వరుణ్ గాంధీకి బీజేపీ ఎందుకు టిక్కెట్ ఇవ్వలేదు, రాహుల్, ప్రియాంకలు ఎంత ఎదిగారు? :మేనకా గాంధీతో బీబీసీ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ

మేనకా గాంధీ
    • రచయిత, రాఘవేంద్ర రావు
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి 2019 లోక్‌సభ ఎన్నికల్లో మేనకా గాంధీ పార్లమెంట్ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. భారతీయ జనతా పార్టీ మరోసారి ఆమెను ఈ స్థానం నుంచి బరిలోకి దింపింది.

అయితే, మేనకా గాంధీ కొడుకు వరుణ్‌గాంధీకి ఈసారి పీలీబీత్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు బీజేపీ టికెట్ లభించలేదు. ఆయనకు బదులుగా కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన జితిన్ ప్రసాద్‌ను పోటీకి నిలిపింది. యోగి ఆదిత్యనాధ్ ప్రభుత్వంలో జితిన్ ప్రసాద్ మంత్రి.

సుల్తాన్‌పూర్ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న మేనకా గాంధీ తన రాజకీయ ప్రయాణం, కుమారుడు వరుణ్ గాంధీకి బీజేపీ టికెట్ రాకపోవడం, రాహుల్ గాంధీ రాజకీయాలు, ప్రియాంక గాంధీ గురించి అనేక అంశాలు బీబీసీతో పంచుకున్నారు.

వరుణ్ గాంధీ సమర్థుడైన వ్యక్తని, అతనికి శక్తి సామర్థ్యాలు ఉంటే ఎంత దూరమైన వెళతారని ఆమె చెప్పారు.

కుమారుడికి టికెట్ రాకపోవడం పట్ల తనకు అసంతృప్తి ఉందని, అయితే ఎన్నికల్లో పార్టీ నిర్ణయాన్ని అందరూ పాటించాలని చెప్పారు. వరుణ్ గాంధీ 28ఏళ్ల వయసులో లోక్‌సభకు ఎన్నికయ్యారని, అప్పటి నుంచి లక్షల మంది హృదయాలను గెలుచుకున్నారని చెప్పారామె.

“రాయడం, ప్రచారం చెయ్యడంతో పాటు అతనికి అనేక సామర్థ్యాలున్నాయి. ఆర్థిక వ్యవస్థ మీద అతను రాసిన రెండు పుస్తకాలు బెస్ట్ సెల్లర్లుగా నిలిచాయి. కవిత్వం కూడా రాస్తాడు. అతను ఇంకా ఎంతో దూరం ప్రయాణించాల్సి ఉంది” అని మేనక చెప్పారు.

వరుణ్ గాంధీ

ఫొటో సోర్స్, Getty Images

వరుణ్ గాంధీ దేశంలోని రాజకీయ పరిస్థితులపై తన అభిప్రాయాలను బహిరంగంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. సొంత పార్టీ నేతలైనా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్ పేర్లను నేరుగా ప్రస్తావించకుండా వారి విధానాలను ప్రశ్నించారు.

ప్రధానమంత్రి మోదీ పుట్టిన రోజున మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌కు తీసుకొచ్చిన చిరుత పులులలో కొన్ని చనిపోయాయి. దీంతో “ పొరుగు దేశపు జంతువుల మీద నిర్లక్ష్యపు ముసుగుని తక్షణమే తొలగించండి” అని వరుణ్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

వరుణ్ గాంధీ- బీజేపీ మధ్య జరుగుతున్న హోరాహోరీ పోరాటం గురించి మేనకా గాంధీని అడిగినప్పుడు “అతను ఏం రాసినా, ఏం చదివినా, అవన్నీ సమస్యల గురించే” అని ఆమె చెప్పారు.

తాను వరుణ్ గాంధీని కలిసినప్పుడు రాజకీయాలు కాకుండా కుటుంబం గురించి, అతని కూతురి గురించే మాత్రమే మాట్లాడతానని చెప్పారు. రాజకీయాలకు ఆవల చాలా పెద్ద జీవితం ఉందని చెప్పారు.

ప్రస్తుతం ఆమె ఎన్నికల ప్రచారం కోసం సుల్తాన్‌పూర్‌లో మకాం వేశారు.

ఎన్నికల ప్రచారంలో వరుణ్ గాంధీ కనిపించకపోవడం గురించి ప్రశ్నించినప్పుడు ‘‘వరుణ్ కూడా రావాలనుకుంటున్నారు. కానీ, ఈ సమయంలో రావాల్సిన అవసరం లేదు. నిజానికి నా కుటుంబమంతా ఇక్కడే ఉండాలని నేను కోరుకుంటున్నా. మేం అందరం చాలా బిజీగా ఉన్నాం. ప్రస్తుతానికి ఎన్నికల ప్రచారం సజావుగా సాగుతోంది. వరుణ్‌ను పిలవాలని అనిపిస్తే కచ్చితంగా పిలుస్తాను’’ అని మేనకా గాంధీ తెలిపారు.

వరుణ్ గాంధీకి టిక్కెట్ రాకపోయినప్పటికీ ఒకవేళ అతను సుల్తాన్‌పూర్ వచ్చి తన కోసం ప్రచారంలో పాల్గొంటే అదేమీ ఇబ్బంది కాదని, అతనికే అది మేలు చేస్తుందని మేనకా గాంధీ అన్నారు.

వరుణ్ గాంధీకి బీజేపీ టిక్కెట్ నిరాకరించినప్పుడు అతను స్వతంత్రంగా పోటీచేస్తారని లేదా కాంగ్రెస్‌తో చేతులు కలుపుతారని ఊహాగానాలు వచ్చాయి.

‘‘ఈ ఊహాగానాలన్నీ మీడియా వల్ల వచ్చాయి. సుల్తాన్‌పూర్‌లో టీ కొట్టు వద్ద కూర్చొని ప్రతీ గంటకు ప్రజలు ప్రభుత్వాలను కూల్చుతారు, తిరిగి నిలబెడతారు. పత్రికల వాళ్లది కూడా ఇదే పని. ఇందులో ఏ మార్పూ రాలేదు. వరుణ్ ముందు నుంచి ఎక్కడ ఉన్నాడో ఇప్పుడు కూడా అక్కడే ఉన్నారు’’ అని మేనకా గాంధీ వ్యాఖ్యానించారు.

మేనకా గాంధీ
ఫొటో క్యాప్షన్, మేనకా గాంధీని ఇంటర్వ్యూ చేస్తోన్న బీబీసీ ప్రతినిధి రాఘవేంద్ర రావు

రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ గురించి ఏమన్నారు?

ఉత్తరప్రదేశ్‌లో గాంధీ కుటుంబానికి సంబంధించిన మూడు స్థానాలు రాయ్‌బరేలీ, అమేఠీ, పీలీబీత్ ఎప్పుడూ వార్తల్లో ఉంటాయి.

ఈసారి కాంగ్రెస్ పార్టీ రాయ్‌బరేలీ నుంచి రాహుల్ గాంధీని తొలిసారి అభ్యర్థిగా నిలిపింది. కేంద్ర మంత్రి, బీజేపీ నేత స్మృతి ఇరానీ 2019లో రాహుల్ గాంధీని అమేఠీలో ఓడించారు.

రాహుల్ గాంధీ ఈసారి అమేఠీని విడిచిపెట్టి రాయ్‌బరేలీలో పోటీ చేయడం గురించి మేనకా గాంధీ స్పందించలేదు.

రాహుల్ గాంధీ రాజకీయ ప్రయాణాన్ని ఎలా చూస్తున్నారని ఆమెను అడిగినప్పుడు ‘‘అతను ఎదిగినట్లుగా నాకైతే అనిపించడం లేదు. కేవలం పాదయాత్ర ద్వారా ఎవరూ ఎదగలేదు. పరిణామం చెందలేరు. సమస్యలను చూపించడం, లోతుగా అధ్యయనం చేయడం, నాయకత్వం, తెగువ ఇలాంటివి అవసరం’’ అని అన్నారు.

ప్రియాంకా గురించి అడగగా, రాహుల్ గాంధీకి వర్తించినవే ప్రియాంకాకు కూడా వర్తిస్తాయని ఆమె అన్నారు. రాహుల్ లాగే ప్రియాంక కూడా ఇంకా ఎదగలేదన్నారు.

ఈ లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని మోదీ 400 స్థానాలు దాటాలి అనే నినాదాన్ని ఇచ్చారు. నిజంగా బీజేపీ ఆ ఫిగర్‌ను దాటగలదా? అని అడిగినప్పుడు....

‘‘ఎన్నికల సమయంలో నాకు కేవలం సుల్తాన్‌పూర్ మాత్రమే కనిపిస్తుంది. తర్వాతే ఇతర ప్రాంతాలు, దేశం గురించి చూస్తాను. మొదట సుల్తాన్‌పూర్‌లోని సమస్యలు, ఇక్కడి ప్రజల ఆకాంక్షలపై నా దృష్టి ఉంటుంది. ఆయన 400 స్థానాలు దాటాలి అనే నినాదం ఇచ్చారంటే అలాగే జరుగుతుంది. లేదా దానికి సమీపంలో రావొచ్చు’’ అని అన్నారు.

శామ్ పిట్రోడా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శామ్ పిట్రోడా

శామ్ పిట్రోడా గురించి ఏం చెప్పారు?

కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా ఇటీవల మాట్లాడుతూ అమెరికాలోని వారసత్వ పన్ను విధానాన్ని సమర్థించారు.

‘‘అమెరికాలో వారసత్వ పన్ను వ్యవస్థ ఉంటుంది. అంటే, ఒకవేళ ఎవరికైనా 100 మిలియన్ డాలర్ల ఆస్తి ఉంటే, వారు చనిపోయాక అందులో 45 శాతం వారి సంతానానికి అందుతుంది. మిగతా 55 శాతం ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. ఇది చాలా మంచి చట్టం. మీరు జీవించి ఉన్నప్పుడు మీకోసం సంపాదించుకున్నారు. మీరు వెళ్లిపోయేటప్పుడు మీకున్న సంపదలో సగాన్ని ప్రజల కోసం వదలేయాలని ఆ చట్టం చెబుతుంది. ఇది మంచిదని నాకు అనిపిస్తుంది.’’ అని పిట్రోడా అన్నారు.

పిట్రోడా వ్యాఖ్యను ప్రధాని మోదీ ఎన్నికల అంశంగా మార్చారు. ఒక ఎన్నికల ర్యాలీలో కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకుంటూ, ‘‘మీరు బతికున్నంత కాలం కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని పన్నులతో వేధిస్తుంది. మీరు చనిపోయాక మీపై వారసత్వ పన్ను భారాన్ని మోపుతుంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీరు కష్టపడి కూడబెట్టిన సంపదను మీ పిల్లలకు దక్కనివ్వదు. బతికి ఉన్నప్పుడూ, చనిపోయాక కూడా మిమ్మల్ని దోచుకోవడమే కాంగ్రెస్ మంత్రం’’ అని మోదీ విమర్శించారు.

ఎన్నికల ప్రచారంలో బీజేపీ చేసే ముస్లింలు, చొరబాటుదారులు, మంగళసూత్రం వంటి పదాల ప్రస్తావన, మోదీ వ్యాఖ్యల గురించి ప్రశ్నించినప్పుడు మేనకా గాంధీ వాటిపై స్పందించేందుకు విముఖంగా ఉన్నట్లుగా కనిపించారు. కానీ, శామ్ పిట్రోడా అలాంటి వ్యాఖ్యలు చేసి ఉండకూడదని అన్నారు.

‘‘ఈ సమయంలో పిట్రోడా అలా చెప్పి ఉండకూడదు. వ్యక్తిగతంగా నేను రాజకీయ అంశాలను పట్టించుకోను. ఎవరేమన్నారు? దానికి ఎలాంటి ప్రతిస్పందన వచ్చింది? వంటి విషయాలను నేను దూరంగా ఉంటా. భారత్‌ వంటి దేశంలో వారసత్వ పన్ను పనిచేయదు. వ్యక్తిగతంగా అలాంటి వాటికి నేను వ్యతిరేకం. మన దేశంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు చాలా బలంగా ఉంటాయి. పిల్లల కోసమే జీవితాంతం కష్టపడి డబ్బులు సంపాదిస్తారు. ప్రభుత్వానికి ఇవ్వడానికి ఎందుకు ప్రజలు కష్టపడాలి?

విదేశాల్లో కూర్చొని ఏమైనా మాట్లాడొచ్చు. కానీ, అది పార్టీపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. పిట్రోడా అసలు అలా మాట్లాడి ఉండకూడదని నేను భావిస్తున్నా’’ అని మేనకా గాంధీ చెప్పారు.

ప్రధాని మోదీ

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, నరేంద్ర మోదీ

విభజన రాజకీయాలు

లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బుజ్జగింపులకు పాల్పడుతుందంటూ ప్రధాని మోదీతో పాటు పలువురు సీనియర్ బీజేపీ నాయకులు ఆరోపించారు.

ఒక ఎన్నికల ర్యాలీలో మోదీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మాటలను ఉటంకిస్తూ కాంగ్రెస్ పార్టీ దళితులు, బీసీల నుంచి రిజర్వేషన్లను లాక్కొని ముస్లింలకు కట్టబెట్టాలని చూస్తోందని అన్నారు.

ఎన్నికల్లో బీజేపీ పోలరైజేషన్‌ను పెంచుతోందన్న ఆరోపణలపై మేనకా గాంధీ స్పందిస్తూ, ‘‘మీరు సుల్తాన్‌పూర్‌లోని ఏ గ్రామానికైనా వెళ్లి చూడండి. మీకు ఇలాంటి ఆరోపణలు వినబడవు. మేం అలాంటివి చేయట్లేదు’’ అని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)