China property crisis-చైనాలో రియల్ ఎస్టేట్ సంక్షోభం: హోం లోన్ ఈఎంఐలు చెల్లించడం ఆపేసిన ప్రజలు.. ప్రభుత్వం ఏం చేస్తోంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సురంజన తివారి
- హోదా, ఆసియా బిజినెస్ కరస్పాండెంట్
''నిర్మాణం నిలిచిపోయింది. తాకట్టు ఆగిపోయింది. ఇళ్లు ఇచ్చాక డబ్బులు కట్టించుకోండి''
చైనాలో అపార్టుమెంట్లు కొనుగోలు చేసినవారు జూన్‌లో చేపట్టిన నిరసనల్లో వినిపించిన నినాదం ఇది.
అయితే, కొనుగోలుదారుల కోపం నినాదాలు, ప్లకార్డులతో ఆగలేదు.. ఇళ్లు కొనుగోలు చేసిన వందలాది మంది తనఖా పెట్టిన ఆస్తుల వాయిదాలు, హోం లోన్‌లు కట్టడం మానేశారు.
అసమ్మతి స్వరం వినిపించడాన్ని ఏమాత్రం సహించని చైనాలో ఈ స్థాయిలో నిరసన వ్యక్తమవుతుండడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయమవుతోంది.
సెంట్రల్ చైనాలోని జింగ్‌ఝోకి మారిన ఓ యువ జంట 'బీబీసీ'తో మాట్లాడుతూ.. ఇంటి కోసం గత ఏడాది డౌన్ పేమెంట్ కట్టామని, ఆ తరువాత బిల్డర్ ప్రాజెక్ట్ నుంచి వైదొలగారని, నిర్మాణం కూడా నిలిచిపోయిందని చెప్పారు.
'కొత్త ఇంట్లో నివసించడానికి సంబంధించి ఎన్నో కలలు కన్నాం. ఎన్నెన్నో ఊహించుకున్నాం. అవన్నీ ఇప్పుడు హాస్యాస్పదంగా మారిపోయాయి'' అని ఆ జంటలోని మహిళ అన్నారు.
జెంగ్‌ఝోలోనే ఇల్లు కొనుగోలు చేసిన మరో మహిళ కూడా చెల్లింపులు చేయబోనని చెప్పారు. ప్రాజెక్టు పూర్తయి ఇల్లు చేతికొస్తేనే డబ్బులు చెల్లిస్తానని చెప్పారు.
వీరంతా డబ్బులు కట్టగలిగే స్థితిలోనే ఉన్నారు.. కానీ, చెల్లించరాదని నిర్ణయించుకున్నారు.
అయితే, దీన్ని 2007 నాటి అమెరికాలోని 'సబ్ ప్రైమ్ మార్ట్‌గేజ్ క్రైసిస్' వంటిది కాదు. అమెరికాలో అప్పట్లో ఏర్పడిన సంక్షోభానికి కారణం... స్తోమత చాలని రుణ గ్రహీతలకు అప్పులివ్వడంతో వారు చెల్లించలేకపోవడం.
కానీ, చైనాలో ప్రస్తుత పరిస్థితి వేరు. అపార్టుమెంట్ల నిర్మాణ సంస్థలు, బిల్డర్లు స్థిరాస్తిని అప్పగించకపోవడంతో కొనుగోలుదారులు చెల్లింపులు చేయడానికి నిరాకరిస్తుండడం ఇక్కడి సమస్య.

ఫొటో సోర్స్, Getty Images
చెల్లింపులు నిలిపివేస్తున్నవారు దేశవ్యాప్తంగా ఉన్నారు. గిట్‌హబ్ వేదికగా ఇలా తమ నిర్ణయాన్ని ప్రకటిస్తున్న కొనుగోలుదారుల వివరాల ఆధారంగా చూస్తే దేశవ్యాప్తంగా సుమారు 320 ప్రాజెక్టులలో ఇళ్లను కొనుగోలు చేసినవారు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని అంచనా.
అయితే, వాస్తవంలో ఈ సంఖ్య ఎంతనేది స్పష్టత లేదు.
చెల్లించని రుణాల మొత్తం 14,500 కోట్ల డాలర్లు (సుమారు రూ. 11,53,148,75,00,000) ఉండొచ్చని ఎస్అండ్‌పీ గ్లోబల్ రేటింగ్స్ అంచనా వేసింది. అంతకంటే ఎక్కువే ఉండొచ్చని మరికొందరు విశ్లేషకులు అంచనా వేస్తున్నరు.
ఆర్థిక మందగమనం, నగదు లభ్యత తగ్గిన నేపథ్యంలో ఇప్పటికే నెమ్మదిగా ఉన్న నిర్మాణ రంగ మార్కెట్‌పై ఈ తాజా పరిణామాల ప్రభావం పడకుండా అధికారులు అప్రమత్తమవుతున్నారు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో రెండో స్థానంలో ఉన్ చైనా ఆర్థికానికి మూలస్తంభాలలో ఒకటైన నిర్మాణ రంగంలో విశ్వాసం లోపించిందనడానికి ఇది సూచనగా చెబుతున్నారు.
చెల్లింపులను నిరాకరించడమనేది నిర్మాణ రంగ ఆర్థిక వృద్ధికి తీవ్ర విఘాతమని 'ఆక్స్‌ఫర్డ్ ఎకనమిక్స్' అభిప్రాయపడింది.
చైనా ఆర్థిక వ్యవస్థలో మూడో వంతు వాటా స్థిరాస్తి రంగానిదే. ఇళ్లు, అద్దెలు, బ్రోకరింగ్ సేవలు వంటివన్నీ ఇక్కడ స్థిరాస్తి రంగం కిందకే వస్తాయి.
కానీ, చైనా ఆర్థిక వ్యవస్థ కొద్దికాలంగా మందకొడిగా ఉంది. మునుపటి ఏడాదితో పోల్చినప్పుడు గత త్రైమాసికంలో 0.4 శాతం వృద్ధి మాత్రమే నమోదైంది.
ఈ ఏడాది కూడా వృద్ధి పెద్దగా ఉండకపోవచ్చని కొందరు ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు.
చైనా అనుసరిస్తున్న జీరో కోవిడ్ స్ట్రాటజీ, తరచూ లాక్‌డౌన్‌లు అమలు చేస్తుండడం, కోవిడ్ నియంత్రణలు ఎక్కువగా ఉండడం వల్ల ఆర్థిక వ్యవస్థ ప్రభావితమవుతోంది.
దీనివల్ల ఆదాయాలు తగ్గడంతో పాటు పొదుపు, పెట్టుబడులూ తగ్గాయి.
చైనా వంటి భారీ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన స్థిరాస్తి మార్కెట్‌కు కలిగే ఆటంకాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థనూ ప్రభావితం చేయొచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
ఇది మిగత ప్రపంచ దేశాలకూ పాకుతుందనే భయం ఆర్థిక నిపుణుల్లో కనిపిస్తోంది. స్థిరాస్తి రంగం కుంగిపోతుందని బ్యాంకర్లు భావిస్తే రుణాలివ్వడం మానేస్తాయని నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
''ఇవన్నీ విధానాలపై ఆధారపడి ఉంటాయి'' అని స్టాండర్డ్ చార్టర్డ్ గ్రేటర్ చైనా ఎకనమిక్ రీసెర్చ్ హెడ్ దింగ్ షువాంగ్ అన్నారు. ''మిగతా దేశాలలో మార్కెట్ల కారణంగా స్థిరాస్తి బుడగలు పగులుతాయి.. కానీ, ఇక్కడ ప్రభుత్వం నిర్ణయాల కారణంగా ఈ పరిస్థి ఏర్పడుతోంది'' అన్నారు దింగ్.
30 రియల్ ఎస్టేట్ కంపెనీలు విదేశీ రుణాలను చెల్లించలేకపోయాయి. ఎవర్‌గ్రాండ్ నిరుడు 30,000 కోట్ల డాలర్ల రుణం తీర్చలేకపోయింది. అమ్మకాలు కానీ ఊపందుకోకపోతే మరిన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు మునిగిపోతాయి అని ఎస్అండ్‌పీ హెచ్చరించింది.
మరోవైపు జనాభా పెరుగుదల, పట్టణీకరణ నెమ్మదించడంతో చైనాలో ఇళ్లకు గిరాకీ భారీగా తగ్గుతోంది.
చైనాలో ఇళ్ల మార్కెట్ ఒక దశ దాటిపోయిందని క్యాపిటల్ ఎకనమిక్స్‌లో సీనియర్ ఆర్థికవేత్త ఎవాన్స్ ప్రిచర్డ్ చెప్పారు.
చైనాలో వ్యక్తిగత సంపదలో రియల్ ఎస్టేట్ వాటా 70 శాతం. ఇక్కడ ఇళ్లను కొనేవారు సాధారణంగా ప్రాజెక్టులు పూర్తికావడానికి ముందే డబ్బులు చెల్లిస్తుంటారు.
చైనాలో ఇళ్ల మార్కెట్‌లో ఈ 'ప్రీ సేల్స్' వ్యాపారం వాటా 70 నుంచి 80 శాతం ఉంటుంది.
కొనుగోలుదార్లు ముందుగా చెల్లించే డబ్బు డెవలపర్లకు అవసరమని... ప్రాజెక్టులకు నిధులు సమకూర్చుకోవడానికి వారు ఆ డబ్బును ఉపయోగిస్తారని ఎవాన్స్ ప్రిచర్డ్ చెప్పారు.
అయితే, బలహీనమైన ఆర్థిక వ్యవస్థ.. ఉద్యోగాల కోతలు, జీతాల కోతల వంటి ధోరణుల కారణంగా డెవలపర్లు ప్రాజెక్టులు పూర్తిచేయలేరనే భయాలతో చాలామంది యువ, మధ్య తరగతి చైనీయులు స్థిరాస్తి పెట్టుబడులు తగ్గించేస్తున్నారు.
బ్యాంకింగ్ గ్రూప్ ఏఎన్‌జడ్ అంచనా ప్రకారం.. అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి 22,000 కోట్ల డాలర్ల వరకు రుణాలు ఉంటాయి.
2020లో చైనా ప్రభుత్వం డెవలపర్ల రుణ పరిమితికి సంబంధించి మూడు 'రెడ్ లైన్లు' ప్రవేశపెట్టింది. ఈ నిర్ణయం నిధుల రాకను తగ్గించేసింది. మార్కెట్ వృద్ధిపై బ్యాంకులకు నమ్మకం తగ్గడమనేది ఈ సమస్యకు తోడయింది.

ఫొటో సోర్స్, Getty Images
ప్రభుత్వం ఏం చేస్తోంది..
చైనా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం స్థానిక ప్రభుత్వాలపై భారం మోపుతోంది.
గృహ కొనుగోలుదారులకు పన్ను మినహాయింపులు, నగదు రాయితీలు ఇస్తూ స్థానిక ప్రభుత్వాలు గృహ కొనుగోలుదారులను ప్రోత్సహిస్తున్నారు.
అలా చేయకపోతే స్థిరాస్తి రంగం నెమ్మదిస్తుందని.. డెవలపర్లు భూములు కొనుగోలు చేయకుంటే స్థానిక ప్రభుత్వాల ఖజానాలు నిండవని వారు ఆందోళన చెందుతున్నారు.
''కేంద్ర ప్రభుత్వం, రెగ్యులేటర్లు రంగంలోకి దిగాల్సిన సమయం వచ్చింది'' అని దింగ్ అన్నారు. ''కొన్ని కంపెనీల సమస్యలను పరిష్కరించడానికి ఏదో ఒక సమయంలో కేంద్ర ప్రభుత్వంలో ఇందులో ఎంటర్ అవుతుంది... ఆర్థిక వ్యవస్థకు ఈ రంగం చాలా ముఖ్యం కదా'' అన్నారు దింగ్.
స్థిరాస్తి డెవలపర్లకు సాయపడేందుకు గాను చైనా 14,800 కోట్ల డాలర్ల రుణాలు ఇస్తోందని 'ఫైనాన్షియల్ టైమ్స్' ఇటీవల రిపోర్ట్ చేసింది.
అలాగే వాయిదాలు చెల్లించనివారికి క్రెడిట్ స్కోర్ దెబ్బతినకుండా 'పేమెంట్ హాలిడే' ప్రకటించే యోచన ఉందని 'బ్లూమ్‌బర్గ్' వెల్లడించింది.
అయితే, రియల్ ఎస్టేట్, మౌలిక వసతుల రంగంలో ప్రభుత్వ జోక్యం అనేది తాత్కాలిక ఉపశమనం కలిగిస్తుందే కానీ దీర్ఘకాలిక ప్రయోజనాలకు ఇది సరైన ఆలోచన కాదని 'ఆక్స్‌ఫర్డ్ ఎకనమిక్స్' అభిప్రాయపడింది.
ఇది కేవలం ఆర్థిక సంక్షోభం కాదని... మూడో సారి అధ్యక్ష పదవిలో కొనసాగానికి వీలు కల్పించే పార్టీ కీలక సమావేశం వచ్చే ఏడాది జరగడానికి ముందు జిన్‌పింగ్‌కు ఇది ఇబ్బంది కావొచ్చని అభిప్రాయపడింది.
నెక్స్ట్ ఏంటి?
14,800 కోట్ల డాలర్ల ఉద్దీపన ప్యాకేజీ ఎటూ చాలదని నిపుణులు చెబుతున్నారు. స్థిరాస్తి కంపెనీలను నిలబెట్టాలంటే 44,400 కోట్ల డాలర్లు అవసరమని క్యాపిటల్ ఎకనమిక్స్ అంచనా వేస్తోంది.
ఒకవేళ నిర్మాణాలు పునఃప్రారంభమైనా కూడా అమ్మకాలు ఊపందుకోకపోతే పరిస్థితి మారదు.
మొత్తంగా చూస్తే చైనా ఆర్థిక వ్యవస్థ సందిగ్థంలో ఉందనడానికి ఈ తాజా సంక్షోభాన్ని ఒక సూచికగా చెప్పొచ్చు.
ఇవి కూడా చదవండి:
- డోనల్డ్ ట్రంప్ నివాసంలో ఎఫ్‌బీఐ సోదాలు: మళ్లీ అధ్యక్ష పదవికి పోటీపడకుండా అనర్హుడిగా ప్రకటించే అవకాశం ఉందా?
- వాట్సాప్ లేటెస్ట్ ప్రైవసీ ఫీచర్లు: ఆ మెసేజ్‌ల స్క్రీన్ షాట్లు ఇకపై సాధ్యం కాదు.. గుట్టుచప్పుడు కాకుండా గ్రూప్ నుంచి లెఫ్ట్ అయిపోవచ్చు..
- పాప్ స్మియర్: మహిళలను గర్భాశయ క్యాన్సర్ నుంచి కాపాడే ఈ టెస్ట్ వెనుక ప్రేమ కథ మీకు తెలుసా?
- డాలరుతో పోలిస్తే రూపాయి ఎందుకు పతనం అవుతోంది? కారణాలు తెలుసుకోండి...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













