పాస్‌పోర్ట్, వీసాల్లేకుండా ఇండియా నుంచి బోటులో న్యూజిలాండ్‌కు ఎందుకు వెళ్లాలనుకున్నారు.. వారంతా ఏమయ్యారు

దిల్లీలోని ఆ కాలనీ పేరు సిలోన్ కాలనీ. నిజానికి ప్రస్తుతం అక్కడున్నవారికి శ్రీలంకతో ఎలాంటి సంబంధమూ లేదు. వందల ఏళ్ల కిందట వారి పూర్వీకులు శ్రీలంక నుంచి ఇక్కడ వలస రావడంతో వారు నివసించే ప్రాంతానికి సిలోన్ కాలనీ అన్న పేరు స్థిరపడిపోయింది.
దక్షిణ దిల్లీలోని మదన్‌గిరిలో ఈ కాలనీ ఉంది. అయిదు నెలలుగా ఇక్కడి వందల కుటుంబాలు వేదనలో మగ్గిపోతున్నాయి. తమవారు ఏమయ్యారో తెలియక తల్లడిల్లుతున్నాయి. కారణం... అయిదు నెలల కిందట ఈ కాలనీకి చెందినవారు పెద్ద సంఖ్యలో సముద్రంలో గల్లంతవడమే.
ఇప్పటివరకు వారి ఆచూకీ తెలియలేదు.. ఏదైనా ఒడ్డుకు కొట్టుకుపోయారా.. లేదంటే సముద్రంలో మునిగిపోయారా అన్నది సమాచారం లేకుండాపోయింది.
కేరళ సముద్ర తీరంలో జనవరి 12న 243 మందితో వెళ్తున్న ఓ బోటు గల్లంతైన సంగతి తెలిసిందే. అందులో 164 మంది సిలోన్ కాలనీ నివాసులే.

పాస్‌పోర్టు, వీసాల్లేకుండా న్యూజిలాండ్ వెళ్లే ప్రయత్నం
గల్లంతైన బోటులో ప్రయాణిస్తున్నవారంతా భారత్ నుంచి అక్రమంగా న్యూజిలాండ్ వెళ్లడానికి ప్రయత్నించినవారే. అందులో ఎవరికీ పాస్‌పోర్టులు, వీసాలు లేవు. కానీ, మధ్యవర్తులు ఎవరో న్యూజిలాండ్‌లో మంచి జీవితం గడపొచ్చన్న ఆశ చూపడంతో బోటులో న్యూజిలాండ్ చేరుకోవాలని ప్రయత్నించి సముద్రంలో గల్లంతయ్యారు.
వీరి ఆచూకీ కోసం పసిఫిక్ సముద్ర తీర దేశాలన్నిటినీ సంప్రదించామని, ఎక్కడి నుంచీ ఎలాంటి సమాచారం రాలేదని భారత విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది.
'జనవరి 11న మా వాళ్లతో మాట్లాడాం. ఆ తరువాత వారి నుంచి ఎలాంటి సమాచారం లేదు. వారేమయ్యారో తెలియడం లేదు'' అని సిలోన్ కాలనీకి చెందిన 68 ఏళ్ల కనకలింగం చెప్పారు.
గల్లంతైన 164 మంది సిలోన్ కాలనీవాసుల్లో 47 మంది కనకలింగం కుటుంబీకులే. ఆయన అన్నదమ్ములు, కుమారులు, కుమార్తెలు, మనవళ్లు, మనవరాళ్లు గల్లంతైనవారిలో ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
వీరందరినీ ఎవరు తీసుకెళ్లారు
''రవీంద్రన్ అనే ఏజెంట్ మా వాళ్లందరినీ ఆశ పెట్టాడు. న్యూజిలాండ్ వెళ్లి పనిచేసుకుంటే ఏడాదికి రూ.10 లక్షలు సంపాదించుకోవచ్చని... పాస్‌పోర్టు, వీసాలేమీ లేకుండానే వెళ్లొచ్చని మాయమాటలు చెప్పాడు. దీంతో మా వాళ్లంతా ఇల్లు, నగలు అమ్మేసి మరీ రవీంద్రన్ అడినంత డబ్బు చెల్లించి బోటు ఎక్కారు'' అని కనకలింగం వెల్లడించారు.
''నా కొడుకు, కోడలు, మనవడు కూడా సముద్రంలో గల్లంతయ్యారు. బోటు మునిగిపోయి కొంతమంది గల్లంతయ్యారని టీవీ చానళ్లలో చూపించినంతవరకు నాకు మావాళ్లంతా న్యూజిలాండ్ వెళ్తున్నారని తెలియదు. దక్షిణ భారతదేశంలోని ఒక ఆలయానికి వెళ్తామని నాతో చెప్పి వెళ్లారు'' అని సరస్వతి అనే వితంతువు రోదిస్తూ చెప్పింది.
జనవరిలో జరిగిన ఈ దారుణ ప్రమాదం నుంచి బయటపడినవారూ ఉన్నారు. బోటు నిండిపోవడంతో ప్రయాణం వాయిదా వేసుకుని ప్రాణాలతో మిగిలారు వారంతా. అలాంటివారిలో ప్రభు ఒకరు. ప్రభు బతికిబయటపడినా ఆయన కుటుంబమంతా మాత్రం ఆ బోటులోనే వెళ్లి గల్లంతైపోయింది.
బోటు బయల్దేరడానికి ముందు ఏం జరిగిందో ప్రభు బీబీసీతో చెప్పారు. ''కేరళలోని ఎర్నాకుళం జిల్లా చరాయి బీచ్ సమీపంలోని ఓ హోటల్‌లో మా కాలనీవాళ్లమంతా ఉన్నాం. రెండు మినీ బస్సులు వచ్చి మమ్మల్ని పికప్ చేసుకున్నాయి. బస్సులు కిక్కిరిసి వెళ్లాయి. అవి మళ్లీ వస్తాయని, అప్పుడు రావొచ్చని చెప్పి ఏజెంట్ నన్ను హోటల్లోనే ఉండమన్నారు. చాలాసేపే వెయిట్ చేశాను. బస్సులు మళ్లీ రాలేదు. బోటు కూడా వెళ్లిపోయిందని ఆ తరువాత తెలిసింది. మా వాళ్లంతా అందులో వెళ్లారు.. నేనొక్కడినే మిగిలిపోయాను'' అన్నారాయన.

కేరళ పోలీసులేమంటున్నారు?
''మునాంబమ్ బీచ్‌లో 80కి పైగా బ్యాగులున్నాయని.. వాటిని ఎవరో వదిలేసి వెళ్లారని మాకు సమాచారం అందడంతో ఈ చట్టవిరుద్ధ బోటు ప్రయాణాల గురించి తమకు తెలిసింద'ని కేరళ పోలీసులు చెప్పారు.
బోటు గల్లంతు వ్యవహారంపై దర్యాప్తు కోసం కేరళ ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందంలోని ఓ సీనియర్ అధికారి 'బీబీసీ'తో మాట్లాడుతూ ఈ చట్టవిరుద్ధ ప్రయాణం కోసం వినియోగించిన బోటును రూ.కోటికి కొనుగోలు చేశారని తెలిపారు.
ఈ వ్యవహారంతో సంబంధమున్న సుమారు 10 మందిని కేరళ పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. అయితే, వారిలో ఎక్కువ మంది బోటులో చోటు లేక మిగిలిపోయినవారే. వారందరినీ జైలుకు పంపించగా ప్రస్తుతం బెయిలుపై బయటకొచ్చారు.
'దేవమాత-2' అనే ఈ బోటు గల్లంతవడంపై ఆస్ట్రేలియా సహా పలు పసిఫిక్ దేశాలకు తాము సమాచారమిచ్చామని విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. 2013లో మదన్‌గిర్‌కే చెందిన సుమారు 70 మంది ఇదే తరహాలో ఆస్ట్రేలియా వెళ్లినట్లు దిల్లీ పోలీసులు చెబుతున్నారు.
ఆస్ట్రేలియాలో శరణార్థులుగా..
2013లో ఇక్కడి నుంచి ఆస్ట్రేలియా వెళ్లినవారంతా పాస్‌పోర్టులు, వీసాలేమీ లేకుండానే వెళ్లారని.. వారంతా ఇప్పుడక్కడ శరణార్థులుగా ఉన్నారని, అక్కడ వారి పరిస్థితి బాగానే ఉందని కనకలింగం బీబీసీతో చెప్పారు.
అయితే... న్యూజిలాండ్‌కు బయలుదేరి సముద్రంలో గల్లంతైనవారి పరిస్థితే ఇప్పటికీ తెలియరాలేదు. వారి కోసం బంధువులు, కుటుంబసభ్యులు పోలీసులు, ప్రభుత్వాధికారుల చుట్టూ తిరుగుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- సిత్రాలు సూడరో: డీకే అరుణ, జయ సుధల.. కండువా మారింది, స్వరం మారింది
- నీరవ్ మోదీ: భారత్‌కు ఎలా రప్పిస్తారు? రూ.11,360 కోట్ల సంగతేంటి?
- 1996లో నల్లగొండ లోక్‌సభకు 480 మంది పోటీ
- ఎన్టీఆర్ ఫొటో ఎంత పని చేసిందంటే...
- ఒంగోలు గిత్తల కథ: ఇక్కడ అరుదై పోయాయి.. బ్రెజిల్లో వెలిగిపోతున్నాయి
- టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల తుది జాబితా ఇదే
- ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు: వైసీపీ అభ్యర్థుల పూర్తి జాబితా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








