (ఖనిజ లవణాలు). విష పదార్థంగా తిరుగులేనివి. వీటికి రుచి ఉండదు. వేడి నీటిలో పూర్తిగా కరిగిపోతాయి. ఒక మనిషిని చంపడానికి చాలా చిన్న మొత్తంలో వినియోగిస్తే చాలు.
అయినప్పటికీ, 19వ శతాబ్దంలో ఆర్సెనిక్ ఆక్సైడ్‌ను ఎలుకలను చంపడానికి పనికొచ్చే విష పదార్థంగా మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. ఇది చాలా చౌకగా, దాదాపు అన్ని దుకాణాల్లోనూ దొరికేది.
చార్లెస్ కడుపులోంచి సేకరించిన నమూనాలను పరిశీలించగా, ఆర్సెనిక్ ప్రయోగం వల్లే చనిపోయినట్లు తేలింది. అప్పట్లో ఫోర్సెనిక్ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. కానీ, బాబుపై అధిక మొత్తంలో ఈ విష పదార్థం ప్రయోగించడంతో ఫోర్సెనిక్ పరీక్షల్లో దాని సంగతి సులువుగా బయటపడింది.
మేరీ కాటన్ నేరం రుజువైంది. ఆమెకు ఉరిశిక్ష విధించారు.
అయితే, ఆమె తల్లి, ఆమె ముగ్గురు భర్తలు, ఇద్దరు స్నేహితులు, పదిమంది పిల్లల చావులు రహస్యంగానే మిగిలిపోయాయి. వీరందరి విషయంలో మేరీ కాటన్‌పై ఎలాంటి విచారణ జరగలేదు.
మేరీ కాటన్ ఉదంతం తర్వాత బ్రిటన్‌లో ఆర్సెనిక్ చట్టాన్ని రూపొందించారు. అనంతరం 1868లో ఫార్మసీ చట్టాన్ని కూడా ప్రవేశపెట్టారు. ఈ చట్ట ప్రకారం, అర్హత కలిగిన డ్రగ్ డీలర్లు, పార్మసిస్ట్స్ మాత్రమే ప్రమాదకరమైన, విషపూరితమైన ఔషధాలను విక్రయించగలరు.
ఇలా ఎన్నో విష ప్రయోగాలు, ప్రమాదాలు, హత్యల అనంతరం ఇవాళ మనం చూస్తున్న చట్టబద్ధమైన ఆధునిక ఔషధ పరిశ్రమ ఉనికిలోకి వచ్చింది.
కాగా, ఒకప్పుడు హంతకులకు పనికొచ్చిన ఆర్సెనిక్, ఇప్పుడు ఆర్సెనిక్ ట్రైఆక్సైడ్ రూపంలో క్యాన్సర్ బాధితులకు సహాయపడుతోంది. దీన్ని క్యాన్సర్‌కు చికిత్సలో భాగంగా ఔషధంగా అందిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
- తాగుడు మానడానికి ఈ ఔషధం పని చేస్తుందా...
- పచ్చబొట్టు పొడిపించుకున్న వారు రక్తదానం చేయకూడదా...
- భారతదేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎందుకు గందరగోళంగా మారింది
- వందల ఏళ్ల క్రితమే గంజాయి వాడకం... సమాధుల్లో బయటపడిన సాక్ష్యాలు
- కరోనావైరస్: డెక్సామెథాసోన్ ఏంటి? ఈ మందు ఎలా పనిచేస్తుంది? దీని ధర ఎంత?
- అందం కోసం సెక్స్ ఒప్పందాలు: ‘నాకు కాస్మోటిక్ సర్జరీ చేయిస్తే నా శరీరం ఆరు నెలలు నీదే’
- 1778 తర్వాత అదృశ్యమైంది, 235 సంవత్సరాలు గడిచాక సముద్రం అడుగున కనిపించింది
- మగవాళ్లకు సంతాన నిరోధక మాత్రలు ఎందుకు లేవు? సైన్స్ ఏం చెబుతోంది
- వెక్కిళ్లు ఎందుకొస్తాయి? ఆగాలంటే ఏం చేయాలి?








