పాలిటెక్నిక్ చదువుతూ లింగ నిర్ధరణ పరీక్షలు చేస్తున్న యువతి అరెస్ట్, అసలేం జరిగిందంటే...?

సోనోగ్రఫీ ఫోటో

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

పాలిటెక్నిక్‌ చదువుతున్న 19 ఏళ్ల యువతి లింగ నిర్ధరణ పరీక్షలు చేస్తున్న ఘటన మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌( ఔరంగాబాద్‌)లో బయటపడింది.

శంభాజీనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆరోగ్య శాఖ చేసిన తనిఖీల్లో ఈ విషయం బయటపడింది.

ఈ కేసులో ఆ విద్యార్థినితో పాటు మరో ఆరుగురిపై కేసు నమోదు చేశారు. నలుగురిని అరెస్టు చేశారు.

అలా వెలుగులోకి...

19 ఏళ్ల సాక్షి థోరట్ పాలిటెక్నిక్‌ మూడో సంవత్సరం చదువుతోంది. ఆమె శంభాజీనగర్‌లోని గర్‌ఖెడ ప్రాంతంలో ఉంటారు.

ఛత్రపతి శంభాజీనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆరోగ్య అధికారి పరాస్ మాండ్లేచా దీనిపై మాట్లాడారు.

"ఆ యువతి ఇంట్లో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారని సమాచారం అందడంతో మా బృందంతో కలిసి అక్కడికి వెళ్లాం. ఆ సమయంలో అంతకు ముందే ఓ పేషెంట్ అక్కడికి వచ్చి వెళ్ళారు. మరో పేషెంట్ వస్తున్నట్లు మాకు సమాచారం అందడంతో మేం అప్రమత్తమయ్యాం’’

గర్భనిర్ధారణ పరీక్షలు చేస్తున్నారా అని కొద్ది సేపటి తర్వాత బయటకు వచ్చిన పేషెంట్‌ను అడిగాం. అది నిజమేనని ఆమె చెప్పారు. దీంతో ఆమెపైనా కేసు నమోదు చేశాం'' అని పరాస్ చెప్పారు.

సాక్షి నుంచి సోనోగ్రఫీ ప్రోబ్, జెల్, కాటన్, ట్యాబ్‌లు, ఇతర సామగ్రిని ఆరోగ్య శాఖ బృందం స్వాధీనం చేసుకుంది. దీంతో పాటు ఆమె ఇంట్లో రూ.12 లక్షల 80 వేల నగదు దొరికింది.

సాక్షికి ఈ ట్యాబ్ పాస్‌వర్డ్ తెలుసని, ఆ ట్యాబ్‌ను వాడేది ఆమేనని, ఆమె పాస్‌వర్డ్ చెప్పగా ట్యాబ్‌లో చాలా సోనోగ్రఫీ ఫోటోలు కనిపించాయని పరాస్ మాండ్లేచా తెలిపారు.

“ఈ కేసులో రెండో నిందితుడు ఆ యువతికి మేనమామ. ఆయన ప్రస్తుతం జైలులో ఉన్నారు. జైలు రికార్డుల ప్రకారం, ఆమె అతనిని క్రమం తప్పకుండా కలిసేది. ఈ కేసులో మొత్తం 8 మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నాం’’ అని ఆయన తెలిపారు.

దీనిపై వైద్య ఆరోగ్య శాఖ బృందం పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇంట్లో దొరికిన సామాగ్రితోపాటు యువతిని, ఆమె తల్లిని అదుపులోకి తీసుకున్నారు.

లింగనిర్ధరణ చట్టరీత్యానేరం

ఫొటో సోర్స్, GETTY IMAGES

పోలీసులు ఏం చెబుతున్నారు?

ఈ కేసులో, మహారాష్ట్ర వైద్య వృత్తి చట్టంలోని సెక్షన్ 33, ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 420తో పాటు ఇతర కేసులు నమోదు చేశారు.

"ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులుగా ఉండగా, నలుగురిని అదుపులోకి తీసుకున్నాం. ఈ కేసు గర్భస్థ పిండ నిర్ధారణకు సంబంధించినది. మిగిలిన వివరాలు విచారణలో తేలుతాయి’’ అని కేసు నమోదు అయిన పుండలిక్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్ రాజేష్ యాదవ్ బీబీసీతో అన్నారు.

చట్టం కఠినంగా ఉన్నా..

కొన్ని నెలల క్రితం షోలాపూర్ జిల్లాలోని బార్షిలో అనుమతి లేకుండా అబార్షన్లు చేస్తున్న విషయం బయటపడింది. అద్దె గదిలో చట్టవ్యతిరేకంగా అబార్షన్లు చేసేవారు.

గర్భస్థ లింగ నిర్ధారణకు సంబంధించి చట్టం ఉన్నా, ఇటువంటి కేసులు చాలానే తెరపైకి వస్తున్నాయి.

భారతదేశంలో1971లో 'మెడికల్ అబార్షన్ చట్టం' వచ్చింది. ఈ చట్టం ప్రకారం, గర్భిణీకి 20 వారాల వరకు అబార్షన్ చేయడానికి అనుమతి ఉండేది. ఈ చట్టాన్ని సవరిస్తూ, ఎంటీపీ - 'మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ' చట్టం 2021లో అమల్లోకి వచ్చింది.

దీని ప్రకారం, అత్యాచార బాధితులు, వికలాంగ మహిళలు, మైనర్ల విషయంలో చట్టపరమైన అబార్షన్ వ్యవధిని 20 నుంచి 24 వారాలకు పొడిగించారు.

కానీ, గర్భస్థ లింగ నిర్ధరణ తర్వాత అబార్షన్ చేస్తే, అది చట్ట ప్రకారం నేరం అవుతుంది.

అటువంటి అబార్షన్ చేసిన వైద్యులకు 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, 10 వేల రూపాయల వరకు జరిమానా విధించవచ్చు.

లింగ నిర్ధరణ పరీక్షకు ఒత్తిడి చేసే కుటుంబ సభ్యులకు 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, రూ. 50,000 వరకు జరిమానా విధించవచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)