విరాట్ కోహ్లీ: అతిగా అపీల్ చేసినందుకు ఐసీసీ జరిమానా... మ్యాచ్ ఫీజులో 25 శాతం కట్

కోహ్లీ డీలా

ఫొటో సోర్స్, Getty Images

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ శనివారం అఫ్గానిస్తాన్‌తో జరిగిన వన్డేలో అతిగా అపీల్ చేశాడని, అందువల్ల అతడికి మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధిస్తున్నట్లు ఐసీసీ ప్రకటించింది.

ఐసీసీకి చెందిన ఆటగాళ్ళ నైతిక నియమావళిలో 2.1వ ఆర్టికల్‌ను కోహ్లీ ఉల్లంఘించాడని ఐసీసీ తప్పు పట్టింది. అంతర్జాతీయ మ్యాచ్‌లో అతిగా అపీల్ చేయడానికి సంబంధించిన ఆ ఆర్టికల్‌లోని అంశాలకు భిన్నంగా కోహ్లీ ప్రవర్తన ఉందని ఐసీసీ వెల్లడించిందని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

అఫ్గానిస్తాన్‌ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 29వ ఓవర్లో ఎల్బీడబ్ల్యూ కోసం కోహ్లీ గట్టిగా అపీల్ చేయడమే కాకుండా అంపైర్ అలీమ్ దార్‌తో‌ వాదిస్తూ కనిపించారు.

కోహ్లీ తన తప్పును అంగీకరిస్తూ ఐసీసీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ప్రకటించారు. దీనిపై విచారణ కూడా అవసరం లేదని, ఐసీసీ ఇలీట్ ప్యానెల్ ఆఫ్ మ్యాచ్ రిఫరీస్‌కు చెందిన మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ ప్రతిపాదించిన జరిమానాకు సమ్మతిస్తున్నానని కోహ్లీ చెప్పారు.

అంతేకాకుండా కోహ్లీ క్రమశిక్షణ రికార్డుకు ఒక డీమెరిట్ పాయింట్ కలుపుతున్నట్లు కూడా ఐసీసీ ప్రకటించింది.

కొత్త నిబంధనావళిని 2016 సెప్టెంబర్‌లో ప్రకటించిన తరువాత కోహ్లీకి ఇలా జరగడం ఇది రెండవసారి. దక్షిణాఫ్రికాతో 2018 జనవరి15న ప్రెటోరియాలో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో కోహ్లీకి ఒక డీమెరిట్ పాయింట్ ఇచ్చారు. మొత్తంగా అతను ఇప్పటికి 2 డీమెరిట్ పాయింట్స్ మూటగట్టుకున్నాడు.

శనివారం నాటి మ్యాచ్‌లో ఫీల్డ్ అంపైర్స్ అలీమ్ దార్, రిజర్డ్ ఇలింగ్‌వర్త్, థర్డ్ అంపైర్ రిచర్డ్ కెటిల్‌బరో, ఫోర్త్ అంపైర్ మైకేల్ గాఫ్‌లు ఉమ్మడిగా కోహ్లీ మీద ఆరోపణలు చేశారు.

ప్రపంచ కప్‌లో భారత జట్టు తదుపరి మ్యాచ్ ఈ నెల 27న మాంచెస్టర్‌లో వెస్టిండీస్‌తో జరుగుతుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)