ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెరిగిన పోలింగ్ శాతం దేనికి సంకేతం, ఎవరికి అనుకూలం?

ఏపీ ఎన్నికలు
    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరగడం ఎవరికి అనుకూలం? ఎవరికి ప్రతికూలం?

పోలింగ్ ముగిసిన తర్వాత అన్ని పార్టీలు లెక్కల్లో మునిగాయి. ఎవరి అంచనాలు వారు వేస్తున్నారు. ఇదే అంశంపై ఇప్పుడు రకరకాల చర్చలు సాగుతున్నాయి.

పోలింగ్ సందర్భంగా రాష్ట్రమంతటా పెద్దసంఖ్యలో ఓటర్లు కదిలారు. అనూహ్యంగా ఈసారి ఇతర ప్రాంతాల నుంచి ఓటు వేసేందుకు రాష్ట్రానికి వచ్చిన వారి సంఖ్య కూడా ఎక్కువే.

పోలింగ్‌కి ముందు రెండు రోజుల పాటు జాతీయ రహదారుల మీద వాహనాల రద్దీ, బస్సులు, రైళ్లలో ఖాళీ లేకపోవడం వంటి దృశ్యాలు కనిపించాయి.

ముఖ్యంగా హైదరాబాద్ నుంచి భారీ సంఖ్యలో ఓటర్లు ఏపీకి తరలివచ్చారు. బెంగళూరు, చెన్నైతో పాటుగా ఇతర దేశాల నుంచి కూడా కొందరు ప్రవాసులు ఓటు వేసేందుకు సొంత రాష్ట్రానికి రావడం కనిపించింది.

స్థానికులు కూడా పెద్దసంఖ్యలో ఓటేయడంతో ఓటింగ్ శాతం పెరిగింది. ఈ పెరుగుదలను ఎవరికి తోచిన రీతిలో వారు అన్వయించుకుంటున్నారు. పెరిగిన పోలింగ్ శాతం ఎవరికి ఉపయోగపడుతుందన్నది కూడా ఆసక్తికరంగా మారింది.

ఏపీ ఎన్నికలు

ఫొటో సోర్స్, UGC

ఓటింగ్ శాతం ఎంత?

సార్వత్రిక ఎన్నికల నాలుగో దశ పోలింగ్‌లో భాగంగా, ఆంధ్రప్రదేశ్ శాసనసభకు కూడా ఎన్నికలు జరిగాయి. పార్లమెంట్‌తో పాటు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించారు.

మే 13న ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన పోలింగ్ వివరాలను ఎన్నికల కమిషన్ ప్రాథమికంగా వెల్లడించింది. ఓటింగ్ ఎంత శాతం నమోదయ్యిందనే వివరాలను భారత ఎన్నికల సంఘం 'ఓటర్ టర్నౌట్' యాప్‌లో ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తోంది.

మే 15వ తేదీ ఉదయం 10 గంటల వరకు పోలింగ్ వివరాలు ఇలా ఉన్నాయి.

ఎన్నికల అధికారుల లెక్కల ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా 80.66 శాతం ఓట్లు పోలయ్యాయి. పోస్టల్ బ్యాలెట్‌తో కలిపి మొత్తం 81.73 శాతంగా తెలిపారు.

2019తో పోలిస్తే బ్యాలెట్ ఓట్లు రెట్టింపయ్యాయి.

ఈసారి గ్రామ/ వార్డు సచివాలయ ఉద్యోగులు కూడా పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకోవడంతో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పెరిగాయి.

జర్నలిస్టులకు కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సదుపాయం కల్పించడం కూడా పోస్టల్ ఓట్ల పెరుగుదలకు మరో కారణం.

అధికారిక జాబితా ప్రకారం, ప్రకాశం జిల్లా దర్శి అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధికంగా ఓట్లు పోలయ్యాయి. ఈ స్థానంలో 90.91 శాతం మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఏపీ ఎన్నికలు

అత్యధిక ఓటింగ్ శాతం నమోదైన 15 నియోజక వర్గాలు

  • దర్శి 90.91
  • జగ్గయ్యపేట 89.89
  • కుప్పం 89.88
  • యర్రగొండపాలెం 89.40
  • వినుకొండ 89.22
  • పెదకూరపాడు 89.18
  • కందుకూరు 88.96
  • ధర్మవరం 88.82
  • గంగాధర నెల్లూరు 88.69
  • పెడన 88.57
  • కళ్యాణదుర్గం 88.52
  • నెల్లిమర్ల 88.25
  • అద్దంకి 88.25
  • కొండెపి 88.12
  • పామర్రు 88.12
ఏపీ ఎన్నికలు

ఫొటో సోర్స్, Venkat

అత్యల్పంగా తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో 63.32 శాతం ఓటింగ్ నమోదైంది.

ఆ తర్వాత విశాఖ సౌత్ నియోజకవర్గంలో 63.42 శాతం మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు.

అత్యల్ప ఓటింగ్ శాతం నమోదైన నియోజకవర్గాలు..

  • తిరుపతి 63.32
  • విశాఖపట్నం సౌత్ 63.42
  • కర్నూలు 63.75
  • పాడేరు 63.91
  • విశాఖపట్నం నార్త్ 64.63
  • అనంతపురం అర్బన్ 65.08
  • కడప 65.27
  • విజయవాడ వెస్ట్ 66.46
  • గుంటూరు వెస్ట్ 66.53
  • ఆదోని 66.55
  • రాజమండ్రి సిటీ 67.57
  • నెల్లూరు రూరల్ 67.76
  • శ్రీకాకుళం 68.31
  • విశాఖపట్నం ఈస్ట్ 68.64
  • ఇచ్చాపురం 69.73

విశాఖపట్నం వెస్ట్ నియోజకవర్గంలో 69.78 శాతం, గాజువాకలో 69.83 శాతం ఓటింగ్ నమోదైంది.

ఏపీ ఎన్నికలు

మొత్తంగా చూస్తే, నగరాల పరిధిలోని నియోజకవర్గాల్లో ఓటింగ్‌పై ఓటర్లు ఆసక్తి చూపించలేదని ఎన్నికల కమిషన్ గణాంకాలు సూచిస్తున్నాయి.

రాష్ట్రంలోని ప్రధాన నగరాలైన విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, కర్నూలు, నెల్లూరు, గుంటూరు, రాజమండ్రి, కడప వంటి చోట్ల ఓటింగ్ శాతం తక్కువగా నమోదవడమే అందుకు నిదర్శనంగా కనిపిస్తోంది.

పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా చూస్తే, ఒంగోలు లోక్‌సభ నియోజవర్గంలో అత్యధికంగా ఓట్లు పోలయ్యాయి.

ఒంగోలు ఎంపీ సీటు పరిధిలో 87.06 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.

విశాఖపట్నం పార్లమెంటరీ నియోజకవర్గంలో అత్యల్ప ఓట్లు నమోదయ్యాయి. ఇక్కడ పోలింగ్ 71.11 శాతంగా ఉంది.

ఏపీ ఎన్నికలు
ఫొటో క్యాప్షన్, కడపలోని సెయింట్ జోసెఫ్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్ వద్ద దృశ్యాలు

పెరుగుతూ వస్తోన్న ఓటింగ్ శాతం

సాధారణ ఎన్నికల సందర్భంగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన నాలుగు ఎన్నికలను పరిశీలిస్తే ఇది స్పష్టమవుతుంది.

ఆధికారిక లెక్కల ప్రకారం, 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 69.9% మంది ఓటు వినియోగించుకున్నారు.

ఆ తర్వాత ఐదేళ్లకు 2009లో అది 72.7% కి పెరిగింది. అంటే, 2.8 శాతం మంది ఓటర్లు అదనంగా ఓటు వేశారు.

ఇక 2014 లెక్కల ప్రకారం పోలింగ్ శాతం 78.4 శాతంగా ఉంది. అంటే, అంతకుముందు ఎన్నికలతో పోలిస్తే ఒకేసారి అనూహ్యంగా 5.7 శాతం పెరుగుదల నమోదైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన చివరి ఎన్నికలు ఇవి.

ఆ తర్వాత జరిగిన 2019 ఎన్నికల్లో ఓటింగ్ శాతం 79.6 శాతానికి పెరిగింది. అంతకుముందు పదేళ్ల కిందట జరిగిన ఎన్నికలతో పోలిస్తే ఇది ఏకంగా 7 శాతం అదనం.

ఏపీ ఎన్నికలు

ఏపీలో భిన్నంగా పరిస్థితి

ఈసారి ఎన్నికల్లో మొదటి మూడు దశల లెక్కలను పరిశీలిస్తే అనేక రాష్ట్రాల్లో పోలింగ్ శాతం తగ్గింది. కొన్ని రాష్ట్రాల్లో అనూహ్యంగా ఓటింగ్ శాతం తగ్గుదల రాజకీయంగానూ చర్చనీయాంశం అయింది.

ఏపీలో మాత్రం అందుకు భిన్నంగా ఉంది. పోలింగ్ శాతంలో పెరుగుదల నమోదు కావడం ఆసక్తికరం. గడచిన రెండు దశాబ్దాలుగా ప్రతీ ఎన్నికల్లోనూ పోలింగ్ శాతంలో పెరుగుదల కనిపిస్తోంది.

"పోలింగ్ శాతం పెరుగుదలకు అనేక కారణాలున్నాయి. ఈసీ ప్రచారం కూడా ఉపయోగపడింది. ఓటర్లలో చైతన్యం వచ్చింది. ఓటు వినియోగించుకోవాలనే తపన పెరుగుతోంది. ఈసారి పోలింగ్ సందర్భంగా క్యూలో వేచి ఉండి ఓటు వినియోగించుకోవడానికి చాలా మంది వెనకాడలేదు.

మధ్య తరగతి, ఎగువ మధ్యతరగతి ఓటర్లు కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు. గతంతో పోలిస్తే యువ ఓటర్ల సంఖ్య కూడా బాగా ఎక్కువగా నమోదైంది. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు సానుకూల సంకేతం" అని ఎన్నికల సంఘం మాజీ అధికారి పి.రవీంద్ర కుమార్ అభిప్రాయపడ్డారు.

ఏపీలో పోలింగ్ శాతం పెరగడానికి అసెంబ్లీ ఎన్నికలు కూడా ఓ కారణమని ఆయన అంచనా వేశారు.

ఏపీ ఎన్నికలు

ఫొటో సోర్స్, FACEBOOK

ఎవరికి అనుకూలం?

ఇదే ఇప్పుడు కీలకాంశంగా మారింది.

పోలింగ్ శాతం పెరగడం మీదనే పార్టీలన్నీ దృష్టి పెట్టాయి. ఇది తమకే అనుకూలమని ఎవరికి వారు లెక్కలు వేస్తున్నారు.

మహిళలు పెద్ద సంఖ్యలో ఓటింగ్ వేసిన తీరుని అధికార వైఎస్సార్సీపీ ప్రధానంగా ప్రస్తావిస్తోంది. తమకు కలిసివస్తుందని చెబుతోంది.

అదే సమయంలో, ప్రభుత్వ వ్యతిరేకత కారణంగానే ఈసారి పోలింగ్ శాతం పెరిగిందని విపక్షం అంచనా వేస్తోంది.

2004 నుంచి పోలిస్తే 2009లో పోలింగ్ శాతం పెరిగినప్పుడు వరుసగా రెండోసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓటర్లు ఎన్నుకున్నారు. అప్పట్లో ఏపీలో త్రిముఖ పోటీ జరిగింది. అయినప్పటికీ కాంగ్రెస్ అధికారం నిలబెట్టుకుంది.

రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల్లో ఒక్కసారిగా పోలింగ్ శాతం పెరిగింది. అప్పుడు ఆంధ్రలో టీడీపీ, తెలంగాణలో అప్పటి టీఆర్‌ఎస్‌కు అధికారం దక్కింది.

2019లో కూడా పోలింగ్ శాతం పెరిగింది. ఆ ఎన్నికల్లోనూ మహిళలు ఎక్కువగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. అప్పుడు కూడా ప్రభుత్వం మారిపోయి, వైఎస్సార్సీపీకి విజయాన్ని కట్టబెట్టింది.

ఈసారి కూడా పోలింగ్ శాతం పెరిగింది. ఓటు హక్కు వినియోగించుకున్న వారిలోనూ మహిళలు అత్యధికంగా ఉన్నారు. మహిళల్లో ఓటింగ్ శాతం 82 వరకూ ఉంటుందని అంచనా. అందులోనూ గ్రామీణ మహిళలు ఎక్కువగా ఉన్నారు.

దీంతో ఇప్పుడు మహిళల ఓటింగ్ ఎవరికి అనుకూలం అన్నదే అన్ని పార్టీల అంచనాలకు అంతుబట్టడం లేదు.

"పోలింగ్ శాతం పెరిగితే ప్రభుత్వ వ్యతిరేకత అనడానికి ఆస్కారం లేదు. తగ్గినా ప్రభుత్వాలకు కలిసివస్తుందనే ఆధారం కూడా లేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో దక్షిణ తెలంగాణలో పోలింగ్ శాతం పెరిగింది. కాంగ్రెస్‌కి ఉపయోగపడింది. నార్త్ తెలంగాణాలో తగ్గింది. పాలక బీఆర్ఎస్‌కి కొంత మేలు చేసింది.

అలాగని ప్రతిసారీ అలా ఉండదు. బెంగాల్‌లో పోలింగ్ శాతం పెరిగినా మళ్లీ తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇలాంటివి దేశవ్యాప్తంగా అనేక ఉదాహరణలున్నాయి" అని సెఫాలజిస్ట్ ఎంఆర్కే మూర్తి అభిప్రాయపడ్డారు.

పోలింగ్ శాతం ఎక్కడ పెరిగింది? ఏ వర్గం నుంచి ఎక్కువగా ఓట్లు వచ్చాయి? ఆయా వర్గాల్లో ప్రభుత్వ వ్యతిరేకత, అనుకూలత ఏ మేరకు అనేది పరిశీలించాల్సి ఉంటుందని ఆయన చెబుతున్నారు.

ప్రతీ ఐదేళ్లకు జరుగుతున్న ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరుగుతున్న కారణంగా, ఈసారి పెరుగుదలను చూసి అంచనాకు రాలేమన్నది పరిశీలకుల వాదన.

గణాంకాలకు ఆధారం: ఎలక్షన్ కమిషన్ ఓటర్ టర్న్‌అవుట్ యాప్.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)