దోచుకెళ్లిన ఆభరణాల్ని బ్రిటిషర్లు ఆ దేశానికి ఎలా వెనక్కి ఇచ్చారు, ఇందులో ట్విస్ట్ ఏంటి?

ఘనా
ఫొటో క్యాప్షన్, కుమాసిలో ప్రదర్శనకు ఉంచిన వస్తువుల్లో పట్టాభిషేకంలో సభికులు పెట్టుకునే ఉత్సవ టోపీ కూడా ఉంది
    • రచయిత, ఫేవర్ నునో, థామస్ నాడి
    • హోదా, బీబీసీ న్యూస్, కుమాసి

బ్రిటిషర్లు 150 ఏళ్ల క్రితం అసంటే రాజ్యం నుంచి దోచుకెళ్లిన కళాకృతులు ఎట్టకేలకు ఘనాకు తిరిగి వచ్చాయి. ఘనాలోని ఒక మ్యూజియంలో వాటిని ప్రదర్శిస్తున్నారు.

అసంటే రాజధాని కుమాసిలోని మన్హియా ప్యాలెస్ మ్యూజియంలో ఉంచిన ఈ 32 కళాకృతులను చూడటానికి జనం పోటెత్తారు.

‘‘అసంటేకు, ఆఫ్రికా ఖండానికి ఇది మరుపురాని రోజు. మా స్ఫూర్తి తిరిగి వచ్చింది’’ అని అసంటే రాజు ఒటుమ్‌ఫుయో నానా ఒసెయ్ టుటు 2 అన్నారు.

ప్రస్తుతానికి ఈ కళాకృతులను మూడేళ్ల ఒప్పందం మీద ఘనాకు అప్పగించారు. ఈ ఒప్పందాన్ని కావాలంటే పొడిగించుకోవచ్చు.

బ్రిటన్‌లోని రెండు మ్యూజియాలకు, అసంటే రాజుకు మధ్య ఈ ఒప్పందం కుదిరింది. ఘనా ప్రభుత్వానికి ఈ ఒప్పందానికి ఎలాంటి సంబంధం లేదు. ద విక్టోరియా అండ్ అల్బర్ట్ మ్యూజియం (వీ అండ్ ఏ), బ్రిటిష్ మ్యూజియంలతో అసంటే కింగ్ చేసుకున్న ఒప్పందం మేరకు మూడేళ్ల కాలానికి ఈ కళాకృతులను ఘనాకు ఇచ్చారు.

ఘనా
ఫొటో క్యాప్షన్, ముఖ్యమైన వ్యక్తుల అంత్యక్రియల్లో రాజు ధరించే కంఠాభరణం (కుడి)

అసంటే రాజును సంప్రదాయ అధికారానికి చిహ్నంగా చూస్తారు. పూర్వీకుల అంశతో ఆయన జన్మించినట్లుగా నమ్ముతారు. కానీ, ఇప్పుడు అసంటే రాజ్యం కూడా ఘనా ఆధునిక ప్రజాస్వామ్య దేశంలో భాగంగా ఉంది.

‘‘మా గౌరవం తిరిగి వచ్చింది’’ అని బీబీసీతో రిటైర్డ్ పోలీస్ కమిషనర్, అసంటే నివాసి హన్రీ అమంక్‌వాటియా అన్నారు.

వీ అండ్ ఏ మ్యూజియం 17 కళాకృతుల్ని, బ్రిటిష్ మ్యూజియం 15 కళాకృతుల్ని అసంటేకు పంపించింది.

అసంటే రాజు సిల్వర్ జూబ్లీ వేడుకల సమయంలోనే ఈ కళాకృతులు కూడా అసంటేకు యాదృచ్ఛికంగా తిరిగొచ్చాయి.

19వ శతాబ్దంలో జరిగిన ప్రముఖ సర్‌గ్రెంతి యుద్ధంతో సహా ఆంగ్లో-అసంటే యుద్ధాల సమయంలో ‘‘ఘనా క్రౌన్ జువెల్స్’’గా పిలిచే కొన్ని ఆభరణాలను బ్రిటిషర్లు కొల్లగొట్టారని కొందరు చెబుతుంటారు.

బంగారు వీణ (సంకువో) వంటి కొన్ని వస్తువులను 1817లో ఒక బ్రిటిష్ దౌత్యవేత్తకు బహుమానంగా ఇచ్చారు.

ఘనా

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, అసంటే రాజు ఒటుమ్‌ఫుయో నానా ఒసెయ్ టుటు 2 సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా కళాకృతుల ప్రదర్శన నిర్వహించారు

‘‘ఈ వస్తువుల వెనుక ఉన్న చాలా బాధాకరమైన చరిత్రను మేం గుర్తించాం. వలసవాదం, సామ్రాజ్యవాదంతో ప్రభావితమైన చరిత్ర అది’’ అని విక్టోరియా అండ్ అల్బర్ట్ మ్యూజియం డైరెక్టర్ డాక్టర్ ట్రిస్టామ్ హంట్ అన్నారు. ఈ వేడుక కోసం ఆయన కుమాసికి వెళ్లారు.

ఘనాకు తిరిగొచ్చిన కళాకృతుల్లో రాష్ట్ర ఖడ్గం, గోల్డ్ పీస్ పైప్, బంగారు బ్యాడ్జ్‌లు ఉన్నాయి.

‘‘ఈ సంపద ఒక గొప్ప సామ్రాజ్యపు విజయం, పరీక్షలకు సాక్షిగా ఉంది. కుమాసికి మళ్లీ అవి తిరిగిరావడం సాంస్కృతిక మార్పిడి, సయోధ్య శక్తికి నిదర్శనం’’ అని డాక్టర్ హంట్ వ్యాఖ్యానించారు.

ఘనా
ఫొటో క్యాప్షన్, విషాద సమయంలో క్రోనోంకీ అని పిలిచే ఈ బంగారు హెల్మెట్‌ను ధరిస్తారు

ఇప్పుడు ఘనాకు తిరిగొచ్చిన వస్తువుల్లో ఒకటైన రాష్ట్ర ఖడ్గానికి అసంటే ప్రజల్లో గొప్ప గౌరవం ఉంది. ఈ కత్తినే ‘‘పాంపోంసుయో ఖడ్గం’’ అని పిలుస్తారు.

సామ్రాజ్యంలో ముఖ్యాధికారులు, రాజు ప్రమాణ స్వీకారం చేసే సమయంలో ఈ కత్తిని ఉపయోగిస్తారు. అందుకే దీనికి అసంటే రాజ్యంలో గొప్ప ప్రాముఖ్యత ఉంది.

‘‘అసంటే రాజ్యం నుంచి వస్తువులను తీసుకున్నప్పుడు వాటితో పాటే మా హృదయాలు, మా ఉనికిలోని కొంత భాగాన్ని కూడా తీసుకున్నట్లు అనిపించింది’’ అని బీబీసీతో రాయల్ హిస్టోరియన్ ఒసెయ్ బోసు సఫో కంటంకా చెప్పారు.

ఈ కళాకృతులు తిరిగి రావడం ఎంత ముఖ్యమైనదో అంతే వివాదాస్పదమైనది.

ఘనా
ఫొటో క్యాప్షన్, కోవర్ట్ ఆపరేషన్లకు మిడ్ నైట్ కత్తి (ఎడమ)ని ఉపయోగిస్తారు. రాజు వద్ద పనిచేసేవారు ధరించే బంగారు బ్యాడ్జీలు (కుడి)

యూకే చట్టం ప్రకారం, జాతీయ మ్యూజియాలైన వీ అండ్ ఏ, బ్రిటిష్ మ్యూజియం వర్గాలు తమ దగ్గర ఉన్న వస్తువులను, కళాకృతులను శాశ్వతంగా ఆయా దేశాలకు తిరిగి ఇవ్వకూడదు. కాబట్టి, ఈ ప్రత్యేక ఒప్పందాలు తమ వద్ద ఉన్న వస్తువులను ఆయా దేశాలకు కొంతకాలం ఇవ్వడానికి ఒక మార్గంగా ఉన్నాయి.

ఇలాంటి ఒప్పందాలు ఆయా వస్తువుల మీద యూకే యాజమాన్యాన్ని అంగీకరిస్తున్నట్లుగా ఉపయోగించవచ్చని కొన్ని దేశాలు భయపడుతున్నాయి.

ఈ కళాకృతులన్నీ శాశ్వతంగా తమ దేశంలోనే ఉండిపోవాలని ఘనాలోని చాలామంది కోరుకుంటున్నారు. బ్రిటిష్ చట్టపర పరిమితులను అధిగమించడానికి ఈ కొత్త ఏర్పాటు ఒక మార్గం.

తమ వద్ద నుంచి దోచుకెళ్లిన వస్తువులను తిరిగి ఇవ్వాలంటూ ఆఫ్రికా దేశాలు పదేపదే పిలుపునిచ్చాయి.

‘‘నైజీరియా నుంచి దోచుకున్న 1000 బెనిన్ కాంస్యాలను 2022లో జర్మనీ తిరిగి నైజీరియాకు ఇచ్చేసింది. వలసవాద చీకటి చరిత్ర చేదు జ్ఞాపకాల నుంచి బయటపడటానికి ఇది ఒక ముందడుగు’’ అని నైజీరియాకు యాజమాన్య హక్కులను అందజేస్తూ జర్మనీ విదేశాంగ మంత్రి వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.