ప్రధాని మోదీ కంటే రాహుల్ గాంధీకి ఆస్తులు, కేసులు ఎక్కువే, అఫిడవిట్‌లు ఏం చెబుతున్నాయంటే....

ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, REUTERS, ANI

ఫొటో క్యాప్షన్, ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ

పాలక పక్ష నేతగా నరేంద్ర మోదీ, ప్రతిపక్షంలోని కీలక నాయకుడిగా రాహుల్ గాంధీలు...నామినేషన్ సందర్భంగా రిటర్నింగ్ అధికారులకు సమర్పించే అఫిడవిట్‌లో ఎవరెన్ని ఆస్తులు, అప్పులు ప్రకటిస్తారనే అంశంపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

వాయనాడ్ లోక్ సభ స్థానానికి ఏప్రిల్ 3న, రాయ్ బరేలీ స్థానానికి మే 3వ తేదీన రాహుల్ గాంధీ నామినేషన్ దాఖలు చేయగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసి నుంచి మంగళవారం నాడు నామినేషన్ వేశారు.

మోదీకి వారణాసి, రాహుల్ గాంధీకి వాయనాడ్ సిట్టింగ్ నియోజకవర్గాలే.

ప్రస్తుతం నడుస్తున్న ఎన్నికల ప్రక్రియలో భాగంగా వాయనాడ్‌కు ఏప్రిల్‌లోనే ఓటింగ్ జరిగింది. వారణాసికి జరగాల్సి ఉంది.

ఎన్డీయే కూటమి, ఇండియా కూటమి నుంచి బరిలోకి దిగిన ఈ ఇద్దరు అగ్రనేతలు తమ అఫిడవిట్‌లలో ఏం చెప్పారు? ఎవరికెన్ని ఆస్తులు ఉన్నాయి, ఎవరి ఆస్తులు, అప్పులు ఎంత పెరిగాయి? చూద్దాం....

ప్రధాని మోదీ

ఫొటో సోర్స్, Getty Images

ప్రధాని నరేంద్రమోదీ అఫిడవిట్‌లో ఏముంది?

ఈ ఆస్తులలో స్థిర, చరాస్తుల వివరాలతో పాటు పెట్టుబడులు వివరాలను కూడా వివరించారు.

దీనిలో తన చేతిలో ఉన్న నగదు రూ.52,920 అని పేర్కొన్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్ల విలువ రూ.2.85 కోట్లుగా వెల్లడించారు.

అలాగే గాంధీనగర్‌లోని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఎన్‌ఎస్‌సీ బ్రాంచ్‌లో రూ.73,304, వారణాసిలోని శివాజీ నగర్ శాఖలో రూ.7 వేలు ఉన్నట్లు తెలిపారు.

బాండ్లు, డిబెంచర్లు, షేర్లు, మ్యూచువల్ ఫండ్స్‌లో మోదీకి ఎలాంటి పెట్టుబడులు లేవు.

అయితే, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్‌లో ప్రధాని మోదీ రూ.9,12,398ను పెట్టుబడిగా పెట్టినట్లు వెల్లడించారు.

ఇక 45 గ్రాముల 4 బంగారు రింగులు ఉన్నాయి. వీటి విలువ రూ.2,67,750గా ఉన్నట్లు చెప్పారు.

మోదీ చరాస్తులు

ఫొటో సోర్స్, affidavit.eci.gov.in

వడ్డీ, క్లెయిమ్‌లలో భాగంగా ఉన్న ఇతర ఆస్తుల విభాగంలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి డిడక్ట్ అయిన ఆదాయపు పన్ను(టీడీఎస్‌ను) రూ.3,33,179గా అంచనావేస్తున్నట్లు తెలిపారు.

ఇలా స్థూలంగా మోదీ చరాస్తుల విలువ రూ.3,02,06,889 కోట్లుగా తన అఫిడవిట్‌లో వెల్లడించారు.

ఇక వ్యక్తిగత రుణాలుగానీ, మోటార్ వెహికిల్స్ కానీ ఏమీ లేనట్లు మోదీ తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. అంతేకాక, అఫిడవిట్ ప్రకారం మోదీకి సొంతిల్లు కూడా లేదు.

వ్యవసాయ భూమిగానీ, వ్యవసాయేతర భూమిగానీ, వాణిజ్య భవంతి, నివాస సదుపాయం లాంటివేవీ లేనట్లు తెలిపారు. మొత్తంగా మోదీకి స్థిరాస్తులు ఏమీ లేవు. అలాగే, అప్పులు కూడా లేవు.

మోదీ ఆస్తులు

ఫొటో సోర్స్, affidavit.eci.gov.in

మోదీ జీవిత భాగస్వామి కాలమ్‌లో ఏం చెప్పారు?

జీవిత భాగస్వామి కాలమ్ కింద జశోదాబెన్ పేరును వెల్లడించినప్పటికీ, ఆమె ఆస్తిపాస్తుల వివరాలు తనకు తెలియదని చెప్పారు.

జీవిత భాగస్వామికి చెందిన ఆస్తిపాస్తుల వివరాలలో అన్ని కాలమ్‌లలో కూడా తెలియదని వెల్లడించారు. అలాగే, ఆమె ఏం చేస్తుంటారో కూడా తెలుపలేదు.

ప్రైమ్ మినిస్టర్ ఆఫీసు నుంచి వచ్చే జీతంతోపాటు, బ్యాంకు డిపాజిట్ల నుంచి వచ్చే వడ్డీలే ఆదాయ వనరుగా ప్రధాని మోదీ పేర్కొన్నారు.

మోదీ నామినేషన్ కార్యక్రమం

ఫొటో సోర్స్, Getty Images

మోదీ విద్యార్హతలు..

విద్యార్హతల కింద ప్రధాని మోదీ గుజరాత్ ఎస్‌ఎస్‌ఎస్ బోర్డు నుంచి 1967లో పదవ తరగతి పాసయ్యారు. దిల్లీ యూనివర్సిటీ నుంచి 1978లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ పట్టాను పొందారు.

అహ్మదాబాద్‌లోని గుజరాత్ యూనివర్సిటీ నుంచి 1983లో మాస్టర్స్ పూర్తి చేశారు.

తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు పెండింగ్‌లో లేవనీ, ఏ నేరపూరిత కేసులో కూడా తాను దోషిని కాదని ప్రధాని తెలిపారు.

రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, Getty Images

రాహుల్: ‘చేతిలో ఉంది రూ.55 వేలే...’

వాయనాడ్ నుంచి బరిలోకి దిగిన రాహుల్ గాంధీ తన ఆస్తిపాస్తుల వివరాలను ఎన్నికల సంఘం ముందు ఉంచారు.

ఎన్నికల సంఘం వద్ద నామినేషన్ పత్రాలలో భాగంగా సమర్పించిన అఫిడవిట్‌లో రాహుల్ గాంధీ మొత్తంగా తనకు రూ.20 కోట్ల వరకు ఆస్తులున్నట్లు వెల్లడించారు. దీనిలో స్థిర, చరాస్తులతో పాటు పెట్టుబడులు కూడా ఉన్నాయి.

రాహుల్ గాంధీ 2024 మార్చి 15 నాటికి తన చేతిలో రూ.55 వేలు ఉన్నట్లు వెల్లడించారు.

బ్యాంకు అకౌంట్లలోని డిపాజిట్లలో భాగంగా ఎస్‌బీఐ సేవింగ్స్ అకౌంట్, హెచ్‌డీఎఫ్‌సీ సేవింగ్స్ అకౌంట్‌లో రూ.26,25,157 ఉన్నట్లు తెలిపారు.

బాండ్లు, షేర్లు, డిబెంచర్లు, మ్యూచువల్ ఫండ్ కాలమ్‌లో తన పెట్టుబడుల వివరాలను రాహుల్ గాంధీ వివరించారు.

యంగ్ ఇండియన్‌కు చెందిన కంపెనీలో రూ.1,90,000 విలువైన పెట్టుబడులు ఉన్నాయని, అలాగే ఇతర లిస్టెడ్ కంపెనీల షేర్లలోని వాటా విలువ రూ.4,33,60,519గా వెల్లడించారు.

అల్కైల్ అమైన్స్ కెమికల్స్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్, హిందూస్తాన్ యూనీలివర్, టైటాన్, టీసీఎస్ వంటి కంపెనీలలో రాహుల్ గాంధీ షేర్లను కొనుగోలు చేసి, పెట్టుబడులు పెట్టారు.

రాహుల్ గాంధీ ఆస్తులు

ఫొటో సోర్స్, affidavit.eci.gov.in

అలాగే, మ్యూచువల్ ఫండ్స్‌లో ఉన్న పెట్టుబడుల విలువ రూ.3,81,33,572గా తెలిపారు. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ రెగ్ సేవింగ్స్-జీ, హెచ్‌డీఎఫ్‌సీ హైబ్రిడ్ డెట్ ఫండ్-జీ వంటి మ్యూచువల్స్ ఫండ్స్‌లో రాహుల్ గాంధీ పెట్టుబడులు పెట్టారు.

సావరీన్ గోల్డ్ బాండ్లలో ఉన్న పెట్టుబడుల విలువ మార్చి 15 నాటికి రూ.15,21,740గా పేర్కొన్నారు.

పీపీఎఫ్ అకౌంట్‌లో రూ.61,52,426 పెట్టుబడులున్నాయని రాహుల్ గాంధీ తన అఫిడవిట్‌లో చెప్పారు.

తనకు వ్యక్తిగత రుణాలు, అడ్వాన్స్‌లు కానీ, సొంతంగా మోటార్ వెహికిల్స్ కానీ లేనట్లు వెల్లడించారు.

రూ.4,20,850 విలువైన జ్యూవెలరీ, ఇతర విలువైన ఆభరణాలు తన వద్ద ఉన్నట్లు రాహుల్ అఫిడవిట్‌లో తెలిపారు.

క్లెయిమ్స్, వడ్డీల కింద వచ్చే ఇతర సంపాదన ఏమీ లేదని తెలిపారు. మొత్తంగా చరాస్తుల కాలమ్ కింద రూ.9,24,59,264 ఆస్తులున్నట్లు వెల్లడించారు.

రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, Getty Images

రాహుల్‌కీ సొంతిల్లు లేదా?

స్థిరాస్తుల కాలమ్ కింద తన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా, తనకు కలిపి ఉన్న వ్యవసాయ భూమి, ఫామ్ హౌస్ బిల్డింగ్‌ వివరాలను వెల్లడించారు. మొత్తంగా వీటి విలువ రూ.2,10,13,598గా అఫిడవిట్‌లో తెలిపారు.

వ్యవసాయేతర భూమి తనకేమీ లేదని చెప్పారు.

కమర్షియల్ బిల్డింగ్స్ కాలమ్ కింద రూ.9,04,89,000 విలువైన ఆస్తులు ఉన్నట్లు తెలిపారు. అయితే, రాహుల్ గాంధీకి సొంతంగా ఇల్లు లేదు. మొత్తంగా స్థిరాస్తుల విలువ రూ.11,15,02,598గా ఉన్నాయి.

రాహుల్ గాంధీకి మొత్తంగా రూ.49.7 లక్షల అప్పు ఉంది.

పెళ్లి కాకపోవడంతో, తన జీవిత భాగస్వామి, డిపెండెంట్ల కాలమ్‌లలో నాట్ అప్లికబుల్ (NA) అని వెల్లడించారు.

రాహుల్ గాంధీ ఆదాయ వనరులుగా అద్దెలు, ఎంపీ జీతం, రాయల్టీ ఆదాయం, బ్యాంకుల నుంచి, బాండ్లు, డివిడెండ్ ద్వారా వచ్చే వడ్డీలు, మ్యూచువల్ ఫండ్స్, షేర్ల ద్వారా వచ్చే క్యాపిటల్ గెయిన్ వంటివి ఉన్నాయి.

రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, Twitter@RahulGandhi

రాహుల్ గాంధీ విద్యార్హతలు

1989లో ఆల్ ఇండియా సీనియర్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్ (AISSCE)ని పరీక్షలో పాసయ్యారు రాహుల్ గాంధీ.

1994లో ఫ్లోరిడాలోని రోలిన్స్ కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, 1995లో కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీలోని ట్రినిటీ కాలేజీ నుంచి డెవలప్‌మెంట్ స్టడీస్‌లో ఎంఫిల్ పూర్తి చేశారు.

అయితే, రాహుల్ గాంధీ తన మీద 18 క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, ఒక కేసులో దోషిగా తేలినట్లు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)