ఇస్లామిక్ దేశాల్లో ఉంటున్న హిందువుల దృష్టిలో ‘హిందుత్వ’ అంటే ఏమిటి?

రాజన్ శర్మ, మహ్మద్ వసీమ్
ఫొటో క్యాప్షన్, ఖతార్ రాజధాని దోహాలో రూమ్‌మేట్స్ రాజన్ శర్మ (ఎడమ), మహ్మద్ వసీమ్‌ (కుడి)
    • రచయిత, రజనీష్ కుమార్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

రామేశ్వర్ సావ్ ముస్లిం కుటుంబాలు ఒక్కటి కూడా లేని బిహార్‌లోని ఔరంగాబాద్‌‌కు చెందినవారు. ఈ గ్రామమే కాదు, దాని చుట్టుపక్కల ఏ ఊరిలోనూ ముస్లింలు లేరు.

చదువుకునే సమయంలో కూడా తాను ఒక్క ముస్లింను కలవలేదని రామేశ్వర్ చెప్పారు.

రామేశ్వర్‌కు యుక్తవయసులోనే పెళ్లి అయింది. బాధ్యతలు భుజాన పడ్డాయి.

దీంతో ఉద్యోగాన్ని వెదుక్కుంటూ ఆయన సౌదీ అరేబియాకు చేరుకున్నారు.

హిందూ ఆధిపత్య గ్రామం, సమాజంలో నివసిస్తున్న రామేశ్వర్ సావ్ జీవితంలో, ఇస్లామిక్ దేశమైన సౌదీ అరేబియాకు వెళ్లడం ఓ ముఖ్యమైన మార్పు.

సౌదీకి వెళ్ళిన కొద్దిరోజులకే రామేశ్వర్ ముస్లింలతో కలిసి ఒక గదిలో ఉన్నారు. వీరిలో కొందరు భారత్ నుంచి, మరికొందరు పాకిస్తాన్ నుంచి వచ్చారు.

మీడియా కారణంగా పాకిస్తాన్ ప్రజలంటే ‘తీవ్రవాదులు, మతోన్మాదులు’ అనే భావన రామేశ్వర్‌లో మనసులో నాటుకుపోయింది. ముస్లింలపైనా ఆయనకు అదే అభిప్రాయముండేది.

‘‘ముస్లింలు, పాకిస్తానీలతో కలిసి జీవిస్తున్నప్పుడు నా ఆలోచనలు చాలా మారిపోయాయి. గతంలో ముస్లింలు హిందువులను ద్వేషిస్తారని అనిపించేది. కానీ నిజం ఏమిటంటే నేనే ముస్లింలను ద్వేషించేవాడిని.

కానీ ఇప్పుడు నా మనసులో ముస్లింలపై ద్వేషం లేదు. పాకిస్తాన్ ప్రజలు అవసరమైన సమయంలో నాకు సాయం చేసేవారు. నేను కూడా వారికి సాయపడేవాడిని’’ అన్నారాయన.

తన వ్యక్తిత్వంలో వచ్చిన ఈ మార్పును రామేశ్వర్ చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. సౌదీ అరేబియాకు వెళ్లకపోయి ఉంటే తాను అజ్ఞానంతోనే ఉండేపోయేవాడినంటారాయన.

రామేశ్వర్ సావ్ ఫోటో

ఫొటో సోర్స్, బీబీసీ

ఫొటో క్యాప్షన్, రామేశ్వర్ సావ్ ఏడేళ్ళుగా సౌదీ అరేబియాలోని దమామ్‌లో నివసిస్తున్నారు.

ఒకే గదిలో పూజలు, నమాజ్

బిహార్‌లోని సివాన్‌ జిల్లా, చాంద్‌పాలి మౌజా గ్రామంలో ముస్లింల జనాభా ఎక్కువ.

అక్కడ 10-12 హిందువుల ఇళ్లు మాత్రమే ఉన్నాయి. ఆ గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి ఒకరిద్దరు పురుషులు గల్ఫ్‌ దేశాల్లో పనిచేస్తున్నారు.

ఆ ఊరు నుంచి ఐదు వందల మందికి పైగా గల్ఫ్ దేశాల్లో ఉన్నారు. గల్ఫ్ దేశాల సంపాదన ప్రభావం ఆ గ్రామంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఊళ్ళో ఒక్క మట్టి ఇల్లు కూడా లేదు.

రాజన్ శర్మది ఆ గ్రామమే. ఆయనకు ఉద్యోగం లేదు. సివాన్‌లో ఉన్నప్పుడు రోజుకు 100 రూపాయలు సంపాదించడం కూడా కష్టమయ్యేదని రాజన్ చెప్పారు.

ఒకరోజు గ్రామానికి చెందిన సోహ్రబ్ అలీ.. రాజన్‌ను ఖతార్‌కు పనికి వెళ్తావా అని అడిగారు. వెళతానని చెప్పడానికి రాజన్ ఏ మాత్రం సందేహించలేదు. రాజన్‌ శర్మకు వీసా రావడంలో సోహ్రాబ్ అలీ సాయం చేశారు.

రాజన్ శర్మ తొమ్మిదేళ్లుగా ఖతార్‌లో ఉంటూ ప్రతి నెలా రూ.30 వేలు ఆదా చేస్తున్నారు. ఆ సంపాదనతో గ్రామంలో మూడంతస్తుల ఇల్లు కట్టుకున్నారు.

రాజన్ తన సోదరుడి పెళ్లికి గ్రామానికి వచ్చినప్పుడు చాలా నిరాశ చెందారు.

"అయోధ్యలో రామ మందిర ప్రతిష్ఠాపన సందర్భంగా, మా గ్రామం మీదుగా ఊరేగింపు వెళ్లింది. ముస్లింలను చిరాకు పరిచేందుకు వారుండే ప్రాంతాల మీదుగా ఉద్దేశపూర్వకంగానే ఊరేగింపు తీసినట్లు అనిపించింది. అయితే ఎలాగో ఈ గొడవ సద్దు మణిగింది. లేదంటే మతపరమైన ఉద్రిక్తతలు తలెత్తేవి’’ అని రాజన్ చెప్పారు.

‘‘ఇది చూసి నేను చాలా బాధపడ్డాను. మా అమ్మ దగ్గరకు వెళ్లి మన రాముడు ఇలాంటి వాడు కాదని చెప్పాను. ఆయన ప్రజలను ఆదుకునేవాడు. వీళ్లు రాముడి పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారు. గత పదేళ్లలో ఇలాంటివి పెరిగాయి’’ అని రాజన్ తెలిపారు.

ఖతార్ రాజధాని దోహాలో చాంద్‌పాలికి చెందిన మహ్మద్ వసీం.. రాజన్ రూమ్మేట్‌గా ఉన్నారు. వసీం కాకుండా ఆ గదిలో మరో ఇద్దరు ఉన్నారు. కానీ రాజన్ ఒక్కరే హిందువు.

రాజన్ కోసం ఆయన ముస్లిం స్నేహితులు ఆ గదిలో ఒక మూలన చిన్న పూజామందిరంలాంటిది ఏర్పాటు చేశారు.

రాజన్ ఆ గదిలో పూజలు చేస్తే, ఆయన ముస్లిం స్నేహితులు అదే గదిలో నమాజ్ చేసుకుంటారు.

"ఖతార్‌లో ఓసారి నా ఆరోగ్యం బాగా క్షీణించింది. మంచం మీద నుంచి లేవడం కూడా కష్టమైంది. అలాంటప్పుడు వసీం భాయ్ నా బట్టలు ఉతికాడు. అలాంటి ప్రేమ మన దేశంలో కనిపిస్తుందా?" అని రాజన్ ప్రశ్నించారు.

రాజన్ శర్మ, మహ్మద్ వసీమ్
ఫొటో క్యాప్షన్, రాజన్ శర్మ, మహ్మద్ వసీమ్సా వన్ జిల్లా చాంద్ పాలీ మౌజా గ్రామానికి చెందినవారు

కలిసి భోజనం చేయని అగ్రవర్ణాలు

చాంద్‌పాలికి చెందిన మహ్మద్ నసీమ్ సౌదీ అరేబియాలో పని చేస్తున్నారు. సెలవులకు ఆయన గ్రామానికి వచ్చారు. నసీమ్ జూన్‌లో తిరిగి సౌదీ అరేబియాకు వెళతారు.

భారతదేశంలో మతపరమైన విభజనకు కారణమైన రాజకీయాలపై ఆయన ఆందోళన చెందుతున్నారు.

"సౌదీ అరేబియా ఒక ఇస్లామిక్ దేశం. అక్కడ రాచరికం, కుటుంబ పాలన ఉంది. ముస్లింలుగా అక్కడికి వెళ్లిన మేము మతపరమైన మెజారిటీ కావచ్చు కానీ దీని వల్ల మాకు ఎలాంటి ప్రత్యేక హక్కు లభించదు. చట్టం అందరికి సమానమే. అక్కడ గూండాలను గూండాలుగా చూస్తారు తప్ప ముస్లిం గూండాలు, హిందూ గూండాలుగా కాదు’’ అని ఆయన చెప్పారు.

"భారతీయ ముస్లింలు ఈ గడ్డకు చెందినవారు. మా పూర్వీకులు భారతదేశాన్ని నిర్మించడానికి తమ రక్తాన్ని, చెమటను ధారపోశారు. కానీ మతం ఆధారంగా వారిని రెండో తరగతి పౌరులుగా చూస్తున్నారు, ఇది చూస్తుంటే బాధగా ఉంది. హిందూ-ముస్లింలు విదేశాలలో కలిసి జీవిస్తారు. కానీ స్వదేశంలో వారి మధ్య అడ్డుగోడలు ఏర్పడతాయి. లౌకిక దేశంలో వివక్ష ఉండకూడదు, కానీ దీనికి విరుద్ధంగా జరుగుతోంది’’ అంటారు మహ్మద్ నసీర్.

మహ్మద్ నసీమ్ గ్రామం చాంద్‌పాలికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న దర్వేష్‌పూర్‌కు చెందిన ఉపేంద్ర రామ్ ఆయన రూమ్‌మేట్.

"ఉపేంద్ర కోసం ముస్లింలు వాళ్ల గదిలోనే ప్లైవుడ్‌తో చిన్న పూజా మందిరం కట్టించారు. సౌదీ అరేబియాలో అన్యమతాచారాలను అంత సులభంగా సహించరు. కానీ మా హిందూ సోదరుడి కోసం మేం వాటిని పట్టించుకోలేదు" అని చెప్పారు నసీమ్.

ఉపేంద్రది చెప్పులు కుట్టే కులమని, అయితే ఆయన్ని తాము ఎన్నడూ అంటరానివాడిగా భావించలేదని మహ్మద్ నసీమ్ చెప్పారు. కానీ అగ్రవర్ణ హిందువులు సౌదీ అరేబియాలోనూ ఆయనతో కలిసి భోజనం చేయరని తెలిపారు.

ఇలా శర్మ ఫోటో
ఫొటో క్యాప్షన్, భర్త శ్యామ్‌తో కలిసి ఇలా శర్మ ఎనిమిదేళ్ళుగా దుబాయ్‌లో ఉంటున్నారు.

అర్ధరాత్రి హాయిగా తిరగొచ్చు

బిహార్‌లోని ఔరంగాబాద్‌కు చెందిన ఇలా శర్మ భర్త శ్యామ్ దుబాయ్‌లోని ఎల్ అండ్ టీ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్. ఆయన చాలా ఏళ్లుగా దుబాయ్‌లో ఉంటున్నారు.

ఇప్పుడు శ్యామ్ దోహాకు మారడంతో వీసా కోసం ఇలా శర్మ ఔరంగాబాద్‌కు వచ్చారు.

దుబాయ్‌లో ఉన్నప్పుడు తాను ముస్లిం దేశంలో ఉన్నట్లు ఎప్పుడూ అనిపించలేదని ఇలా శర్మ తెలిపారు.

‘‘నిజం చెప్పాలంటే హోలీ, దీపావళి, ఛత్‌ పూజను ఇక్కడికన్నా దుబాయ్‌లోనే బాగా చేసుకున్నాం. అక్కడ మాకెలాంటి ఇబ్బందీ లేదు. మేం మతపరమైన మైనారిటీలమని ఎప్పుడూ అనిపించలేదు. భద్రత విషయానికి వస్తే భారతదేశంలో కంటే దుబాయ్‌లోనే భద్రత ఎక్కువ. అక్కడ రాత్రి 2 గంటలకు కూడా మహిళలు ఒంటరిగా నడవొచ్చు’’ అన్నారామె.

గల్ఫ్‌లోని ఇస్లామిక్ దేశాలలో నివసిస్తున్న హిందువులను కలిస్తే, వాళ్లలో చాలా మంది ముస్లింల గురించి తమ గత ఆలోచనలు మారిపోయాయని అంగీకరిస్తారు.

గల్ఫ్‌లో ఉద్యోగం వారి ఆర్థిక పరిస్థితిలో మార్పు తీసుకురావడమే కాకుండా వారి రాజకీయ, సామాజిక ఆలోచనలనూ మార్చింది.

రవికుమార్
ఫొటో క్యాప్షన్, సౌదీ అరేబియాలో రవికుమార్ చాలా ఏళ్ళ నుంచి పని చేస్తున్నారు.

‘సౌదీ వెళ్ళాకా మార్పు’

ఈ మార్పు గురించి పట్నాలోని ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి తవిషి బహల్ పాండే మాట్లాడుతూ, “ఒకే చోట నివసిస్తున్నప్పుడు, అనేక రకాల అపోహలు ఏర్పడతాయి, కానీ మనం ఇతర దేశాలకు వెళ్లి వివిధ సంస్కృతులకు చెందిన వ్యక్తులను కలిసినప్పుడు, ఆ అవగాహన మారుతుంది. మనం ఇంతకుముందు అనుకున్నది నిజం కాదని గ్రహిస్తాం’’ అన్నారు.

నేను గల్ఫ్ దేశాలలో ఉంటున్న బిహారీ హిందువులతో మాట్లాడినప్పుడు ముస్లింల పట్ల తమ ఆలోచనా విధానం మారిందని వాళ్లు చెప్పారు.

సివాన్‌కు చెందిన రవికుమార్ తొమ్మిదేళ్లుగా సౌదీ అరేబియాలో ఉంటున్నారు. ప్రస్తుతం ఆయన సివాన్‌లో సొంత ఇంటిని కట్టుకుంటున్నారు.

“సౌదీ అరేబియా వెళ్లే ముందు నాకు ముస్లింలంటే సదభిప్రాయం లేదు. కానీ సౌదీ అరేబియా వెళ్లిన తర్వాత వాళ్లపట్ల నా ఆలోచనలలో చాలా మార్పు వచ్చింది. సౌదీ అరేబియా ఇస్లామిక్ దేశమే అయినా, భారత్‌ నుంచి వెళ్ళిన ముస్లింలకు ప్రత్యేకంగా లాభాలేవీ ఉండవు. హిందువుల పట్ల వివక్షా ఉండదు. భారతదేశానికి వచ్చాకే, మనం ఇంకా హిందువులు, ముస్లింలు అంటూ కొట్టుకుంటున్నామని అనిపిస్తుంది’’ అన్నారు రవి.

అబ్దుల్ బారీ సిద్ధిఖీ పాత తరం జనతాదళ్ నాయకుడు. గల్ఫ్‌కు వెళ్లే హిందువుల మనసులో ముస్లింల గురించి మారుతున్న అభిప్రాయాలను ఎలా చూస్తారని సిద్ధిఖీని ప్రశ్నిస్తే, "గత కొన్ని సంవత్సరాలుగా, ముస్లింలపై ద్వేషాన్ని విపరీతంగా పెంచారు. కానీ మెజారిటీ హిందువులలో అది లేదు. మెజారిటీ హిందువులు ఇప్పటికీ సమ్మిళిత సమాజాన్ని సమర్ధిస్తారని నేను నమ్ముతున్నాను. గల్ఫ్‌కు వెళ్లిన తర్వాత, హిందువులు భారతదేశంలో వారు ఇస్లాంను ద్వేషించడానికి ఎలాంటి ప్రాతిపదిక లేదని గమనిస్తారు. పరస్పర సంభాషణ ద్వారా మాత్రమే ఆలోచనలు మారతాయి’’ అన్నారు.

“నేను కాయస్థ కుటుంబం నుంచి వచ్చిన మహిళను పెళ్లి చేసుకున్నాను. ఈ వివాహంలో హిందువులూ సహకరించారు. ఆ సమయంలో కర్పూరి ఠాకూర్ బిహార్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన చాలా రోజులు మమ్మల్ని తన ఇంట్లో ఉంచుకున్నారు. ఇప్పుడు రాజకీయాల్లో ద్వేషమే ఎక్కువగా ఉంది. కానీ ద్వేషానికీ జీవితకాలం అంటూ ఒకటుంటుంది, అది నశించక తప్పదు’’ అన్నారు.

తవీష్ పాండే ఫోటో
ఫొటో క్యాప్షన్, పట్నాలోని ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి తవిషి పాండే

గత కొన్నేళ్లుగా, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్‌లోని (GCC) ఆరు సభ్య దేశాలైన సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్, బహ్రెయిన్, ఒమన్, ఖతార్‌లకు వెళుతున్న భారతీయ వలస కార్మికుల ట్రెండ్ మారిపోయింది.

యుఏఈలో నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, గతంలో కేరళ నుంచి బ్లూ కాలర్ కార్మికులు పెద్ద సంఖ్యలో ఆ దేశాలకు వెళ్లేవారు. అయితే అది ఇప్పుడు 90 శాతం తగ్గింది. ఇప్పుడు వారి స్థానాన్ని యూపీ, బిహార్‌కు చెందిన కార్మికులు భర్తీ చేస్తున్నారు.

2023 మొదటి ఏడు నెలల్లో, జీసీసీ దేశాలకు వెళ్లే భారతీయ కార్మికుల సంఖ్య 50 శాతం పెరిగింది. వాళ్లలో ఎక్కువ మంది యూపీ, బిహార్‌కు చెందినవారే.

తవిషి పాండే మాట్లాడుతూ, "పట్నాలోని ప్రాంతీయ కార్యాలయం ప్రతి సంవత్సరం సుమారు మూడు నుంచి నాలుగు లక్షల పాస్‌పోర్ట్‌లు జారీ చేస్తోంది. చాలా మంది ప్రజలు గల్ఫ్‌లోని ఇస్లామిక్ దేశాలలో పని చేయడానికి పాస్‌పోర్ట్‌లు తీసుకుంటున్నారు. ఇప్పుడు గల్ఫ్ దేశాలకు వెళ్లడం పెరిగింది. సివాన్, గోపాల్‌గంజ్ నుంచి గల్ఫ్‌కు వలస వెళ్లేవాళ్లు ఎక్కువగా ఉంటున్నారు’’ అని తెలిపారు.

గల్ఫ్‌లోని ఇస్లామిక్ దేశాల్లో దాదాపు 90 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. యూఏఈలో 34 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. సౌదీ అరేబియాలో 26 లక్షల మంది భారతీయులు ఉన్నారు.

2023లో భారతీయులు విదేశాల నుంచి సుమారు లక్ష కోట్ల రూపాయలను భారతదేశానికి పంపారు. ఇందులో అత్యధిక వాటా గల్ఫ్‌లో నివసిస్తున్న భారతీయులదే. ఈ లక్ష కోట్ల రూపాయల్లో ఒక్క యూఏఈలో నివసిస్తున్న భారతీయుల వాటాయే 18 శాతం.

పట్నాలోని ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం బయట ప్రతిరోజూ వందలాది మంది ప్రజలు క్యూలో నిలబడి కనిపిస్తారు. వాళ్లలో యువతే ఎక్కువ. మీరు వాళ్లతో మాట్లాడితే, వాళ్ల గొంతులో బిహార్ గురించి నిరాశావాదం కనిపిస్తుంది. ఈ యువత డిగ్రీ లేదా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులు.

భారతీయ ముస్లింలు గల్ఫ్ వెళ్లేందుకు ఎక్కువ ఉత్సాహం చూపిస్తారనిపిస్తుంది. కానీ ఇది నిజం కాదు. గల్ఫ్ వెళ్లేవారిలో ముస్లింలకంటే హిందువులే ఎక్కువ.

పట్నాలోని ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం ఫోటో
ఫొటో క్యాప్షన్, పట్నాలోని ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం

ముస్లింల కంటే హిందువులే ఎక్కువ మంది గల్ఫ్‌కు వెళ్తున్నారని పాస్‌పోర్టు కార్యాలయం బయట ఉండే క్యూ లైన్‌ను చూస్తే తెలుస్తుంది.

ఆరాకు చెందిన అమన్ తివారీ ఒమన్‌కు వెళ్లేందుకు పాస్‌పోర్ట్‌ తీసుకోవడానికి వచ్చారు. ఆయన ఇంటర్మీడియట్ పాసయ్యారు. భారతదేశంలో ఉపాధి పొందడం కష్టమా అని ఆయన్ని అడిగితే, "నేను ఒమన్‌కు వెళ్లి కూలీగా పని చేయాలి. కానీ దాని వల్ల నాకు మంచి డబ్బు వస్తుంది. భారతదేశంలో, నాకు అదే పనికి తక్కువ డబ్బు వస్తుంది. అంతే కాకుండా ఉండడానికి ఠికానా ఉండదు" అని చెప్పారు.

"భారతదేశంలో, మీరు ప్రతి నెలా ఇంటికి 20 వేల రూపాయలు పంపాలంటే, మీ జీతం కనీసం 30 వేల రూపాయలు ఉండాలి. ఢిల్లీ-ముంబైల్లో రూ.30 వేలు జీతం వచ్చినా రూ.10 వేలు పొదుపు చేయడం కష్టం. భారతదేశంలో ప్రైవేట్ రంగంలో పనిచేసే ఏ కూలీకి రూ.30 వేలు జీతం రాదు. వృద్ధులైన తల్లిదండ్రులను వదిలి వేరే దేశానికి వెళ్లేందుకు మేం సిద్ధపడడానికి ఇదే కారణం’’ అని అమన్ వివరించారు.

20 ఏళ్లుగా నితీష్ కుమార్ అధికారంలో ఉన్నా బిహార్‌లో విద్య, ఉద్యోగాల పరిస్థితి గతంలో కంటే దారుణంగా మారిందని అమన్ సహోద్యోగి సరోజ్ పాండే చెప్పారు. మొన్నటి వరకు వ్యవసాయం లాభసాటిగా ఉండేదని, ఇప్పుడు వ్యవసాయం చేస్తే నష్టాలు వస్తున్నాయని చెప్పారు.

మామ్జార్ బీచ్‌లో ఛత్ ఉత్సవ ఫోటో
ఫొటో క్యాప్షన్, షార్జాలోని మామ్జార్ బీచ్‌లో ఛత్ ఉత్సవాన్ని జరుపుకుంటున్న బిహార్ హిందువులు

మతం, రాజకీయాలు

బిహార్‌కు చెందిన ప్రసిద్ధ చరిత్రకారుడు ఇంతియాజ్ అహ్మద్ మాట్లాడుతూ “గల్ఫ్‌లో నివసిస్తున్న భారతీయులు భారతదేశంలో కొనసాగుతున్న ద్వేషం, హింస పట్ల చాలా అసంతృప్తితో ఉన్నారు. అరబ్ దేశాలలో వాళ్లు కలిసి మెలిసి జీవిస్తున్నారు ఎందుకంటే అరబ్బులు వారిని కూలీలుగా తప్ప ముస్లింలుగానో లేదా హిందువులుగానో పరిగణించరు. అటువంటి పరిస్థితిలో, భారతీయులంతా కలిసిమెలిసి జీవిస్తారు. వాళ్లు సుఖదు:ఖాలను పంచుకుంటారు.’’ అంటారు.

“భారతదేశంలో మతం ఆధారంగా హింస లేదా ద్వేషం పెరిగితే, ఆ వార్త ప్రపంచంలోని ప్రతి మూలకు వెళుతుంది. ఇది భారతదేశ ప్రతిష్టను దిగజార్చడమే కాకుండా సాధారణ ప్రజలకు ఒక చెడు సందేశాన్ని పంపుతుంది’’ అన్నారు ఇంతియాజ్.

సౌదీ అరేబియాలో నివసిస్తున్నప్పుడు, భారత రాజకీయాల గురించి తోటి ముస్లింలతో ఎప్పుడైనా చర్చించారా అని రామేశ్వర్ సావ్‌ను ప్రశ్నిస్తే, "భారతీయ ముస్లింలకు బీజేపీ అంటే ఇష్టం లేదు. గల్ఫ్‌లో నివసించే భారతీయ ముస్లింలూ బీజేపీని విమర్శిస్తారు. కానీ విదేశాలలో మన దేశం గురించి చెడుగా మాట్లాడకూడదని నేను భావిస్తున్నాను. పాకిస్తాన్ ముస్లింలు అలా చేయరు" అన్నారు.

కానీ బీజేపీని విమర్శిస్తే అది దేశాన్ని విమర్శించినట్లు ఎలా అవుతుందని అడిగితే దీనిపై రామేశ్వర్ స్పందిస్తూ , ‘‘బీజేపీ అనేది భారత రాజకీయ పార్టీ. అధికారంలో ఉన్న పార్టీ. అలాంటి పరిస్థితుల్లో దేశాన్ని, పార్టీని విడివిడిగా చూడలేం,’’ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)