ప్రపంచకప్-2019లో భారత్‌కు తొలి ఓటమి.. 31 పరుగుల తేడాతో ఇంగ్లండ్ విజయం

ధోనీ

క్రికెట్ వరల్డ్ కప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 31 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 306 పరుగులు మాత్రమే చేయడంతో ఇంగ్లండ్ నిర్దేశించిన 338 పరుగుల లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది.

భారత జట్టులో ఓపెనర్ల రోహిత్ శర్మ 109 బంతుల్లో 15 ఫోర్లతో 102 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ 9 బంతులాడి పరుగులేమీ చేయకుండానే అవుటయ్యాడు.

కోహ్లీ 66, హార్దిక్ పాండ్యా 45, రిషబ్ పంత్ 32 పరుగులు చేశారు. ధోనీ 42, కేదార్ జాదవ్ 12 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.

ఇంగ్లండ్ బౌలర్లలో ప్లంకెట్ 3, వోక్స్ 2 వికెట్లు తీశారు.

ఈ విజయంతో ఇంగ్లండ్ సెమీస్ చేరడానికి ఇంకా అవకాశాలు మిగిలి ఉన్నాయి.

ఇండియా, ఇంగ్లండ్ మ్యాచ్

ఫొటో సోర్స్, Getty Images

ఇంగ్లండ్ భారీ స్కోరు

అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది.

ఓపెనర్లు రాణించడంతో భారీ స్కోరుకు పునాది పడింది.

బెయిర్ స్టో 109 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లతో 111 పరుగులు చేసి భారీ స్కోరుకు బాటలు వేశాడు.

జేజే రాయ్ 66, జో రూట్ 44, బెన్ స్టోక్స్ 79 పరుగులతో రాణించారు.

షమీ

ఫొటో సోర్స్, Getty Images

షమీ ఒక్కడే

భారత బౌలర్లు తొలి వికెట్ దక్కించుకోవడం ఆలస్యం కావడంతో ఓపెనర్లు కుదురుకుని మంచి పునాది వేశారు. దీంతో తరువాత వచ్చిన ఆటగాళ్లూ ఒత్తిడి లేకుండా ఆడగలిగారు.

భారత బౌలర్లలో మహ్మద్ షమీ 5 వికెట్లు తీయగా.. బుమ్రా, కుల్దీప్ యాదవ్‌లు తలో వికెట్ తీశారు.

చాహల్ 10 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా తీయకుండా 88 పరుగులు సమర్పించుకున్నాడు.

హార్దిక్ పాండ్యా కూడా వికెట్లేమీ తీయకుండా 10 ఓవర్లలో 60 పరుగులు ఇచ్చాడు.

కుల్దీప్ యాదవ్ 10 ఓవర్లలో 72 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీయగా... షమీ 10 ఓవర్లలో 69 పరుగులు ఇచ్చినప్పటికీ 5 వికెట్లు తీశాడు.

భారత బౌలర్లలో బుమ్రా ఒక్కడే పొదుపుగా బౌలింగ్ చేశాడు. పది ఓవర్లలో 44 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు.

వోక్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కేఎల్ రాహుల్ వికెట్ తీసిన ఆనందంలో వోక్స్

ఆరంభంలోనే వికెట్ కోల్పోవడంతో..

328 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో దిగిన భారత్ ఆరంభంలోనే కేఎల్ రాహుల్ వికెట్ కోల్పోయింది. రాహుల్.. వోక్స్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

అనంతరం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు నిలకడగా ఆడుతూ స్కోరును ముందుకు తీసుకెళ్లారు. కోహ్లీ అర్ధశతకం పూర్తి చేసుకోగా, రోహిత్ శర్మ సెంచరీ సాధించాడు.

జట్టు స్కోరు 146 వద్ద కోహ్లీ అవుటయ్యాడు. 76 బంతుల్లో 7 ఫోర్లతో కోహ్లీ 66 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ 109 బంతుల్లో 15 ఫోర్లతో 102 పరుగులు చేసి అవుటయ్యాడు.

అనంతరం హార్దిక్ పాండ్యా ధాటిగా ఆడినప్పటికీ అవుట్ కావడంతో కేదార్ జాదవ్‌తో కలిసి ధోనీ గెలుపు కోసం ప్రయత్నించాడు. 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 31 బంతుల్లోనే ధోనీ 42 పరుగులు చేసినప్పటికీ అప్పటికే కావాల్సిన రన్ రేట్ భారీగా పెరిగిపోవడంతో ఓటమి తప్పలేదు.

ధోనీ

ఫొటో సోర్స్, Getty Images

భారత్ ఇన్నింగ్స్‌లో ఒకే ఒక సిక్సర్

ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ మొత్తం 13 సిక్సర్లు బాదగా భారత ఆటగాళ్లు కేవలం ఒకే ఒక సిక్సర్ కొట్టారు.

ఇన్నింగ్స్ చివర్లో ధోనీ కొట్టిన సిక్సరే ఈ మ్యాచ్‌లో భారత్ తరఫున నమోదైన ఏకైక సిక్సర్.

ఆరెంజ్ కలర్ జెర్సీ ధరించిన విరాట్ కోహ్లీ

ఫొటో సోర్స్, Getty Images

భారత్‌కు అన్నీ విజయాలు.. ఒక మ్యాచ్ రద్దు

భారత్ ఇప్పటి వరకు ఆరింటిలో ఐదు మ్యాచ్‌లు గెలిచింది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. ఈరోజు ఇంగ్లండ్‌తో తలపడనుంది.

ప్రస్తుతం 11 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్న భారత జట్టు ఈ మ్యాచ్‌లో గెలిస్తే నేరుగా సెమీ ఫైనల్‌కు చేరుకుంటుంది. ఒకవేళ ఓడిపోయినప్పటికీ భారత్‌ సెమీస్ అవకాశాలపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు. ఎందుకంటే.. దీని తర్వాత భారత జట్టు జూలై 2వ తేదీ మంగళవారం బంగ్లాదేశ్, 6వ తేదీ శనివారం శ్రీలంక జట్లతో తలపడనుంది.

కాగా, ఈ మెగా టోర్నీలో పది జట్లు పోటీ పడుతుండగా.. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని ఏకైక జట్టు భారత్.

ఈ మ్యాచ్‌లో ఓడితే ఇంగ్లండ్ సెమీస్ అవకాశాలు సంక్లిష్టం అవుతాయి. భారత్‌తో మ్యాచ్ తర్వాత ఇంగ్లండ్ జట్టు గ్రూప్ పోటీల్లో తన చివరి మ్యాచ్ న్యూజీలాండ్‌తో తలపడనుంది.

ఈ రెండు మ్యాచ్‌లు తమకు క్వార్టర్ ఫైనల్స్ లాంటివని ఇంగ్లండ్ జట్టు భావిస్తోంది.

ప్రపంచ కప్ పోటీల్లో భారత్, ఇంగ్లండ్ జట్లు ఇప్పటి వరకూ ఏడుసార్లు పోటీ పడ్డాయి. చెరో మూడు మ్యాచుల్లో గెలవగా.. ఒకటి టై అయ్యింది.

భారత జట్టు: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), విజయ్ శంకర్, ఎంఎస్ ధోనీ (వికెట్ కీపర్), కేదార్ జాధవ్, హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహల్, జస్‌ప్రిత్ బుమ్రా

పాయింట్ల పట్టిక

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)