చైనా రియల్ ఎస్టేట్: కోట్ల సంఖ్యలో ఖాళీ ఫ్లాట్లు... 'నిర్మానుష్య ఆకాశ హర్మ్యాలు'

ఫొటో సోర్స్, Getty Images
ఆకాశానికి నిచ్చెన వేసినట్లుగా కనిపించే భారీ అపార్ట్‌మెంట్లు నిర్మించారు. లక్షలాది ఫ్లాట్లు సిద్ధంగా ఉన్నాయి. కానీ, వాటిని కొనేవారు, అద్దెకు తీసుకునేవారు లేరు. దాంతో ఆ భవనాలు 'నిర్మానుష్యంగా' మిగిలిపోతున్నాయి.
చైనా నగరాల్లో పరిస్థితి ఇది. తాజా సర్వే ప్రకారం, ఈ దేశంలో ప్రస్తుతం దాదాపు 5 కోట్ల ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయి.
ఇక్కడి పట్టణాలు ప్రపంచంలోనే అత్యధికంగా ఖాళీ ఇళ్లున్న మున్సిపాలిటీలుగా మారుతున్నాయి. జనాలు లేక మూగబోయిన ఆ ఆకాశ హర్మ్యాలు 'పర్యాటక స్థలాలు'గా మారుతున్నాయి.
దేశ ఆర్థిక వ్యవస్థకు ఇదో పెద్ద సమస్యగా తయారవుతోంది.
అమెరికాలోని టెక్సాస్ ఏ&ఎం విశ్వవిద్యాలయం ఎకనమిక్స్ ప్రొఫెసర్ గన్ లీ నేతృత్వంలో వేల మంది పరిశోధకులు కలిసి చైనాలో సమగ్ర సర్వే నిర్వహించారు.
ప్రస్తుతం చైనాలోని పట్టణ ప్రాంతాల్లో 20 శాతానికి పైగా ఇళ్లు ఖాళీగా ఉన్నాయని ఆ సర్వేలో వెల్లడైంది. ప్రతి అయిదు ఇళ్లల్లో ఒకటి ఖాళీగా ఉందని తేలింది.
అనేకమంది ధనవంతులు తాము ఉండేందుకు ఇల్లు ఉన్నా, పెట్టుబడి రూపంలో అదనపు ఇళ్లను కొనేశారు. కానీ, వాటిలో కిరాయికి ఉండేవారు కరవయ్యారు.
అలా అద్దెలు లేక ఖాళీగా ఉండిపోయిన ఫ్లాట్లలో అధిక శాతం ఒకటికి మించి ఇళ్లున్న వాళ్లవేనని ఈ పరిశీలనలో తేలింది.
మరోవైపు, సొంతింటి కలను సాకారం చేసుకోవాలని ఎదురుచూస్తున్న లక్షల మంది... ఆకాశాన్నంటిన ఫ్లాట్ల ధరలను చూసి వెనకడుగు వేస్తున్నారని పరిశోధకులు గుర్తించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇళ్ల ధరలను, ప్రజల ఆదాయాలను పోల్చి చూసినప్పుడు ప్రపంచంలో అత్యంత ఖరీదైన 10 నగరాల్లో ఏడు నగరాలు చైనాలోనే ఉన్నాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ గణాంకాలు చెబుతున్నాయి.
"దాన్ని బట్టి చూస్తే చైనాలోని నగరాల్లో సామాన్యులు ఇళ్లు కొనే పరిస్థితి లేదని అర్థమవుతోంది. అంత ధరలు పెట్టే స్తోమత లేకపోవడంతో సామాన్య ప్రజలు ఇళ్లు కొనేందుకు వెనకడుగు వేస్తున్నారు" అని గన్ లీ అన్నారు.
"చాలామంది తమకు ఉండేందుకు ఒక ఇల్లున్నా, పెట్టుబడి రూపంలో అదనపు ఇళ్లు కొన్నారు. దాంతో ధరలు ఆకాశాన్నంటాయి." అని ఆయన వివరించారు.
తాజా అధ్యయనం ప్రకారం, తొలిసారి ఇల్లు కొనేవారి సంఖ్య 2013 మూడో త్రైమాసికం నుంచి 2014 మూడో త్రైమాసికం మధ్య 48 శాతం తగ్గిపోయింది.

ఫొటో సోర్స్, Getty Images
చైనాలో చాలామంది ధనవంతులు పెట్టుబడులు పెట్టేందుకు నిత్యం ఊగిసలాడే స్టాక్ మార్కెట్లకు ప్రత్యామ్నాయ రంగాల గురించి ఆలోచించారు. షేర్ మార్కెట్లతో పోల్చితే రియల్ ఎస్టే రంగంలో నష్ట భయాలు తక్కువని భావించారు. కొందరు పిల్లల భవిష్యత్తు కోసమంటూ ఇళ్లు కొన్నారు.
అలా ఇళ్ల కొనుగోళ్లు పెరిగిపోవడంతో ధరలు తారా స్థాయికి చేరాయి.
ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావడానికి ప్రభుత్వం కొత్త విధానాలను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించింది. "ఇళ్లు నివాసం ఉండడానికి మాత్రమే, వ్యాపారం కోసం కాదు" అని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ వ్యాఖ్యానించారు.
ఇళ్ల ధరలకు కళ్లెం వేసేందుకు రానున్న అయిదేళ్లలో కొత్త స్థిరాస్తి పన్నుల విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త పన్ను విధానాన్ని తీసుకొచ్చే ప్రక్రియలో భాగంగా జాతీయ భూ యాజమాన్య సమాచార నిధి (డేటాబేస్)ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
కానీ, ప్రభుత్వ నిర్ణయం పట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఇళ్లపై పెట్టుబడులు పెట్టిన ధనవంతుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది.

ఫొటో సోర్స్, Getty Images
అయితే, నివాసాల మార్కెట్ విషయంలో ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే, ప్రస్తుతం చైనా జీడీపీలో అయిదో వంతు ఈ రంగానిదే. ఏమాత్రం పొరపాటు జరిగినా అది సంక్షోభానికి దారితీసే అవకాశం ఉంటుంది.
జిన్ పింగ్ ప్రభుత్వం ప్రతిపాదించిన నూతన పన్ను విధానం అమల్లోకి వస్తే... పట్టణ ప్రాంతాల్లో ఒకటి కంటే ఎక్కువ ఇళ్లున్నవారిలో 20 శాతం మందికి పైగా తమ ఖాళీ గృహాలను అమ్మేందుకు సిద్ధపడతారని తాజాగా ఎఫ్‌టీ కాన్ఫిడెన్షియల్ రీసెర్చ్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది.
దాంతో ఇళ్ల ధరలు ఒక్కసారిగా పతనమయ్యే అవకాశం ఉంది. ఫలితంగా రియల్ ఎస్టేస్ రంగం తీవ్రంగా కుదేలయ్యే పరిస్థితి ఏర్పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- నల్లగొండలో ఆడపిల్లల అమ్మకాలు ఆగిపోయాయా?... సంక్షేమ పథకాలతో సమస్య పరిష్కారమైందా?
- సిసలైన తెలంగాణ ప్రజావాణి బీబీసీ న్యూస్ తెలుగులో
- అడాల్ఫ్ హిట్లర్ - ఓ యూదు చిన్నారి: ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన స్నేహం
- కిలోరాయి మారుతోంది.. మరి మీ బరువు మారుతుందా? మారదా?
- ఏ సెల్‌ఫోన్‌తో ఎంత ప్రమాదం?
- సెల్ఫోన్లు ఎందుకు పేలుతున్నాయి?
- ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గులాబీ వజ్రం ఇది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








