భారత్‌లో తయారయ్యే మసాలాల గురించి ఎఫ్‌ఎస్ఎస్ఏఐ బీబీసీతో ఏం చెప్పిందంటే...

మసాలాలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సౌతిక్ బిస్వాస్, శారద.వి
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

"భారతీయులకు సుగంధ ద్రవ్యాలు పెయింట్ బాక్స్‌లో పెయింట్ల లాంటివి" అని నటుడు, ఫుడ్ రచయితగా మారిన మధుర్ జాఫ్రీ వ్యాఖ్యానించారు.

"ఒక మసాలాను ఏదో ఒకటి చేసి దాని నుంచి అనేక రకాల మసాలాలు బయటకు తీస్తాం.’’ అని ఆయన తెలిపారు.

ఇంకా చెప్పాలంటే మీరు మసాలా దినుసులను వేయించవచ్చు లేదా పొడిగా రుబ్బుకోవచ్చు.

వాటి రుచుల వైవిధ్యం మతిపోయేలా ఉంటుంది. భారతీయ మసాలాలు ఊరగాయలు, మాంసం రుచులను పెంచుతాయి.

స్పైసీ, స్ట్రీట్ ఫుడ్‌కు ఈ మసాలాలే రుచినిస్తాయి. జెస్టి మసాలాలు లోకల్ ఫ్రూట్ డ్రింక్స్ ఎనర్జీని పెంచుతాయి. పండ్లు, సలాడ్‌లకు ఘాటైన రుచిని అందిస్తాయి.

భారత మసాలాలు

ఫొటో సోర్స్, Getty Images

ప్రమాదంలో వేల కోట్ల వ్యాపారం

భారత్ ప్రపంచ సుగంధ ద్రవ్యాల కేంద్రం. 200కు పైగా సుగంధ ద్రవ్యాలను దాదాపు 180 దేశాలకు భారత్ ఎగుమతి చేస్తుంది.

వీటి విలువ రూ. 33 వేల కోట్లు అని స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా తెలిపింది.

దేశీయ మార్కెట్ రూ. 83 వేల కోట్లకు పైమాట. ఇలా భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద సుగంధ ద్రవ్యాల వినియోగదారుగా మారింది.

కానీ, ఇప్పుడు ఈ ప్రఖ్యాత మసాల దినుసులు ఎంత వరకు సేఫ్ అన్న అంశంపై ఆందోళనలు తలెత్తుతున్నాయి.

భారత కంపెనీలైన ఎండీహెచ్, ఎవరెస్ట్‌లు ఉత్పత్తి చేసిన కొన్ని మసాలా దినుసుల అమ్మకాలను సింగపూర్, హాంకాంగ్ దేశాలు గత నెలలో నిలిపివేశాయి.

వాటిలో క్యాన్సర్ కారక పెస్టిసైడ్, ఇథిలీన్ ఆక్సైడ్ అధిక స్థాయిలో ఉందంటూ నిలిపివేశాయి.

క్రిమి సంహారకాల అనుమానంతో భారత్‌కు చెందిన ప్రముఖ బ్రాండ్‌ ఉత్పత్తులపై దర్యాప్తు చేస్తున్నామని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ప్రతినిధి ఒకరు రాయిటర్స్‌తో చెప్పారు.

2021 నుంచి అమెరికాకు దిగుమతైన ఎండీహెచ్ మసాలా దినుసులలో బ్యాక్టీరియా ఉనికి కారణంగా సగటున 14.5 శాతం తిరస్కరించారని అమెరికా రెగ్యులేటరీ డేటా వార్తాసంస్థ చేసిన విశ్లేషణలో వెల్లడైంది.

మరోవైపు, ఈ రెండు బ్రాండ్‌లు తమ ఉత్పత్తులు సురక్షితమైనవని వాదిస్తున్నాయి.

అంతేకాదు భారత్ నుంచి వచ్చిన మిరపకాయలు, మిరియాలలో అదే క్యాన్సర్ కారక పదార్థాన్ని ఐరోపా సమాఖ్య (ఈయూ) గుర్తించి, ఆందోళనలను లేవనెత్తింది.

భారత మసాలాలపై మాల్దీవులు, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా ఆహార నియంత్రణ సంస్థలు కూడా పరిశోధనలు ప్రారంభించాయని పలు రిపోర్టులు చెబుతున్నాయి.

భారత మసాలాలు

ఫొటో సోర్స్, Getty Images

మసాలా దినుసులు సురక్షితమేనా?

దేశంలోని మసాలాలపై నాణ్యత పరీక్షలు నిర్వహించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.

ఇథిలీన్ ఆక్సైడ్ వినియోగంపై తనిఖీ చేయాలని ఎగుమతిదారులకు సుగంధ ద్రవ్యాల బోర్డు మార్గదర్శకాలను జారీ చేసింది.

ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) కూడా నమూనాలను పరీక్షిస్తోంది.

ప్రపంచంలోనే అత్యంత కఠినమైన (మ్యాగ్జిమమ్ రెసిడ్యూ లిమిట్స్) ప్రమాణాలు భారతదేశంలో ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అంటోంది.

"భారతదేశం శతాబ్దాలుగా సుగంధ ద్రవ్యాల ఎగుమతిదారు. ప్రభుత్వం తగిన శ్రద్ధ చూపకపోవడంతో, గత కొన్నేళ్లుగా ప్రభావం తగ్గుతోంది. ఏ స్థాయిలో లోపాలు ఉన్నాయో మనకు ఇంకా తెలియదు. ఇథిలిన్ ఆక్సైడ్‌ను రైతులు ఉపయోగించరు. అది పంట కోత తర్వాత, ప్రాసెసింగ్ తర్వాత చేరే అవశేషం" అని ఇండిపెండెంట్ రీసెర్చర్, ఎన్విరాన్మెంట్ జస్టిస్ యాక్టివిస్ట్ నరసింహ రెడ్డి దొంతి చెప్పారు.

ఇది దీర్ఘకాలిక ప్రభావం చూపిస్తుందని నరసింహ రెడ్డి అంటున్నారు.

గతంలో పురుగుమందుల అవశేషాల కారణంగా అమెరికాకు మామిడి ఎగుమతులకు ఏళ్లుగా ఇబ్బంది తలెత్తిందని ఆయన గుర్తుచేశారు.

అయితే, దీనిపై స్పందించిన ఎఫ్‌ఎస్ఎస్ఏఐ "ఇథిలీన్ ఆక్సైడ్ (ETO) భారతదేశంలో అమ్మే మసాలాల్లో ఉపయోగించరు." అని బీబీసీకి పంపిన ఈ మెయిల్‌లో పేర్కొంది.

వివాదానికి కారణమైన రసాయనాలు భారతీయ మార్కెట్లలో విక్రయించే మసాలా దినుసులలో లేవని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ పేర్కొనడం బహుశా ఇదే మొదటిసారి.

అయితే ఎఫ్ఎస్ఎస్ఐ మసాలా దినుసులలో ఈటీఓ లేదని ఎలా చెబుతుందని కొంతమంది నిపుణులు ప్రశ్నించారు.

ఎఫ్ఎస్ఎస్ఐ దేన్ని ఆధారంగా చేసుకుని ఇలా చెబుతోందని నరసింహ రెడ్డి దొంతి ప్రశ్నించారు.

మసాలా దినుసులలో పురుగులమందుల అవశేషాలపై మీడియా రిపోర్టులు వచ్చిన వెంటనే తాము రంగంలోకి అనేక ప్రాంతాలలో శాంపిల్స్ సేకరించి పరిశీలించినట్లు ఆ సంస్థ వెల్లడించింది.

ఏదైనా సమస్య ప్రపంచం దృష్టిని ఆకర్షించినప్పుడు మాత్రమే ఎఫ్ఎస్ఎస్ఐ ఇటువంటి చర్యలు తీసుకుంటుందని, ఈ భారతీయ ఉత్పత్తులు గతంలోనూ తిరస్కరణకు గురయ్యాయని డాక్టర్ రెడ్డి చెప్పారు.

‘‘గడిచిన కొన్నేళ్ళలో యురోపియన్ యూనియన్ అనేక ఆహారపదార్థాలను తిరస్కరించింది. ఎఫ్ఎస్ఎస్ఐ వీటిపై విచారణ జరిపి ఏ చర్యా ఎందుకు తీసుకోలేదు’’ డాక్టర్ రెడ్డి ప్రశ్నించారు.

అయితే, ఫుడ్ సేఫ్టీని కొలిచే ప్రమాణాలలో యూరోపియన్ యూనియన్, అమెరికా, భారత్ ల మధ్య తేడాలున్నాయని ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్‌కు సంబంధించిన అన్బు వాహిని తెలిపారు. ఈ ప్రమాణాల ప్రకారం భారత్‌లో వాడానికి ఈ రెండు బ్రాండ్‌లకు అనుమతి ఉందని ఆమె తెలిపారు.

"అభివృద్ధి చెందిన దేశాలలో వినియోగదారులకు మెరుగైన సమాచారం, అవగాహన కల్పించాల్సి ఉంది. ఈ విషయంలో వారు తమ హక్కులను వినియోగించుకుంటారు. ఉల్లంఘనలు ఉంటే వారు కంపెనీపై కేసులు వేయగలరు. భారతదేశంలో ఇది అలా కాదు" అని వాహిని తెలిపారు.

ప్రపంచ మసాలాలకు కేంద్రం

  • భారత్ దాదాపు రూ. 33 వేల కోట్లు విలువైన సుగంధ ద్రవ్యాలను ఎగుమతి చేస్తుంది, ప్రపంచ మసాలా ఎగుమతుల్లోదానికి 12 శాతం వాటా ఉంది.
  • ఎగుమతి అయ్యే ప్రధాన సుగంధ ద్రవ్యాలలో కారం పొడి, జీలకర్ర, పసుపు, యాలకులు, మిశ్రమ మసాలాలు ఉన్నాయి.
  • ఇతర ముఖ్యమైన ఎగుమతులలో ఇంగువ, కుంకుమ పువ్వు, సోంపు, జాజికాయ, లవంగం, దాల్చిన చెక్క ఉన్నాయి.
  • భారత మసాలా దినుసులకు చైనా, అమెరికా, బంగ్లాదేశ్‌ దేశాలు అతిపెద్ద మార్కెట్‌లు.
  • ఇతర ముఖ్యమైన మార్కెట్లలో యూఏఈ, థాయిలాండ్, మలేషియా, ఇండోనేషియా, యూకే, ఆస్ట్రేలియా, సింగపూర్, హాంకాంగ్ దేశాలు ఉన్నాయి.

(మూలం: స్పైసెస్ బోర్డ్, గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్)

భారత మసాలాలు

ఫొటో సోర్స్, Reuters

కలవరపెట్టేవే..

భారత మసాలాలను నిరాకరించడం కలవరపెట్టే పరిణామం. ఎందుకంటే అందులో ఒకటి, రెండు బ్రాండ్‌లు జనాదరణ పొందినవి, విశ్వసనీయమైనవి.

దిల్లీకి చెందిన ఎండీహెచ్ అనే కంపెనీ, 105 ఏళ్లుగా నడుస్తున్న ఒక దిగ్గజ సంస్థ, ఇది 60కు పైగా మిశ్రమ, గ్రౌండ్ మసాలాలు అందిస్తోంది.

ఎవరెస్ట్ ఫుడ్ ప్రొడక్ట్స్‌కు 57 ఏళ్ల చరిత్ర ఉంది.

''భారతదేశంలో స్వచ్ఛమైన, మిశ్రమ సుగంధ ద్రవ్యాల అతిపెద్ద తయారీదారు మాత్రమే కాదు, 80 దేశాలకు ఎగుమతి చేస్తున్నాం'' అని ఎవరెస్ట్ పేర్కొంది

బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్‌లు ఎవరెస్ట్ బ్రాండ్ అంబాసిడర్లుగా పనిచేశారు.

భారత మసాలాలు

ఫొటో సోర్స్, Getty Images

ఇంతకుముందు ఆరోపణలు వచ్చాయా?

ఖచ్చితంగా చెప్పాలంటే భారతీయ మసాలా దినుసులపై ఆరోపణలు రావడం ఇది మొదటిసారి కాదు.

కోల్‌కతాలో కారం, జీలకర్ర, కరివేపాకు, గరం మసాలా తయారు చేసిన ప్రముఖ మసాలా బ్రాండ్‌లను బయోకెమిస్ట్రీ నిపుణురాలు ఇప్సితా మజుందార్ 2014లో పరీక్షించారు.

సుగంధ ద్రవ్యాలకు నారింజ లేదా ఎరుపు రంగులు ఇవ్వడానికి ఉపయోగించే ఫుడ్ కలరింగ్‌లో సీసాన్ని గుర్తించినట్లు ఆమె చెప్పారు.

ఏప్రిల్‌లో గుజరాత్‌లో 60,000 కిలోలకు పైగా కల్తీ మసాలా దినుసులను (కారం పొడి, పసుపు, కొత్తిమీర పౌడర్, పికిల్ మసాలా) ఫుడ్ అండ్ డ్రగ్స్ కంట్రోల్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

మసాలాలు

ఫొటో సోర్స్, Getty Images

చైనా, ఈయూలు తిరస్కరిస్తే ఇబ్బందే..

నాణ్యతకు సంబంధించి ఆందోళనలు భారత నుంచి ఎగుమతి అయ్యే మసాలాలలో సగం మసాలాలకు ఇబ్బంది కలిగించొచ్చని దిల్లీకి చెందిన థింక్ ట్యాంక్ గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (జీటీఆర్ఐ) అభిప్రాయపడింది.

భారతీయ మసాలా దినుసుల నాణ్యతను చైనా కూడా ప్రశ్నిస్తే, ప్రపంచ ఎగుమతుల్లో భారత సరుకు సగానికి పైగా ప్రభావితం కావచ్చని జీటీఆర్ఐ ఇటీవలి నివేదికలో పేర్కొంది.

"నాణ్యత సమస్యలపై భారతీయ మసాలా సరుకులను క్రమం తప్పకుండా తిరస్కరిస్తున్న ఈయూ, ఒకవేళ కేసు వైపు మొగ్గుచూపితే పరిస్థితి మరింత దిగజారవచ్చు" అని తెలిపింది.

మరోవైపు పాశ్చాత్య దేశాలలోని మసాలా వినియోగదారులకు ఆ దినుసులు ఎక్కడి నుంచి వస్తున్నాయనేది తెలియకపోవచ్చు.

"సుగంధ ద్రవ్యాల వినియోగదారుల్లో చాలామందికి అవి ఎక్కడి నుంచి వస్తాయో తెలుసని అనుకోను. నేను సుగంధ ద్రవ్యాలను ఎక్కువగా వాడుతా. చికాగోలోని భారత షాపులకు ప్రసిద్ధి అయిన డెవాన్ అవెన్యూ సమీపంలో నివసిస్తాను. అక్కడే మసాలాలు కొంటాను. అవి భారత్ నుంచి వచ్చాయనుకుంటాను, కానీ నేను ఏ రోజూ పరిశీలించలేదు" అని భారతీయ వంటకాలపై ప్రత్యేకంగా రచనలు చేసే కొలీన్ టేలర్ సేన్ చెప్పారు.

అంతిమంగా నిపుణుల అభిప్రాయం ప్రకారం, భారత్ తన ఎగుమతుల సమగ్రతను కాపాడటానికి ఆహార భద్రత, పారదర్శకత, నిబంధనలను కఠినంగా అమలు చేయడం, స్పష్టమైన కమ్యూనికేషన్‌కు ప్రాధాన్యతనిస్తూ తన విధానాన్ని ప్రాథమికంగా సవరించాలి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)