ప్రయాగ్‌రాజ్: ‘వరకట్న మరణానికి’ భయంకరమైన ప్రతీకారం.. అసలేం జరిగింది?

ఫొటో సోర్స్, Ankit Srinivas
- రచయిత, గీతా పాండే
- హోదా, బీబీసీ న్యూస్, ప్రయాగ్ రాజ్
ఒక దారుణ ఘటన రెండు కుటుంబాలను విచ్ఛిన్నం చేసింది. ముగ్గురి చావులకు కారణమైంది. ఏడుగురిని జైలుకు పంపించింది.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ (గతంలో అలహాబాద్)లో మార్చి 18 రాత్రి జరిగిన ఆ ఘటన ఆ పరిసర ప్రాంతాల్లో అందర్నీ భయభ్రాంతులకు గురిచేసింది.
హెచ్చరిక: ఈ కథనంలో వివరాలు కొందరిని కలచివేయవచ్చు.
‘‘అప్పుడు దాదాపు రాత్రి 11 గంటలు అవుతోంది. అరవై, డెబ్బై మంది మా ఇంటికి వచ్చారు. కనికరం లేకుండా కొట్టడం మొదలుపెట్టారు’’ అని శివాని కేసర్వాణి చెప్పారు.
దాడి చేయడానికి వచ్చిన వారిలో అన్షిక కుటుంబీకులు, బంధువులు ఉన్నారని ఆమె తెలిపారు.
శివాని సోదరుడు అన్షు భార్య అన్షిక. కేసర్వాణి ఇంటిలో అంతకు గంట క్రితమే అన్షిక ఉరి వేసుకొని కనిపించారని ఆమె చెప్పారు.
అన్షిక ఆత్మహత్య చేసుకున్నట్లుగా శివానితో పాటు పోలీసులు చెప్పారు. కానీ, వరకట్నం కోసం ఆమెను హత్య చేశారని అన్షిక కుటుంబీకులు, పొరుగువారు ఆరోపించారు.
కేసర్వాణీ కుటుంబీకులు కలప వ్యాపారం చేస్తారు. అది వారి కుటుంబ వ్యాపారం. వారిది ఉమ్మడి కుటుంబం. ఇంట్లోని గ్రౌండ్‌ఫ్లోర్, బేస్‌మెంట్‌లో కలప దుకాణం నడిపేవారు. దానిపైన గోదాంతో పాటు వారి కుటుంబం నివాసం ఉంది.
ఆ ఇంట్లో ప్రతీ అంతస్తులోనూ ఒక పడక గది ఉంది. ఏడాది క్రితం అన్షికతో అన్షు పెళ్లి జరిగింది. అప్పటి నుంచి వారిద్దరూ టాప్ ఫ్లోర్‌లో ఉంటున్నారు. వారి తల్లిదండ్రులు మొదటి అంతస్తులో, చెల్లెలె శివాని రెండో అంతస్తులో ఉంటున్నారు.
‘‘అన్షిక మామూలుగా రోజూ రాత్రి దాదాపు 8 గంటలకు డిన్నర్ కోసం కిందకు వస్తుంది. కానీ, ఆ రోజు ఆమె రాలేదు. ఆమె కచ్చితంగా పడుకొని ఉంటుందని మేం అనుకున్నాం’’ అని బీబీసీతో శివాని చెప్పారు.
10 గంటలకు దుకాణం నుంచి వచ్చిన ఆమె సోదరుడు భార్యను పిలవడానికి పైకి వెళ్లారు.
‘‘తలుపు తట్టినా, పిలిచినా ఆమె నుంచి సమాధానం రాలేదు. గొళ్లెం తీయడానికి తలుపు పైనున్న అద్దాన్ని పగులగొట్టాడు. అప్పుడు అన్షిక చనిపోయినట్లు అతనికి తెలిసింది. వెంటనే అతను కేకలు వేయడంతో మేమంతా పైకి వెళ్లాం’’ అని శివాని వివరించారు.

ఫొటో సోర్స్, Ankit Srinivas
అన్షిక చనిపోయినట్లు సమీప పోలీస్ స్టేషన్‌లో తన అంకుల్‌తో కలిసి అన్షు సమాచారమిచ్చారు. వారి ఇంటికి అర కిలోమీటర్ దూరంలోనే పోలీస్ స్టేషన్ ఉంటుంది. అన్షిక తల్లిదండ్రులకు కూడా సమాచారం ఇచ్చారు.
ఆ తర్వాత గంట లోపలే చాలా మంది బంధువులతో అన్షిక కుటుంబీకులు అక్కడికి చేరుకున్నారని పోలీసులు చెప్పారు. నిమిషాల వ్యవధిలో ఆ రెండు కుటుంబాల మధ్య పెద్ద గొడవ జరిగిందని తెలిపారు.
శివాని తన మొబైల్ ఫోన్‌లో పురుషులు కేకలు వేస్తున్న, ఒకరినొకరు చెక్కలతో కొట్టుకుంటున్న వీడియోలను చూపించారు. పోలీస్ ఒకరు వారిని ఆపడానికి, పరిస్థితులను అదుపులోకి తేవడానికి ప్రయత్నించి విఫలమయ్యారు.
అన్షిక మృతదేహాన్ని ఇంట్లో నుంచి బయటకు తీసుకురాగానే, ఆమె కుటుంబీకులు ఇంటికి నిప్పంటించారని పోలీసులు చెప్పారు.
గ్రౌండ్‌ఫ్లోర్, బేస్‌మెంట్‌లో నిల్వ చేసిన కలపకు నిప్పు అంటుకొని మంటలు చెలరేగడంతో శివాని, ఆమె తల్లిదండ్రులు, ఆమె అత్త ఇంట్లోనే చిక్కుకుపోయారు.
శివాని, ఆమె అత్త రెండో అంతస్తులోని ఒక కిటికీని పగులగొట్టుకొని, పాకుకుంటూ పక్కనే ఉన్న తన అంకుల్ ఇంటికి చేరుకున్నారు. ఆమె తల్లిదండ్రులు మంటల్లోనే చిక్కుకున్నారు.
అగ్నిమాపక సిబ్బందికి మంటలు ఆర్పడానికి 3 గంటలకుపైగా సమయం పట్టింది. తెల్లవారుజామున మంటలు అదుపులోకి వచ్చాక లోపలికి వెళ్లి చూడగా వారిద్దరి కాలిపోయిన మృతదేహాలు కనిపించాయని శివాని చెప్పారు.
‘‘మా అమ్మ శవం మెట్ల మీద కూర్చొన్న స్థితిలో కనిపించింది. ఆమెను ఒక సంచిలో మార్చురీకి తీసుకెళ్లారు’’ అంటూ కన్నీళ్లు తుడుచుకుంటూ శవాని చెప్పారు.

ఫొటో సోర్స్, Ankit Srinivas
పోలీసులకు శివానీ ఇచ్చిన ఫిర్యాదులో అన్షిక కుటుంబానికి చెందిన 12 మంది, 60-70 మంది గుర్తు తెలియని వ్యక్తులు అని పేర్కొన్నారు.
అన్షిక తండ్రి, వారి కుమారులు, అంకుల్‌తో కలిపి మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేసి జైల్లో ఉంచినట్లు బీబీసీకి ఒక పోలీస్ అధికారి చెప్పారు.
అన్షికను అన్షుతో పాటు ఆయన తల్లిదండ్రులు, చెల్లెలు కట్నం కోసం వేధించి హత్య చేశారని ఆరోపిస్తూ ఆమె తండ్రి కూడా ఒక కౌంటర్ కంప్లైంట్ దాఖలు చేసినట్లు వారు తెలిపారు.
తన కుటుంబంపై వచ్చిన ఆరోపణలను శివానీ ఖండించారు. పెళ్లి సమయంలో అన్షిక కుటుంబం నుంచి ఒక కారుతో పాటు కొన్ని బహుమతులు తమ కుటుంబానికి అందాయని ఆమె అన్నారు.
‘‘మేం ఏమీ అడగలేదు. తమ కూతురి కోసం వారు ఇవ్వాలనుకున్నవి ఇచ్చారు’’ అని ఆమె చెప్పారు.
అన్షిక చనిపోయినప్పటి నుంచి అన్షు తిరిగి ఇంటికి రాలేదు. ‘‘అన్షు ఎక్కడో దాక్కున్నాడు. ఎందుకంటే అన్షిక బంధువుల్లో చాలామంది బయటే ఉన్నారు. వారంతా తనను చంపేస్తారని అన్షు భయపడుతున్నాడు’’ అని ఆమె తెలిపారు.
భారత్‌లో కట్నం ఇవ్వడం, పుచ్చుకోవడం 1961 నుంచి చట్టవిరుద్ధం. కానీ, ఇప్పటికీ 90 శాతం భారతీయ వివాహాల్లో కట్నం ప్రస్తావన ఉంటుందని ఇటీవల చేసిన ఒక సర్వే తేల్చింది.
భార్యలను వేధిస్తున్నట్లుగా పోలీసులకు ప్రతీ సంవత్సరం వేల సంఖ్యలో ఫిర్యాదులు వస్తుంటాయి. తగినంత కట్నం ఇవ్వలేదనే కారణంతో 2017-2022 మధ్య 35,493 మంది వధువుల మరణాలు సంభవించినట్లు నేరగణాంకాలు చూపుతున్నాయి.
కానీ, వరకట్నం మరణమంటూ ఆరోపించిన ఒక కేసులో ఇలాంటి భయానక ప్రతీకార దాడి జరిగినట్లు ఎప్పుడూ వినలేదు.
ప్రస్తుతం పక్కనే తన అంకుల్ ఇంట్లో ఉంటున్న శివానీ, తగులబడిన తమ సొంత ఇంట్లోకి మమ్మల్ని తీసుకెళ్లారు. ఆ రాత్రి జరిగిన విషాదానికి సంబంధించిన ఆనవాళ్లు ఇంట్లో ప్రతీచోటా ఉన్నాయి. ఇంటి గోడలు మసిబారిపోయాయి. నేలంతా చిక్కటి బూడిద పరుచుకుంది. కాలిన ఫర్నీచర్ అవశేషాలు కనిపించాయి.
‘‘నాకు న్యాయం కావాలి. మా ఇల్లు, కుటుంబం నాశనమైంది. నా జీవితంలో ఏమీ లేకుండా పోయింది. నేరస్థులందర్నీ శిక్షించాలి. న్యాయవిచారణ పారదర్శకంగా జరగాలి. మా ఇంటిని వాళ్లెందుకు తగులబెట్టారు. ఇప్పుడు మాకు సాక్ష్యాలు ఎలా దొరుకుతాయి? ’’ అని శివానీ అన్నారు.

ఫొటో సోర్స్, Ankit Srinivas
పోలీసులపై కూడా శివానీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అప్పుడు మా ఇంటి బయట కనీసం రెండు డజన్ల మంది పోలీసులు ఉండి ఉంటారు. కానీ, ఎవరూ మా తల్లిదండ్రుల్ని రక్షించడానికి ప్రయత్నించలేదు. కేవలం బయట నిల్చొని అంతా చూశారు’’ అని ఆమె ఆరోపించారు.
ఈ ఆరోపణలను పోలీసులు తీవ్రంగా ఖండించారు. ‘‘అది చాలా సున్నిత అంశం. అందరూ ఆవేశంలో ఉన్నారు. మేం మృతదేహాలను బయటకు తీసి, పోస్ట్ మార్టంకు తరలించడంపై దృష్టి సారించాం. జనాలను చెదరగొట్టి, పరిస్థితిని అదుపులోకి తీసుకురావడం మా ఉద్దేశం’’ అని బీబీసీతో ఒక సీనియర్ పోలీస్ అధికారి చెప్పారు. ఆయన పేరు చెప్పడానికి ఇష్టపడలేదు.
‘‘ఇంటికి నిప్పంటిస్తారని ఎవరూ ఊహించలేదు. అది పూర్తిగా ఊహించనిది. వెంటనే అగ్నిమాపక సిబ్బందిని పిలిపించాం. ఐదుగురిని రక్షించడంలో సహాయం చేశాం’’ అని ఆయన తెలిపారు.
ఈ ఘటన అన్షిక కుటుంబీకులను కూడా భయంలోకి నెట్టింది. మేం అన్షిక పుట్టింటికి వెళ్లినప్పుడు ఇంటి ప్రధాన ద్వారానికి పెద్ద ఇనుప తాళం వేసి ఉంది.

ఫొటో సోర్స్, Ankit Srinivas
అన్షిక పుట్టింటికి కేవలం 2 కి.మీ దూరంలో ఆమె అంకుల్ ఇల్లు ఉంటుంది. అరెస్ట్ అయిన వారిలో అతనితోపాటు ఆయన కుమారులు కూడా ఉన్నారు. వారి కుటుంబం ఇప్పటివరకు మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు.
మేం తలుపు తట్టగానే అన్షికకు తాత వరుసయ్యే జవహర్ లాల్ కేసర్వాణీ బయటకు వచ్చారు. ఆయన మాతో కొన్ని విషయాలు పంచుకున్నారు.
‘‘నేను మీకు ఏం చెప్పాలి? నా కుటుంబం అంతా జైల్లో ఉంది. నా కుమారులు, మనవళ్లు జైలులో ఉన్నారు’’ అని ఆయన అన్నారు.
‘‘వారు అన్షికను చంపారు. ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ఉరి వేశారు’’ అని ఆయన ఆరోపించారు.
అన్షిక వివాహం చాలా ఘనంగా జరిగిందని ఆయన చెప్పారు. ‘‘మేం దాదాపు 50 లక్షలు ఖర్చు చేశాం. మేం ఆమెకు ఒక ఇంట్లోకి కావాల్సినవన్నీ ఇచ్చాం. 16 లక్షల విలువ చేసే కారు కూడా ఇచ్చాం’’ అని ఆయన చెప్పారు.
ఫిబ్రవరిలో చివరిసారిగా అన్షిక తమ దగ్గరకు వచ్చినప్పుడు తనను వేధిస్తున్నారని చెప్పినట్లు ఆయన తెలిపారు. ‘‘తనను వేధిస్తున్నారని చెప్పింది. మేం కాస్త సర్దుకోమని, తర్వాత అంతా సద్దుమణుగుతుందని చెప్పాం’’ అని ఆయన వెల్లడించారు.
కేసర్వాణీ కుటుంబానికి స్థానికంగా మంచి పేరుంది. వారు స్నేహపూర్వకంగా, సహాయకరంగా, వినయంగా ఉంటారనే పేరుంది. కానీ, ఈ డబుల్ విషాదం పొరుగువారందరినీ షాక్‌కు గురి చేసింది.
‘‘వాళ్లు చాలా మంచోళ్లు. ఇది ఎలా జరిగిందో కూడా మేం ఊహించలేం. వారు గొడవల్లో తలదూర్చే వ్యక్తులు కాదు’’ అని ఆ వీధిలో నివసించే ఒక వ్యక్తి చెప్పారు.
‘‘ఇంటికి ఎవరు నిప్పంటించారో మాకు తెలియదు. కానీ, తమ కూతురు మృతదేహం చూస్తే ఎవరైనా మతి కోల్పోతారు’’ అని ఆయన అన్నారు.
పొరుగునే ఉండే మరో మహిళ మాట్లాడుతూ, అన్షిక చాలా మంచి అమ్మాయని అన్నారు. ‘‘ఆమెది చాలా సాధారణ కుటుంబం. ఇలాంటి క్రూరమైన నేరాలు చేసే రకం కాదు. అన్షిక చాలా మర్యాదగా ఉండేవారు. ఆమె అత్తింటివారు మంటల్లో కాలిపోయి చనిపోవడం దురదృష్టకరం. కానీ, ఇప్పుడు అన్షికకు ఏం జరిగింది? ఆమె ఎలా చనిపోయింది? అనే విషయాల గురించి ఎవరూ మాట్లాడటం లేదు. అది నాకు చాలా బాధకారంగా ఉంది’’ అని ఆమె అన్నారు.
ఫోటోలు: అంకిత్ శ్రీనివాస్
ఇవి కూడా చదవండి:
- పాముల సెక్స్: సంభోగం తరువాత ఆడ అనకొండ మగపామును ఎందుకు చంపుతుంది?
- బ్లూ కార్నర్: ప్రజ్వల్ రేవణ్ణ కోసం ఈ నోటీస్ ఎందుకు జారీ చేశారు, దీనివల్ల ఏమవుతుంది?
- పెనైల్ క్యాన్సర్: పురుషాంగం తొలగించడానికి కారణమవుతున్న ఈ క్యాన్సర్ ఎలా వస్తుంది?
- శామ్ పిట్రోడా: ‘ఆఫ్రికన్’ కామెంట్లపై సొంత పార్టీ ఎలా స్పందించింది... ప్రధాని చేసిన విమర్శలేంటి?
- గుడ్డు గురించి మీకు ఈ విషయాలు తెలుసా?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














