దుబాయ్ రియల్ ఎస్టేట్ : భారత్, పాకిస్తాన్‌లకు చెందిన నేతలు, నేరగాళ్లు ఇక్కడ ఎలా ఆస్తులు కొంటున్నారంటే...

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జుబైర్ అజమ్
- హోదా, బీబీసీ ఉర్దూ.కామ్
- నుంచి, ఇస్లామాబాద్
అంతర్జాతీయ జర్నలిజం సంస్థ ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ ఇటీవల ‘దుబాయ్ అన్‌లాక్డ్’ పేరుతో చేపట్టిన విచారణ భారత్, పాకిస్తాన్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన దుబాయ్ ప్రాపర్టీ మార్కెట్‌లో పెట్టుబడుల పెట్టిన ఎంతో మంది పేర్లు ఈ ఇన్వెస్టిగేషన్‌లో బయటికి వచ్చాయి. వారికి సంబంధించిన ఎన్నో విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ప్రపంచవ్యాప్తంగా 70కి పైగా జర్నలిజం సంస్థలు, జర్నలిస్టులు సంయుక్తంగా ‘దుబాయ్ అన్‌లాక్డ్’ పేరుతో ఈ ఇన్వెస్టిగేషన్ రిపోర్టును రూపొందించారు.
దుబాయ్‌లో రియల్ ఎస్టేట్‌లో వేల ప్రాపర్టీలు కొన్న వివిధ దేశాలకు చెందిన వ్యక్తుల పేర్లను ఈ విచారణ నివేదిక బయటపెట్టింది. వీరిలో నేరస్తులు, రాజకీయ నాయకులు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
అయితే, దుబాయ్‌లో కొనుగోలు చేసిన ప్రాపర్టీలను అక్రమంగా కొనట్లు ఈ విచారణ చెప్పడం లేదు.
ప్రాపర్టీలను కొనుగోలు చేసిన రాజకీయ నేతలు, సైనిక అధికారులను పేర్లను ప్రజా ప్రయోజనార్థం విడుదల చేసినట్లు ఈ నివేదిక తెలిపింది.
అదే విధంగా, ఈ నివేదిక చాలామంది పేర్లను వెల్లడించడం ఎన్నో సందేహాలను లేవనెత్తుతోంది.
ప్రాపర్టీలలో పెట్టుబడులు పెట్టేందుకు భారతీయులు, పాకిస్తానీయులతో సహా విదేశీయులకు దుబాయ్ ఎలా స్వర్గధామంగా మారిందనేదే ఇక్కడ కీలకమైన అంశం.
దీంతో పాటు దుబాయ్ లాంటి దేశంలో ప్రాపర్టీని కొనుగోలు చేయడం అంత తేలికనా అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది. ప్రాపర్టీ కొనుగోలుకు అక్కడున్న నియమ, నిబంధనలేంటి? విషయాలపై చర్చ జరుగుతోంది. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునే ముందు.. ‘దుబాయ్ అన్‌లాక్డ్’ అంటే ఏంటో ఒకసారి తెలుసుకుందాం..

ఫొటో సోర్స్, OCCRP
‘దుబాయ్ అన్‌లాక్డ్’ ఇన్వెస్టిగేషన్ ఏంటసలు?
‘దుబాయ్ అన్‌లాక్డ్’ పేరుతో చేపట్టిన అంతర్జాతీయ విచారణలో ఆ నగర రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టిన విదేశీ యజమానులు గురించి తెలుసుకునేందుకు ప్రయత్నించారు.
ప్రపంచవ్యాప్తంగా 70కి పైగా మీడియా సంస్థలలోని జర్నలిస్టులు భాగమైన ‘ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్(ఓసీసీఆర్‌పీ) నేతృత్వంలో ఆరు నెలల పాటు ఈ పరిశోధన జరిగింది.
మధ్య ప్రాచ్యలో ఆర్థిక కేంద్రంగా ఉన్న నగర ప్రాపర్టీకి అసలైన యజమాని ఎవరు, ఎన్నో విషయాలలో ఆరోపణలకు గురవుతూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు ఈ నగరమెలా తలుపులు తెరిచింది? వంటి విషయాలను ఇది బహిర్గతం చేస్తుందని ఓసీసీఆర్‌పీ తెలిపింది.
‘‘దుబాయ్ ల్యాండ్ డిపార్ట్‌మెంట్, ఎన్నో ఇతర ప్రభుత్వ కంపెనీల నుంచి పొందిన లీకైన డేటా సాయంతో ఈ నివేదికను రూపొందించాం. 2020 నుంచి 2022 మధ్య కాలానికి చెందిన రికార్డులు ఇవి’’ అని ఓసీసీఆర్‌పీ వెబ్‌సైట్‌లో పొందుపరిచింది.
ఓసీసీఆర్‌పీ ప్రకారం, దుబాయ్ ఇళ్ల మార్కెట్(హౌసింగ్ మార్కెట్)లో విదేశీయులకు 160 బిలియన్ డాలర్ల (రూ.13,35,115 కోట్లు) విలువైన ఆస్తులున్నట్లు తేలింది.
ఓసీసీఆర్‌పీ మీడియా పార్టనర్, పాకిస్తాన్ వార్తాపత్రిక ‘డాన్’ రిపోర్టు ప్రకారం, దుబాయ్‌లో 35,000 ప్రాపర్టీలకు 29 వేల 700 మంది భారతీయులు యజమానులని 2022లో లీకైన డేటాలో తేలింది.
ఈ జాబితాలో భారతీయులు నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు. పాకిస్తాన్ పౌరసత్వం ఉన్న వారు ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. దుబాయ్‌లో 23 వేల రెసిడెన్షియల్ ప్రాపర్టీలకు 17 వేల మంది పాకిస్తానీ పౌరులు యజమానులని తెలిసింది.
క్రిమినల్ రికార్డులు, రాజకీయంగా బలం ఉన్న వ్యక్తులు లేదా ఏదో ఒకరూపంలో అంతర్జాతీయంగా ఆంక్షలు ఎదుర్కొన్న 200 మంది వ్యక్తులపై ఈ విచారణ ఎక్కువగా దృష్టిపెట్టినట్లు ఓసీసీఆర్‌పీ తెలిపింది.
ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అవసరమైన వ్యక్తుల పేర్లను మాత్రమే జర్నలిస్టులు బహిర్గతం చేసినట్లు ఈ నివేదిక తెలిపింది. చాలా మంది యజమానుల పేర్లను ఈ నివేదికలో కనీసం ప్రస్తావించలేదని పేర్కొంది.

ఫొటో సోర్స్, @SHARJEELINAM
ఇతర పాకిస్తానీ నేతలు ఏం అంటున్నారు?
పాకిస్తాన్ నుంచి రాజకీయ నేతలు మాత్రమే కాకుండా, డజనుకు పైగా పదవీ విరమణ పొందిన మిలటరీ అధికారులు, వారి కుటుంబాలు, బ్యాంకర్లు, బ్యూరోక్రాట్లు ఈ జాబితాలో ఉన్నట్లు ఆ దేశంలో ఓసీసీఆర్‌పీకి చెందిన మరో మీడియా పార్టనర్ ‘ది న్యూస్ ఇంటర్నేషనల్’ తెలిపింది. అయితే, ఈ వివరాలను బీబీసీ స్వతంత్రంగా ధ్రువీకరించలేదు.
పాకిస్తాన్‌కు చెందిన కొందరు రాజకీయ వేత్తల పేర్లు ఈ జాబితాలో ఉన్నట్లు వెలుగులోకి రావడంతో, వారు దీనిపై స్పందించారు.
దుబాయ్‌లో తనకు అపార్ట్‌మెంట్ ఉందని తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ నేషనల్ అసెంబ్లీ సభ్యులు అఫ్జల్ మార్వత్ ఒప్పుకున్నారు. తాను ఈ ప్రాపర్టీని రిజిస్టర్ చేసుకున్నట్లు, గత ఆరేళ్లుగా పాకిస్తాన్‌లోని అన్ని నియంత్రణ సంస్థల వద్ద ఈ ఆస్తిని వెల్లడిస్తూ వస్తున్నట్లు తెలిపారు.
ఈ నియంత్రణ సంస్థలలో ఫెడరల్ బోర్డు ఆఫ్ రెవెన్యూ(ఎఫ్‌బీఆర్), ఎలక్షన్ కమిషన్ ఆఫ్ పాకిస్తాన్ వంటివి ఉన్నట్లు చెప్పారు. ‘‘దీన్ని ఎఫ్‌బీఆర్ నుంచి ధ్రువీకరించుకోవచ్చు. 2018 నామినేషన్ పత్రాలలో ఈ ఆస్తిని వెల్లడించాను’’ అని తెలిపారు.
‘‘2017లో నా భార్య పేరుతో కొనుగోలు చేసిన దుబాయ్ ప్రాపర్టీని పన్ను రిటర్నుల దాఖలలో రికార్డు చేశాను’’ అని పాకిస్తాన్ హోమ్ మంత్రి, సెనేటర్ మోహ్సిన్ నఖ్వీ తెలిపారు. మోహ్సిన్ నఖ్వి పేరు కూడా ‘దుబాయ్ అన్‌లాక్డ్’ జాబితాలో ఉంది.
‘‘పంజాబ్‌కు ఇన్‌ఛార్జ్ ముఖ్యమంత్రిగా ఎన్నికల సంఘానికి ఈ వివరాలను సమర్పించాను. ఈ ప్రాపర్టీని ఏడాది క్రితం అమ్మేశాను. దాని నుంచి వచ్చిన డబ్బుతో కొత్త ప్రాపర్టీని కొనుగోలు చేశాను’’ అని ఆయన తెలిపారు.
సింధ్ సీనియర్ మంత్రి షర్జీల్ ఇనామ్ మీమన్ కూడా ఇదే రకమైన ప్రకటన చేశారు. పాకిస్తాన్‌లోని పన్ను అధికారులు, ఎన్నికల సంఘం ముందు తన ఆస్తులను వెల్లడించినట్లు ఆయన తెలిపారు.
‘‘ఆస్తులు, ప్రాపర్టీల డిక్లరేషన్‌లో భాగంగా ప్రతి ఏడాది వీటి వివరాలను సమర్పిస్తాను. ఇది కొత్త విషయమేమీ కాదు. ప్రతీది ప్రస్తుతం ప్రజలకు తెలుసు’’ అని అన్నారు.
కానీ, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. డిక్లరేషన్ లేదా పన్నుల చెల్లింపుకు సంబంధించిన విషయం కాదు, ప్రాపర్టీలు కొనుగోలు చేసేందుకు ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? వాటిని దుబాయ్‌కు ఎలా బదిలీ చేస్తున్నారు? అని సోషల్ మీడియా వేదికపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
దక్షిణాసియా ప్రజలకు దుబాయ్ పెట్టుబడుల కేంద్రంగా ఎందుకు మారింది?
‘దుబాయ్ అన్‌లాక్డ్’ పేరుతో రూపొందించిన జాబితాలో భారత్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, ఇరాన్ దేశాలకు చెందిన చాలా మంది పేర్లు ఉన్నాయి.
కానీ, ఇక్కడ ప్రశ్నేంటంటే.. దక్షిణ ఆసియా ప్రజలకు దుబాయ్ ఆకర్షణీయమైన మూలధన పెట్టుబడుల కేంద్రంగా ఎందుకు మారింది?
‘‘ చాలా కారణాలతో దుబాయ్ ఆకర్షణీయమైన గమ్యస్థానం. దీనిలో ఒకటి దుబాయ్‌కు ఉన్న ఆర్థిక పరిపుష్టి. బలమైన, వేగవంతమైన ఆర్థిక వ్యవస్థకు పెట్టింది పేరుగా దుబాయ్ నిలుస్తుంది. అందుకే, ఇన్వెస్టర్లు దుబాయ్ వైపు చూస్తున్నారు’’ అని ఏజెన్సీ 21 డైరెక్టర్ షర్జీల్ అహ్మర్ చెప్పారు.
పాకిస్తాన్, విదేశీ రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్న వ్యక్తులతో కలిసి ఈ కంపెనీ పనిచేస్తుంది.
‘కానీ, ఇదొక్కటే కారణం కాదు. దుబాయ్ ప్రాపర్టీ కొనుగోలుదారులకు పన్ను కట్టనవసరం లేని వ్యవస్థ ఉంది. ఇది దుబాయ్‌ను ఆకర్షణీయంగా మారుస్తుంది. దుబాయ్‌లో ప్రాపర్టీ అద్దెలు చాలా ఎక్కువగా ఉంటాయి. మూలధన పెట్టుబడిదారులకు మంచి లాభాలను అందిస్తుంది’’ అని షర్జీల్ చెప్పారు.
దుబాయ్ ముఖ్యమైన వ్యాపార, పర్యాటక కేంద్రంగా కూడా మారిందన్నారు. అభివృద్ధితో పాటు, ఇక్కడ ప్రాపర్టీలకు డిమాండ్, అద్దె విపరీతంగా పెరుగుతోంది.
రియల్ ఎస్టేట్‌లో వివిధ రకాల ప్రాపర్టీలు అందుబాటులో ఉంటున్నాయని తెలిపారు. అపార్ట్‌మెంట్లు, విల్లాల నుంచి వాణిజ్య దుకాణాల వరకు వివిధ రకాల ప్రాపర్టీలు దక్షిణాసియా పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నాయని చెప్పారు.
ఇవి మాత్రమే కాక, అద్భుతమైన మౌలిక సదుపాయాలు, రవాణా, ప్రజా సౌకర్యాలు దుబాయ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు మూలధన పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నాయని తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
దుబాయ్‌లో ప్రాపర్టీ కొనడం తేలికనా?
దుబాయ్ ప్రాపర్టీ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడానికి ప్రధాన కారణం ఇక్కడ నియమ, నిబంధనలు అని షర్జీల్ అహ్మర్ చెప్పారు.
‘‘కొన్నేళ్ల క్రితం వరకు, బ్యాగులో నగదు తీసుకొచ్చుకుని ఎవరైనా దుబాయ్‌లో ప్రాపర్టీ కొనుగోలు చేసుకునే వీలుండేది. ఆ సమయంలో దుబాయ్‌లో చాలామంది ప్రజలు పెట్టుబడులు పెట్టారు. ప్రాపర్టీ కొనుగోలుకు వాడుతున్న డబ్బులు మీకెలా వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయని ఎవరూ మిమ్మల్ని ఇక్కడ ప్రశ్నించరు. దుబాయ్ అభివృద్ధికి ఇదొక రహస్యం. స్విట్జర్లాండ్‌తో పోలిస్తే ఇక్కడకు డబ్బులు తీసుకొచ్చి, రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టడం చాలా తేలికగా ఉండేది’’ అని తెలిపారు.
అస్పష్టమైన ఈ నియమ, నిబంధనలతో దుబాయ్‌ను కూడా 2022లో గే లిస్ట్‌లో పెట్టింది ఎఫ్‌ఏటీఎఫ్. అదే ఏడాది మార్చిలో దుబాయ్ ఆ జాబితా నుంచి బయటపడింది.
‘‘ప్రస్తుతం నిబంధనలు మారాయి. బ్యాంకింగ్ నెట్‌వర్క్ ద్వారానే డబ్బులు రియల్ ఎస్టేట్‌లో డబ్బులు పెట్టాల్సి ఉంది. దీని వల్ల, ప్రస్తుతం ప్రాపర్టీల కొనుగోలు అంత తేలిక కాదు’’ అని చెప్పారు.
మొత్తంగా దుబాయ్‌లో బ్యాంకులు సైతం ఆ డబ్బులు ఎక్కడి నుంచి, ఎలా వచ్చాయని అడగవని తెలిపారు.
దుబాయ్‌లో ప్రాపర్టీ కొనుగోలు ఉన్న నియమ, నిబంధనలేంటి?
ఏ విదేశీయుడైనా అంటే పాకిస్తాన్ లేదా భారత్‌కు చెందినవారైనా దుబాయ్‌లో ప్రాపర్టీలను కొనుగోలు చేయొచ్చు. కానీ, కొన్ని నియమ, నిబంధనలను వారు దృష్టిలో పెట్టుకోవాల్సి ఉందని షర్జీల్ అహ్మర్ చెప్పారు.
‘‘తొలుత దుబాయ్‌లోకి చట్టప్రకారం వచ్చేందుకు వీసా, పాస్‌పోర్టు ఉండాలి. ఇక రెండోది ప్రాపర్టీ కొనుగోలు చేసేందుకు తనకు ఆర్థిక సామర్థ్యం ఉందని తెలిపే ఆదాయ ధ్రువీకరణను సమర్పించాలి’’ అని తెలిపారు.
ప్రాపర్టీ కొనుగోలు చేయాలనుకునే వారు దుబాయ్ ల్యాండ్ డిపార్ట్‌మెంట్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ లేదా ఎన్ఓసీ తీసుకురావాల్సి ఉంటుందని షర్జీల్ అహ్మర్ చెప్పారు.
‘‘కొనుగోలుదారు బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేయాలి. ఆ తర్వాత అమ్మకపు ఒప్పందంతో పాటు అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించాలి’’ అని తెలిపారు.
‘‘న్యాయవాది లేదా ఏజెంట్ సాయంతో కొనుగోలుదారులు ఈ పనులన్నీ చేసుకుంటే మంచిది. వీరికి దుబాయ్‌లో ప్రాపర్టీ కొనుగోలుపై పూర్తి అవగాహన ఉంటుంది. దీంతో, ఏమైనా ఇబ్బందులుంటే తప్పించుకోవచ్చు’’ అని షర్జీల్ అహ్మర్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెరిగిన పోలింగ్ శాతం దేనికి సంకేతం, ఎవరికి అనుకూలం?
- ఏపీలో మే 13న ఎన్నికలు పూర్తయితే జూన్ 1 వరకు ఎగ్జిట్ పోల్స్ ఎందుకు ఇవ్వకూడదు?
- షుగర్ ఉన్న వాళ్లు మామిడి పండ్లు తినొచ్చా, తినకూడదా? డాక్టర్లు ఏం చెప్పారంటే..
- ఇస్లామిక్ దేశాల్లో ఉంటున్న హిందువుల దృష్టిలో ‘హిందుత్వ’ అంటే ఏమిటి?
- ఉత్తరాంధ్ర: రాజవంశీకులు రాజకీయాలకు ఎందుకు దూరమవుతున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














