ఇజ్రాయెల్- గాజా యుద్ధం: అమెరికా హెచ్చరికలకూ తలొగ్గని నెతన్యాహు..

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మైక్ వెండ్లింగ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
యుద్ధంలో ఇజ్రాయెల్ ఒంటరిగా నిలబడగలదని ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రతిజ్ఞ చేశారు. గాజాలోని రఫాలో పూర్తి స్థాయి దాడులకు దిగితే ఆయుధ సరఫరాను నిలిపివేస్తామని అమెరికా హెచ్చరించిన తర్వాత ఈ ప్రకటన వచ్చింది.
ఇజ్రాయెల్ మిలిటరీ సోమవారం 'పరిమిత ఆపరేషన్' ప్రారంభించిన తర్వాత వేలాది మంది ఈ దక్షిణ నగరం నుంచి పారిపోయారు.
ఇజ్రాయెల్ ఆపరేషన్‌ను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇప్పటికే వ్యతిరేకించారు, 'రెడ్ లైన్' దాటుతోందని హెచ్చరించారు.
అయితే, నెతన్యాహు అమెరికా హెచ్చరికను పట్టించుకోలేదు, ఇజ్రాయెల్ పోరాడుతుందని ప్రకటించారు.
ఒంటరిగా నిలబడతామని, అవసరమైతే చేతి గోళ్లతోనైనా పోరాడుతామన్నారు.
అమెరికా హెచ్చరికలను తోసిపుచ్చుతూ నెతన్యాహు 1948 నాటి యుద్ధాన్ని కూడా గుర్తుచేశారు, అప్పట్లో కొత్తగా ఏర్పడిన ఇజ్రాయెల్‌పై అరబ్ దేశాలు జరిపిన దాడిని ఆయన ప్రస్తావించారు.
''76 ఏళ్ల క్రితం జరిగిన స్వాతంత్య్ర సంగ్రామంలో అనేకమందికి వ్యతిరేకంగా మేం నిలబడ్డాం, మా వద్ద అంతగా ఆయుధాలు లేవు. కానీ మా మధ్య ఉన్న గొప్ప వీరత్వం, ఐక్యతతో విజయం సాధించాం" అని నెతన్యాహు అన్నారు.

ఫొటో సోర్స్, EPA
మమ్మల్ని లొంగదీసుకోలేరు: ఇజ్రాయెల్ రక్షణ మంత్రి
రఫాలో మారణ హోమానికి కారణమవుతాయనే భయంతో అమెరికా పద్దెనిమిది వందల 2000 ఎల్బీ బాంబులు, పదిహేడు వందల 500 ఎల్బీ బాంబుల సరఫరా నిలిపివేయడంతో నెతన్యాహు ప్రభుత్వం ఇరకాటంలో పడింది.
బుధవారం సీఎన్ఎన్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బైడెన్ మరింత దూకుడుగా మాట్లాడారు, దాడులు అలాగే ముందుకు సాగితే ఫిరంగి షెల్స్, ఇతర ఆయుధాల సరఫరాను నిలిపివేస్తానన్నారు.
ఇదే సమయంలో అమెరికా హెచ్చరికలను ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ తోసిపుచ్చారు. ''ఇజ్రాయెల్ శత్రువులు అలాగే వారి స్నేహితులు మా దేశాన్ని లొంగదీసుకోలేరని తెలుసుకోవాలి'' అని అన్నారు.
"మేం బలంగా నిలబడతాం, మా లక్ష్యాలను సాధిస్తాం" అని గాలంట్ అన్నారు.

ఫొటో సోర్స్, REUTERS
రఫాలో ఆహారం అందడం లేదు: ఐక్యరాజ్య సమితి
రఫాలోకి ఇజ్రాయెల్ ట్యాంకులు చేరడంతో సోమవారం నుంచి 80,000 మందికి పైగా ప్రజలు అక్కడి నుంచి పారిపోయారని ఐక్యరాజ్యసమితి చెప్పిన కొన్ని గంటల తర్వాత ఈ వ్యాఖ్యలు వచ్చాయి.
నగరంలో ఇప్పటికే పది లక్షల మందికి పైగా జనం ఆశ్రయం పొందుతున్నారని, వారికి ఆహారం తగ్గిపోతోందని ఐక్యరాజ్యసమితి అంటోంది.
వాహనాలకు ఇంధనం కూడా అయిపోతోందని, సమీపంలోని క్రాసింగ్‌ల ద్వారా సహాయం అందడం లేదని తెలిపింది.
ఇజ్రాయెల్ దళాలు ఈజిఫ్టుతో కలిసే రాఫా క్రాసింగ్‌ను నియంత్రణలోకి తీసుకొని, మూసివేశాయి. కెరెమ్ షాలోమ్ క్రాసింగ్‌కు సిబ్బంది, సరుకు లారీలు చేరుకోవడం చాలా ప్రమాదకరమని ఐక్యరాజ్యసమితి అంటోంది.

ఫొటో సోర్స్, Getty Images
ఇజ్రాయెల్‌ను బైడెన్ నమ్మడం లేదంటున్న వైట్ హౌస్
రఫాలో మిగిలిపోయిన హమాస్ ఫైటర్లే లక్ష్యంగా దాడులు చేస్తున్నామని ఇజ్రాయెల్ చెబుతోంది.
అయినప్పటికీ పూర్తి స్థాయి దాడి చేయడం లేదనే మాటకు కట్టుబడి ఉండటానికి ఇజ్రాయెల్ నిరాకరించింది.
హమాస్‌ను ఓడించాలనే ఇజ్రాయెల్ లక్ష్యం రఫాలో దాడితో ముందుకు సాగుతుందని బైడెన్ నమ్మడం లేదని వైట్‌హౌస్ జాతీయ భద్రతా ప్రతినిధి జాన్ కిర్బీ అన్నారు.
"హమాస్ శాశ్వత ఓటమే ఇజ్రాయెల్ లక్ష్యం, మేం వారితో ఆ లక్ష్యాన్ని పంచుకుంటాం" అని కిర్బీ చెప్పారు.
"మేం ఏదో ఒకవిధంగా ఇజ్రాయెల్ నుంచి దూరంగా వెళుతున్నాం లేదా హమాస్‌ను ఓడించడంలో సహాయం చేయడానికి సిద్ధంగా లేమనే వాదనలు వాస్తవాలతో సరిపోవు" అని ఆయన పేర్కొన్నారు.
రఫాలో సోమవారం రాత్రి గ్రౌండ్ ఆపరేషన్ ప్రారంభించే ముందు నివాసితులను ఖాళీ చేయాలంటూ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) ఆదేశించింది.
కానీ, రఫాలోని అల్-జెనీనే పరిసరాల్లో ఇజ్రాయెల్ వైమానిక దాడిలో గురువారం మధ్యాహ్నం ఇద్దరు వ్యక్తులు మరణించారని పాలస్తీనా మీడియా తెలిపింది.
తరలింపు జోన్‌లో కాకుండా ఈజిప్టు సరిహద్దు పక్కనే ఉన్న బ్రెజిల్ సమీపంలోని ప్రాంతంలో జరిగిన వైమానిక దాడిలోనూ మరో ముగ్గురు మరణించినట్లు సమాచారం.
ఇజ్రాయెల్, అమెరికాతో పాటు పలు దేశాలు హమాస్, పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్ (పీఐజే)లను తీవ్రవాద సంస్థలుగా ఆరోపిస్తూ నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
తూర్పు శివార్లలో ఇజ్రాయెల్ దళాలను మోర్టార్ బాంబులు, యాంటీ ట్యాంక్ క్షిపణులతో లక్ష్యంగా చేసుకున్నామని ఈ గ్రూపులు చెబుతున్నాయి.
రఫాకు తూర్పున బూబీ-ట్రాప్డ్ సొరంగం మీదా మూడు ఇజ్రాయెల్ సైనిక వాహనాలు ప్రయాణిస్తుండగా ఆ సొరంగం పేల్చివేసినట్లు హమాస్ తెలిపింది.
పేలుడు కారణంగా తమ ముగ్గురు సైనికులు గాయపడ్డారని ఐడీఎఫ్ తెలిపింది.
ఇజ్రాయెల్ రాత్రి జరిపిన దాడిలో పశ్చిమ తాల్ అల్-సుల్తాన్ పరిసరాల్లోని ఒక ఇల్లు దెబ్బతినడంతో అందులో ఉంటున్న కుటుంబంలోని ఐదుగురు మరణించినట్లు నివేదికలు వెల్లడయ్యాయి.
వీరిలో ముగ్గురు పిల్లలు ఉన్నారని, వారిలో ఒకరు ఏడాది వయసున్న పసిపాప ఉందని వైద్యులు తెలిపారు.
శాంతి ఒప్పందంపై సన్నగిల్లిన ఆశలు
గత వారం శాంతి ఒప్పందంపై ఆశలు చిగురించినా, అవీ క్షీణిస్తున్నట్లే కనిపిస్తున్నాయి. గురువారం కైరోలో ఇజ్రాయెల్, హమాస్ ప్రతినిధులు పరోక్ష చర్చలను ముగించారు.
గాజాలో ఏడు నెలల యుద్ధం తర్వాత, రఫా నగరంలోకి వెళ్లకుండా, అక్కడి హమాస్ బెటాలియన్లను తొలగించకుండా విజయం అసాధ్యం అని ఇజ్రాయెల్ నొక్కి చెబుతోంది.
అక్టోబరు 7న దక్షిణ ఇజ్రాయెల్‌పై హమాస్ దాడికి ప్రతిస్పందనగా దానిని నాశనం చేయడానికి గాజాలో ఇజ్రాయెల్ సైనిక దాడిని ప్రారంభించింది.
హమాస్ దాడిలో సుమారు 1,200 మంది మరణించారని, 252 మందిని బందీలుగా తీసుకెళ్లారని ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు.
ఇప్పటికీ హమాస్ వద్ద 128 మంది బందీలుగా ఉన్నారని, వీరిలో 36 మంది చనిపోయారని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది.
మరోవైపు, ఇజ్రాయెల్ దాడితో గాజాలో 34,900 మందికి పైగా మరణించినట్లు హమాస్ ఆధ్వర్యంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఇవి కూడా చదవండి:
- బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్: మహిళా రెజ్లర్లకు లైంగిక వేధింపులపై అభియోగాల నమోదు
- మాల్దీవులు: ‘ఇండియా అవుట్’ అన్న ఆ ప్రభుత్వమే భారత్‌కు విదేశాంగ మంత్రిని ఎందుకు పంపింది, తెర వెనక ఏం జరుగుతోంది?
- పెనైల్ క్యాన్సర్: పురుషాంగం తొలగించడానికి కారణమవుతున్న ఈ క్యాన్సర్ ఎలా వస్తుంది?
- World Asthma Day: ఆస్తమా ఎందుకు వస్తుంది? రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- ‘మా నాన్న సీఎం’
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














