సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ దేశాలతో బైడెన్‌కు వచ్చిన సమస్య ఏంటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, క్సేనియా గోగిడిడ్జ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
గాజాలో యుద్ధం ప్రారంభమయ్యే ముందు, మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో శాంతిని నెలకొల్పడంపై చర్చలు బలంగా జరిగాయి. ఇజ్రాయెల్‌ను సౌదీ అరేబియా గుర్తించే దిశగా చర్చలు సాగుతున్నట్లు కనిపించాయి. త్వరలో పాలస్తీనా దేశంగా మ్యాప్‌లో కనిపిస్తుందని ఆశించారు.
ఒప్పందం కుదిరాక, ఇరాన్ నుంచి ఏదైనా ముప్పు తలెత్తితే సౌదీ అరేబియాకు అమెరికా భద్రత కల్పించే అవకాశం ఉండేది.
కానీ, 2023 అక్టోబర్ 7 ఘటనతో అంతా మారిపోయింది. ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేసింది, అనంతరం గాజాపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. దీంతో మిడిల్ ఈస్ట్‌లో శాంతి పునరుద్ధరణ ప్రయత్నాలు ఆగిపోయాయి.
అయితే, ఇటీవల అమెరికా, సౌదీ అరేబియా దౌత్యవేత్తలు శాంతి ఒప్పందంపై చర్చలు తిరిగి ప్రారంభించారు. మరి, ఇదంతా సులువుగా సాధ్యమవుతుందా?
హమాస్, పాలస్తీనియన్లకు ఇరాన్ మద్దతుగా ఉంటుంది.
అయితే, ఇజ్రాయెల్‌ను సౌదీ అరేబియా గుర్తించడం ఇరాన్‌కు నచ్చదు.
ఇజ్రాయెల్, సౌదీ అరేబియాల మధ్య సంబంధాలు మెరుగుపడటానికి, 'పాలస్తీనా ప్రత్యేక దేశం' ఏర్పాటుకు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు అంగీకరించేలా చేయడానికి అమెరికా ప్రయత్నాలు చేస్తోంది.
ఈ ఒప్పందం మిడిల్ ఈస్ట్ దేశాల మధ్య సంబంధాలను పూర్తిగా మార్చడమే కాకుండా, అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్‌కు విదేశాంగ విధానంలో ఇది ఒక పెద్ద విజయంగా నిలుస్తుంది.
రాబోయే అధ్యక్ష ఎన్నికలలో బైడెన్ దానిని సద్వినియోగం చేసుకోవచ్చు.
మరోవైపు, క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ నాయకత్వంలో దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సౌదీ అరేబియా చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లకు సాయపడగలదు.
అదే సమయంలో వారు తమ దేశాన్ని పర్యాటక కేంద్రంగా మార్చడానికి మరింత శ్రద్ధ చూపొచ్చు.
ఇది కాకుండా, ఇరాన్ నుంచి ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా సహాయపడే మిడిల్ ఈస్ట్‌లోని ఒక శక్తివంతమైన మిత్రపక్షాన్ని ఇజ్రాయెల్ పొందేది.
కానీ ఈ ప్రణాళిక అసంపూర్తిగా ఉండిపోయింది. ఇప్పుడు చర్చలు సఫలం కావాలంటే మునుపటి కంటే ఎక్కువ సవాళ్లు ముందున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
సవాళ్లు ఏమిటి?
మొదటి అతిపెద్ద సవాల్ ఇజ్రాయెల్-గాజా యుద్ధం. దానిని ఆపకుండా సాగే చర్చలకు అర్థం లేదు.
రెండో సమస్య ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు. పాలస్తీనా ఏర్పాటును ఆయన పదే పదే వ్యతిరేకిస్తున్నారు.
మూడో సవాల్ అమెరికా పార్లమెంట్, ఇది సౌదీ అరేబియాతో కుదుర్చుకునే ఒప్పందాన్ని ఆమోదించవలసి ఉంటుంది. అయితే, సమయం గడిచిపోతోంది. ఎంత వీలైతే అంత తొందరగా ఒప్పందం పూర్తిచేయాలని బైడెన్ అనుకుంటున్నారు. ఎందుకంటే అధ్యక్ష ఎన్నికలు వచ్చేస్తున్నాయి.
పాలస్తీనా సమస్య ప్రతి ఒక్కరికీ ఇబ్బందులను సృష్టిస్తోంది. పాలస్తీనాను గుర్తించబోమని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మొండిగా కూర్చున్నారు. అలా చేయకపోతే తన మిత్రబృందం దూరమవుతుందనే ఆందోళన నెతన్యాహులో ఉంటుంది.
ఇదే జరిగితే, ఇజ్రాయెల్‌లో మళ్లీ ఎన్నికలు జరుగుతాయని, అందులో తాను ఓడిపోవచ్చని ఆయన భయపడుతున్నారు.
పాలస్తీనా కోసం సౌదీ అరేబియా
మరోవైపు, సౌదీ క్రౌన్ ప్రిన్స్ కూడా పాలస్తీనాకు మద్దతుగా మొండిగా వెళుతున్నారు. పాలస్తీనా సమస్య పరిష్కారం కాకుండా పరిస్థితి సాధారణం కాదని వారి అభిప్రాయం.
అమెరికా కూడా పాలస్తీనా దేశాన్ని ఒప్పందంలో ప్రధానంగా ఉంచుతోంది. అంతేకాదు, యుద్ధం తర్వాత గాజా భవిష్యత్తు అనేది ఇజ్రాయెల్‌తో అరబ్ దేశాల సఖ్యతపై ఆధారపడి ఉంటుంది.
హమాస్ ఇజ్రాయెల్ యుద్ధానికి ముందు, ఇజ్రాయెల్ కనీసం పాలస్తీనా పాలనను అంగీకరిస్తామని వాగ్దానం చేస్తే సంబంధాలను సాధారణీకరించడానికి సిద్ధంగా ఉన్నామని సౌదీ అరేబియా ఒక ప్రైవేట్ సంభాషణలలో స్పష్టం చేసింది. అయితే, గాజా యుద్ధం, వేలాది మరణాలు ఇప్పుడు అక్కడ శాంతి ప్రాముఖ్యతను పెంచింది.
ఇజ్రాయెల్‌తో భవిష్యత్ సంబంధాలను పునరుద్దరించడానికి ఇజ్రాయెల్-పాలస్తీనా వివాద పరిష్కారాన్ని సౌదీ అరేబియా ఒక షరతుగా మార్చడంలో ఆశ్చర్యం లేదని అజీజ్ అల్గాషియాన్ అంటున్నారు.
అజీజ్ సౌదీ అరేబియాకు చెందిన ఇజ్రాయెల్-సౌదీ అరేబియా సంబంధాల విశ్లేషకులు.
అజీజ్ ప్రకారం.. ఇప్పుడు గాజాలో పరిస్థితి కారణంగా ఇరు వైపులా మునుపటి కంటే ఎక్కువ సవాళ్లు ఉన్నాయని, అరబ్ మిత్రుల కారణంగా పాలస్తీనా సమస్యను క్రౌన్ ప్రిన్స్ వెనక్కి నెట్టలేరు.
అయితే, ఇజ్రాయెల్ నుంచి ఖచ్చితమైన హామీ లేకున్నా సంబంధాలను సాధారణీకరించడానికి సౌదీ అరేబియా అంగీకరిస్తుందని వార్తా సంస్థ రాయిటర్స్ ఫిబ్రవరిలో తెలిపింది.
పాలస్తీనా దేశంపై ఇజ్రాయెల్ నుంచి చిన్న వాగ్దానం కూడా సౌదీ అరేబియాకు సరిపోతుందని ఆ ఏజెన్సీ అభిప్రాయపడింది.

ఫొటో సోర్స్, Getty Images
రఫాపై దాడితో ఆందోళన
ఇప్పుడు అమెరికా, సౌదీ అరేబియా రెండింటికీ అత్యంత ముఖ్యం యుద్ధాన్ని ముగించడం, దీర్ఘకాలిక కాల్పుల విరమణకు అంగీకరించడం.
మరోవైపు గాజాలో యుద్ధం కొనసాగుతోంది. అమెరికా పదేపదే వ్యతిరేకించినప్పటికీ, ఇజ్రాయెల్ రఫాలో దాడి గురించి ఆలోచిస్తోంది.
అక్కడ నివసిస్తున్న సుమారు లక్ష మందిని వారి స్థలాలను విడిచి వెళ్లాలంటూ ఇజ్రాయెల్ ఆదేశించింది. ఇపుడు కాల్పుల విరమణకు అవకాశం గతంలో కంటే కష్టంగా మారింది.
ఈ వారం ఈజిప్టులో ఇజ్రాయెల్, హమాస్ మధ్య కొనసాగిన శాంతి చర్చలు కూడా అసంపూర్తిగానే ఉన్నాయి.
మరోవైపు, రఫాను ఆక్రమించడంపై హమాస్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇజ్రాయెల్ పబ్లిక్ రేడియో స్టేషన్ కాన్ ప్రకారం, మే ప్రారంభంలో, సౌదీ అరేబియాతో సంబంధాలను పునరుద్దరణపై నిర్ణయం తీసుకోవడానికి ఇజ్రాయెల్‌కు అమెరికా అధికారులు ఒక నెల సమయం ఇచ్చారు.
రఫా, రియాద్ (సౌదీ అరేబియా రాజధాని)లో ఇజ్రాయెల్ ఒకటి ఎంచుకోవలసి ఉంటుందని ది న్యూయార్క్ టైమ్స్‌లో కాలమిస్ట్ థామస్ ఫ్రైడ్‌మాన్ వివరించారు.
ఇజ్రాయెల్ రఫాలో పరిమిత దాడులను చేస్తోందని థామస్ చెప్పారు.
రఫాపై భారీ సైనిక దాడి అనేది చర్చల అవకాశాలను అంతం చేస్తుందని అమెరికా గతంలో హెచ్చరించింది.

ఫొటో సోర్స్, Getty Images
సౌదీ అరేబియా ఏం కోరుతోంది?
మిడిల్ ఈస్ట్‌ను మార్చగల సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ మధ్య సంబంధాలను సాధారణీకరించడానికి గత వేసవిలో చర్చలు చురుకుగా ప్రారంభమయ్యాయి.
అమెరికా నుంచి భద్రతా హామీలతో ఇజ్రాయెల్‌తో సంబంధాలను సాధారణీకరించడానికి సౌదీ అరేబియా అంగీకరించింది.
అయితే, అటువంటి ఒప్పందంపై పలువురు విశ్లేషకులు, దౌత్యవేత్తలు సందేహాలు వ్యక్తం చేశారు.
నెతన్యాహు కారణంగా సౌదీ అరేబియా, అమెరికా 'ప్లాన్ బి'ని రూపొందించుకున్నట్లు బ్లూమ్‌బర్గ్‌లో మే ప్రారంభంలో కొన్ని మూలాలను (సోర్స్) ఉటంకిస్తూ రాశారు.
ఈ ప్రణాళిక ప్రకారం ఇజ్రాయెల్‌తో సంబంధాల అంశం లేకుండా సౌదీ అరేబియా, అమెరికాల మధ్య సైనిక ఒప్పందంపై చర్చ జరిగింది.
చైనా, ఇరాన్, రష్యా నుంచి సౌదీని దూరం చేసి భవిష్యత్తులో పాశ్చాత్య మిత్రదేశాలకు దగ్గరయ్యేలా ఒప్పించాలని కూడా అమెరికా ప్లాన్ చేసింది.
అయితే సౌదీ అరేబియా వాస్తవానికి అమెరికా కోరుకున్నట్లు వ్యవహరిస్తుందనే గ్యారెంటీ లేదు.
అమెరికాతో ప్రత్యేక సంబంధాలను ఏర్పరచుకోవడానికి సౌదీ అరేబియా ఇష్టపడటం లేదని యూరోపియన్ కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్ (ఈసీఎఫ్ఆర్)లో ఫెలో అయిన సింజియా బియాన్కో అంటున్నారు.
బియాన్కో ప్రకారం.. డిజిటల్ లేదా సైబర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో చైనాతో సహకారాన్ని పరిమితం చేయడానికి లేదా నిలుపుదలకు సౌదీ సిద్ధపడొచ్చు. కానీ, చైనీస్ కరెన్సీలో సాగే చమురు వ్యాపారం వంటి సంబంధాలను తెంచుకోవడానికి అంగీకరించదు.
క్రౌన్ ప్రిన్స్ భవిష్యత్తు కోసం సౌదీ అరేబియాను తీర్చిదిద్దుతున్నారు. మత, జాతి వైరుధ్య దేశాల మధ్య వివాదాలకు దూరంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నారు.
ఒత్తిడి, అస్థిరత అనేది పెట్టుబడిని అడ్డుకునే అంశాలు కాబట్టి క్రౌన్ ప్రిన్స్ ఆచరణాత్మకంగా వ్యవహరిస్తారు. ఈ రంగంలో కేవలం ఒక భాగస్వామిపై ఆధారపడకూడదని ఆయన అనుకుంటారు.
గత వేసవిలో చైనా మధ్యవర్తిత్వం ద్వారా, సౌదీ అరేబియా తన బద్ధ శత్రువు ఇరాన్, సిరియాలతో దౌత్య సంబంధాలను పునరుద్ధరించడానికి అంగీకరించింది.
ఇంతకుముందు కూడా ఖతార్, తుర్కియేలతో సౌదీ అరేబియా శాంతిని నెలకొల్పింది.
2023 సెప్టెంబర్‌లో యూరోపియన్ కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్ ఒక సర్వే నిర్వహించింది. దీని ప్రకారం అమెరికా, చైనా రెండింటితోనూ సత్సంబంధాలు కొనసాగించాలని సౌదీలో 77 శాతం మంది అభిప్రాయపడ్డారు.
అయితే, సర్వేలో పాల్గొన్న వారిలో సగానికి పైగా ప్రజలు వచ్చే ఐదేళ్లలో అమెరికా, చైనాల మధ్య సైనిక వివాదానికి అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఈ పరిస్థితిలో సౌదీ అరేబియా ఎవరికి మద్దతు ఇవ్వాలి? అని ప్రజలను అడిగినప్పుడు, 50 శాతం మంది అమెరికా పేరును, 39 శాతం మంది చైనా పేరును ఎంచుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా, సౌదీ ఒప్పందం ఏమిటి?
సౌదీ అరేబియా, అమెరికాల ద్వైపాక్షిక ఒప్పందంలో రక్షణ రంగంలో సహకార అంశం కూడా ఉంది.
శాంతియుత ప్రయోజనాల కోసం సౌదీ అణుశక్తి సామర్థ్యాల అభివృద్ధికి సహాయపడేందుకు అమెరికా అంగీకరించనుంది.
ఇదొక్కటే కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఆర్థిక సహకారంపై కూడా రెండు దేశాల మధ్య ఒప్పందం జరగాల్సి ఉంది.
దీని ప్రకారం, అమెరికా సహాయంతో సౌదీ అరేబియాలో సెమీకండక్టర్ ఉత్పత్తి కూడా జరుగుతుంది.
ప్రతిఫలంగా, చైనా సాంకేతిక పరిజ్ఞానం పరిమితంగా కొనుగోళ్లు చేస్తామని అమెరికాకు సౌదీ అరేబియా హామీ ఇవ్వాలి.
సౌదీ అణు కార్యక్రమాన్ని అభివృద్ధి చేయడంలో సహాయానికి బదులుగా, అమెరికా అక్కడ సుసంపన్నమైన యురేనియంను పొందుతుంది.
బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, సౌదీ అరేబియాతో ఈ ద్వైపాక్షిక ఒప్పందంపై సంతకం చేయడానికి కొంతమంది అమెరికన్ దౌత్యవేత్తలు సిద్ధంగా ఉన్నారు.
ఈ ఒప్పందం కుదిరిన తర్వాత ఇజ్రాయెల్‌ను అందులో చేరాలంటూ ఆహ్వానిస్తారు.
అమెరికా కాంగ్రెస్‌తోనూ సమస్యే..
అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ సౌదీ అరేబియాలో ఏప్రిల్ నెలలో మాట్లాడుతూ.. " సౌదీ, యూఎస్ ఒప్పందం కుదరడానికి దగ్గరగా ఉంది. దీనికి గాజాలో శాంతి, పాలస్తీనా ప్రభుత్వం స్థాపనకు విశ్వసనీయ మార్గాన్ని ఎంచుకోవాలి" అని అన్నారు.
"మేం ఒక ఒప్పందానికి చాలా దగ్గరగా ఉన్నాం" అని సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ కూడా అన్నారు.
అయితే అదంతా మామూలుగా సాగదు. బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ప్లాన్ బి అంగీకరించినప్పటికీ, వారు అమెరికన్ కాంగ్రెస్‌ను అలా ఒప్పించే అవకాశం లేదు.
ఇజ్రాయెల్‌ను చేర్చని సౌదీ అరేబియాతో ఏ ఒప్పందాన్ని అమెరికన్ కాంగ్రెస్ ఆమోదించదని రిపబ్లికన్ పార్టీ సెనేటర్ లిండ్సే గ్రాహం జెరూసలేం పోస్టుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.
"ఇజ్రాయెల్‌ను మినహాయించిన సౌదీ అరేబియా, యూఎస్‌ల మధ్య ఏ రక్షణ ఒప్పందం కూడా సెనేట్‌లో 67 ఓట్లనైతే పొందలేదు" అని తెలిపారు.
ఇజ్రాయెల్‌తో సంబంధాల పునరుద్దరణకు వాగ్దానం చేయని రియాద్‌తో అమెరికా ఎటువంటి ఒప్పందంపై సంతకం చేయబోదని యుఎస్ డిఫెన్స్ అడ్వైజర్ జేక్ సుల్లివన్ ఫైనాన్షియల్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.
"ఇది ఏకకాలంలో జరుగుతుంది, ఒక సమస్యను మరొకదాని నుంచి వేరు చేయడం అసాధ్యం" అని జేక్ అభిప్రాయపడ్డారు.
సౌదీ అరేబియా, అమెరికాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందం నుంచి ఇజ్రాయెల్‌ను దూరంగా ఉంచుతారని గత కొద్దిరోజుల నుంచి వార్తలొచ్చాయి.
నెతన్యాహు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, సౌదీ అరేబియాతో భారీ ఒప్పందానికి సిద్ధమయ్యేందుకు ఇలాంటి వార్తలు లీక్ చేస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అక్టోబరు 7 హమాస్ దాడికి ముందు కూడా బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వం, పాలస్తీనా విషయంలో వెనక్కి తగ్గేందుకు సిద్ధంగా లేదు.
ప్రత్యేక పాలస్తీనా ఆలోచనను నెతన్యాహు పదేపదే తిరస్కరించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇజ్రాయెల్ ముందున్న దారేంటి?
"నెతన్యాహు ఈ వివాదానికి ఎలాంటి పరిష్కారం కోరుకోవడం లేదు. ఆయన ముందున్న అతిపెద్ద సమస్య తన రాజకీయ ఉనికిని కాపాడుకోవడమే" అని ఫ్రెంచ్ నేషనల్ సెంటర్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్‌లో మిడిల్ ఈస్ట్ వ్యవహారాల నిపుణురాలు స్టెఫానీ లాట్టే అబ్దుల్లా అభిప్రాయపడ్డారు.
"నెతన్యాహు మొత్తం దృష్టి ఈ యుద్ధాన్ని కొనసాగించడం ద్వారా తన రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకోవడంలో ఉంది" అని ది రాయల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ అఫైర్స్, ఇంటర్నేషనల్ థింక్ ట్యాంక్ చాథమ్ హౌస్‌లో నిపుణులు బిలాల్ సాబ్ తెలిపారు.
“కోపంతో ఉన్న ఇజ్రాయెల్ ప్రజలను శాంతింపజేయడానికి వారు ప్రయత్నిస్తున్నారు. యుద్ధం ఆగిన వెంటనే, అక్టోబర్ 7 హమాస్ దాడిని ఆపడంలో విఫలమైనందుకు ప్రజలు ప్రశ్నిస్తారని వారికి బాగా తెలుసు'' అని బిలాల్ చెప్పారు.
అయితే గతంలో నెతన్యాహు, అమెరికా ఒత్తిడికి వెనక్కి తగ్గడం కనిపించింది.
ఏప్రిల్ 14న ఇరాన్ నేరుగా ఇజ్రాయెల్‌పై దాడి చేసినప్పుడు, అమెరికాతో సహా కొన్ని పాశ్చాత్య, అరబ్ దేశాలు పరిస్థితి మరింత దిగజారకుండా నియంత్రించాయి. ఫ్రాన్స్, బ్రిటన్, జోర్డాన్ కూడా ఈ చొరవలో పాల్గొన్నాయి.
ఈ కారణంగా టెల్ అవీవ్, రియాద్ మధ్య సైనిక సహకారానికి మార్గం తెరిచి, సౌదీ అరేబియాతో సంబంధాలను సాధారణీకరించడానికి అమెరికా ఇజ్రాయెల్‌ను ఒప్పించవచ్చని పలువురు విశ్వసిస్తున్నారు.
"యుఎస్ నేతృత్వంలోని ఈ ఒప్పందం టెల్ అవీవ్, వాషింగ్టన్ రెండింటికీ విజయంగా ఉంటుంది" అని ఇజ్రాయెల్ మాజీ డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారు చక్ ఫ్రెలిక్, ఇజ్రాయెల్ వార్తా వెబ్‌సైట్ హారెట్జ్ కోసం రాసిన కాలమ్‌లో తెలిపారు.
సౌదీ అరేబియా, అమెరికాల మధ్య సైనిక ఒప్పందాన్ని పూర్తి చేయాలని ఆహ్వానించడం ద్వారా బైడెన్ అడ్మినిస్ట్రేషన్, నెతన్యాహుకు అనుకూలమైన పరిస్థితులను కల్పించగలదని చక్ ఫ్రెలిక్ అభిప్రాయపడ్డారు.
దీని కోసం బైడెన్ అడ్మినిస్ట్రేషన్ మూడు దశల ప్రణాళికకు మరో పాయింట్ చేర్చవచ్చని తెలిపారు.
ఇందులో ఇజ్రాయెల్, హమాస్‌ల మధ్య యుద్ధం ముగింపు, బందీల విడుదల, సౌదీ, ఇజ్రాయెల్ దేశాల మధ్య సంబంధాల సాధారణీకరణ వంటి అంశాలు ఉంటాయన్నారు.
రిపబ్లికన్ పార్టీ సెనేటర్ లిండ్సే గ్రాహం కూడా ఇజ్రాయెల్‌కు అమెరికన్ ఆఫర్‌ను మంచి అవకాశంగా చెబుతున్నారు.
"ఇజ్రాయెల్ మొదటి ప్రాధాన్యత బందీల విడుదల. కానీ దీర్ఘకాలిక భద్రత కోణం నుంచి చూస్తే సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ దేశాల మధ్య కుదిరే ఒప్పందం ఇజ్రాయెల్ దేశంగా ఏర్పడిన తర్వాత అతిపెద్ద విజయంగా పరిగణిస్తారు" అని లిండ్స్ తెలిపారు.
నెతన్యాహుకు పదవీ గండం
ఇజ్రాయెల్‌లో సంకీర్ణ ప్రభుత్వం పడిపోయి కొత్తగా ఎన్నికలు జరిగితే, నెతన్యాహు పార్టీ ఎన్నికలలో ఓడిపోయే అవకాశం ఉంది.
భవిష్యత్తులో నెతన్యాహు స్థానంలో ఇజ్రాయెల్ పగ్గాలు చేపట్టే వారిలో నేషనల్ యూనిటీ పార్టీ అధినేత, మిలటరీ కేబినేట్ సభ్యుడు బెన్నీ గేట్జ్ ప్రముఖుంగా ఉంటారు.
రియాద్‌తో ఇజ్రాయెల్ ఒప్పందానికి బెన్నీ గేట్జ్ బలమైన మద్దతుదారు.
సౌదీ అరేబియాతో సంబంధాలను సాధారణీకరించడానికి, గాజాలో భద్రతా భాగస్వామ్య ఒప్పందానికి దగ్గరగా ఉందని ఏప్రిల్‌లో బెన్నీ గేట్జ్ చెప్పారు.
హమాస్‌ను గద్దె దించే ప్రయత్నంలో ఇదొక భాగమని ఆయన ఆ సమయంలో అన్నారు.
అయితే, పాలస్తీనా ప్రభుత్వాన్ని గుర్తించడంపై ఆయన స్పష్టంగా ఏమీ చెప్పలేదు. కానీ ఆయన చర్యలు దానిని తిరస్కరించడం లేవని సూచిస్తున్నాయి.
ఇజ్రాయెల్ రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు, బెన్నీ అనేక సార్లు పాలస్తీనా అథారిటీ నాయకుడు మహమూద్ అబ్బాస్‌ను కలిశారు.
ఇవి కూడా చదవండి:
- ఈ నగరం కిందంతా భూగర్భ సొరంగాలే.. మరి వాటిపై భారీ భవనాలు ఎలా కడుతున్నారు?
- Northern Lights: ఆకాశంలో ఈ రంగుల తుపాను మీకెప్పుడైనా కనిపించిందా?
- స్కార్పియన్: మానవ అక్రమ రవాణాలో ఆరితేరిన ఈ యూరప్ మోస్ట్‌వాంటెడ్ క్రిమినల్ బీబీసీ జర్నలిస్టుకు ఎలా దొరికాడంటే....
- ఈ ఊరిలో ఫోన్లు, టీవీలు లేవు, ఇంటర్నెట్ లేదు, అసలు కరెంటే లేదు... మరి ప్రజలు ఎలా జీవిస్తున్నారు?
- పాకిస్తాన్ ఆర్థికసంక్షోభం: ఈసారి చైనా, సౌదీ అరేబియా కూడా కాపాడలేవా
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














