తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్, ఓటర్లకు కల్పించిన సదుపాయాలివే..

ఫొటో సోర్స్, PIB
- రచయిత, శంకర్ వడిశెట్టి, అమరేంద్ర యార్లగడ్డ, అరుణ్ శాండిల్య
- హోదా, బీబీసీ ప్రతినిధులు
ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్‌సభ స్థానాలకు, తెలంగాణలోని 17 పార్లమెంటు సీట్లు, ఒక అసెంబ్లీ స్థానానికి నేడు పోలింగ్ జరుగుతుంది.
ఏపీలో పాలక వైసీపీ, ఎన్డీయే కూటమి, ఇతర పార్టీల తరఫున పోటీ చేస్తున్నవారు, స్వతంత్రులు తమ విజయం కోసం పెద్ద ఎత్తున చేపట్టిన ప్రచారం శనివారం సాయంత్రానికే ముగిసింది.
అటు తెలంగాణలో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ప్రచారం హోరెత్తించాయి. ఈసారి ఎన్నికల్లో ప్రభావం చూపాలని గట్టిగా ప్రయత్నిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించడమే లక్ష్యంగా సన్నాహాలు చేసినట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది.
26 జిల్లాల పరిధిలోనూ అధికారులు, పోలింగ్ సిబ్బంది రంగంలో దిగారు. సోమవారం ఉదయం 7 గం.లకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.
ఉదయం 5.30 గంటలకే మాక్ పోలింగ్ ఏర్పాట్లు చేసినట్టు ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్, ముఖేష్ కుమార్ మీనా చెప్పారు.
ఏపీలోని 169 నియోజకవర్గాలలో ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది.
మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలైన అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాలలో ఉదయం 7 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ ఉంటుంది.
పాలకొండ, సాలూరు, కురుపాం నియోజకవర్గాలలో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు.

ఫొటో సోర్స్, Facebook
జగన్, పవన్, చంద్రబాబు ఓటు ఎక్కడ వేయనున్నారు?
ప్రధాన పార్టీల నేతల్లో చాలావరకు గత ఎన్నికలలో పోటీ చేసిన స్థానాలలోనే ఈసారి కూడా పోటీ పడుతున్నారు.
ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నుంచి వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. తన సొంత నియోజకవర్గంలోని భాకారపురంలో ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఇక్కడ టీడీపీ నుంచి మారెడ్డి రవింద్రనాథ్ రెడ్డి బరిలో ఉన్నారు.
కుప్పం అసెంబ్లీ నియోజకర్గం నుంచి టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పోటీలో ఉన్నారు. వరుసగా తొమ్మిదోసారి ఆయన కుప్పం నుంచి బరిలో దిగారు. ఆయనకు ప్రత్యర్థిగా ఎమ్మెల్సీగా ఉన్న భరత్‌ను తొలిసారి వైఎస్సార్సీపీ పోటీలో దింపింది. దాంతో కుప్పం ఆసక్తికరంగా మారింది.
మంగళగిరి నుంచి టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పోటీ చేస్తున్నారు. చంద్రబాబుతో పాటు నారా లోకేష్ కూడా తన కుటుంబ సభ్యులతో కలిపి మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఉండవల్లిలో ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. మంగళగిరిలో వైసీపీ తరఫున మురుగుడు లావణ్య పోటీలో ఉన్నారు.
పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. సీనియర్ నాయకురాలు వంగా గీత అక్కడి నుంచి వైఎఎస్సార్సీపీ తరపున పోటీలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ కూడా మంగళగిరిలోనే తన ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి కూడా నియోజకవర్గం మారారు. గత ఎన్నికలలో రాజంపేట నుంచి పోటీ చేసి ఓటమి పాలైన ఆమె ఈసారి టీడీపీ, జనసేనల మద్దతుతో రాజమండ్రి పార్లమెంటు స్థానం నుంచి పోటీలో ఉన్నారు. ఇక్కడ వైసీపీ నుంచి గూడూరి శ్రీనివాసులు పోటీ చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారి ఎన్నికల బరిలో దిగుతున్నారు. ఆమె ఒకప్పుడు తన తండ్రి, బాబాయి, సోదరుడు ప్రాతినిధ్యం వహించిన కడప పార్లమెంటు సీటులో పోటీ చేస్తున్నారు. ఇక్కడ వైసీపీ నుంచి వైఎస్. అవినాశ్ రెడ్డి పోటీలో ఉన్నారు. టీడీపీ నుంచి చదిపిరాళ్ల భూపేష్ రెడ్డి బరిలో ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఏపీలో ఎన్నికల ఏర్పాట్లు ఇలా..
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 4,14,01,887 మంది ఓటర్లున్నారు. వారిలో 2,10,58,615 మంది మహిళలు కాగా, 2,03,39,851 మంది పురుషులు, 3,421 మంది ట్రాన్స్ జెండర్స్ ఉన్నారు.
రాష్ట్రంలోని 156 అసెంబ్లీ స్థానాల పరిధిలో పురుషుల కన్నా మహిళలే అత్యధిక ఓటర్లున్నారు.
ప్రజలు ఓట్లేసేందుకుగాను రాష్ట్ర వ్యాప్తంగా 46,389 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు. పోలింగ్ కోసం లక్షా 60 వేల ఈవీఎంలు వినియోగిస్తున్నారు.
పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 3,20,566 మంది సిబ్బందిని నియమించారు. వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల వద్ద వారికి పోలింగ్ సామాగ్రి అందించారు.

144 సెక్షన్ అమలు
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రాష్ట్ర వ్యాప్తంగా 1,06,145 మంది పోలీసు బలగాలను మోహరించారు.
పోలింగ్ ప్రశాంతంగా సాగేలా అన్ని ఏర్పాట్లు చేసిన ఎన్నికల అధికారులు అన్ని పోలింగ్ స్టేషన్ల వద్ద 144 సెక్షన్ విధించారు.
పోలింగ్ ముగిసే వరకూ ఇది అమలులో ఉంటుందని వెల్లడించారు.
రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని వై రామవరం మండలంలో పోలింగ్ సామగ్రి తరలించడానికి హెలికాప్టర్ వినియోగించారు.
పోలింగ్ ముగిసిన తర్వాత మళ్లీ ఆయా ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ లకు తరలించేందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు.
అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా స్ట్రాంగ్ రూమ్ లు సిద్ధం చేశారు. జూన్ 4న కౌంటింగ్ వరకూ వాటిని అక్కడే భద్రపరచబోతున్నారు.

ఫొటో సోర్స్, CEOAndhrapradesh
వెబ్ క్యాస్టింగ్ ద్వారా పర్యవేక్షణ
రాష్ట్రంలోని పోలింగ్ కేంద్రాల్లో సమస్యాత్మక, తీవ్ర సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారు. అందులో 14 అసెంబ్లీ నియోజకవర్గాలను సమస్యాత్మకంగా గుర్తించారు. గత ఎన్నికల్లో అనుభవాలు, ప్రస్తుత శాంతిభద్రతల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని వాటిని ఎంపిక చేశారు.
ఆ 14 అసెంబ్లీ స్థానాల పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ ద్వారా పర్యవేక్షణ చేయబోతున్నారు.
శాంతిభద్రతలను పర్యవేక్షిస్తూ ప్రశాంతంగా పోలింగ్ జరగడానికి ప్రత్యేక పోలీసు బలగాలను కూడా రంగంలో దింపారు.
రాష్ట్రంలో 46,389 పోలింగ్ కేంద్రాలున్నాయి. వాటిలో 34,165 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ ఏర్పాట్లు చేశారు.
ఆయా కేంద్రాల్లో పోలింగ్ స్టేషన్ లోపలా, వెలుపల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షణకు ఏర్పాట్లు చేశారు.

ఫొటో సోర్స్, I &PR Ranagareddy
తెలంగాణలో ఇలా..
ఆరు నెలల క్రితమే అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తెలంగాణాలో ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల సందడి కనిపిస్తోంది.
సాధారణ ఎన్నికల నాలుగో దశలో భాగంగా రాష్ట్రంలోని 17 పార్లమెంట్ సీట్లు, కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి సోమవారం పోలింగ్ జరుగుతుంది. దానికి తగ్గట్టుగా అధికారులు సన్నాహాలు చేశారు.
రాష్ట్రంలో అధికార కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ప్రచారం హోరెత్తించాయి. ఈసారి ఎన్నికల్లో ప్రభావం చూపాలని గట్టిగా ప్రయత్నిస్తున్నాయి.
పలువురు ప్రముఖులు కూడా బరిలో ఉన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నుంచి మరోసారి బరిలో దిగారు. ఆయనకు పోటీగా కాంగ్రెస్ తరుపున మాజీ మంత్రి దానం నాగేందర్ పోటీ చేస్తుండడం ఆసక్తికరంగా మారింది.
హైదరాబాద్ స్థానంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ పోటీ చేస్తుండగా, ఆయనకు పోటీగా బీజేపీ తరపున మాధవీలత పోటీ చేస్తున్నారు.
ఇక బీజేపీ సిట్టింగ్ ఎంపీలు బండి సంజయ్ కరీంనగర్ నుంచి రంగంలో ఉండగా , నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్ పోటీలో ఉన్నారు.
మాజీ మంత్రి ఈటెల రాజేందర్ మల్కాజ్ గిరి నుంచి రంగంలో ఉన్నారు. కాంగ్రెస్ కూడా పలువురు సీనియర్లను రంగంలో దింపింది.

ఫొటో సోర్స్, I &PR Ranagareddy
ఈ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
కొన్ని సమస్యాత్మక, మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియనుంది.
''ఆదిలాబాద్ లోక్ సభ పరిధిలోని సిర్పూర్, అసిఫాబాద్ అసెంబ్లీ నియోజకర్గాలు, పెద్దపల్లి లోక్ సభ పరిధిలోని చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని అసెంబ్లీ నియోజకవర్గాలు, వరంగల్ లోక్‌సభ పరిధిలోని భూపాలపల్లి, మహబూబాబాద్ లోక్ సభ పరిధిలోని ములుగు, పినపాక, ఇల్లెందు, భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గాలు, ఖమ్మం లోక్ సభ పరిధిలోని కొత్తగూడెం, అశ్వారావుపేట అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సాయంత్రం నాలుగు గంటలకే పోలింగ్ ముగియనుంది'' అని తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ అధికారి వికాస్ రాజ్ చెప్పారు.
మిగిలిన అన్ని చోట్ల సాయంత్రం ఆరు గంటలకు వరకు పోలింగ్ ఉంటుంది.
సాధారణంగా ఎన్నికల పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకే ఉండేది. వేసవి ఎండల కారణంగా పోలింగ్ సమయాన్ని ఎన్నికల సంఘం సాయంత్రం 6 గంటలకు పెంచింది .

ఫొటో సోర్స్, CEOTelangana
‘‘ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. మొత్తం 160 కంపెనీల కేంద్ర బలగాలు, 72 వేల మంది రాష్ట్ర పోలీసులు, 20వేల మంది పక్క రాష్ట్రాల పోలీసులు, 4 వేల మంది యూనిఫార్మ్ సర్వీస్ సిబ్బంది బందోబస్తులో ఉంటారు. పోలింగ్ సిబ్బంది సహా మొత్తం 2,94,00 మంది ఎన్నికల విధుల్లో ఉంటారు. 35,809 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశాం’’ అని చెప్పారు వికాస్ రాజ్.
తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పట్నుంచి మే 11 సాయంత్రం నాటికి రూ.320.84 కోట్ల విలువైన నగదు, వస్తువుల సీజ్ చేసినట్లు వికాస్ రాజ్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఓటరు కార్డు లేకపోయినా ఓటెయవచ్చా?
ఓటరు జాబితాలో పేరు ఉండి, ఓటరు కార్డు లేకపోయినా ఓటు వేయొచ్చు.
అయితే, అందుకోసం ఇతర కొన్ని ఐడీలు చూపించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఎలక్షన్ కమిషన్ సూచనలు చేసింది.
పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంక్ పాస్‌బుక్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, పెన్షన్ కార్డు, ఉపాధి హామీ జాబ్ కార్డ్‌లో ఏదైనా ఉంటే ఆ కార్డు చూపించి ఓటేయొచ్చు.
2019 ఎన్నికల్లో పోలింగ్ వివరాలివే..
2019లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఆ ఏడాది ఏప్రిల్ 11న జరిగింది. ప్రస్తుత ఎన్నికల తరహాలోనే అప్పుడు కూడా ఒకే దశలో పోలింగ్ పూర్తి చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా 79.88 శాతం పోలింగ్ నమోదైంది. ఆ ఎన్నికలలో ప్రకాశం జిల్లాలోని అద్దంకి నియోజకవర్గంలో అత్యధికంగా 89.82 శాతం ఓటింగ్ నమోదు కాగా, విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గంలో అత్యల్పంగా 58.19 శాతం ఓటింగ్ రికార్డైంది.
మొత్తం 175 సీట్లకూ పోటీ చేసిన తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలలో తెలుగుదేశం పార్టీకి 23, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 151 సీట్లు వచ్చాయి. 137 సీట్లలో పోటీ చేసిన జనసేన ఒక్క చోట మాత్రమే విజయం సాధించింది.
173 సీట్లలో పోటీ చేసిన బీజేపీ, 174 సీట్లలో పోటీ చేసిన కాంగ్రెస్‌లు ఒక్క చోట కూడా విజయం సాధించలేకపోయాయి. అత్యధిక సీట్లు గెలుచుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది.
2024లో..
ఈ ఎన్నికలలో కూడా వైసీపీ ఒంటరిగా పోటీచేస్తుండగా గత ఎన్నికలలో వేర్వేరుగా పోటీ చేసిన బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు ఈసారి ఎన్డీయే కూటమిగా పోటీ చేస్తున్నాయి.
వైసీపీ 175 సీట్లలో పోటీ చేస్తుండగా ఎన్డీయే కూటమిలోని తెలుగుదేశం పార్టీ 144, జనసేన 21, బీజేపీ 10 అసెంబ్లీ సీట్లలో పోటీ చేస్తున్నాయి.
మరో కూటమి ‘ఇండియా’లో భాగంగా కాంగ్రెస్ పార్టీ 159 సీట్లు, సీపీఎం 8, సీపీఐ 8 సీట్లలో పోటీ చేస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్ పాలిత కశ్మీర్లో పిండి ధరలపై ఆందోళనలు, హింసాత్మక ఘర్షణలో పోలీసు అధికారి మృతి
- Northern Lights: ఆకాశంలో ఈ రంగుల తుపాను మీకెప్పుడైనా కనిపించిందా?
- స్కార్పియన్: మానవ అక్రమ రవాణాలో ఆరితేరిన ఈ యూరప్ మోస్ట్‌వాంటెడ్ క్రిమినల్ బీబీసీ జర్నలిస్టుకు ఎలా దొరికాడంటే....
- ఈ ఊరిలో ఫోన్లు, టీవీలు లేవు, ఇంటర్నెట్ లేదు, అసలు కరెంటే లేదు... మరి ప్రజలు ఎలా జీవిస్తున్నారు?
- పాకిస్తాన్ ఆర్థికసంక్షోభం: ఈసారి చైనా, సౌదీ అరేబియా కూడా కాపాడలేవా
- జేపీ నడ్డా మీద నరేంద్ర మోదీ, అమిత్ షాలకు ఎందుకంత నమ్మకం?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














