కశ్మీర్: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఎందుకు పోటీ చేయడం లేదు?

కశ్మీర్‌లో సైనికుడి ఫోటో

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, కశ్మీర్‌లోని మూడు పార్లమెంటు స్థానాలలో బీజేపీ పోటీ చేయడం లేదు.
    • రచయిత, అకీబ్ జావేద్
    • హోదా, శ్రీనగర్‌ నుంచి బీబీసీ కోసం

కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్ 370ని నాలుగేళ్ల కిందట రద్దుచేసిన అధికార భారతీయ జనతా పార్టీ, అక్కడి లోక్‌సభ ఎన్నికలలో తన అభ్యర్థులను పోటీకి దించకూడదని నిర్ణయించింది.

హిందూ ఓటర్ల ఆధిపత్యం ఉన్న జమ్ములోని రెండు లోక్‌సభ స్థానాలలో తన అభ్యర్థులను నిలిపిన బీజేపీ, కశ్మీర్ లోయలో ముస్లింల ఆధిపత్యం ఉన్న మూడు స్థానాలలో పోటీకి దూరంగా ఉంది.

ఈ ప్రాంతంలో బీజేపీపై ప్రజలలో ఉన్న ఆగ్రహమే ఇందుకు కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ విషయాన్ని బీజేపీ కూడా అంగీకరిస్తోంది.

దశాబ్దాల తరబడి దిల్లీ, కశ్మీర్ మధ్య సంబంధాలు ఆందోళనకరంగానే ఉన్నాయి. గడిచిన మూడు దశాబ్దాలలో భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓ పక్క తీవ్రవాదులు, వారిని అణిచివేసేందుకు సైన్యం,ఇలా ఇరుపక్షాల కారణంగా వేలాదిమంది పౌరుల ప్రాణాలు పోయాయి.

ఈ పరిస్థితులు 2019లో మరింతగా క్షీణించాయి. ఆ సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసి, జమ్ము కశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు- జమ్ము కశ్మీర్, లద్దాఖ్‌లుగా విభజించింది.

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 జమ్ము కశ్మీర్‌కు గణనీయ స్థాయిలో స్వయం ప్రతిపత్తిని కల్పించేది. దాన్ని రద్దు చేసిన తరువాత కేంద్రప్రభుత్వం, ఇంటర్నెట్, సమాచార వ్యవస్థలపై పరిమితులు విధించింది. ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులు సహా అనేకమందిని నిర్బంధంలో ఉంచింది.

2019లో తాము తీసుకున్న నిర్ణయం జమ్ముకశ్మీర్‌లో శాంతి నెలకొల్పడానికి దోహదపడిందంటూ ఆర్టికల్ 370 రద్దు తర్వాత నుంచి ప్రధాని మోదీ, ఆయన మంత్రులు చెబుతూ వచ్చారు.

కశ్మీర్‌లో కర్ఫ్యూ ఫోటో

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, 2019లో ఆర్టికల్ 370ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రద్దు చేసింది.

కారణమేంటి?

కశ్మీర్‌లో ఇంటింటికి విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా తమ ప్రాబల్యం పెంచుకునేందుకు స్థానిక బీజేపీ నేతలు తీవ్రంగా శ్రమించారు.

కానీ, చివరకు లోక్‌సభ ఎన్నికలలో తన అభ్యర్థులను నిలబెట్టకూడదని ఆ పార్టీ నిర్ణయించడం ఆశ్చర్యం కలిగించింది.

జమ్ములోని హిందూ ఆధిపత్యం ఉన్న పార్లమెంటు స్థానాలు రెండూ ప్రస్తుతం బీజేపీ చేతుల్లోనే ఉన్నాయి.

2019లో జమ్ము నుంచి జుగల్ కిషోర్ శర్మ, ఉధంపుర్ నుంచి జితేంద్ర సింగ్ బీజేపీ తరపున గెలిచారు. కానీ ముస్లింల ప్రాబల్యం అధికంగా ఉన్న కశ్మీర్‌ ప్రాంతంలో బీజేపీ ఒక్క సీటూ గెలుచుకోలేదు.

ఎన్నికలనేవి ముఖ్యం కాదని, ప్రజల హృదయాలు గెలుచుకోవడమే తమకు ముఖ్యమని బీజేపీ అధికార ప్రధాన ప్రతినిధి సునీల్ సేథ్ చెప్పారు.

‘‘కశ్మీర్‌ను మిగిలిన దేశంలో సంపూర్ణంగా కలపడానికి 75 సంవత్సరాలు పట్టింది. దీన్ని కేవలం మేం ఎన్నికలలో సీట్లు గెలుచుకోవడానికే చేశామనే భావన కలిగించాలనుకోవడం లేదు’’అని ఆయన అన్నారు.

ఇక్కడ గెలవడం అంత తేలిక కాదు కాబట్టే బీజేపీ తన అభ్యర్థులను నిలపలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

‘‘ఆర్టికల్ 370 రద్దు బహుశా బీజేపీకి ఇతర రాష్ట్రాలలో ఏదో సాధించిన విషయంగా చెప్పుకోవడానికి పనికి రావచ్చు. కానీ ఇక్కడి ప్రజలు ఆ నిర్ణయాన్ని ఇష్టపడం లేదు’’ అని రాజకీయ విశ్లేషకుడు నూర్ అహ్మద్ బాబా చెప్పారు.

అయితే బీజేపీ 2019లో తీసుకున్న నిర్ణయం ఇక్కడ ఆ పార్టీకి రెఫరెండంగా మారకుండా ఉండేందుకే పోటీ నుంచి దూరంగా ఉందని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.

‘‘ఒకవేళ ప్రజలు ఆర్టికల్ 370 రద్దుతో సంతోషంగా ఉండి ఉంటే, బీజేపీ పోటీనుంచి వెనకడుగు వేయాల్సిన అవసరం ఉండేది కాదు’’ అని జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా అన్నారు.

‘‘బీజేపీ తనను తాను రక్షించుకోవడానికే పోటీ నుంచి దూరంగా ఉంది’’ అని వ్యాఖ్యానించారాయన.

సరస్సులోని బోటు ఫోటో

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, మధ్య కశ్మీర్, ఉత్తర కశ్మీర్‌లో పట్టున్న పార్టీలకు మద్దతు ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది.

బీజేపీ మద్దతు ఎవరికి?

జమ్ము కశ్మీర్‌లో జనరల్ ఎలక్షన్స్ ఐదు దశల్లో పోలింగ్ జరగనుంది. నేషనల్ కాన్ఫరెన్స్‌తోపాటు పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ), పీపుల్స్ కాన్ఫరెన్స్ (పీసీ), జమ్ము కశ్మీర్ అప్నీ పార్టీ, కాంగ్రెస్‌ బరిలో ఉన్నాయి.

పీపుల్స్ కాన్ఫరెన్స్ (పీసీ), జమ్ము కశ్మీర్ అప్నీ పార్టీకి బీజేపీ మద్దతు ఇస్తోందని ఎన్‌సీ, పీడీపీ నేతలు పదేపదే చెబుతున్నారు. ఈ రెండు పార్టీలను బీజేపీకి ప్రాక్సీలుగా వారు వర్ణిస్తున్నారు.

అయితే ఈ రెండు పార్టీలకు మద్దతు ఇవ్వడంపై బీజేపీ ఎటువంటి ప్రకటనా చేయలేదు. ఉత్తర, మధ్య కశ్మీర్‌లో గట్టి పట్టు ఉన్న పార్టీలకు తమ మద్దతు ఇస్తామని బీజేపీ వర్గాలు బీబీసీకి చెప్పాయి.

తమ భావజాలానికి దగ్గరగా ఉన్న పార్టీలకు మద్దతు ఇస్తామని భారతీయ జనతా పార్టీ జమ్ము కశ్మీర్ అధ్యక్షుడు రవీందర్ రైనా చెప్పారు.

కశ్మీర్‌లో మహిళల ప్రదర్శన

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, కశ్మీర్‌లో బీజేపీ కేడర్ పెరుగుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.

స్థానిక బీజేపీలో నిరుత్సాహం

కశ్మీర్ ప్రాంతంలో ఎన్నికలలో పోటీ చేయకూడదనే బీజేపీ నిర్ణయం చాలామంది స్థానిక నేతలను ఆశ్చర్యానికి గురి చేసింది. 2019 నుంచే ఎన్నికలకు సిద్ధమవుతున్నట్టు వారు చెబుతున్నారు.

‘‘మేం ఇంటింటికి వెళ్ళి ప్రభుత్వం వారి కోసం ఏం చేసిందో ప్రచారం చేశాం’’ అని ఉత్తర కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాకు చెందిన బీజేపీ కార్యకర్త షబ్బీర్ అహ్మద్ జర్గార్ చెప్పారు.

బారాముల్లా జిల్లాకు చెందిన బీజేపీ కార్యకర్త ఫైదా హుస్సేన్ కూడా పార్టీ నిర్ణయం పై నిరుత్సాహంగా ఉన్నారు. ‘‘ఏదేమైనా పార్టీ నిర్ణయాన్ని మేమందరం ఆమోదించాల్సిందే’’ అని ఆయన అన్నారు.

బీజేపీకి ఇక్కడ పెద్దగా మద్దతు ఉండకపోవడమనేది సంప్రదాయంగా వస్తున్నదే. కానీ ఇటీవల కాలంలో బీజేపీ కేడర్ పెరుగుతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

2016 జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ మెరుగైన పనితీరు కనపరిచింది. అప్పట్లో బీజేపీ రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది. పీడీపీ సహకారంతో బీజేపీ ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసింది. జమ్ములోని మొత్తం 87 స్థానాలలో బీజేపీ 25 స్థానాలు గెలుచుకుంది.

ఇవే బీజేపీకి చివరి ఎన్నికలు. బీజేపీ, పీడీపీ అనుబంధం 2018లో ముగిసింది. దీని తరువాత జమ్ము కశ్మీర్‌లో గవర్నర్ పాలన విధించారు.

2020లో జరిగిన స్థానిక ఎన్నికలలో బీజేపీ మెరుగైన పనితీరు కనిపించింది. కశ్మీర్‌లో ఆ పార్టీ మూడుస్థానాలు కూడా గెలుచుకుంది.

రెండేళ్ళ తరువాత అసెంబ్లీ స్థానాలను డీలిమిటెషన్ చేయడం వల్ల జమ్ముకు అదనంగా 6 అసెంబ్లీ స్థానాలు వచ్చాయి. కానీ కశ్మీర్‌కు అదనంగా ఒక సీటే దక్కింది. ప్రస్తుతం ఇక్కడ అసెంబ్లీ స్థానాలు 90కు పెరిగాయి. (2019వరకు జమ్ములో 37 అసెంబ్లీ స్థానాలు, కశ్మీర్‌లో 46 అసెంబ్లీ సీట్లు ఉండేవి)

ఎన్నికలలో హిందువుల పలుకుబడి పెరిగేలా జమ్ము కశ్మీర్‌లో సీట్ల సంఖ్య పెంచిందని బీజేపీ ఆరోపణలు ఎదుర్కొంది.

కొన్ని ఎన్నికల విజయాలు తప్ప క్షేత్రస్థాయిలో బీజేపీ తన ముద్ర వేయలేకపోతోందని రాజకీయ విశ్లేషకుల మాట.

పెరిగిన నిరుద్యోగం, స్థానిక నేతలు రాజకీయాలకు దూరం కావడం, భద్రతా దళాలు మానవ హక్కులను ఉల్లంఘించడం వంటి కారణాలు కూడా పరాయిభావనను పెంచాయని స్థానికులు, ప్రతిపక్షనేతలు చెబుతున్నారు.

‘‘దేశమంతటా వారు గెలిచినా, కశ్మీర్‌ను వదలుకోవడం వారికి పెద్ద ఓటమే’’ అని పీడీపీ అధికార ప్రతినిధి మోహతి భాన్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)