మోదీ వందేభారత్ రైళ్ళను ప్రారంభిస్తే అదో ఈవెంట్... దీనికి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేయడం కరెక్టేనా?

వందేభారత్

ఫొటో సోర్స్, ANI

    • రచయిత, అర్జున్ పర్మర్
    • హోదా, బీబీసీ న్యూస్ గుజరాతీ

గుజరాత్‌లో గత నెలలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ, అహ్మదాబాద్‌లో జరిగిన ఒక ఈవెంట్‌లో 10 వందేభారత్ రైళ్లను ప్రారంభించడంతో పాటు వివిధ ప్రాజెక్టులను ఆవిష్కరించారు.

దీంతో మొత్తం వందేభారత్ రైళ్ల సంఖ్య 100కు చేరింది.

వేగం, ఫీచర్లు, డిజైన్‌ల దృష్ట్యా వందేభారత్ రైళ్లు చర్చల్లో నిలిచాయి. అయితే, వీటి ప్రారంభోత్సవాల కోసం ఖర్చు చేసిన ప్రజా వ్యయం గురించి పెద్దగా ఎవరికీ తెలియదు.

కేవలం గత రెండేళ్లలో జరిగిన 10 ప్రారంభోత్సవ ఈవెంట్లకు గానూ భారతీయ రైల్వే రూ. 1.89 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచార హక్కు చట్టం (2005) ద్వారా బీబీసీ గుర్తించింది. అంటే సగటున ఒక్కో ఈవెంట్‌కు దాదాపు రూ. 19 లక్షలు ఖర్చు పెట్టారు.

అంతకుముందు సంవత్సరాలకు సంబంధించిన వివరాలను కూడా బీబీసీ కోరింది. కానీ, ఆ వివరాలను ఇవ్వలేదు. నిజానికి, ఈ చట్టంలో నిబంధనలు ఉన్నప్పటికీ, పలు జోనల్ అధికారులు సరిగా స్పందించలేదు.

వందేభారత్ రైళ్లను ‘‘భారత తొలి సెమీ హైస్పీడ్ రైలు’’గా పిలుస్తారు. ఈ రైళ్లు గంటకు 160 కి.మీ వేగంతో ప్రయాణించగలవు.

దురంతో ఎక్స్‌ప్రెస్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2009 సెప్టెంబర్ 21న దిల్లీ-చెన్నై మధ్య నడిచే నాన్‌స్టాప్ దురంతో ఎక్స్‌ప్రెస్‌ను జెండా ఊపి ప్రారంభించిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మాజీ మంత్రి పి. చిదంబరం

2019లో న్యూదిల్లీ-వారణాసి మధ్య నడిచే తొలి వందేభారత్ రైలును జాతికి అంకితం చేసిన తర్వాత నరేంద్ర మోదీ స్వయంగా లేదా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు వందేభారత్ రైళ్లను ప్రారంభించారు.

ప్రయాణికుల భద్రత, సౌకర్యవంతమైన ప్రయాణం, పర్ఫార్మెన్స్ స్థాయిలను ఇతర దేశాల ప్రమాణాలకు సరితూగేలా తక్కువ ధరకే అందించాలనే ఉద్దేశంతో ఈ రైళ్లను తీసుకొచ్చినట్లు భారతీయ రైల్వే పేర్కొంది.

బీబీసీ మొదట భారతీయ రైల్వేకు సమాచార హక్కు దరఖాస్తును సమర్పించింది. 2019 జనవరి నుంచి వందేభారత్ రైళ్లను జాతికి అంకితం చేసేందుకు నిర్వహించిన కార్యక్రమాల కోసం చేసిన ఖర్చు వివరాలను వెల్లడించాలని దరఖాస్తులో కోరింది.

రైల్వే మంత్రిత్వ శాఖ ఈ వివరాలను చెప్పడానికి నిరాకరించింది. వందేభారత్ సర్వీసులను ఆవిష్కరించడంతో పాటు అదే వేడుకలో ప్రధాని మోదీ ఇతర ప్రాజెక్టులను కూడా ప్రారంభించడంతో కచ్చితంగా వందేభారత్ ప్రారంభోత్సవాలకు చేసిన ఖర్చును చెప్పలేమని రైల్వే శాఖ తెలిపింది.

ఆ తర్వాత, కొంకణ్ రైల్వేస్‌తో పాటు వివిధ రైల్వే జోన్లకు కలిపి బీబీసీ మొత్తం 17 ఆర్‌టీఐ దరఖాస్తులు సమర్పించింది. దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు అన్ని రైల్వే జోన్లను కవర్ చేసింది.

వీటిలో ఆరు జోన్లు మాత్రమే స్పందించాయి.

ఆర్‌టీఐ దరఖాస్తు

బీబీసీకి అందించిన సమాచారాన్ని విశ్లేషించగా, వందేభారత్ రైళ్లను జాతికి అంకితం చేయడం కోసం 2022, 2023లలో నిర్వహించిన 10 ఈవెంట్లకు మొత్తం రూ. 1.89 కోట్లు ఖర్చు చేసినట్లు అర్థం అవుతుంది.

ఖర్చుల వివరాలు ఇలా ఉన్నాయి:

కొంకణ్ రైల్వే 2023లో రెండు వందేభారత్ రైళ్ల ప్రారంభోత్సవ ఈవెంట్ల కోసం రూ. 1,06,23,000 ఖర్చు చేసింది. ఇందులో క్యాటరింగ్ సర్వీసు ఖర్చులను చేర్చలేదని కొంకణ్ రైల్వే తెలిపింది.

2022లో రెండు వందేభారత్ రైళ్ల ప్రారంభం కోసం నైరుతి రైల్వే (సౌత్ వెస్ట్రన్)కు రూ. 49, 29,682 ఖర్చు అయింది.

దక్షిణ మధ్య రైల్వే జోన్ 2023లో రెండు వందేభారత్ రైళ్ల ఆవిష్కరణ కోసం మొత్తం రూ. 16,58,953 ఖర్చు చేసింది.

సెంట్రల్ రైల్వే, వెస్ట్రన్ రైల్వే, నార్తర్న్ రైల్వే వంటి జోన్లు గత రెండేళ్లలో ఈ వేడుకల కోసం వరుసగా రూ. 4.46 లక్షలు, రూ. 7.44 లక్షలు, రూ. 5.52 లక్షలు ఖర్చు పెట్టాయి.

పైన చెప్పిన లెక్కలే కాకుండా, నైరుతి రైల్వే జోన్ అదనంగా రూ. 90,05,915 ఖర్చు చేసినట్లు వెల్లడించింది. వాటి వివరాలను బీబీసీకి అందించింది.

2023లో వందేభారత్ రైళ్లతో పాటు ఇతర రైల్వే ఆస్తులను అంకితం చేసినప్పుడు ఈ మొత్తం ఖర్చు అయినట్లుగా రాతపూర్వకంగా నైరుతి రైల్వే అధికారులు వెల్లడించారు.

ఖర్చులను వివరంగా చెప్పాలని కోరినప్పటికీ అధికారులు సమగ్ర గణాంకాలను మాత్రమే అందించారు.

లాలూ ప్రసాద్ యాదవ్
ఫొటో క్యాప్షన్, 2006 ఫిబ్రవరి 15న న్యూదిల్లీ రైల్వే స్టేషన్‌లో న్యూదిల్లీ-భోపాల్ మధ్య నడిచే శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభిస్తోన్న అప్పటి బారత రైల్వే మంత్రి లాలు ప్రసాద్ యాదవ్

ఈస్ట్రన్, ఈస్ట్ సెంట్రల్, ఈస్ట్ కోస్ట్, నార్త్ సెంట్రల్, నార్త్ ఈస్ట్రన్, నార్త్‌ఈస్ట్ ఫ్రాంటియర్, నార్త్ వెస్ట్రన్, సదరన్, సౌత్ ఈస్ట్రన్, సౌత్ ఈస్ట్ సెంట్రల్, వెస్ట్ సెంట్రల్ రైల్వేస్ జోన్లు బీబీసీ చేసిన ఆర్‌టీఐ దరఖాస్తులకు స్పందించలేదు.

రైల్వే శాఖ గత కొన్నేళ్లుగా ఇలాంటి పెద్ద ఈవెంట్లను ప్లాన్ చేయడానికి ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీలను ఏర్పాటు చేసుకుంటోందని బీబీసీకి రైల్వే మాజీ ఉద్యోగి, ఆర్‌టీఐ కార్యకర్త అజయ్ బోస్ చెప్పారు.

‘‘ఈ ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు కార్యక్రమానికి చెందిన సామగ్రి, చిత్రీకరణ, ప్రసారం, క్యాటరింగ్ వంటి అంశాల్లో సేవలు అందిస్తాయి. ఇలాంటి ఈవెంట్లకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరు అవుతున్నారు’’ అని ఆయన అన్నారు.

గతంలో ఇలాంటి వేడుకలు సాదాసీదాగా జరిగేవని, రైల్వే శాఖ అడ్వర్టైజ్‌మెంట్ లేదా ప్రెస్‌నోట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించేదని బీబీసీ మాట్లాడిన ఇతర రైల్వే అధికారులు చెప్పారు.

‘‘ఇప్పుడు ఈ కార్యక్రమాలు రాజకీయంగా మారిపోయాయి. నా హయాంలో ప్రధానమంత్రి రైళ్లను ప్రారంభించినట్లుగా గుర్తు లేదు’’ అని భారతీయ రైల్వే మాజీ సీఈవో ఆర్.ఎన్.మల్హోత్రా అన్నారు.

ప్రారంభోత్సవ ఖర్చులు పూర్తిగా అనవసరమైనవని బీబీసీతో వెస్ట్రన్ రైల్వేస్ రైల్వే యూజర్స్ కమిటీ సభ్యుడు అనిల్ తివారీ అన్నారు.

వందేభారత్ రైళ్లు

ఫొటో సోర్స్, Getty Images

‘‘వందేభారత్ కంటే ముందు శతాబ్ది, దురంతో, గరీబ్ రథ్ వంటి చాలా రైళ్లు ఎలాంటి హంగామా లేకుండానే మొదలయ్యాయి. ఇది ఒక ట్రెండ్‌లా మారింది’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

కొత్త రైళ్లు ప్రారంభించినప్పుడు కొంతమంది ప్రయాణికులకు స్వీట్లు పంచడం వంటి చిన్న చిన్న సంబరాలు చేసేవారని, భారీ ఈవెంట్లు ఉండకపోయేవని బీబీసీతో మాట్లాడుతూ పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక మాజీ సీనియర్ రైల్వే ఎగ్జిక్యూటివ్ అన్నారు.

మునుపటి నివేదికలను పరిశీలించగా, 2009 సెప్టెంబర్10న అప్పటి రైల్వే మంత్రి మమతా బెనర్జీ, దేశంలోని మొదటి నాన్‌స్టాప్ సూపర్‌ఫాస్ట్ ప్యాసింజర్ రైలు ‘‘దురంతో ఎక్స్‌ప్రెస్’’ను ప్రారంభించారు.

2002 ఏప్రిల్ 16న నితీశ్ కుమార్ కూడా ఇతర మంత్రుల్లాగే అధికారికంగా రైళ్లను ప్రారంభించారు. ఈ ఈవెంట్‌కు సంబంధించిన వివరాలు పరిమితంగా అందుబాటులో ఉన్నాయి.

మేం సమర్పించిన ఆర్‌టీఐ దరఖాస్తుల్లో సమాధానం అందని, ఇతర రైల్వే అధికారులు ప్రస్తావించిన విషయాల మీద స్పందించాల్సిందిగా కోరుతూ రైల్వే మంత్రిత్వ శాఖకు మెయిల్ చేశాం. వారి నుంచి ఇంకా స్పందన రాలేదు.

బడ్జెట్‌లో పెరుగుదల కారణంగా విస్తరణ కార్యక్రమాల్ని మెరుగ్గా నిర్వహించే వీలు కలిగిందని రైల్వే అధికారులు తమ ప్రకటనల్లో పేర్కొంటుంటారు.

2003-04 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే, 2023-24 నాటికి రైల్వే బడ్జెట్ కేటాయింపులు 30 రెట్లు పెరిగినట్లు పీఐబీ పేర్కొంది.

కొత్త రైళ్లను ప్రవేశపెట్టడంతో పాటు, వేగంగా కొత్త ట్రాక్‌ల నిర్మాణం, రైల్వే భద్రతను పెంచడానికి అవసరమైన చర్యలు తీసుకోవడం వంటి అధికారిక ప్రకటనలు ఈ అంశాన్ని ధ్రువీకరిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)