క్రికెట్: బంగ్లాదేశ్‌ను భారత మహిళా జట్టు క్లీన్‌స్వీప్ చేసింది, అది ఎంతమందికి తెలుసు?

ఫొటో సోర్స్, PHOTO BY SAZZAD HOSSAIN/SOPA IMAGES/LIGHTROCKET VIA GETTY IMAGES
- రచయిత, శారద ఉగ్ర
- హోదా, సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్
మే 6న బంగ్లాదేశ్‌లోని సిల్హట్‌లో జరిగిన అంతర్జాతీయ మహిళల టీ20 మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశారు భారత క్రీడాకారిణి ఆశా శోభన. భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన పెద్ద వయసు క్రీడాకారిణిగా రికార్డ్ సృష్టించిన ఆమె ఆనందానికి అవధులు లేవు.
33 ఏళ్ల 51 రోజుల వయసులో శోభన ఈ ఘనత సాధించారు.
బంగ్లాదేశ్‌తో ముగిసిన సిరీస్‌ను ప్రసారం చేసిన ఛానెల్ శోభన ఇంటర్వ్యూ కోసం సిద్ధమైనప్పుడు, జట్టు సభ్యులు సమీపంలో ఆనందంగా చూస్తూ నిల్చున్నారు. కానీ, శోభన మీడియాతో మాట్లాడేందుకు ప్రెస్ కాన్ఫరెన్స్ గదికి వెళ్లేప్పటికి అక్కడ కేవలం ఒకేఒక్క జర్నలిస్ట్ ఉన్నారు.
ఆ జర్నలిస్ట్ అన్నేశా ఘోష్.
దీనిని అన్నేశా ఘోష్ తన ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
బంగ్లాదేశ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ 5-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసింది. యువ కెప్టెన్ నాయకత్వంలో ఊపుమీదున్న బంగ్లాదేశ్ జట్టును భారత జట్టు చిత్తు చేసింది.
ఎడమ చేతివాటం స్పిన్నర్ రాధా యాదవ్ సిరీస్ చివరి మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచారు. మొత్తం సిరీస్‌లో 10 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గానూ ఎంపికయ్యారు.
ఒకవేళ ఫ్యాన్‌కోడ్ స్ట్రీమింగ్ సర్వీస్ ఈ సిరీస్‌ను ప్రసారం చేయకుంటే, ఈ సిరీస్ జరిగనట్లు కూడా తెలిసేది కాదేమో.

ఫొటో సోర్స్, ANNESHA GHOSH/X
కానరాని మీడియా సంస్థలు
ఐపీఎల్ జరుగుతున్న సమయంలోనే ఈ సిరీస్ కూడా జరుగుతుండడంతో మ్యాచ్‌లను కవర్ చేయడానికి భారత మీడియా సంస్థలు జర్నలిస్టులను పంపుతాయని ఆశించడం కష్టమే.
ఇప్పటికే మీడియా సంస్థల్లోని స్పోర్ట్స్ డెస్కులు చాలా తక్కువ మందితో పనిచేస్తున్నాయి. అయితే, ఈ మొత్తం వ్యవహారంలో బీసీసీఐ వైఖరి చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఆన్‌లైన్ లైవ్ కామెంట్రీ మినహా బీసీసీఐ మరే ఇతర ఏర్పాట్లూ చేయలేదు.
ఐపీఎల్ వెబ్‌సైట్‌లో కనిపించే కంటెంట్‌తో పాటు, నిత్యం ఐపీఎల్‌పై బీసీసీఐ నుంచి మీడియా సంస్థలకు వచ్చే కంటెంట్ కుప్పలుతెప్పలుగా కనిపిస్తుంది.
వాటిలో మీడియా సమావేశాలు, రిఫరీ నిర్ణయాలు, సోషల్ మీడియాకి సంబంధించిన సమాచారం ఉంటుంది. కానీ, మహిళల టీ20 సిరీస్‌పై మాత్రం బీసీసీఐ శీతకన్నేసింది.
ఒక విధంగా చెప్పాలంటే, మహిళల సిరీస్‌ను బీసీసీఐ వార్తల నుంచే తప్పించింది. ఈ మెయిల్స్ లేవు, ప్రెస్ కాన్ఫరెన్సుల ఆన్‌లైన్ లింకులు లేవు, వీడియోలు కానీ, సోషల్ మీడియా పోస్టులు కానీ లేవు.
భారత మహిళల క్రికెట్ జట్టు 5-0 తేడాతో బంగ్లాదేశ్ జట్టును మట్టికరిపించిన సిరీస్ పరిస్థితి ఇది.
ఈ సిరీస్‌లో అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రంతో ఆశా శోభన రికార్డ్ సృష్టించారు. హర్మన్‌ప్రీత్ కౌర్ తన 300వ అంతర్జాతీయ మ్యాచ్, షెఫాలీ వర్మ తన 100వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడారు. షెఫాలీ, స్మృతి మందన్న మహిళల టీ20 ఇంటర్నేషనల్‌లో, భారత్ తరఫున 2000 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన తొలి జోడీగా నిలిచారు.

ఫొటో సోర్స్, SAJJAD HUSSAIN/AFP VIA GETTY IMAGES
మీడియా మేనేజర్ కూడా కనిపించలేదు..
బీసీసీఐ మహిళల క్రికెట్ అధికారిక వెబ్‌సైట్ పేజీలో, మే 10వ తేదీ రాత్రి 7 గంటల వరకూ ఏప్రిల్ 15 నాటి వార్తలే కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ఎలాంటి అప్డేట్లూ లేవు.
ఏప్రిల్ 15న పోస్టు చేసిన వార్తలో బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ కోసం భారత మహిళల జట్టు ప్రకటన ఉంది.
చివరి వీడియో ఏప్రిల్ 28న పోస్ట్ చేశారు. ఇందులో బంగ్లాదేశ్‌తో తొలి టీ20 మ్యాచ్ తర్వాత యస్తికా భాటియా మాట్లాడుతూ కనిపించారు.
మీడియా మేనేజర్ కూడా లేకుండానే భారత మహిళల జట్టు బంగ్లాదేశ్ సిరీస్‌కు వెళ్లింది. ఒకవేళ, మీడియా మేనేజర్ ఉన్నారనుకున్నా, ఎక్కడా కనిపించలేదు.
ఆట గురించి రిపోర్ట్ చేసేందుకు జర్నలిస్టులు లేని సమయంలో మీడియా మేనేజర్ పాత్ర కీలకమవుతుంది. విదేశీ పర్యటన సమయంలో దేశంలోని మీడియా సంస్థలకు మ్యాచ్ సమాచారం, ఫీచర్లు, ఇంటర్వ్యూల వంటివి మీడియా మేనేజర్ అందజేస్తారు.
దేశంలో ఎన్నికలు, ఐపీఎల్ కారణంగా వార్తాపత్రికల్లో పెద్దగా ప్రాధాన్యం దక్కకపోవడం నిజమే. కానీ, భారత మహిళల జట్టు విజయాలపై బీసీసీఐ మీడియా విభాగం రూపొందించే కథనాలు ప్రచురించడానికి డిజిటల్ మీడియాకు ఎలాంటి అభ్యంతరం ఉండకపోవచ్చు.
మహిళల క్రికెట్‌ను ప్రోత్సహించాలి, ముందుకు తీసుకెళ్లాలనే చిత్తశుద్ధి ఉంటే మాత్రమే ఇలాంటి వాటిని ఆశించగలం.
ఈ సిరీస్‌ను కవర్ చేయాలనుకున్న భారత విలేఖరులు తమ సొంత పరిచయాల ద్వారా తమంతట తాము సమాచారం తెలుసుకుని కథనాలు రాశారు. బంగ్లాదేశ్‌లోని తమ స్నేహితులు, సహోద్యోగులతో మాట్లాడడం, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డును సంప్రదించడం ద్వారా కథనాలను అందించారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
మాటలకూ, చేతలకూ తేడా
మే 9న బీసీసీఐ సెక్రటరీ జై షా ముంబయిలో కొందరు జర్నలిస్టులతో సమావేశమయ్యారు.
ఆ సమయంలో వీడియో లేదా ఆడియో రికార్డ్ చేయడానికి అనుమతించలేదు. కేవలం సమాచారం రాసుకోవడానికి మాత్రమే అనుమతించారు.
అప్పుడు అక్కడున్న జర్నలిస్టులు భారత మహిళా క్రికెట్ జట్టు భవిష్యత్తు ప్రణాళికల గురించి షాను ప్రశ్నించారు.
అందుకు షా స్పందిస్తూ, అక్టోబర్ 3 నుంచి 20 వరకు ఢాకా, సిల్హట్‌లలో ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ సిరీస్ జరగనుండడంతో అక్కడి పరిస్థితులపై భారత మహిళల జట్టుకు అవగాహన కల్పించడమే బంగ్లాదేశ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఉద్దేశమని చెప్పారు.
నిజానికి ఈ సిరీస్ ఐదు నెలల తర్వాత, అది కూడా వర్షాకాలం తర్వాత జరగాల్సి ఉంది.
విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)కు అద్భుతమైన స్పందన వచ్చింది. కేవలం టిక్కెట్ల విక్రయం ద్వారానే రూ.5 కోట్ల ఆదాయం వచ్చినట్లు షా చెప్పారు.
మహిళల క్రికెట్‌పై తమకు నిబద్ధత ఉందని షా గర్వంగా చెబుతారు.

ఫొటో సోర్స్, Getty Images
మహిళల క్రికెట్ జట్టు బలంగా ఉందని, పురుషుల జట్టుకు ఎంత ప్రాధాన్యత ఇస్తామో ఆ జట్టుకీ అంతే ప్రాధాన్యత ఇస్తున్నామని షా చెప్పినట్లు వార్తా సంస్థ పీటీఐ రిపోర్ట్ చేసింది.
''పురుషుల క్రికెట్‌లో రాణిస్తున్నాం. కాబట్టి మేం 51 శాతం మహిళల క్రికెట్‌పై, 49 శాతం పురుషుల క్రికెట్‌పై దృష్టి పెట్టాం. మహిళా క్రికెట్‌కు మేం చాలా ప్రాధాన్యం ఇస్తున్నాం. మేం వాళ్ల మ్యాచ్ ఫీజునూ పెంచాం. వాళ్ల ఆదాయం కూడా పెరిగింది'' అని షా అన్నారు.
మహిళల క్రికెట్‌పై 51 శాతం దృష్టి పెట్టడం మంచిదే కానీ, బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ అది నిజం కాదని నిరూపించింది.
ఒకవేళ ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు భారత్ ఏ పురుషుల జట్టు బంగ్లాదేశ్‌కు వచ్చి, జట్టుతో పాటు రిపోర్టర్ ఎవరూ లేకపోయి ఉంటే.. భారత్‌లోని మీడియా సంస్థలకు వార్తలు పంపేందుకు వారితో పాటు మీడియా మేనేజర్ లేకుండా ఉండడం మాత్రం జరగదు.
మ్యాచ్ ఫీజు పెంపు నిర్ణయం మంచిదే. కానీ, మహిళల క్రికెట్ క్యాలెండర్ రూపొందించి, ప్రతి సీజన్‌లో వీలైనన్ని మ్యాచ్‌లు ఆడేలా చేస్తేనే ప్రయోజనం కలుగుతుంది.
మహిళల క్రికెట్‌కు సాయం గురించి చెప్పే మాటలకూ, చేతలకూ మధ్య చాలా అంతరం ఉంటోంది. కేవలం హెడ్‌లైన్స్‌లో నిలిచే సమయంలో మాత్రమే మహిళా క్రికెటర్లు గుర్తుకురావడం సరికాదు.
ఇవి కూడా చదవండి:
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














