ఇజ్రాయెల్‌ను పశ్చిమ దేశాలు అడ్డుకునేలా చేస్తున్న ఈ ప్రాంతం ఏంటి? అక్కడ ఏం జరుగుతోంది?

ఫొటో సోర్స్, Reuters
అమెరికా సహా పశ్చిమదేశాల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ దక్షిణ గాజాలోని రఫాలో భారీ ఎత్తున సైనిక చర్య చేపడతామని ఇజ్రాయెల్ బెదిరిస్తోంది.
రఫాలో కనుక ఇజ్రాయెల్ అన్నంతపనికి దిగితే, అక్కడ ఆశ్రయం పొందుతున్న ప్రజలపై తీవ్రమైన ప్రభావం పడుతుంది.
గాజాలోని 22 మంది లక్షల మందిలో దాదాపు సగం మంది ప్రస్తుతం రఫాలో ఆశ్రయం పొందుతున్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు గుడారాలలోనూ తాత్కాలిక ఇళ్ళలోనూ నివసిస్తున్నారు.
రఫాలో ఉన్న హమాస్ బెటాలియన్లను నాశనం చేస్తామని, తద్వారా తన యుద్ధ లక్ష్యాన్ని నెరవేర్చుకుంటానని ఇజ్రాయెల్ చెబుతోంది.
మే 7వ తేదీన ఇజ్రాయెలీ ట్యాంకులు రఫాలోని ఓ భాగాన్ని ఆక్రమించుకోవడానికి కదిలాయి. ఇజ్రాయెల్ ట్యాంకులు ఈజిప్ట్‌ను దాటి ఇక్కడకు చేరుకున్నాయి.
గాజాకు సాయం అందించేందుకు ఈ మార్గం చాలా ముఖ్యమైనది.
అంతకుముందు రఫాలోని తూర్పుప్రాంతంలోని లక్షమంది ప్రజలను ఖాళీచేయాల్సిందిగా ఇజ్రాయెల్ ఆదేశించింది.
ఇజ్రాయెల్ తన చర్యను పరిమిత సైనిక చర్యగా పేర్కొంది.
ప్రస్తుతం ఇక్కడి పరిస్థితులు అక్టోబరు7 నాటికి ముందులా లేవు.
అప్పటికంటే ఇప్పుడు ఇక్కడ ఐదురెట్ల జనాభా ఎక్కువగా నివసిస్తోంది.
అక్టోబరు7న హమాస్ ఇజ్రాయెల్‌పై దాడిచేసింది. ఈ దాడిలో సుమారు 1200 మంది చనిపోయారు. 250 మందిని బందీలుగా పట్టుకుపోయారు.

ఫొటో సోర్స్, REUTERS
1. రఫా ఎక్కడుంది?
గాజాలో దక్షిణ భాగంలో రఫా ఉంది.
ఇది గాజా, ఈజిప్ట్ సరిహద్దుల్లో ఉంటుంది.
రఫా సరిహద్దులను ఈజిప్ట్, ఇజ్రాయెల్ నియంత్రిస్తుంటాయి.
రఫా జనాభాలో ప్రస్తుతం 14 లక్షల మంది పాలస్తినీయన్లు ఉన్నారు.
రఫా 60 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించింది. ఇది న్యూయార్క్‌లోని మన్‌హట్టన్‌కు దాదాపు సమానం.
గాజా స్ట్రిప్, ఈజిప్ట్ మధ్య ఉన్నఏకైక సరిహద్దు మార్గం ఇదే. గాజాకు సాయం అందించేందుకు దశాబ్దాల తరబడి ఈ మార్గాన్ని వినియోగిస్తున్నారు.
హమాస్-ఇజ్రాయెల్ యుద్ధానికి ముందు ప్రతిరోజూ వందలాది ట్రక్కులు గాజాలోకి ప్రవేశించేందుకు ఈ మార్గాన్నే వాడుకునేవి.
గతంలో సరిహద్దు వద్ద డజన్ల కొద్దీ సొరంగాలు ఉండేవి. వాటిల్లో స్మగ్లింగ్ జరిగేది.
వీటిని ఇజ్రాయెల్, ఈజిప్ట్ దిగ్బంధానికి వినియోగించారు. తద్వారా సహాయ సామగ్రి గాజాకు చేరుకోలేదు. ఇది వ్యాపార, ఆర్థిక వ్యవస్థకు రఫా ఒక ముఖ్యమైన ప్రదేశంగా మారేలా చేసింది.
మేలో రఫా క్రాసింగ్‌ను స్వాధీనం చేసుకున్నట్టు ఇజ్రాయెల్ సైన్యం చెప్పింది. రఫాలో తమ సైన్యం మూడు మైన్ షాఫ్ట్‌లను కనిపెట్టినట్టు తెలిపింది.
ఈ సొరంగాలను స్మగ్లింగ్ కోసం హమాస్ వినియోగించిందని ఇజ్రాయెల్ ప్రభుత్వ అధికారి ప్రతినిధి చెప్పారు.
సరిహద్దు వెంబడి స్మగ్లింగ్ జరుగుతోందనే ఇజ్రాయెల్ ప్రకటనను ఈజిప్ట్ తోసిపుచ్చింది. సొరంగాలను ధ్వంసం చేసి, స్మగ్లింగ్‌ను అరికట్టినట్టు ఈజిప్ట్ ఏళ్ళ తరబడి చెబుతోంది.

2. రఫా క్రాసింగ్ అంటే..?
గాజాస్ట్రిప్‌లో దక్షిణాన రఫా క్రాసింగ్ ఉంది. గాజాస్ట్రిప్‌ను ఈజిప్ట్‌లోని సినాయ్ ఎడారికి ఈ క్రాసింగే అనుసంధానం చేస్తుంది.
దీంతోపాటు గాజాస్ట్రిప్‌లో ఎరేజ్, కీరెమ్ షాలోమ్ అనే మరో రెండు బోర్డర్ క్రాసింగ్‌లు ఉన్నాయి. ఎరేజ్ క్రాసింగ్ ఉత్తర గాజాను ఇజ్రాయెల్‌తో కలుపుతుంది.
కీరెమ్ షాలోమ్ కూడా ఇజ్రాయెల్, గాజామధ్యన ఉంది. కానీ ఈ మార్గాన్ని సరుకుల రవాణాకు మాత్రమే వాడతారు.
కానీ ఇప్పుడీ రెండు బోర్డర్ క్రాసింగ్‌లను మూసివేశారు.
ఎరేజ్ క్రాసింగ్‌పై హమాస్ అక్టోబర్ 7న దాడిచేయడంతో తీవ్రంగా నష్టపరిచింది. హమాస్ హఠాత్తుగా చేసిన ఈ దాడిలో సుమారు 1200 మంది ఇజ్రాయెలీ పౌరులు మరణించారు.
ఈ దాడులు జరిగిన కొన్నిరోజుల తరువాత ఎరేజ్, కీరెమ్ షాలోమ్ క్రాసింగ్‌లు , తదుపరి ఆదేశాల వరకూ మూసివేస్తున్నట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది.
ఈ నేపథ్యంలో పాలస్తీనా సాధారణ పౌరులకు గాజాలోంచి బయటకు రావడానికి రఫా క్రాసింగ్ ఒక్కటే మార్గం.
గాజాకు అంతర్జాతీయ సంస్థలు పంపే సాయాన్ని తీసుకువచ్చే విమానాలను ఉత్తర సినాయ్‌లోని అల్ అరిష్ విమానాశ్రయానికి తరలిస్తున్నట్లు ఈజిప్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ గత వారం తెలిపింది.
ఇలాంటి పరిస్థితుల్లో గాజాస్ట్రిప్‌కు ఇంధనం, ఇతర సహాయ సామాగ్రిని అందించేందుకు రఫా క్రాసింగ్ బయట డజన్ల కొద్దీ ట్రక్కులు క్యూ కట్టాయి.

ఫొటో సోర్స్, REUTERS
3. ఎందుకు మూసేశారు?
గతంలో రఫా క్రాసింగ్ హమాస్, ఈజిప్ట్ నియంత్రణలో ఉండేది. ఈ క్రాసింగ్ వద్ద రాకపోకలను అవి నియంత్రిస్తుండేవి.
కానీ ఇజ్రాయెల్ బాంబు దాడుల తరువాత ఈ క్రాసింగ్ వద్ద ఎటువంటి పనులూ జరగడం లేదు.
ఈజిప్ట్ మీడియాలో కథనాల ప్రకారం అక్టోబరు 9, 10 తేదీల మధ్యన ఇజ్రాయెల్ చేసిన మూడు దాడుల కారణంగా ఈ క్రాసింగ్‌ను మూసివేవారు. ఆ దాడులలో ఈజిప్ట్, పాలస్తీనా వైపునున్న ప్రజలు గాయపడ్డారు.
రఫా క్రాసింగ్ వద్ద బాంబులు వేయడం ఆపాలని ఈజిప్ట్ ప్రభుత్వం ఇజ్రాయెల్‌ను కోరింది. దీనివల్ల గాజా ప్రజలకు కొంత ఊరట లభిస్తుందని పేర్కొంది.
దీంతోపాటు రఫా క్రాసింగ్ వద్ద తన ఉద్యోగుల ప్రాణాలకు గ్యారంటీ లభించేవరకూ క్రాసింగ్‌ను తెరవబోమని ప్రకటించింది.
గాజాలోని విదేశీ పాస్‌పోర్టు హోల్డర్లకు రఫా క్రాసింగ్ సురక్షితమైన మార్గంగా మారేందుకు, అలాగే గాజాకు మానవతా సాయం అందించేందుకు పాశ్చాత్య దేశాలు ప్రయత్నిస్తున్నాయి.
ఈ మార్గాన్ని తెరిచేందుకు ఇజ్రాయెల్, ఈజిప్టులతో కలిసి పనిచేస్తున్నట్లు బ్రిటన్ విదేశాంగ శాఖా మంత్రి జేమ్స్ క్లెవర్లీ, అమెరికా విదేశాంగ శాఖా మంత్రి ఆంటోనీ బ్లింకెన్ తెలిపారు.

ఫొటో సోర్స్, BBC/GETTYIMAGES
4. రఫా చరిత్ర ఏంటి?
గాజాలోని చారిత్రక నగరాలలో రఫా ఒకటి.
ఫారోలు, అసిరియన్లు, గ్రీకులు, రోమన్లు దీనిని జయించారు.
ఇజ్రాయెల్ ఆవిర్భావ ప్రకటన వెలువడిన తరువాత ఈ నగరం 1917 నుంచి 1948 దాకా బ్రిటన్ అధీనంలోనే ఉండేది.
దీని తరువాత అరబ్ యుద్ధం జరిగింది. యుద్ధం ముగిసిన తరువాత గాజాస్ట్రిప్‌తో పాటు రఫా కూడా ఈజిప్ట్ నియంత్రణలోకి వచ్చాయి.
1967లో ఆరురోజుల యుద్ధంలో ఇజ్రాయెల్ గాజా, రఫాతోపాటు ఈజిప్ట్‌లోని సినాయ్ ప్రాంతంపైనా నియంత్రణ సాధించింది.
దీని ద్వారా ఇజ్రాయెల్‌కు వెస్ట్‌బ్యాంక్, గోలన్ హైట్స్, తూర్పు జెరూసలెంపై పట్టు చిక్కింది.
తరువాత 1979లో ఈజిప్ట్, ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం సినాయ్ ఈజిప్ట్‌కు తిరిగి ఇచ్చేటట్టు, రఫాను విభజించేట్టు అంగీకరించారు.
దీంతో రఫాలో కొంత భాగం ఈజిప్ట్‌లోనూ మరికొంత భాగం ఇజ్రాయెల్ ఆక్రమిత గాజాలోనూ ఉంది.
రఫా నగరాన్ని విభజిస్తూ ముళ్ళకంచెను వేశారు. గాజాలోని మిగిలిన నగరాల్లానే రఫా పాలస్తీనా శరణార్థులకు నిలయంగా మారింది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















