లెబనాన్: ఈ దేశంలో కొన్ని పట్టణాలు ‘ఘోస్ట్ సిటీ’లుగా ఎందుకు మారిపోతున్నాయి?

- రచయిత, కెరీన్ టోర్బీ
- హోదా, బీబీసీ అరబిక్
సరిహద్దుల వెంబడి దాడులు, ఉద్రిక్తతల నడుమ లెబనాన్‌లో ఇప్పటివరకూ 70 మందికిపైగా చనిపోయారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇక్కడి ప్రజలు పరుగులు తీస్తున్నారు. దీంతో దక్షిణ లెబనాన్‌లో చాలా ప్రాంతాలు ఘోస్ట్ సిటీలుగా మారిపోతున్నాయి.
దాడుల్లో చాలా ఇళ్లు నేలమట్టం అవుతున్నాయి. అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ దళాలతో కలిసి ఆ ప్రాంతాల్లో బీబీసీ పర్యటించింది.
కొన్ని రోజుల క్రితం భారీ భవనమున్న ప్రాంతంలో మాకు దుమ్ము, రాళ్లతో భారీ బిలం కనిపించింది. దీన్ని ‘పూల్’గా తాము పిలుస్తామని అత్యంత ప్రమాదకర ప్రాంతాల్లో ఒకటిగా మారిన సరిహద్దు పట్టణం యరీన్‌లో ఓ సైన్యాధికారి చెప్పారు.
ఇజ్రాయెల్, లెబనాన్‌ల మధ్య అనధికార సరిహద్దు ‘బ్లూ లైన్’కు యరీన్ కేవలం ఒక కి.మీ. దూరంలోనే ఉంటుంది.

సరిహద్దుకు సమీపంలోని దాదాపు అన్ని పట్టణాల్లోనూ భవనాలు నేలమట్టం కావడం, భారీ బిలాలు ఏర్పడిన దృశ్యాలే కనిపిస్తున్నాయి.
యరీన్‌కు 4 కి.మీ.ల పశ్చిమాన ఉండే ‘ఆల్మా ఎల్ షాబ్’లో ఓ ‘గేటెడ్ విల్లా’ పూర్తిగా ధ్వంసమైంది. ఇక్కడ చుట్టుపక్కల వేసిన కంచె, నేలమట్టమైన భవనాలు మాత్రమే కనిపిస్తున్నాయి. పేలుళ్ల తీవ్రతకు చుట్టుపక్కల ఇళ్ల కిటికీల అద్దాలు కూడా పగిలిపోయాయి.
‘‘ఎవరో చేసిన దానికి మేం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది’’ అని విల్లా యజమాని 75 ఏళ్ల నదీమ్ సయ్యా అన్నారు.
తన ఇంట్లో 24 గంటలూ లైట్లు ఆన్‌చేసి ఉంచే వాడినని, ఇలా చేస్తే ఇక్కడ ప్రజలు ఉంటున్నారని అర్ధమై దాడులు చేసేవారు వదిలేస్తారని భావించినట్లు సయ్యా చెప్పారు.
‘‘కానీ, మొత్తం కోల్పోయాం. ఇల్లు, ఇంట్లోని వస్తువులు, కార్లు అన్నీ ధ్వంసమయ్యాయి. కానీ, వీలైనంత త్వరగా మళ్లీ అక్కడికే వెళ్లిపోతాను. అక్కడ గుడారంలో నివసించాల్సి వచ్చినా వెళ్లిపోతాను’’ అని ఆయన అన్నారు.
ఒక క్షిపణి దాడికి ఈ ప్రాంతమంతా ఇలా మారిందని ఒక సైనికుడు మాకు చెప్పారు.

రోజూ దాడులే
హమాస్‌కు మద్దతుగా అక్టోబరు 8న ఇజ్రాయెల్‌పై లెబనాన్‌లో అత్యంత శక్తిమంతమైన షియా ఇస్లామిక్ సంస్థ హిజ్బొల్లా రాకెట్లతో దాడిచేసిన అనంతరం, ఈ ప్రాంతాల్లో రోజూ ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది.
దక్షిణ లెబనాన్‌లోని దాడుల్లో ఇప్పటివరకూ ముగ్గురు రిపోర్టర్లు (రాయిటర్స్‌కు చెందిన వారు ఒకరు, అల్ మయదీన్‌కు చెందిన వారు ఇద్దరు) మరణించారు. వారి మరణాలకు ఇజ్రాయెల్‌దే బాధ్యతని వారి వార్తా సంస్థలతోపాటు లెబనాన్ ఆరోపిస్తోంది.
అయితే, జర్నలిస్టులను తాము లక్ష్యంగా చేసుకోబోమని ఇజ్రాయెల్ చెబుతోంది. ప్రస్తుతం కల్లోలంగా మారిన ఓ సరిహద్దు ప్రాంతంలో ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ దళం ‘యూనీఫిల్’తో కలిసి బీబీసీ పర్యటించింది.
1978నాటి దురాక్రమణ అనంతరం దక్షిణ లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ బలగాల ఉపసంహరణ తర్వాత, ఇక్కడ యూనీఫిల్ సేవలు అందిస్తోంది.
ఇజ్రాయెల్, హిజ్బొల్లాల మధ్య చివరి యుద్ధం 2006లో జరిగింది. అప్పటి నుంచి 16 ఏళ్లపాటు ఇక్కడ శాంతి నెలకొనేలా పరిస్థితులను పర్యవేక్షించామని యూనీఫిల్ ప్రతినిధులు మాతో చెప్పారు.
మేం డ్రోన్లతో పరిస్థితులను రికార్డు చేస్తున్నప్పుడు ఆకాశంలో ఇజ్రాయెల్ డ్రోన్లు తిరుగుతూ కనిపించాయి. ఆ తర్వాత కొంత దూరంలో దట్టమైన పొగ కనిపించింది. అసలు దేనిపై దాడి జరిగిందో తెలుసుకోవడానికి మాకు సాధ్యపడలేదు.

ఇజ్రాయెల్ సైన్యం ఏం చెబుతోంది?
హిజ్బొల్లా ఫైటర్లు, వారి మౌలిక సదుపాయాలనే తాము లక్ష్యంగా చేసుకుంటున్నామని, ఉత్తర ఇజ్రాయెల్‌లోని సైనిక స్థావరాలపై దాడులకు తాము ప్రతి స్పందిస్తున్నామని ఇజ్రాయెల్ సైన్యం చెబుతోంది.
అయితే, ఈ ప్రాంతం మొత్తాన్ని నివసించేందుకు వీలుకాని దెయ్యాల ప్రాంతంగా మార్చేందుకు ఇజ్రాయెల్ సైన్యం ప్రయత్నిస్తోందని లెబనాన్ ప్రధాన మంత్రి, పార్లమెంటు స్పీకర్ సహా లెబనాన్ అధికారులు ఆరోపిస్తున్నారు.
ప్రస్తుతం చాలా దక్షిణ గ్రామాల్లో ప్రజలెవరూ కనిపించలేదు. తమ ఇళ్లను వదిలి ప్రజలు ప్రాణాలతో పరుగులు తీస్తున్నారు. మొత్తంగా 90,000 మంది లెబనాన్ పౌరులు నిరాశ్రయులయ్యారని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (ఐవోఎం) చెబుతోంది. మరోవైపు ఇజ్రాయెల్ వైపు కూడా 80,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
సరిహద్దు ప్రాంతాల నుంచి హిజ్బొల్లా ఫైటర్లను వెళ్లగొట్టేవరకూ ఉత్తర ఇజ్రాయెల్‌లోని ప్రజలను సురక్షిత ప్రాంతాల్లోనే ఉంచుతామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి చెప్పారు.

ఇజ్రాయెల్‌కు 700 మీటర్ల దూరంలోనే లెబనాన్ పట్టణం ‘అయితా ఎల్ షాబ్’ ఉంటుంది. ఇజ్రాయెల్ దాడుల్లో అత్యంత తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతమిదీ. మేం పర్యటించిన రోజు అక్కడ 40 దాడులు చేపట్టినట్లు ఇజ్రాయెల్ తెలిపింది.
‘‘మా ఇల్లు పూర్తిగా దెబ్బతిందని మాకు తెలుసు. కానీ, ఇంకా అది నేలమట్టం కాలేదు’’ అని అయితా ఎల్ షాబ్‌కు చెందిన హుస్సేన్ జావెద్ చెప్పారు.
నిర్మాణ రంగ కార్మికుడిగా పనిచేసే హుస్సేన్ తన భార్య, ఏడుగురు పిల్లలను వెంట పెట్టుకుని ఇల్లు వదిలి వెళ్లిపోయారు. ప్రస్తుతం బేరూత్ శివార్లలోని ఒక అపార్ట్‌మెంట్‌లో వీరు జీవిస్తున్నారు.
‘‘ఇన్ని రోజులు దాడులు జరుగుతాయని మేం అనుకోలేదు. కొన్ని రోజుల్లోనే అంతా సద్దుమణుగుతుందని మేం భావించాం’’ అని ఆయన భార్య మరియమ్ చెప్పారు.
కొన్ని నెలల క్రితం వీరు జీవించిన పట్టణాల్లో తీసిన వీడియోలను హుస్సేన్‌కు మేం చూపించాం.
‘‘ఆ ఇల్లు ఇప్పుడు నేలమట్టమైంది. ఆ ఇల్లు కూడా. అక్కడుండే షాప్‌ల భవనాలు కూడా ఇప్పుడు లేవు’’ అని ఆయన చెప్పారు.
కొన్ని వారాల క్రితం అంత్యక్రియలకు హాజరయ్యేందుకు తన పట్టణానికి ఆయన వెళ్లారు. పట్టణంలోని భద్రతా దళాలు లేదా మేయర్ సిబ్బంది నుంచి తన ఇంటికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆయన తెలుసుకుంటున్నారు.

గత అక్టోబరు నుంచి సరిహద్దుల వెంబడి ఇజ్రాయెల్, హిజ్బొల్లాల మధ్య 5,400 దాడులు జరిగినట్లు అమెరికాకు చెందిన మోనిటరింగ్ గ్రూప్ ‘ఆర్మ్‌డ్ కాన్‌ఫ్లిక్ట్ లొకేషన్ అండ్ ఈవెంట్ డేటా ప్రాజెక్ట్ (ఏసీఎల్ఈడీ) డేటా చెబుతోంది. ఈ దాడుల్లో 80 శాతం ఇజ్రాయెల్ సైన్యం చేపట్టిందని వెల్లడిస్తోంది.
హిజ్బొల్లాకు చెందిన 4,300 భవనాలను తాము లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) తెలిపింది. ఏప్రిల్ 2 నాటికి లెబనాన్ భూభాగం నుంచి 3,100 రాకెట్లను ప్రయోగించినట్లు వెల్లడించింది. లెబనాన్ నుంచి ప్రయోగించిన రాకెట్లతో తొమ్మిది మంది ఇజ్రాయెల్ పౌరులు మరణించినట్లు తెలిపింది.
ప్రస్తుతం తన ఇంటికి ఇప్పుడప్పుడే వెళ్లే యోచనలో హుస్సేన్ లేరు.
‘‘ఇప్పుడు మనం చూస్తున్న విధ్వంసమంతా ఆరంభం మాత్రమే’’ అని ఆయన అన్నారు.
ఇక్కడ హింస చెలరేగుతున్నప్పటికీ శాంతి పరిరక్షణ దళాలు పనిచేయడం చాలా ముఖ్యమని యూనీఫిల్‌లోని ఇటాలియన్ విభాగం కమాండర్, కల్నల్ ఆల్బెర్నో సాల్వడోర్ చెప్పారు.
‘‘ప్రస్తుత పరిస్థితులను చూసీచూసీ ప్రజలు విసుగు చెందారు. రెండు వైపులా పరిస్థితి ఇలానే ఉంది. ఇది శాంతి పరిక్షణ సమయం’’ అని ఆయన అన్నారు.
‘‘మా ముందున్న అతిపెద్ద సవాల్ ఏమిటంటే, మళ్లీ వారి సొంత ఇళ్లకు ప్రజలను జాగ్రత్తగా తీసుకురావడమే’’ అని ఆయన తెలిపారు.
కానీ, ఇజ్రాయెల్, హిజ్బొల్లాల మధ్య ఘర్షణలు నానాటికీ తీవ్రరూపం దాలుస్తుండటంతో.. యూనీఫిల్ లక్ష్యం ఇప్పట్లో నెరవేరేలా కనిపించడం లేదు.
ఇవి కూడా చదవండి:
- నీకా షాకరామీ: ఇరాన్ భద్రతా దళాలే ఈ టీనేజర్‌ను లైంగికంగా వేధించి, చంపేశాయని వెల్లడి చేసిన సీక్రెట్ డాక్యుమెంట్
- దక్షిణ కొరియా: ప్రెప్పర్లు ఎవరు, ఉత్తర కొరియాతో యుద్ధం భయంతో ఎందుకు అన్నీ సర్దుకుంటున్నారు?
- లోక్‌సభ ఎన్నికలు: ఒకనాడు 400కు పైగా స్థానాలలో గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 300 స్థానాలలో మాత్రమే ఎందుకు పోటీ చేస్తోంది?
- 4.7 కోట్ల ఏళ్లనాటి వాసుకి పాము అవశేషాలు వెలుగులోకి.. అసలేంటి ఈ పాము కథ?
- అడాల్ఫ్ హిట్లర్ కోసం ఆ మహిళలు కన్న వేలమంది ‘ఆర్య పుత్రులు’ ఏమయ్యారు?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















