స్కార్పియన్: మానవ అక్రమ రవాణాలో ఆరితేరిన ఈ యూరప్‌ మోస్ట్‌వాంటెడ్‌ క్రిమినల్ బీబీసీ జర్నలిస్టుకు ఎలా దొరికాడంటే....

స్కార్పియన్ ఫోటో
ఫొటో క్యాప్షన్, స్కార్పియన్
    • రచయిత, స్యూ మిచెల్
    • హోదా, బీబీసీ న్యూస్

మానవ అక్రమ రవాణాలో ఆరితేరి, యూరప్ మోస్ట్ వాటెండ్‌గా మారిన వ్యక్తితో ముఖాముఖి మాట్లాడేందుకు ఇరాన్‌లోని ఓ షాపింగ్‌మాల్‌లో కూర్చుని ఉన్నాను.

ఆయన పేరు బర్జన్ మజీద్. బ్రిటన్ సహా అనేక దేశాల పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నారు.

షాపింగ్‌మాల్‌తోపాటు తరువాత రోజు ఆయన ఆఫీసులో జరిగిన సంభాషణలో ఇంగ్లీషు చానల్ ( బ్రిటన్, ఫ్రాన్స్ మధ్య ఉండే ఒక సముద్రం ) ద్వారా తానెంతమందిని రవాణా చేసిందీ తెలియదని మజీద్ చెప్పారు.

‘‘బహుశా వెయ్యి లేదా పదివేలు.. ఏమో తెలియదు. నేనెప్పుడూ లెక్కపెట్టలేదు’’ అని చెప్పారు.

కొన్ని నెలల కిందటివరకూ మా ఈ మీటింగ్ అసాధ్యమనే అనిపించింది. కానీ శరణార్థుల కోసం పనిచేసే మాజీ సైనికుడు రాబ్ లారీ సహకారంతో ‘స్కార్పియన్’ పేరుతో ప్రసిద్ధి చెందిన మజీద్‌ను కనుక్కోగలిగి ఆయనను పలు ప్రశ్నలు వేయగలిగాను.

ఇంగ్లీషు చానల్ మీదుగా పడవలు, లారీలలో మానవ అక్రమ రవాణాను అనేక ఏళ్ళుగా మజీద్, ఆయన గ్యాంగ్ నడుపుతోంది.

2018 నుంచి ఇంగ్లీష్ చానెల్‌ మీద పడవలలో ప్రయాణించి 70 మందికి పైగా మరణించారు. కిందటి నెలలో ఫ్రెంచ్ తీరంలో ఏడేళ్ళ బాలిక సహా ఐదుగురు మృతి చెందారు.

ఈ ప్రయాణం ఎంతో ప్రమాదకరం. కానీ మనుషుల్ని అక్రమంగా రవాణా చేసేవారికి మాత్రం లాభదాయకం.

పడవల ద్వారా దాటించేందుకు మనిషికి 6 వేల పౌండ్లు (సుమారు రూ. 6.28 లక్షలు) వసూలు చేస్తారు.

2023లో ఇలా పడవల ద్వారా ప్రయాణించేందుకు 30వేలమంది ప్రయత్నించారంటే వీరికి ఇదెంత లాభదాయకమో ప్రత్యేకించి చెప్పక్కరలేదు.

‘డింగీ’ ఎక్కితే డింకీలే

ప్రమాదకర ప్రయాణం ఫోటో

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, ఏటా వేలాదిమంది వలసదారులు ఇంగ్లీషు చానెల్ దాటడానికి ప్రయత్నిస్తారు

ఫ్రాన్స్‌కు ఉత్తరాన కలైస్‌లో ఉన్న వలసదారుల శిబిరంలో ఓ చిన్నపిల్లను కలుసుకున్నప్పుడు ‘స్కార్పియన్’పై మాకు ఆసక్తి పెరిగింది.

గాలితో నిండిన ట్యూబ్‌లా ఉండే పడవ (డింగీ) పై ఈ బాలిక ఇంగ్లీషు చానల్ దాటే ప్రయత్నంలో దాదాపుగా చావు అంచుల వరకు వెళ్ళింది.

ఆ డింగీ సముద్రయానానికి పనికిరాదు. కానీ చవకైనది. దీనిని సెకండహ్యాండ్‌లో బెల్జియంలో కొన్నారు. దానిపై లైఫ్‌ జాకెట్లు లేకుండా 19 మంది ప్రయాణించారు.

ఇలా ఎటువంటి రక్షణ లేకుండా ప్రజలను సముద్రంలోకి ఎవరు పంపుతారు?

యూకేలో పోలీసులు అక్రమ వలసదారులను అదుపులోకి తీసుకున్నప్పుడు వారి మొబైల్ ఫోన్లను తనిఖీ చేస్తారు. 2016 నుంచి వలసదారుల మొబైల్ ఫోన్లలో ఒక నెంబర్ కనిపించడం పెరిగింది.

యూకేలోకి వేలాదిమందిని అక్రమ రవాణాచేసి, యూరప్ మోస్ట్ వాంటెడ్ క్రైమ్‌ బాసుల్లో ఒకరైన, స్కార్పియన్ (కోడ్‌నేమ్) కోసం బీబీసీ జర్నలిస్ట్ స్యూ మిచెల్, స్వచ్ఛంద కార్యకర్త రాబ్ లారీ కలిసి ఓ నాటకీయమైన వేట మొదలుపెట్టారు.

తరచూ ఆయన పేరు ‘స్కార్పియన్’గా మొబైల్ ఫోన్లలో సేవ్ అయ్యేది. లేదంటే స్కార్పియన్ బొమ్మతో సేవ్ చేసుకునేవారు.

యూకే నేషనల్ క్రైమ్ ఏజెన్సీ (ఎన్‌సీఏ)లో సీనియర్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ మార్టిన్ క్లార్క్ మాట్లాడుతూ ‘స్కార్పియన్’ అనేది కర్దీష్ ఇరాకీ అయిన బర్జన్ మజీద్‌కు సంబంధించిన పేరని తరువాత అర్థం చేసుకున్నానని చెప్పారు.

మజీద్‌కు 20 ఏళ్ళ వయసున్నప్పడు 2006లో లారీ వెనుక భాగంలో కూర్చుని ఇంగ్లండ్‌లోకి అక్రమంగా ప్రవేశించాడు. ఓ ఏడాది తరువాత ఇంగ్లండ్ ను వీడటానికి నిరాకరించాకా, ఆయన అనేక సంవత్సరాలు జైలులో ఉన్నారు. తుపాకులు, మత్తుపదార్థాల నేరాలపైనా కూడా ఆయన జైల్లో ఉన్నారు.

ఎట్టకేలకు 2015లో ఆయన ఇరాక్‌కు బయల్దేరారు. దీని తరువాత కొద్దికాలానికే తన అన్న మొదలుపెట్టిన మానవ అక్రమ రవాణా వ్యాపారాన్ని వారసత్వంగా కొనసాగించారు. ఆయన అన్న బెల్జియంలో జైలు శిక్ష అనుభవిస్తున్నారు.

మజీద్ ‘స్కార్పియన్’గా ఫేమస్ కావడం మొదలైంది.

మజీద్ ఫోటో

ఫొటో సోర్స్, Facebook

ఫొటో క్యాప్షన్, నాటింగ్‌హామ్‌లో 2012లో మజీద్ కారు మెకానిక్‌గా పనిచేస్తున్నప్పటి ఫోటో

యూరప్, యూకే మధ్యన మానవ అక్రమ రవాణా వ్యాపారాన్ని 2016 నుంచి 2021 మధ్యన స్కార్పియన్ గ్యాంగ్ తమ చెప్పుచేతుల్లో పెట్టుకున్నట్టు చెబుతారు.

రెండేళ్ళపాటు అంతర్జాతీయ పోలీసు ఆపరేషన్ ఫలితంగా ఈ గ్యాంగ్‌లో సుమారు 26 మందికి యూకే, ఫ్రాన్స్, బెల్జియం కోర్టులలో జైలుశిక్ష పడింది.

కానీ, స్కార్పియన్ మాత్రం అరెస్ట్ నుంచి తప్పించుకుని పరారయ్యారు.

మజీద్ పరారీలో ఉన్నప్పటికీ 121 మందిని అక్రమంగా రవాణా చేసినందుకు ఆయనకు బెల్జియం కోర్టు జైలు శిక్ష విధించింది. అక్టోబరు 2022లో ఆయనకు పదేళ్ళ జైలుశిక్ష, సుమారు రూ. 8.7 కోట్ల జరిమానా విధించింది.

అప్పటి నుంచి స్కార్పియన్ ఎక్కడున్నది ఎవరికీ తెలియదు.

ఈ మిస్టరీని ఛేదించాలని మేం భావించాం.

రాబ్‌కు తెలిసిన ఓ వ్యక్తి, మాకో ఇరానీ వ్యక్తిని పరిచయం చేశారు. ఈ ఇరానీ వ్యక్తి ఇంగ్లీషు చానల్ దాటే ప్రయత్నంలో స్కార్పియన్‌ను కలుసుకున్నట్టు చెప్పారు. ఈ ఇరానీ వ్యక్తికి తాను తుర్కియేలో ఉన్నట్టు స్కార్పియన్ చెప్పారు. అక్కడి నుంచి తన వ్యాపారాన్ని సమన్వయం చేసుకుంటున్నట్టు తెలిపారు.

బెల్జియంలో మేం మజీద్ అన్నయ్యను కనిపెట్టగలిగాం. ఇప్పడాయన జైలు నుంచి బయటకు వచ్చారు. ఆయన కూడా స్కార్పియన్ తుర్కియేలో ఉండే అవకాశం ఉందని చెప్పారు.

బోటు ప్రమాదంలో మృతుల ఫోటో

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఫిబ్రవరి 2023: కనీసం 95మంది వలసదారులు బోెటుపై తుర్కీయే నుంచి ఇటలీకి వస్తూ మరణించారు.

తుర్కియే మీదుగా..

యూకేకు వలసపోదామనుకునే వారందరికీ తుర్కియే ఓ ముఖ్యమైన ప్రాంతం. అక్కడి వలస చట్టాల కారణంగా ఆఫ్రికా, ఆసియా, మధ్యప్రాచ్యం నుంచి వీసా పొందడం చాలా తేలిక.

మాకు అందిన సమాచారం మమ్మల్ని ఇస్తాంబుల్‌లోని మానవ అక్రమరవాణాదారులు తరచూ సందర్శించే ఓ కేఫ్‌వైపు దారితీయించింది. బర్జాన్ మజీద్ ఇటీవలే అక్కడ కనిపించినట్టు తెలిసింది.

మేం తొలుత ఆయన సమాచారం తెలుసుకోవడానికి చేసిన ప్రయత్నం అంతగా ఫలించలేదు. మేం కేఫ్ మేనేజర్‌ను మానవ అక్రమ రవాణా వ్యాపారం గురించి చెప్పగలరా అని అడిగాం. కానీ మాకు మౌనమే సమాధానంగా వచ్చింది.

కొద్దిసేపటి తరువాత మేం కూర్చున్న టేబుల్ పక్కనుంచి వెళుతున్న ఓ వ్యక్తి తన జాకెట్ జిప్ తీసి, అందులోని తుపాకీని చూపి వెళ్ళిపోయాడు. మేమెంతటి ప్రమాదకర వ్యక్తుల గురించి వెదుకుతున్నామో ఆ ఘటనకు మాకు తెలియజేసింది.

కానీ మా తరువాతి మజిలీ మాకు మంచి ఫలితాన్నే ఇచ్చింది. ఇటీవలే మజీద్, అక్కడకు కొన్ని వీధుల ఆవల ఉన్న మనీ ఎక్స్ఛేంజ్‌లో 2 లక్షల యూరోలు డిపాజిట్ చేసినట్టు తెలిసింది. మేం అక్కడ మా ఫోన్ నెంబర్లు ఇచ్చి వెనుదిరిగాం. ఆ తరువాత రోజు రాత్రి రాబ్ ఫోన్ మోగింది.

కాలర్ ఐడీలో ‘నంబర్ విత్ హెల్డ్’ అని వచ్చింది. అటువైపున ఉన్నది బర్జాన్ మజీద్ అని తెలిసింది.

అప్పటికే బాగా పొద్దుపోయింది. కానీ ఈఫోన్ కాల్ అసలు ఊహించలేదు. ఫోన్ కాల్ మొదటి నుంచి రికార్డు చేసేందుకు అవకాశం లేకుండా పోయింది. రాబ్ ఫోన్ ఎత్తగానే . ‘‘ మీరు నా కోసం చూస్తున్నారని విన్నాను’’ అని స్కార్పియన్ అడగగా, నేను ‘‘మీరు ఎవరు? స్కార్పియనా’’ అని అడిగా.. ‘‘అవును..మీరు నన్ను అలా పిలవాలనుకుంటే అలాగే కానీయండి..నాకేమీ ఇబ్బంది లేదు’’అని చెప్పారు.

అయితే అసలీ ఫోన్ మాట్లాడుతోంది బర్జాన్ మజీదా కాదా అని తేల్చుకోవడానికి మాకే దారీ కనిపించలేదు. కానీ ఆయన చెప్పిన వివరాలు, మాకు తెలిసిన సమాచారంతో సరిపోలాయి. 2015వరకు తాను నాటింగ్‌హామ్‌లో ఉన్నట్టు ఆయన చెప్పారు. కానీ మానవ అక్రమ రవాణా వ్యాపారంలో తన ప్రమేయాన్ని ఆయన ఖండించారు.

‘‘ఇది నిజం కాదు. ఇదంతా మీడియా సృష్టి’’ అని చెప్పారు.

మేం మృదువుగా ఆయనతో మాట్లాడుతున్నా, తానెక్కడున్నాననే విషయంపై ఆయన ఎటువంటి క్లూ ఇవ్వలేదు.

స్కార్పియన్ ఫోటో
ఫొటో క్యాప్షన్, తన సోదరులతో స్కార్పియన్ (బ్లర్ చేయని వ్యక్తి). ఈ ఫోటో తీసిన తేదీ, స్థలం తెలియవు.

దీని తరువాత మరోసారి మాకు ఆయన ఫోన్ చేస్తారా లేదా అనే విషయంపై మాకు ఎటువంటి ఐడియా లేనప్పుడు రాబ్‌కు పరిచయం ఉన్న స్థానికుడు ఒకరు స్కార్పియన్ ప్రస్తుతం తుర్కియే నుంచి గ్రీసుకు మానవ అక్రమ రవాణా వ్యవహారంలో ఉన్నట్టు సమాచారం ఇచ్చారు.

12 మందిని తీసుకువెళ్ళడానికి లైసెన్సు పొందిన పడవలో దాదాపు 100మందిని కుక్కి, అక్రమంగా రవాణా చేస్తున్నట్టు విని కలవరపడ్డాం.

ఇలాంటి పడవలను ఏమాత్రం అనుభవం లేనివారు నడుపుతుంటారు. పైగా తీర రక్షణ దళాల గస్తీ నుంచి తప్పించుకోవడానికి చిన్న ద్వీప సముదాయాల మధ్యనున్న ప్రమాదకరమైన మార్గాల మీదుగా ప్రయాణం సాగిస్తారు.

దీని ద్వారా పెద్ద ఎత్తున డబ్బు సంపాదిస్తారు. ఈ పడవలలో చోటు సంపాదించడానికి ప్రయాణికులు ఒకొక్కరు 10వేల యూరోలు( సుమారు రూ. 9 లక్షలు) చెల్లించాల్సి ఉంటుంది. గడిచిన పదేళ్ళుగా 7,20,000 మందికిపైగా ప్రజలు తూర్పు మధ్యధర సముద్రం ద్వారా యూరప్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. వీరిలో 2500మంది చనిపోయారు. చాలామంది సముద్రంలో మునిగి మృతి చెందారు.

ఎస్ఓఎస్ మెడిటేరేనియన్ చారిటీ సంస్థకు చెందిన జులియా షాఫెర్మేయర్ మాట్లాడుతూ ‘‘ ఈ అక్రమ రవాణా దారులు ప్రజల ప్రాణాలను పెద్ద ప్రమాదంలో పడేస్తున్నారు. కానీ ప్రజలు బతికున్నా, చచ్చినా వారికి ఒకటే’’ అని చెప్పారు.

సరిగ్గా అదే సమయంలో ఈ ప్రశ్నలను మేం నేరుగా స్కార్పియన్‌నే అడిగే అవకాశం, ఆయనే ఫోన్ చేయడం ద్వారా కల్పించారు.

కానీ తాను మానవ అక్రమ రవాణదారుడినికానని మరోసారి ఆయన ఖండించారు. కేవలం తాను డబ్బు మనిషిని మాత్రమేనని చెప్పారు. మజీద్ నిర్వచనం ప్రకారం ప్రత్యక్షంగా దగ్గరుండి తీసుకువెళ్ళేవారే అక్రమ రవాణాదారులవుతారు. ఇప్పుడు నేను కూడా పడవలో ఉండాలి కదా. కానీ నేను అక్కడ లేను. ఇప్పడు కూడా అక్కడ లేను’’ అని చెప్పారు.

సముద్రంలో మునిగి చనిపోయిన వలసదారులపై మజీద్ ఎటువంటి సానుభూతి చూపలేదు.

‘‘నువ్వెప్పుడు చనిపోవాలనేది దేవుడు ముందే రాసి పెడతాడు. కాకపోతే కొన్నిసార్లు అది మీ తప్పిదం వల్ల జరగవచ్చు. పడవలోకి వెళ్ళు అని దేవుడు ఎప్పుడూ చెప్పడు’’ అని అన్నారు.

మర్మరీస్ ఫోటో

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, స్కార్పియన్‌కు మర్మరీస్ రిసార్ట్స్‌లో సొంత విల్లా ఉందని భావిస్తున్నారు.

మర్మరీస్ రిసార్ట్స్

మా తరువాతి మజిలీ మర్మరీస్ రిసార్ట్. అక్కడ స్కార్పియన్‌కు ఓ సొంత విల్లా ఉందని తుర్కియే పోలీసులు అనుమానిస్తున్నారు. మేం దాని గురించి చుట్టుపక్కల విచారించాం. తాను స్కార్పియన్‌తో స్నేహంగా ఉన్నట్టు మాకు ఒకరి నుంచి ఫోన్ కాల్ వచ్చింది.

మజీద్‌కు మానవ అక్రమ రవాణాలో ప్రమేయం ఉన్నట్టు ఆమెకు తెలుసు. అయితే ఈ పని ఆయనను ఒత్తిడికి గురిచేస్తోందని, ఆయన బాధంతా డబ్బుగురించే కానీ, వలసదారుల గురించి కాదని ఆమె చెప్పారు.

‘‘ఆయన వారి గురించి ఏమాత్రం లెక్కచేయరు. ఇది చాలా విచారకరం. నేను సిగ్గుపడుతున్నాను. నేను విన్న విషయాలు ఏమాత్రం మంచివి కావు’’ అని ఆమె తెలిపారు.

మర్మరీస్ విల్లాలో ఇటీవల కాలంలో తాను మజీద్‌ను చూడలేదని ఆమె చెప్పారు. కొంతమంది ఆయన ఇరాక్‌లో ఉండి ఉండొచ్చని ఆమెకు చెప్పారట.

ఇది మాకు మరో వ్యక్తిని కలుసుకునేందుకు అవకాశం ఇచ్చింది. ఆయనే తాను స్కార్పియోను ఇరాక్‌లోని కుర్దిస్తాన్ ప్రాంతంలోని సులేమానియా నగరంలో ఓ మనీ ఎక్చేంజ్ వద్ద చూసినట్టు చెప్పారు.

దీంతో మేం సులేమానియాలో స్కార్పియన్‌ను కనుక్కోలేకపోతే, ఇక అక్కడితో ఈ వేటకు స్వస్తి పలకాలని భావించాం.

కానీ రాబ్ కు పరిచయం ఉన్న వ్యక్తులు స్కార్పియన్‌తో టచ్‌లోనే ఉన్నారు. మజీద్ చాలా అనుమానపు మనిషి. మేం ఆయనను యూరప్‌కు తీసుకువెళతామనే భయపడ్డారు.

దీని తరువాత రాబ్ స్నేహితుడి ద్వారానూ, ఆపైన రాబ్ ద్వారానూ మెస్సేజ్‌లు వెల్లువెత్తాయి. ఎట్టకేలకు స్కార్పియన్‌ మమ్మల్ని కలవడానికి అంగీకరించాడు. కాకపోతే ఎక్కడ కలవాలనేది తానే చెపుతానని అన్నారు. కానీ ఆయన మమ్మల్ని ఏమైనా చేయవచ్చనే భయంతో మేం ఆ ప్రతిపాదనను తిరస్కరించాం.

తరువాత ‘మీరెక్కడున్నారు? ’ అంటూ సింపుల్‌గా ఓ టెక్స్ట్ మెస్సేజ్ వచ్చింది.

మేం దగ్గరలోని మాల్‌కు వెళ్ళే దారిలో ఉన్నామని చెప్పాం.

దీంతో అక్కడకు దగ్గరలోని ఓ కాఫీ షాపులో కలుస్తానని స్కార్పియన్ చెప్పారు.

స్యూ, రాబ్, స్కార్పియన్ సమావేశపు ఫోటో
ఫొటో క్యాప్షన్, స్కార్పియన్‌‌ను స్యూ, రాబ్ కలుసుకున్నప్పటి చిత్రం. దీనిని వారి డ్రైవర్లు రహస్యంగా తీశారు.

అలా కలిశాం

ఎట్టకేలకు మేం ఆయన్ని చూశాం.

చూడటానికి ఓ ధనికుడైన గోల్ఫర్‌లా కనిపించారు బర్జాన్ మజీద్. కొత్త జీన్స్ ప్యాంట్, లేతనీలిరంగు చొక్కా, దానిపై నలుపురంగు జాకెట్ ధరించి వచ్చారు.

ఆయన తన చేతిని టేబుల్‌పై పెట్టినప్పుడు, ఆయన చేతి వేళ్లకు గోళ్లరంగు ఉండటం గమనించాను. ఇంతలో ఓ ముగ్గురు వ్యక్తులు మాకు దగ్గరలోని టేబుల్ దగ్గర కూర్చున్నారు.

వారు ఆయన భద్రతా సిబ్బంది అని మేం ఊహించగలిగాం.

ఓ నేరసామ్రాజ్యంలో అగ్రస్థానంలో ఉన్న మజీద్ తాను నేరస్తుడిని కానని మరోసారి ఖండించారు. కొన్ని గ్యాంగులు తన ప్రమేయం ఉన్నట్టు చూపడానికి ప్రయత్నిస్తున్నాయని చెప్పారు.

‘‘కొంతమంది అరెస్ట్ అయినప్పుడు తక్కువ శిక్ష పడుతుందనే ఉద్దేశంతో నాకోసం పని చేస్తున్నానని చెప్పి, నెపం నాపైన నెడుతున్నారు’’ అని చెప్పారు.

ఇతర స్మగ్లర్లు బ్రిటిషు పాస్‌పోర్టులతో తమ వ్యాపారాన్ని కొనసాగించడంపై ఆయన ఈర్ష్యతో ఉన్నట్టుగా కనిపించారు.

‘‘మూడు రోజులలో ఓ వ్యక్తి 170 నుంచి 180 మంది దాకా తుర్కియే నుంచి ఇటలీకి పంపారు. అతనికి ఇప్పటికీ బ్రిటిషు పాస్‌పోర్ట్ ఉంది. నేను ఇక్కడ వ్యాపారం చేయలేను. వేరే దేశం వెళ్లాలనుకుంటున్నాను.’’ అని చెప్పారు.

వలసదారులు చనిపోవడంలో ఆయన బాధ్యతపై మేం గుచ్చి గుచ్చి అడిగిన ప్రశ్నలకు, అంతకుముంద ఫోన్‌లో చెప్పిన విషయాలనే మళ్ళీ చెప్పారు.

మజీద్‌కు స్మగ్లర్ అంటే కేవలం మనుషులను పడవలు, లారీలలో రవాణా చేసే వ్యక్తి మాత్రమే. ‘‘నేనెప్పుడు ఎవరినీ పడవలోకి పంపలేదు. నేను ఎవరినీ చంపలేదు’’ అని చెప్పారు.

మా సంభాషణ ముగిశాకా, రాబ్‌ను సులేమానియాలోని తాను పనిచేసే మనీ ఎక్స్‌ఛేంజ్ కార్యాలయానికి ఆహ్వానించారు.

అదో చిన్న ఆఫీసు. అక్కడ ఓ కిటికీపై అరబిక్‌లో ఏదో రాసి ఉంది. కొన్ని మొబైల్ ఫోన్ నెంబర్లు రాశారు. జనం ప్రయాణానికి ఇక్కడ డబ్బులు చెల్లిస్తారు. తాను అక్కడ ఉన్నప్పుడు డబ్బుతో నిండి ఉన్న ఓ బాక్సును తీసుకువెళుతున్న వ్యక్తిని చూసినట్టు రాబ్ చెప్పారు.

ఈ సందర్బంగా 2016లో వేలాదిమంది యూరప్ వైపు సాగిపోతున్నప్పుడు తాను ఈ వ్యాపారంలోకి ఎలా వచ్చింది స్కార్పియన్ వివరించారు.

‘‘వారిని ఎవరూ బలవంతం చేయలేదు. వారు వెళ్ళాలని కోరుకున్నారు’’ అని చెప్పారు. ‘‘వారు స్మగ్లర్లను అడుక్కుంటారు. ప్లీజ్, ప్లీజ్ మాకోసం ఈ పని చేసి పెట్టండి అంటారు. కొన్నిసార్లు స్మగ్లర్లు మాత్రం ‘‘దేవుడి కోసం మేం వారికి సాయం చేశాం’’ అని చెబుతారు. తరువాత వారు అది కాదు, ఇది కాదు అంటూ ఫిర్యాదులు చేస్తారు.

‘అప్పుడు ఉన్నా, ఇప్పుడు లేను’

స్కార్పియన్ ఫోటోలు
ఫొటో క్యాప్షన్, బెల్జియం ప్రాసిక్యూటర్స్ సమాచార పత్రం.

బెల్జియం, ఫ్రాన్స్‌లో 2016 నుంచి 2019 వరకు కార్యకలాపాలు నిర్వహించిన ఇద్దరు కీలక వ్యక్తులలో తాను ఒకరినని స్కార్పియో చెప్పారు. ఆ సమయంలో మిలియన్ల కొద్దీ డాలర్లను కళ్ళజూసినట్టు అంగీకరించారు.

‘‘డబ్బు, స్థలం, పాసింజర్లు, స్మగ్లర్లు....వాటిమధ్య నేను, వారికి ఇలాంటి పనులు చేసి పెట్టాను’’ అని తెలిపారు.

అయితే ఇప్పటికీ మానవ అక్రమ రవాణాలో ఉన్నాననే విషయాన్ని ఆయన ఖండించారు. కానీ తన పనులు అందుకు విరుద్ధంగా ఉన్నాయనే విషయాన్ని ఆయన గ్రహించ లేకపోతున్నారు.

అయితే స్కార్పియన్ తన ఫోన్‌ను స్క్రోల్ చేస్తున్నప్పుడు ఆ స్క్రీన్ ప్రతిబింబం వెనుక గోడపై ఉన్న ఓ ఫోటో ఫ్రేమ్‌పై పడటాన్ని రాబ్ గమనించారు. స్కార్పియన్ మొబైల్ ఫోన్‌లో ఉన్నవి పాస్‌పోర్ట్ నెంబర్లని రాబ్‌కు అర్థమైంది. ఈ నెంబర్లను ఇరాకీ అధికారులకు పంపుతారని తరువాత మాకు తెలిసింది. అధికారులకు లంచాలు ఇచ్చి వలసదారులకు తప్పుడు వీసాలు వచ్చేలా చేసి, వారు తుర్కియేకు ప్రయాణించేలా చేస్తారు.

మేం స్కార్పియన్‌ను చూడటం అదే చివరి సారి. మా ఈ ప్రయాణంలో మా ప్రతి మజిలీ గురించి, మేం కనిపెట్టిన విషయాల గురించి ఎప్పటికప్పుడు యూకే, యూరప్ అధికారులకు తెలియజేశాం.

స్కార్పియన్‌కు జైలుశిక్ష విధించేలా చేసిన బెల్జియంలోని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆన్ లూకోవియాక్‌కు ఏదో ఒకరోజు ఇరాక్ స్కార్పియన్‌ను అప్పగించి తీరుతుందని నమ్ముతున్నారు.

‘‘మీరేమి అనుకుంటే అది చేయలేరు అనే సంకేతాన్ని పంపడం మనకు చాలా ముఖ్యం. ఎప్పటికైనా అతని ఆటకట్టించాల్సిందే ’’ అని ఆమె చెప్పారు.

(అదనపు రిపోర్టింగ్ : బెన్ మిల్నే)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)