చాంద్ బీబీ: అక్బర్‌ సైన్యాన్ని ఎదిరించి పోరాడిన ఈ బీజాపూర్ రాణి ఎవరు?

చాంద్ బీబీ

ఫొటో సోర్స్, ANIL RELIA / THEINDIANPORTRAIT

    • రచయిత, వకార్ ముస్తఫా
    • హోదా, జర్నలిస్ట్, పరిశోధకుడు

బీజాపూర్ ఐదో పాలకుడు అలీ ఆదిల్ షా 1580లో మరణించిన తర్వాత ఆయన భార్య చాంద్ బీబీ తాను కేవలం భర్తను కోల్పోయిన ఓ వితంతువుగా మిగిలిపోవాలని అనుకోలేదు.

దక్షిణ భారతదేశంలోని దక్కన్ ప్రాంతంలో క్రీ.శ 1347లో ఏర్పాటైన బహమనీ సామ్రాజ్యం 180 ఏళ్ల తర్వాత అంతరించింది. అప్పుడు దాని నుంచి 5 చిన్న రాజ్యాలు ఉద్భవించాయి. ఆ రాజ్యాల పాలకుల్లో బీజాపూర్ ఒకటి. దాని పాలకుల్లో అలీ ఆదిల్ షా ఒకరు . ఆయన భార్య చాంద్ బీబీ నిజాం షాహీ. ఆమె అహ్మద్‌నగర్‌ సుల్తాన్ హుస్సేన్ నిజాం షాహీ - III కుమార్తె.

హుస్సేన్ షా భార్య కుంజా హుమాయూన్ కూడా పాలనలో పాలుపంచుకునేవారు. హుస్సేన్ షా చనిపోయిన తర్వాత, చిన్నవాడైన వారి కుమారుడు ముర్తజా పాలనా బాధ్యతలు చేపట్టారు.

అజర్‌బైజాన్ రాజకుటుంబానికి చెందిన రాణి కుంజా చాలా ముందుచూపు కలవ్యక్తని చరిత్రకారులు మను.ఎస్.పిళ్లై రాశారు.

కుంజా గొప్ప నైపుణ్యం, తెలివితేటలు, ధైర్యంతో పాటు రాజ్యపాలనపై మంచి అవగాహన ఉన్న వ్యక్తి అని రఫీవుద్దీన్ షిరాజి, మహమ్మద్ ఖాసిం ఫిరిష్తా వంటి చరిత్రకారులు పేర్కొన్నారు.

కుంజా అనేక యుద్ధాల్లో పాల్గొన్నారని సయ్యద్ అహ్మదుల్లా ఖాద్రీ రాశారు. ఈ కుంజా హుమాయూన్ కూతురే చాంద్ బీబీ.

'చాంద్ బీబీది కూడా ఆమె తల్లి మనస్తత్వమే.’ అని వజీర్ హుస్సేన్ తన పుస్తకం 'చాంద్ బీబీ సుల్తాన్: ఏ డాటర్'లో పేర్కొన్నారు.

విలువిద్య, గుర్రపు స్వారీ, కత్తి యుద్ధంలో చాంద్ బీబీకి నైపుణ్యముంది. అరబిక్, పర్షియన్, టర్కిష్, కన్నడ, మరాఠీ భాషలు తెలుసు. సితార్ వాయించేవారు, పెయింటింగ్ చేసేవారు, ముఖ్యంగా పువ్వులు వేయడాన్ని ఇష్టపడేవారు.

చరిత్ర

ఫొటో సోర్స్, Getty Images

భర్తపై దాడిని తిప్పికొట్టిన రాణి

చాంద్ బీబీ‌ని బీజాపూర్ పాలకుడైన అలీ ఆదిల్ షా-I వివాహం చేసుకున్నారు. అలీ ఆదిల్ షా సోదరి హూడియా సుల్తానను చాంద్ బీబీ తమ్ముడు ముర్తజా వివాహం చేసుకున్నారు. ఈ రెండు వివాహాలు అహ్మద్‌నగర్, బీజాపూర్ మధ్య శత్రుత్వానికి ముగింపు పలికాయని అలీ అహ్మద్ పేర్కొన్నారు.

చాంద్ బీబీ అనేక సందర్భాల్లో తన భర్తకు అండగా నిలిచారు. యుద్ధభూమిలోని కఠిన పరిస్థితులను భరిస్తూ, అవసరమైన సమయంలో సలహాలు ఇచ్చేవారు, ధైర్యం నూరిపోసేవారు.

ఆమె సలహాలు, ప్రయత్నాలతో అహ్మద్‌నగర్‌తో బీజాపూర్ మంచి సంబంధాలను నెలకొన్నాయి. సామ్రాజ్యం బలపడింది, తిరుగుబాట్లకు తెరపడింది.

ఒకసారి, తన భర్తను హతమార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చాంద్ బీబీకి సమాచారం అందింది. రాత్రంతా ఇక్కడే ఉంటానని తన భర్తకు సర్దిచెప్పి చాంద్‌బీబీ ఆయనతోనే ఉన్నారు. రాత్రివేళ భవనం డెక్ పైన ఎవరో దూకిన అలికిడి విన్న చాంద్ బీబీ, కత్తి తీసుకుని ఒంటరిగా పైకి వెళ్లారు.

ముసుగులు ధరించిన వ్యక్తులు కత్తులతో చాంద్ బీబీ వైపు దూసుకొస్తున్నారు. అప్పుడు చాంద్ బీబీ ఒకడుగు ముందుకేసి కత్తిని బలంగా విసరడంతో వారిలో ఒకరు నేలకూలారు. చాంద్ బీబీ దగ్గరికొచ్చిన మరొకరికి కూడా అదే పరిస్థితి ఏర్పడింది.

ఆ శబ్దం విన్న అలీ ఆదిల్ షా పై అంతస్తుకి పరుగెత్తారు. అక్కడి దృశ్యాన్ని చూసిన అలీ ఆదిల్ షా, వీరురాలైన తన రాణి ఖడ్గాన్ని ముద్దాడుతూ.. ''చాంద్ బేగం.. ఈ లోకమంతా నాకు శత్రువుగా మారినా నువ్వు నాతో ఉంటే నాకు భయం ఉండదు'' అన్నారు.

అలీ ఆదిల్ షా మరణించే నాటికి చాంద్ బీబీ వయసు 28 ఏళ్లు. ఆ వయసుకే ఆమెకు యుద్ధ కళలు, పాలనాపరమైన విషయాలు తెలుసని చరిత్రకారులు చెబుతున్నారు.

భర్త మరణించడంతో చాంద్ బీబీకి సంతానం లేకుండా పోయింది. దీంతో పాలనాపగ్గాలు అలీ ఆదిల్ షా మేనల్లుడు ఇబ్రహీంకి చేరాయి. ఇబ్రహీం ఆదిల్ షా - II గా ఆయన చరిత్రకెక్కారు.

చరిత్ర

ఫొటో సోర్స్, Getty Images

అహ్మద్‌నగర్ సామ్రాజ్యం

పట్టాభిషేకం జరిగే నాటికి ఇబ్రహీంకు తొమ్మిదేళ్లు. ఇబ్రహీం పర్యవేక్షణ బాధ్యతల నుంచి కమల్ ఖాన్‌ను తొలగించి, అతని చదువు, శిక్షణ, రాజ్య వ్యవహారాలను చాంద్ బీబీ చూసుకున్నారు.

బహమనీ సామ్రాజ్య పతనం తర్వాత.. బేరార్, బీదర్, గోల్కొండ రాజ్యాలు మూకుమ్మడిగా బీజాపూర్ రాజ్యంపై దాడి చేశాయి. ఆ సమయంలో చాంద్ బీబీ కోట ఒక చివరి నుంచి మరో చివరికి తిరుగుతూనే ఉన్నారు.

ఒకసారి, భారీ వర్షం కారణంగా పగుళ్లు ఏర్పడడడంతో, చాంద్ బీబీ స్వయంగా రక్షణగా నిలబడి, పగుళ్లను దగ్గరుండి సరిచేయించారు. ఈ ముట్టడి ఏడాది పాటు కొనసాగింది. ఆ తర్వాత శత్రువులు వెనక్కితగ్గారు.

1584లో ఇబ్రహీం సోదరికి చాంద్ బీబీ మేనల్లుడు, ముర్తజా కుమారుడితో వివాహం జరిగింది. దీంతో చాంద్ బీబీ బీజాపూర్ వదిలి అహ్మద్‌నగర్‌కు వెళ్లారు. ముర్తజాకు మానసిక సమస్యలున్నాయి. ఆయన ఒక దశలో కొడుకు ప్రాణం తీసేందుకు ప్రయత్నించారు. దాని నుంచి తప్పించుకునే క్రమంలో కొడుకే ముర్తజాను చంపేశారు.

చాంద్‌ బీబీకి అహ్మద్‌నగర్ వైస్రాయ్ పదవి ఇచ్చిన సమయంలో ఆ సింహాసనంపై ముగ్గురు హక్కుదారులు ఉన్నట్లు బ్రిటిష్ చరిత్రకారుడు ఎర్నెస్ట్ బాన్‌ఫీల్డ్ హోవెల్ రాశారు.

ఆ ముగ్గురిలో ఒక్కరు అక్బర్ కుమారుడైన ప్రిన్స్ మొరాద్ సాయం కోరారు. అప్పట్లో గుజరాత్‌లో మొఘల్ సైన్యానికి ప్రిన్స్ మొరాద్ కమాండర్. ఈ అవకాశాన్ని మొరాద్ ఉపయోగించుకున్నారు.

అక్బర్ పంపించిన కమాండర్ ఖాన్-ఇ-ఖానాన్‌తో కలిసి అహ్మద్‌నగర్‌ వైపు కదిలాయి. అయితే, మొరాద్ అతి మద్యపానం, కోపం కారణంగా సలహాదారుగా అక్బర్ పంపిన సమర్థుడు, అనుభవజ్ఞుడు అయిన జనరల్ ఖాన్-ఇ-ఖానాన్‌తో విభేదాలతో గందరగోళం తలెత్తింది.

తొమ్మిది నెలల ముట్టడి తర్వాత, పరిస్థితిలో కొంత పురోగతి కనిపించింది. ఆ తర్వాత, చాంద్ బీబీ నాయకత్వంలో అహ్మద్‌నగర్ స్వతంత్ర రాజ్యంగా ఉండేందుకు ప్రిన్స్ మొరాద్ అంగీకరించారు. అందుకు ప్రతిఫలంగా బేరార్ రాజ్యంపై తనకు ఆధిపత్యాన్న ఇవ్వాలని మొరాద్ షరతు పెట్టాడు. దానికి చాంద్ బీబీ అంగీకరించారు. ఈ యుద్ధం తర్వాత మొఘలులు ఆమెను చాంద్ బీబీని ‘సుల్తాన్’ అని పిలవడం ప్రారంభించారు.

కానీ, ఇంతటితో చాంద్ బీబీ ఇబ్బందులు ముగియలేదు. ఆ తర్వాత కొద్దికాలానికే ఒక మంత్రి చేసిన ద్రోహం, బేరార్ రాజ్య సరిహద్దులపై వివాదం కారణంగా మళ్లీ మొఘలులతో పోరు మొదలైంది.

ఈసారి మొఘలులు సంయుక్తంగా కలిసి వచ్చి ఓటమి నుంచి బయటపడ్డారు. అయితే ఖాన్, ప్రిన్స్ మొరాద్ మధ్య విభేదాల కారణంగా 1598వ సంవత్సరం ప్రారంభంలో ఖాన్‌ను అక్బర్ వెనక్కి పిలిపించారు. అబుల్ ఫజల్‌ను దక్కన్‌కు వెళ్లాలని, ప్రిన్స్ మొరాద్ తిరిగి కోటకు రావాలని ఆదేశించారు. కానీ, అబుల్ ఫజల్ వచ్చిన రోజే మొరాద్ అనారోగ్యంతో మరణించారు.

చరిత్ర

ఫొటో సోర్స్, Getty Images

చాంద్ బీబీ హత్య

ధైర్యవంతురాలు, భయమంటే తెలియని చాంద్ బీబీని సైనికులు హత్య చేసినట్లు చెబుతారు. ఆమె మొఘలులతో సంధికి ప్రయత్నిస్తున్నారని, రాజ్యానికి ద్రోహం చేస్తున్నరని పుకార్లు రావడంతో ఆగ్రహించిన ఆమె సైనికులు కొందరు ఆమెను చంపేశారని చెబుతారు.

అయితే, చాంద్ బీబీ విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారని ఐరిష్ చరిత్రకారుడు విన్సెంట్ ఆర్థర్ స్మిత్ రాయడం గమనార్హం.

ఇబ్రహీం షా ఇలా రాశారు, “యుద్ధభూమిలో ఆమె ఎప్పుడూ ధైర్యం కోల్పోలేదు. చాలా తెలివైనది. అలాగే పేదలపట్ల దయతో, ఉదారంగా ఉండేవారు. ఆమే చాంద్ సుల్తాన్, బీజాపూర్ ప్రియమైన రాణి."

చాంద్ బీబీ మరణం అనూహ్యమైనది, అహ్మద్ నగర్ సమర్థురాలైన పాలకురాలిని కోల్పోయిందని చరిత్రకారులు మను.ఎస్.పిళ్లై రాశారు.

మరో ఆరు నెలల వ్యవధిలో, ప్రిన్స్ డానియల్ మీర్జా నేతృత్వంలోని మొఘల్ సైన్యం 1601లో అహ్మద్‌నగర్‌పై దాడి చేసింది. డానియల్ మీర్జా అక్బర్ చిన్న కుమారుడు. ఆ సమయంలో ఊచకోతలు జరిగాయి. వనరులు లూటీ అయ్యాయి. చాంద్ బీబీ మేనల్లుడు, చిన్న వయసులోనే అహ్మద్ నగర్ పాలకుడిగా ఉన్న బహదూర్ నిజాం షాహీని గ్వాలియర్ కోటలో ఖైదు చేశారు.

మొఘలులు చాంద్ బీబీని చంపిన వారిని కూడా చంపారు. అబుల్ ఫజల్ సలహా మేరకు అక్బర్ లాహోర్ నుంచి బయలుదేరి ఫారూకీ రాజవంశంలో చివరి పాలకుడు అయిన బహదూర్ ఖాన్ ఏలుబడిలో ఉన్న ఖాందేష్ రాజ్యం మీదుగా దక్కన్‌లోకి ప్రవేశించారు.

తనకు ముందు పాలించిన రాజుకు 30 ఏళ్ల జైలు శిక్ష విధించి, సింహాసనం అధిష్టించిన కొన్నాళ్లకే బహదూర్ ఖాన్ మొఘల్ పాలకుడు అక్బర్‌తో పోరాడాల్సి వచ్చింది. 11 నెలల ముట్టడి తర్వాత అతను అక్బర్ కు లొంగిపోయాడు.

ఆయన్ను కూడా గ్వాలియర్‌ జైలులో పెట్టారు. ఖాందేష్ ప్రాంతం మొఘల్ సామ్రాజ్యంలో విలీనమైంది. మొఘల్ ఆక్రమణ తర్వాత బీజాపూర్, గోల్కొండ సుల్తానులు అక్బర్‌తో సంధి చేసుకోవాలని భావించారు.

ప్రిన్స్ డేనియల్‌తో ఇబ్రహీం ఆదిల్ షా కుమార్తెతో వివాహానికి నిర్ణయించారు. దీంతో దక్కన్ చక్రవర్తి బిరుదును స్వీకరించిన అక్బర్, 1602లో విజయంతో ఆగ్రాకు తిరిగొచ్చారు. అబుల్ ఫజల్‌కు దక్కన్ పాలనా పగ్గాలు అప్పగించారు.

చరిత్ర

ఫొటో సోర్స్, Getty Images

స్త్రీ స్వేచ్ఛకు ప్రతీక

చాంద్ బీబీకి హిందీ, పర్షియన్, దక్కన్‌ రాజ్యాలతో సంబంధముందని పరిశోధకురాలు సారా వహీద్ పేర్కొన్నారు.

“చాంద్ బీబీ గద్దను వేటాడుతున్నట్లుగా కనిపించే అనేక పెయింటింగ్స్ ఉన్నాయి. సాధారణంగా గద్దలను వేటాడడం మగవారి కాలక్షేపం. కానీ, ఈ పెయింటింగ్స్‌లో ఆ గద్ద స్త్రీ స్వేచ్ఛకు చిహ్నంగా కనిపిస్తుంది.''

చాంద్ బీబీ ఆస్థానంలో జ్యోతిష్కులు, దౌత్యవేత్తలు, శిల్పులు, చిత్రకారులు, వైద్యులు, తత్వవేత్తలు, దర్జీలు, స్వర్ణకారులు, కవులు, నృత్యకారులు ఉండేవారని అబ్దుల్ ఖాదిర్ రాసిన 'హిస్టరీ ఆఫ్ అహ్మద్‌నగర్' పుస్తకంలో పేర్కొన్నారు.

ప్రయాణ సమయాల్లో చాంద్ బీబీ వెంట ఏడుగురు మహిళలు ఉండేవారు.

ఏనుగు నడిపించే మావటి, ఒంటెను నడిపించే వ్యక్తితో పాటు వంద మందికి పైగా సాయుధ సైనికులు ఉంటారు. బంగారు నగలు ధరించిన నాలుగు వందల మంది మహిళలు పురుషుల దుస్తుల్లో ఉండేవారు.

''నేను దక్షిణ భారతదేశంలో చాంద్ బీబీ పాలించిన ప్రదేశాలకు వెళ్లా. ఆమె ఇంకా అక్కడి ప్రజల మనసులో సజీవంగానే ఉన్నారని అనిపించింది'' అని సారా అన్నారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)