ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: కొట్లాటలు, గాలిలోకి కాల్పులు, పెట్రోలు బాంబులు, ఈవీఎం ధ్వంసాలు, కిడ్నాపులు, సస్పెన్షన్లు.. పోలింగ్ రోజు ఏం జరిగిందంటే..

ఓటేసిన మహిళలు

ఫొటో సోర్స్, Vizag DPRO

    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ప్రధాన ఘట్టం ముగిసింది. కోట్ల మంది తీర్పు ఈవీఎం డబ్బాల్లో నిక్షిప్తం అయింది.

ఆంధ్రప్రదేశ్లో జరిగిన శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్ రాత్రి పొద్దుపోయే వరకూ కొనసాగింది.

78.25 పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం సోమవారం రాత్రి వెల్లడించింది. తుది పోలింగ్ శాతం మంగళవారం మధ్యాహ్నానికి తెలిసే అవకాశం ఉంది.

కొట్లాటలు, గాలిలోకి కాల్పులు, రాళ్లు విసరడాలు, రక్తం కారడాలు, పెట్రోలు బాంబులు, ఈవీఎం ధ్వంసాలు, కిడ్నాపులు, సస్పెన్షన్లు.. ఇలా ఒకవైపు కొనసాగుతుండగా.. మరోవైపు మిట్టమధ్యాహ్నం ఒంటి గంటకు మండే ఎండల్లో రెండు మూడు గంటల పాటు క్యూలలో నిలబడి మరీ ఓటేశారు ప్రజలు.

అంతేకాక, ఓటేయడం కోసం కొండ కోనల నుంచి డోలీలు కట్టుకుని వచ్చారు గిరిజన వృద్ధులు.

రాత్రి పొద్దుపోయే వరకూ క్యూలైన్లో నిల్చుని మరీ సామాన్యులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇలా ఆంధ్రా శాసన సభ ఎన్నికలు ఎప్పట్లాగే అత్యంత ఆసక్తికరంగా సాగాయి.

ఎక్కడా రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం పడలేదని ఎన్నికల సంఘం ప్రకటించింది.

ఓటేసేందుకు క్యూలైన్లలో నిల్చున్న ప్రజలు

ఉదయం నుంచే బారులు తీరిన ఓటర్లు

ఎన్నికల సంఘం ప్రకటించిన దాని ప్రకారం పోలింగ్ సమయం ఉదయం 7 గంటలకు మొదలు అవుతుంది. కానీ ఓటర్లు మాత్రం ఆరు-ఆరున్నర నుంచే పోలింగ్ కేంద్రాల ముందు పెద్ద సంఖ్యలో కనిపించారు.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 46,389 కేంద్రాల్లో పోలింగ్ జరిగింది. ఇన్ని వేల ఈవీఎంలలో ఒక వెయ్యిలోపు ఈవీఎంలలో మాత్రమే సమస్యలు వచ్చాయి. వాటిని సరిచేసి పోలింగ్ మొదలు పెట్టే సరికి కాస్త ఆలస్యమైంది. స్పేర్ ఈవీఎంలు ఉంచుకోవడం వల్ల పని సులువైంది.

ఇక మధ్యాహ్నం ఎండ పెరిగినప్పటికీ ఓటర్ల సంఖ్య తగ్గలేదు. మిట్ట మధ్యాహ్నం కూడా వేడిని తట్టుకుని పోలింగ్ కేంద్రాల ముందు నిల్చుని సగటున 2-3 గంటల సమయం ఓపిగ్గా ఎదురుచూసి మరీ ఓటేశారు జనాలు.

మన్యం జిల్లాలోని కొమరాడ మండలంలోని రెబ్బ గ్రామస్థులు

ఫొటో సోర్స్, VENKAT

ఫొటో క్యాప్షన్, ఓటేసేందుకు నదిదాటుతున్న మన్యం జిల్లాలో కొమరాడ మండలంలోని రెబ్బ గ్రామస్థులు

కర్నూలు సహా కొన్ని చోట్ల వర్షాలు కురిసాయి. అయినా ఓటర్లు పోలింగ్‌కి బాగానే వచ్చారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై సహా అనేక ఇతర ప్రాంతాల నుంచి వచ్చి మరీ ఓటేశారు.

ఎన్నికల సంఘం ఏర్పాట్లలో పకడ్బందీగా వ్యవహరించింది. చిన్న చిన్న సమస్యలు మినహా స్థూలంగా ఏర్పాట్లు బాగా చేశారు.

టెంట్లు వేయడం, మంచినీరు పెట్టడం, వృద్ధులు, వికలాంగులకు వీల్ చైర్లు, వైద్య సహాయం వంటివి ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ఏర్పాటు చేశారు.

ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లోని వివాదాస్పద కొటియా గ్రామం వారు రెండు రాష్ట్రాల్లోనూ ఓటు వేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని కొమరాడ మండలంలోని రెబ్బ గ్రామస్థులు ఓటు వేయడానికి నది దాటాల్సి వచ్చింది. మోకాలు లోతు నీటిలో నాగావళి నదిని దాటి కూనేరు పోలింగ్ కేంద్రానికి వెళ్లి వీరంతా ఓట్లు వేశారు.

ఓటేసేందుకు క్యూలైన్లలో నిల్చున్న ప్రజలు

ఫొటో సోర్స్, Vizag DPRO

కొన్ని చోట్ల ఈవీఎంలు ధ్వంసం

మావోయిస్టు ప్రభావిత ఏజెన్సీ ప్రాంతాల్లో ఓటింగ్ సాయంత్రం 4 గంటలకే ముగిసింది. మిగిలిన చోట్ల 6 గంటల వరకూ సమయం ఇచ్చారు. సాయంత్రం 5-6 గంటలలోపు చాలా చోట్ల పోలింగ్ పూర్తి కాగా, ఆ తరువాత కూడా కొన్ని పోలింగ్ కేంద్రాల్లో జనాలు క్యూలైన్లలో కనిపించారు.

పల్నాడులో మొత్తం 8 చోట్ల ఈవీఎంలు ధ్వంసం అయినట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. సీఆర్పీఎఫ్ బలగాలను మోహరించినా ఇలాంటి ఘటనలు జరిగాయని చెప్పింది.

అయితే ఈవీఎంలలోని చిప్‌లలో డేటా నిల్వ ఉంటుంది కాబట్టి, ఓట్లు లెక్కించడానికి ఇబ్బంది ఉండదని చెప్పారు.

గతంలోలాగా ఓట్లు గల్లంతు లాంటి వార్తలు ఎక్కడా వినపడలేదు. ఆ మేరకు ఓటర్ల జాబితాను పకడ్బందీగా తయారు చేశారు అధికారులు.

‘‘సాయంత్రం 6 తరువాత కూడా దాదాపు 3,500 పోలింగ్ కేంద్రాల్లో 100 నుండి 200 మందికి పైగా క్యూలైన్లో ఉన్నారు’’ అని ఎన్నికల సంఘం ప్రకటించింది.

ముందుగా పోలింగ్ కేంద్రాల నుంచి ఈవీఎంలను సంబంధిత రిసెప్షన్ సెంటర్లకు తీసుకువెళ్తారు. అక్కడ పార్టీల ఏజెంట్లు సమక్షంలో వాటిని స్ట్రాంగ్ రూముల్లో పెట్టి ఆ గదులకు సీల్ వేస్తారు.

ఆ ప్రాంతాల భద్రత సీఆర్పీఎఫ్ పోలీసులు చూస్తారు. సీసీ కెమెరాలు పెడతారు. కావాలంటే పోటీ చేస్తున్న అభ్యర్థుల తరపున ఏజెంట్లు కూడా అక్కడ కాపలా ఉండవచ్చు.

గన్నవరం నియోజకవర్గంలో ఉద్రికత్త

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, గన్నవరం నియోజకవర్గంలో ఉద్రికత్త

పల్నాడులో హింస

పోలింగ్ ప్రారంభం అవుతూనే పల్నాడులో రక్తం చిందింది. పల్నాడులో పోలింగ్ రోజంతా గొడవలు జరుగుతూనే ఉన్నాయి.

ఆంధ్రా ఎన్నికల్లో హింస పల్నాడు నుంచి ప్రారంభం కాగా, దక్షిణ కోస్తా రాయలసీమల్లో అనేక చోట్ల హింస, బీభత్స దృశ్యాలు కనిపించాయి.

రెంటచింతల మండలం రెంటాల గ్రామంలో వైయస్సార్సీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య గొడవ జరిగి, ఇద్దరు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి.

ముందుగా పోలీసులు సర్దిచెప్పి, అంతా చక్కదిద్దిన తరువాత అక్కడకు టీడీపీ అభ్యర్థి బ్రహ్మానంద రెడ్డి వెళ్లగా మరోసారి ఉద్రిక్తత ఏర్పడింది.

పల్నాడులోని చాలా పల్లెల్లో వైయస్సార్సీపీ, తెలుగుదేశం కార్యకర్తల మధ్య ఈ తరహా ఘర్షణ వాతావరణం కనిపించింది.

పాలువాయి గేటు గ్రామంలోని ఈవీఎంలను వైయస్సార్సీపీ నాయకులు ధ్వంసం చేశారు. మాచర్ల పరిధిలో ఈవీఎంలు ధ్వంసం చేయడంతో నాలుగు పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ఆగిపోయి, సిబ్బంది అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయారు.

నరసరావుపేటలో టీడీపీ అభ్యర్థి అరవింద బాబు కారుపై దాడి జరిగింది. ప్రతిగా వైయస్సార్సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ ఇల్లు, వ్యాపార సంస్థలపై రాళ్ల దాడి జరిగింది.

పెట్రోలు బాంబులు విసురుకున్నారు. చివరకు పోలీసులు రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

లావు కృష్ణదేవరాయలు కార్ల అద్దాలు ధ్వంసం అయ్యాయి. మధ్యాహ్నం నుంచి గొడవలు బాగా పెరిగాయి. రెంటచింతల జెట్టిపాలెంలో తెలుగుదేశం కార్యకర్తలు ఈవీఎంలను ధ్వంసం చేశారు. గురజాల మండలం తంగేడులో బాంబులు విసురుకున్నారు. అనేక దుకాణాలు తగలబడ్డాయి.

అన్నమ్మయ్య జిల్లాలో జరిగిన ఘర్షణలో ఒక వ్యక్తి కన్ను పోయింది. మాచర్ల తెలుగుదేశం అభ్యర్థి కారుకు నిప్పు పెట్టారు. పూర్తిగా తగలబడింది.

కొన్ని చోట్ల గ్రామం మొత్తం కరెంటు సరఫరా నిలిపివేశారు. సీసీ కెమెరాలు పనిచేయకూడదనే లక్ష్యంతో ఇలా చేశారు. పల్నాడు వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో వాహనాలు ధ్వంసం అయ్యాయి. అనేక ఘటనలు జరిగాయి.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

ఇతర జిల్లాల్లో..

చిత్తూరు జిల్లా పుంగనూరులో ముగ్గురు తెలుగుదేశం పోలింగ్ ఏజెంట్లు కిడ్నాప్ అయినట్టు ఫిర్యాదు రాగా, పోలీసలు వారిని గుర్తించి తీసుకొచ్చారు.

స్వయంగా ఎన్నికల సంఘమే పుంగనూరులో ఏజెంట్లు కిడ్నాప్ అయినట్లు ప్రకటన ఇచ్చింది. తరువాత ఈ ఘటనలో స్థానిక ఎస్సైని సస్పెండ్ చేసింది. అన్నమయ్య జిల్లా పుల్లంపేటలో టీడీపీ ఏజెంట్ కిడ్నాప్ అయ్యారు. వాహనాలు ధ్వంసం అయ్యాయి.

దర్శి నియోజకవర్గంలో వైయస్సార్సీపీ కార్యాకర్తపై తెలుగుదేశం కార్యకర్తలు దాడి చేసి గాయపరిచారు. కృష్ణా జిల్లా గన్నవరంలో వల్లభనేని వంశీ, యార్లగడ్డ వెంకట్రావు వర్గాల వారి మధ్య తోపులాట జరిగింది. రాళ్లు రువ్వుకున్నారు.

తిరుపతిలో దొంగ ఓట్ల ఆరోపణలతో వైయస్సార్సీపీ, తెలుగుదేశం కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. తాడిపత్రిలో వాగ్వివాదాలు జరిగాయి. నంద్యాలలో రాళ్ల దాడులు జరిగాయి.

ఓటింగ్

గృహ నిర్బంధాలు

హింసాత్మక ఘటనలపై ఎప్పడికప్పుడు పోలీసులు స్పందించారు. చక్కదిద్దడానికి ప్రయత్నించారు. అయితే అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించి అక్కడ అల్లర్లు జరగకుండా, ఈవీఎంలు ధ్వంసం చేసే వరకూ పరిస్థితి వెళ్లకుండా కట్టడి చేయడంలో మాత్రం పోలీసులు విఫలం అయినట్లు కనిపిస్తుంది.

ఇక ఈ హింసాత్మక ఘటనలపై మధ్యాహ్నం తరువాత ఎన్నికల సంఘం ఒక ప్రకటన విడుదల చేసింది. తెనాలి, మాచర్ల, అనంతపురం ఘటనల్లో కేసులు పెట్టడంతో పాటూ సంబంధిత నాయకులను గృహ నిర్బంధం చేయాలని ఆదేశించింది.

సాయంత్రం 4-6 మధ్య ఎటువంటి గొడవ జరగకుండా చూడాలని ఆదేశాలు ఇచ్చింది.

మొత్తంగా అన్నాబత్తుని శివకుమార్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి, జేపీ ప్రభాకర రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డిలను గృహ నిర్బంధం చేశారు.

హింస జరిగిన ప్రాంతాల్లో ఎక్కువగా జనసేన పోటీ చేయలేదు. ప్రధానంగా తెలుగుదేశం వైయస్సార్సీపీలు పోటీ చేసిన చోట్ల, ఆ రెండు పార్టీల మధ్యే ఘర్షణలు జరిగాయి. దీంతో రెండు పార్టీలూ పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి.

అవతలి పార్టీ వారు ఓడిపోతున్నారన్న భయంతోనే ఈ దాడులు చేసుకున్నట్టు రెండు పార్టీలూ ఆరోపించాయి. పార్టీలు ఎన్నికల సంఘానికి చాలా ఫిర్యాదులు కూడా చేశాయి. చంద్రగిరిలో కేంద్ర బలగాలు గాలిలోకి కాల్పులు జరిపాయి. కళ్యాణదుర్గంలో నాయకుల కార్లు ధ్వంసం అయ్యాయి.

గిద్దలూరులో రాళ్ల దాడులు జరిగాయి. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో గొడవల్లో ఒక వ్యక్తికి తల పగిలింది. తాడిపత్రిలో పోలీసుల మీద రాళ్ల దాడి జరిగింది.

తెనాలి ఎమ్మెల్యే ఘటన

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే, యువకుడి మధ్య ఘర్షణ - చెంప దెబ్బలు

తెనాలి ఎమ్మెల్యే ఘటనపై దేశమంతా చర్చ

తెనాలి వైయస్సార్సీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివ కుమార్ ఒక ఓటరు చెంపపై కొట్టడం, తిరిగి ఆ ఓటర్ ఎమ్మెల్యే చెంపపై కొట్టడం, ఆ తరువాత ఆయన అనుచరులు అంతా కలసి ఆ ఓటరును కొట్టడం – ఇదంతా రికార్డయిన వీడియో దేశమంతా వైరల్ అయింది.

ఈ ఘటనపై ఇద్దరూ వ్యక్తులూ మీడియా ముందు తమ వివరణ ఇచ్చారు. సదరు ఓటరు తాగి ఇతరులను ఇబ్బంది పెడుతూ తనను దుర్భాషలాడాడని ఎమ్మెల్యే చెప్పగా, లైన్లో వచ్చి ఓటు వేయమన్నందుకే కొట్టాడని గొట్టిముక్కల సుధాకర్ అనే ఓటరు చెప్పారు.

దీనిపై కేసులు పెట్టారు. వీడియోపై స్పందించిన ఎన్నికల సంఘం ఎమ్మెల్యేను పోలింగ్ ముగిసే వరకూ గృహ నిర్బంధంలో ఉంచాలని ఆదేశాలు ఇచ్చింది.

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నజీర్

ప్రముఖులు ఎక్కడ ఓటేశారు?

గవర్నర్ నజీర్ విజయవాడలో ఓటు వేశారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన రెడ్డి పులివెందుల నియోజకవర్గంలోని ఓటు వేశారు. తెలుగుదేశం అధ్యక్షులు చంద్రబాబు, లోకేశ్‌లు మంగళగిరిలో ఓటు వేశారు.

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మంగళగిరిలో ఓటు వేశారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిళ పులివెందుల నియోజకవర్గంలో ఓటు వేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి రాజమండ్రి నగర నియోజకవర్గంలో ఓటు వేశారు.

పవన్ కల్యాణ్
ఫొటో క్యాప్షన్, జనసేన అధ్యక్షుడు, పిఠాపురం అభ్యర్థి పవన్ కల్యాణ్ మంగళగిరిలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

పిఠాపురం ఉత్కంఠ

పవన్ కళ్యాణ్ పోటీ చేస్తోన్న పిఠాపురం, లోకేశ్ పోటీ చేస్తోన్న మంగళగిరి నియోజకవర్గాలపై బాగా ఆసక్తి కనిపించింది ఓటర్లలో.

ఈ ఇద్దరు నాయకులు పార్టీ అధ్యక్ష స్థాయి వ్యక్తులు కావడం, గతంలో ఒకసారి ఎమ్మెల్యేలుగా ఓడిపోవడంతో ఆ ఆసక్తి కనిపించింది. రెండు నియోజకవర్గాల్లోనూ పోలింగ్ ప్రశాంతంగానే జరిగింది.

మొత్తంగా 4 కోట్ల 14 లక్షల మంది ఆంధ్రా ఓటర్లు ఉండగా, 46 వేల 389 కేంద్రాల్లో పోలింగ్ జరగగా, లక్షా ఆరు వేల మంది పోలీసులు, లక్షల మంది సిబ్బంది ఎన్నికల క్రతువును పూర్తి చేశారు.

ఇక 25 ఎంపీ నియోజకవర్గాల్లోని 454 అభ్యర్థులూ, 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 2 వేల 387 మంది అభ్యర్థుల భవితవ్యం స్ట్రాంగ్ రూముల్లో సీల్ చేసి భద్రంగా ఉంది.

దేశమంతా ఎన్నికలు పూర్తయ్యే వరకూ ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు కూడా రావు. కాబట్టి మేనెల అంతా ఉత్కంఠే.

జూన్ 4న ఫలితాలు కాగా, దానికి మూడు రోజుల ముందు ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు వస్తాయి. ఇప్పటి వరకూ ఎండల్లో కష్టపడి ఎన్నికల్లో రాత్రనకా పగలనకా తిరిగిన నాయకులు, కార్యకర్తలు విశ్రాంతి తీసుకుంటున్నారు. పెద్ద నాయకులు విదేశీ ప్రయాణాలు పెట్టుకున్నారు.

వీడియో క్యాప్షన్, పిఠాపురంలో పోలింగ్ రోజు ఏం జరిగింది?

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)