ఇజ్రాయెల్ అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి గాజాలో అమెరికా ఆయుధాలను ప్రయోగించిందా, తాజా నివేదిక ఏం చెబుతోంది?

గాజా

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, టామ్ బతే‌మ్యాన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

గాజా యుద్ధంలో కొన్నిసార్లు ఇజ్రాయెల్ అంతర్జాతీయ మానవతా చట్టాలను ఉల్లంఘిస్తూ అమెరికన్ ఆయుధాలను ఉపయోగించి ఉండవచ్చని అనిపిస్తోందని అమెరికా తెలిపింది.

అంతర్జాతీయ నియమాలకు అనుగుణంగా ఇజ్రాయెల్ ఆయుధాలను వినియోగించి ఉండాల్సిందని అమెరికా వ్యాఖ్యానించింది.

అయితే, ఈ ఉల్లంఘనలకు సంబంధించిన పూర్తి సమాచారం తమ దగ్గర లేదని అమెరికా తెలిపింది.

ఇజ్రాయెల్ అమెరికన్ ఆయుధాల వినియోగానికి సంబంధించిన నివేదికను శుక్రవారం అమెరికా పార్లమెంటులో సమర్పించారు.

గాజా యుద్ధంలో అమెరికన్ ఆయుధాలను ఎలా ఉపయోగించారన్నది సమీక్షించాలని అమెరికా అధ్యక్ష కార్యాలయం ఆదేశించడంతో ఈ నివేదికను రూపొందించారు.

గాజాలో దాడులకు అమెరికన్ ఆయుధాలను ఇజ్రాయెల్ వినియోగించడం గురించి ఈ నివేదికలో చాలా వివరాలు ఉన్నాయి. కానీ, అంతర్జాతీయ మానవతా చట్టాల ఉల్లంఘన గురించి మాత్రం లోతైన వివరాలను వెల్లడించలేదు.

గాజాలో హమాస్‌పై దాడులు చేయడంలో ఇజ్రాయెల్ 'అసాధారణ సైనిక సవాళ్లను' ఎదుర్కొందని ఈ నివేదికలో పేర్కొన్నారు.

మరోవైపు, అంతర్జాతీయ చట్టాలకు లోబడే అమెరికన్ ఆయుధాలను వాడుతామని ఇజ్రాయెల్ ‘నమ్మదగిన’ హామీ ఇచ్చిందని, కాబట్టి ఆ దేశానికి ఆయుధాల సరఫరాను కొనసాగించవచ్చని తెలిపారు.

గాజా

ఫొటో సోర్స్, Reuters

‘ఇజ్రాయెల్ చర్యలను అమెరికా నిత్యం పర్యవేక్షిస్తూనే ఉంటుంది’

హమాస్ 'మౌళిక సదుపాయాలను, మానవ కవచాలను సైనిక ప్రయోజనాల కోసం ఉపయోగిస్తోంది' కాబట్టి, యుద్ధం జరుగుతున్న ప్రాంతంలో వాస్తవాలను కచ్చితత్వంతో గుర్తించడం కష్టంగా మారిందని ఆ నివేదికలో చెప్పారు.

అయితే, అమెరికాలో తయారైన ఆయుధాలపైనే ఇజ్రాయెల్ ఎక్కువగా ఆధారపడుతోంది కాబట్టి, అది కొన్ని సందర్భాల్లో అంతర్జాతీయ మానవతా చట్టాలను ఉల్లంఘించి గాజాపై చేసిన దాడులకు తమ ఆయుధాలు వినియోగించి ఉండవచ్చని ఆ రిపోర్టులో పేర్కొన్నారు.

మరోవైపు, ‘‘సైనిక దాడులతో పౌరులకు తక్కువ హాని కలిగించే పద్ధతులు, అనుభవం, సాంకేతికత ఇజ్రాయెల్ దగ్గర ఉన్నాయి. కానీ, పెద్ద సంఖ్యలో పౌరులు చనిపోవడం చూస్తే ఇజ్రాయెల్ సైన్యం ఆయుధాలను సమర్థవంతంగా ఉపయోగించిందా? లేదా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది’’ అని ఆ రిపోర్టులో రాశారు.

సామాన్యులకు ప్రాణ హానిని తగ్గించేందుకు ఇజ్రాయెల్ తీసుకున్న చర్యలు సరిపోవని ఐక్యరాజ్యసమితి, హ్యుమానిటేరియన్ సంస్థలు చెప్పాయి.

ఈ యుద్ధం మొదలయ్యాక మొదటి కొన్ని నెలలు గాజాకు మానవతా సహాయం అందించేందుకు అమెరికా చేసిన ప్రయత్నాలకు ఇజ్రాయెల్ పూర్తిగా సహకరించలేదని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. అయితే, ఇప్పుడు ఆ పరిస్థితి మారింది.

"గాజాకు అమెరికా పంపుతున్న మానవతా సహాయం పంపిణీ లేదా రవాణాను ఇజ్రాయెల్ ప్రభుత్వం అడ్డుకుందా లేదా కొన్ని ప్రాంతాలకే పరిమితం చేసిందా? అన్నది ప్రస్తుతానికి అంచనా వేయలేకపోయాం" అని ఈ నివేదికలో పేర్కొన్నారు.

ఈ నివేదిక రచయితల్లో గతంలో తుర్కియేలో అమెరికా రాయబారిగా పనిచేసిన డేవిడ్ సాటర్‌ఫీల్డ్ కూడా ఉన్నారు. ఈ తరహా నివేదిక రూపొందించడం ఇదే మొదటిదని ఆయన బీబీసీకి చెప్పారు. ఇజ్రాయెల్ చర్యలను అమెరికా నిత్యం సమీక్షిస్తూనే ఉంటుందన్నారు.

ఇంత తీవ్రమైన ఘర్షణను ప్రపంచం ఎన్నడూ చూడలేదని, స్పష్టమైన, విశ్వసనీయమైన నివేదిక ఇచ్చేందుకు అనేక రకాల ఆధారాలనూ పరిశీలించామని ఆయన చెప్పారు.

వీడియో క్యాప్షన్, ఇజ్రాయెల్ వైమానిక దాడిలో ఓ చెయ్యి కోల్పోయిన 10 ఏళ్ల చిన్నారి సొమాయా

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)