INDvsENG : ఇండియా గెలిస్తే ఇంగ్లండ్ సెమీస్ ఆశలు వదులుకోవాల్సిందేనా? ఇంగ్లండ్‌కు సొంతగడ్డ కలిసిరాలేదా?

ఇంగ్లండ్ జట్టు

ఫొటో సోర్స్, Getty Images

ప్రపంచ కప్ సెమీ ఫైనల్స్ రేసులో పాకిస్తాన్ ముందంజలో ఉంది. అఫ్గానిస్తాన్‌తో ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో విజయం ఆ జట్టు సెమీస్ ఆశల్ని సజీవంగా ఉంచింది. ఆ జట్టు 9 పాయింట్లతో.. నాలుగో స్థానానికి చేరుకుంది.

అఫ్గాన్‌పై పాకిస్తాన్ విజయంతో ఇంగ్లండ్ సెమీ ఫైనల్ సమీకరణాలు మారిపోయాయి. ఆదివారం జరిగే మ్యాచ్‌లో ఇంగ్లండ్ తప్పనిసరిగా భారత జట్టును ఓడిస్తేనే ఆతిథ్య జట్టు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంటుంది.

అయితే, ఈ ప్రపంచ కప్‌లో శనివారం వరకూ 37 మ్యాచులు జరిగాయి. భారత్ ఆరు మ్యాచులు ఆడగా, మిగతా అన్ని జట్లు ఏడు, ఎనిమిది మ్యాచులు చొప్పున ఆడాయి. వీటన్నింటిలోనూ ఇప్పటి వరకూ ఒక్క మ్యాచ్‌ కూడా ఓడిపోని జట్టు భారత్ మాత్రమే. అలాంటి భారత జట్టును ఇప్పుడు ఇంగ్లండ్ ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఎదుర్కొంటోంది.

ఒకవేళ ఈ మ్యాచ్‌లో ఓడిపోతే.. ఇంగ్లండ్ జట్టు తమకు మిగిలిన ఏకైక మ్యాచ్‌లో.. న్యూజీలాండ్‌పై బుధవారం తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది. అయితే, ఈ గెలుపు మాత్రమే సరిపోదు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక జట్లు ఆడనున్న మిగతా మ్యాచ్‌ ఫలితాలను బట్టి ఇంగ్లండ్ సెమీ ఫైనల్‌కు వెళ్తుందా? వెళ్లదా? తేలుతుంది.

ఒకవేళ భారత జట్టు ఆదివారం మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను ఓడించి, మంగళవారం జరిగే మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై ఓడిపోతే.. న్యూజీలాండ్‌పై గెలిచినా కూడా ఇంగ్లండ్ (10 పాయింట్లతో) ప్రపంచ కప్ నుంచి వైదొలగాల్సిందే.

అప్పుడు.. లార్డ్స్ మైదానంలో జరిగే పాకిస్తాన్, బంగ్లాదేశ్ మ్యాచ్‌లో ఎవరు గెలిస్తే వారు (11 పాయింట్లతో) నేరుగా సెమీ ఫైనల్‌కు వెళ్లే అవకాశం ఉంది.

పాయింట్ల పట్టిక

ఇంగ్లండ్‌కు సొంతగడ్డ కలిసిరాలేదా?

సాధారణంగా సొంతగడ్డపై ఆడే జట్లకు విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే, ప్రస్తుత ప్రపంచ కప్‌ బ్రిటన్‌లోనే జరుగుతోంది కాబట్టి ఇంగ్లండ్ కూడా సొంతగడ్డపై విజృంభిస్తుందని, ఆ జట్టే ఫేవరెట్ అని క్రికెట్ విశ్లేషకులంతా అనుకున్నారు. కానీ, ఆ జట్టు ఇప్పుడు సెమీ ఫైనల్స్ చేరుకోవడమే కష్టంగా మారింది.

ఇప్పటి వరకూ ఇంగ్లండ్ జట్టు ఏడు మ్యాచులు ఆడింది. అందులో నాలుగు మ్యాచులు గెలిచి, మూడింటిలో ఓడి.. ఎనిమిది పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది.

ఇక ఆ జట్టుకు మిగిలిన మ్యాచ్‌లు రెండు. ఆదివారం భారత్‌తో ఎడ్జ్‌బాస్టన్‌లో తలపడుతోంది. ఈ పిచ్ స్లోగా ఉంటుందని, స్పిన్నర్లకు అనుకూలిస్తుందని భావిస్తున్నారు. అంటే ఇది విరాట్ కోహ్లీ బృందానికే కలిసొస్తుంది. గత బుధవారం ఇదే పిచ్‌పై పాకిస్తాన్ జట్టు.. అప్పటి వరకూ ఒక్క ఓటమి కూడా లేని న్యూజీలాండ్‌ను ఓడించింది.

భారత్‌తో మ్యాచ్ తర్వాత ఇంగ్లండ్ జట్టు తన చివరి గ్రూప్ మ్యాచ్‌లో చెస్టర్ లె స్ట్రీట్ మైదానంలో న్యూజీలాండ్‌తో తలపడనుంది. ఇది స్వింగ్, సీమ్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉండే పిచ్. న్యూజీలాండ్ జట్టు బలం కూడా అదే బౌలింగ్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)