సెక్షన్ 498-ఏ: వరకట్న వేధింపుల చట్టంపై గత తీర్పును సవరిస్తూ సుప్రీం కోర్టు తాజా జడ్జిమెంట్

సుప్రంకోర్టు

ఫొటో సోర్స్, Reuters

వరకట్న వేధింపుల వ్యతిరేక చట్టం 498-ఎ పై సుప్రీంకోర్టు శుక్రవారం కీలకమైన తీర్పు వెలువరించింది. ఈ సెక్షన్ కింద అరెస్టులు చేసే ముందు వరకట్న వేధింపుల ఫిర్యాదుల పరిశీలనకు స్థానికంగా సంక్షేమ కమిటీలను ఏర్పాటు చేయాలని గతంలో ఇచ్చిన తీర్పును తాజా తీర్పు సవరించింది. సంక్షేమ కమిటీలను రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ చట్టం దుర్వినియోగం కాకుండా చూసేందుకు సెక్షన్ 41-ఏ, ముందస్తు బెయిల్ వంటి అంశాలు అంతర్గతంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది.

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఎ.ఎం ఖాన్విల్కర్ జస్టిస్ వై.చంద్రచూడ్ ధర్మాసనం 2017లో సుప్రీంకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలను సమర్థించింది.

ఇదే ఏడాది ఏప్రిల్ 23న జరిగిన విచారణల అనంతరం సుప్రీంకోర్టు ఈ కేసు తీర్పును రిజర్వ్‌లో ఉంచింది.

గత ఏడాది జులై 27న జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్, జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్‌తో కూడిన ఇద్దరు జడ్జిల ధర్మాసనం ఈ కేసులో కీలక ఆదేశాలు ఇచ్చింది.

వరకట్న వేధింపుల కేసుల్లో నిందితులపై ఆరోపణలను దర్యాప్తు చేసేవరకూ వారిని అరెస్టు చేయకూడదని అప్పట్లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.

ఆ తీర్పుతో సెక్షన్ 498-ఎ నిబంధనలను మార్చారు. అంతకు ముందు వరకట్న వేధింపుల కేసుల్లో నిందితుడిని వెంటనే అరెస్టు చేయడం తప్పనిసరిగా ఉండేది.

2017లో ఇచ్చిన తీర్పులో కుటుంబ సంక్షేమ కమిటీలు ఏర్పాటు చేయాలని కూడా సుప్రీం బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. ఇవి పోలీసులు చట్టపరమైన దర్యాప్తు ప్రారంభించే ముందు ఫిర్యాదులను సమీక్షిస్తాయి.

కానీ, తాజా తీర్పులో కుటుంబ సంక్షేమ కమిటీలు ఏర్పాటు చేయాలన్న ఆదేశాలను సుప్రీంకోర్టు రద్దుచేసింది. ఈ కేసులను పోలీసులు మాత్రమే దర్యాప్తు చేస్తారని చెప్పింది.

నవ వధువు

ఫొటో సోర్స్, INDRANIL MUKHERJEE/AFP/Getty Images

కొనసాగుతున్న సంప్రదాయం

వరకట్న వేధింపుల వ్యతిరేక చట్టం కింద తప్పుడు కేసులు భారీగా నమోదు అవుతుండడంతో 2017లో ఈ చట్టం దుర్వినియోగం కాకుండా అడ్డుకోవాలని సుప్రీంకోర్టు అధికారులను ఆదేశించింది.

ఆరోపణలపై దర్యాప్తు చేసేవరకూ వరకట్న వేధింపుల కేసుల్లో నిందితులను అరెస్టు చేయకూడదని కోర్టు ఆదేశించింది.

వరకట్న వేధింపుల వ్యతిరేక చట్టం కింద ప్రతి ఏటా వేలాది మంది అరెస్ట్ అవుతున్నారు. కానీ వీరిలో దోషులుగా తేలేవారి సంఖ్య తక్కువగా ఉంది.

"కేసు పెడుతున్నప్పుడు దానివల్ల వచ్చే సమస్యలు, పర్యవసానాలు వారికి కనిపించడం లేదు. దాంతో అలాంటి ఫిర్యాదులు ఒక్కోసారి నిందితులకు మాత్రమే కాకుండా, ఫిర్యాదు చేసినవారిని వేధించడానికి కూడా కారణం అవుతున్నాయి" అని గత ఏడాది కోర్టు చెప్పింది.

2015లో వరకట్నం సంబంధిత ఘటనల్లో 7634 మంది చనిపోయారని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.

భారతదేశంలో శతాబ్దాల నుంచి వరకట్నం ఇచ్చిపుచ్చుకునే సంప్రదాయం కొనసాగుతోంది. దక్షిణాదికి చెందిన ఈ సంప్రదాయంలో వివాహ సమయంలో వధువు తల్లిదండ్రులు వరుడి కుటుంబానికి నగదు, బట్టలు, ఆభరణాలు లాంటివి బహుమతిగా ఇస్తారు.

1961 నుంచి భారతదేశంలో వరకట్నం తీసుకోవడం చట్టవిరుద్ధంగా మారింది.

వధువు చేతుల్లో 100 రూపాయల నోట్లు

ఫొటో సోర్స్, SAM PANTHAKY/AFP/Getty Images

పెరుగుతున్న తప్పుడు కేసులు

అత్తింట వధువుల వరకట్న చావులను, మహిళలపై వేధింపులను అడ్డుకునేందుకు భారతదేశం 1983లో ఐపీసీ సెక్షన్ 498-ఎ ప్రకారం వరకట్న వేధింపుల వ్యతిరేక చట్టాన్ని తీసుకొచ్చింది.

ఈ చట్టం కింద ఫిర్యాదు చేస్తే నిందితులు, అంటే సాధారణంగా భర్త, అతడి కుటుంబ సభ్యులను పోలీసులు వెంటనే అరెస్ట్ చేస్తారు. కానీ దీనికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న వారు ఈ నిబంధన దుర్వినియోగం అవుతోందని, చాలా మంది మహిళలు తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు.

సెక్షన్ 498-ఎ దుర్వినియోగం కావడంపై 2014లో విచారణలు చేపట్టిన కోర్టు, మహిళలకు సహకరించేందుకు తీసుకొచ్చిన ఈ చట్టం, అసంతృప్తితో ఉన్న భార్యల చేతిలో ఆయుధంగా మారిందని భావించింది.

కానీ ఇది ఇంకా కొనసాగుతుండడంతో, వరకట్నం మహిళను బలహీనంగా చేస్తుందని, గృహ హింసకు, ఆమె మరణానికి కూడా కారణమవుతుందని మహిళాసంఘాలు ఉద్యమాలు చేస్తున్నాయి. వరకట్న వేధింపుల కేసుల్లో బాధితులకు న్యాయం జరిగేలా ఈ చట్టాన్ని మరింత కఠినంగా మార్చాలని డిమాండ్ చేస్తున్నాయి.

ఇవికూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)