ఉత్తరాంధ్ర: రాజవంశీకులు రాజకీయాల‌కు ఎందుకు దూరమవుతున్నారు?

ఉత్తరాంధ్రలో రాజవంశస్తుల రాజకీయాలు

ఫొటో సోర్స్, lakkojusrinivas

ఫొటో క్యాప్షన్, ఉత్తరాంధ్ర ప్రాంతంలో నర్సీపట్నం నుంచి అటు గిరిజన ప్రాంతమైన మేరంగి వరకు ఇక్కడ ఐదు రాజ సంస్థానాలు ఉన్నాయి.
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

ఉత్తరాంధ్రలోని రాజ కుటుంబాలు రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో వీరికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అయితే ఆ తర్వాత క్రమంగా వీరికి పోటీగా సామాన్యులే ఎదురు నిలిచి, విజయాలు సాధించారు.

ఉత్తరాంధ్ర ప్రాంతంలో రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉందని చెబుతారు. ఇటు నర్సీపట్నం నుంచి అటు గిరిజన ప్రాంతమైన మేరంగి వరకు ఇక్కడ ఐదు రాజ సంస్థానాలు ఉన్నాయి.

వీరిలో విజయనగరం గజపతి రాజులు, బొబ్బిలి రాజులు, కురుపాం, మేరంగిలకు చెందిన గిరిజన రాజులు, ఇటు నర్సీపట్నం ప్రాంతానికి చెందిన తంగేడు రాజులు ఉన్నారు.

దేశానికి స్వాతంత్య్రం అనంతరం సంస్థానాలు, రాజభరణాలు రద్దయ్యాయి. కాలక్రమేణా ఈ రాజ వంశస్తులు రాజకీయాల్లో ప్రవేశించారు.

ఒకప్పుడు ఈ కుటుంబాలు ఏపీలో రాజకీయాలను శాసించినా, ఇప్పుడు వారి ప్రభావం అంతగా కనిపించడం లేదు. ఇంతకు ఇలా ఎందుకు జరుగుతోంది? ఈ రాజ వంశస్తులు అసలు రాజకీయాల్లోకి ఎలా వచ్చారు?

తంగేడు

ఫొటో సోర్స్, lakkojusrinivas

ఉత్తరాంధ్రలో వీరి రాజ్యాలు ఎలా ఏర్పడ్డాయి?

ఇప్పుడు ఉత్తరాంధ్రగా పిలుస్తున్న ప్రాంతమే ఒకప్పటి కళింగాంధ్ర, 17వ శతాబ్ధంలో ఈ ప్రాంతం కుతుబ్ షాహీల పాలనలో ఉండేది.

ఆ సమయంలో ప్రజల నుంచి కుతుబ్ షాహీలు తిరుగుబాటు ఎదుర్కొన్నారు. దీనికి కారణాలు కనుగొనేందుకు సేనాని షేర్ మహ్మద్ ఖాన్ ను కుతుబ్ షాహీలు ఈ ప్రాంతానికి పంపించారు. ఇక్కడ నీరు, మతం, పరిపాలన విషయంలో ప్రజలు అసంతృప్తిలో ఉన్నారనే విషయం తెలుసుకున్నారు.

దీంతో ఈ ప్రాంతంలో ఉన్న కొన్ని పెద్ద కుటుంబాలకు అధికారాలు ఇచ్చి.. మంచి పాలన అందిస్తే ప్రజల్లో అశాంతిని తగ్గించవచ్చని వారు భావించారని ఏయూ హిస్టరీ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ కొల్లూరి సూర్యనారాయణ బీబీసీతో చెప్పారు.

“ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రముఖ వంశాలకు జమీందారీలు ఇచ్చారు. ఆ విధంగా బొబ్బిలి‌లో రావులు, అంతకుముందు నుంచి ఉన్న పూసపాటి రాజవంశం, కాకర్లపూడి, గోడె జమీందార్లు, అలాగే నర్సీపట్నం సమీపంలోని తంగేడు రాజులు, గిరిజన రాజులుగా పేరు పొందిన కురుపాం, వైరిచర్ల వంశస్తులకు కూడా జమీందారీలు అప్పగించారు. అప్పటీకే వీళ్లని చిన్నచిన్న సంస్థానాలుగానో, జమీందార్లుగానే చూస్తున్నప్పటికీ అధికారికంగా మాత్రం కుతుబ్ షాహీలే గుర్తింపునిచ్చారు” అని రిటైర్డ్ ప్రొఫెసర్ కొల్లూరి సూర్యనారాయణ చెప్పారు.

సూర్యనారాయణ

ఫొటో సోర్స్, lakkojusrinivas

ఫొటో క్యాప్షన్, ఇందిరాగాంధీతో తంగేడుకు చెందిన రాజు సాగి సూర్యనారాయణ రాజు

ప్రధాని ఆఫీసుకు నేరుగా ఫోన్ చేయగలిగే పలుకుబడి..

మధ్యయుగాల్లో త్యాగి రాజవంశం ఉండేది. అది అంతరించి పోయాక ఆ వారసులు ఉత్తరాంధ్ర ప్రాంతంలో వారి బంధువులున్న పాండ్రగి ప్రాంతానికి వచ్చారు. అక్కడ నుంచి తంగేడు ప్రాంతానికి వెళ్లి అక్కడ ఒక సంస్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ త్యాగి వంశీయులే ఇక్కడ సాగి వంశరాజులుగా కొనసాగుతున్నారని కొల్లూరి సూర్యనారాయణ చెప్పారు.

నర్సీపట్నానికి ఆనుకొని ఉన్న కోటవురట్ల మండలంలోని తంగేడు అనే గ్రామంలోని తంగేడు రాజుల కనుసన్నల్లోనే మూడు, నాలుగు దశాబ్ధాల పాటు విశాఖ జిల్లా రాజకీయాలు సాగాయి. తంగేడుకు చెందిన రాజు సాగి సూర్యనారాయణ రాజు, ఆయన సోదరుడు రాజా సాగి సీతారామరాజు మూడు దశాబ్దాలు జిల్లా పరిషత్ చైర్మన్లుగా పని చేశారు.

1967-1977 సంవత్సరాల మధ్యలో సూర్యనారాయణ రాజు రాష్ట్ర అటవీశాఖ మంత్రిగా, దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తరువాత 1989 ఎన్నికలలో రాజాసాగి కృష్ణమూర్తి రాజు నర్సీపట్నం నుంచి శానసభ్యుడిగా ఎన్నికయ్యారు.

తంగేడు

ఫొటో సోర్స్, Lakkojusrinivas

ఫొటో క్యాప్షన్, పీవీ నరసింహారావుతో రాజు సాగి సూర్యనారాయణ రాజు కుటుంబం

సామాజిక సమీకరణాల నేపథ్యంలో వీరు రాజకీయాలకు కేంద్రమైన కోటవురట్ల మండలం పాయకరావు పేట ఎస్సీ నియోజకవర్గంలో కలిసిపోవడంతో వీళ్లకి సొంత నియోజకవర్గం అంటూ ఏమీ లేకుండా పోయింది.

పాయకరావుపేట, నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గాలలో తమకి ప్రాధాన్యత లేకపోవడంతో పాటు అటు అనకాపల్లి పార్లమెంటు కూడా క్షత్రియులకు ఇవ్వడం లేదు, దీంతో తంగేడు రాజులు ప్రత్యక్ష రాజకీయాల్లో కనిపించడం లేదు.

“ఆ రోజుల్లో తంగేడు రాజులకు ఎంత ప్రాధాన్యం ఉండేదంటే....వాళ్లు ఇంట్లోంచి నేరుగా ప్రధాని మంత్రి ఆఫీసుకి కూడా ఫోన్ చేయగలిగేవారు. జిల్లా సీట్లన్నీ తంగేడు రాజులే ఇచ్చేవారు. వీరు తరచూ దిల్లీ వెళ్తుండంటంతో... అక్కడ పరిచయాలు బాగా పెరిగి కాంగ్రెస్ పార్టీ ఏ ఎన్నికలైనా ఉత్తరాంధ్రకు చెందిన మొత్తం బీఫారాలు వీళ్లకే ఇస్తే... వీళ్లు ఇక్కడకి వచ్చి వాటిని అభ్యర్థులకు అందజేసేవారు. అయితే అటువంటి తంగేడు రాజుల ప్రాబల్యం దాదాపు తగ్గిపోయింది. ఇప్పటి రాజకీయ పార్టీల్లో వీరికి పెద్దగా ప్రాధాన్యత లేదు. ఈ వంశం తరపున యాక్టివ్ పాలిటిక్స్ ఎవరు చేయడం లేదు” అని పొలిటికల్ ఎనలిస్ట్ ఎం. యుగంధర్ రెడ్డి బీబీసీతో చెప్పారు.

ఉత్తరాంధ్ర రాజకీయం

ఫొటో సోర్స్, lakkojusrinivas

ఫొటో క్యాప్షన్, జైపూర్ సంస్థానం నుంచి పూసపాటి రాజ వంశీయులు విడిపోయి విజయనగరం జిల్లా వద్ద కుమిలిని ప్రధాన కేంద్రంగా చేసుకున్నారు,

పూసపాటి రాజకీయాలు..

జైపూర్ (జయపురం-ఒడిశా) సంస్థానం నుంచి పూసపాటి రాజ వంశీయులు విడిపోయి విజయనగరం జిల్లా వద్ద కుమిలిని ప్రధాన కేంద్రంగా చేసుకున్నారు, అనంతరం స్వాతంత్య్ర జమీందారిగా ప్రకటించుకుని పాలన మొదలు పెట్టారు.

వాస్తవానికి వీళ్లు కృష్ణా జిల్లా పూసపాడు ప్రాంతానికి చెందిన వారు. వీరు అక్కడ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లి స్థిరపడి, చివరకు విజయనగరంలో ఒక సంస్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మధ్యయుగాల్లో విష్ణుకుండీనుల నుంచి తమకు వారసత్వం ఉన్నట్లు చెప్పుకుంటున్నారు.

ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఈ రాజ వంశీయులు కళలు, విద్యపరంగా చేసిన సేవలు చాలా గొప్పవని, రాజకీయాల్లో కూడా ఈ వంశం తమదైన ముద్రని వేసిందని రిటైర్డ్ ప్రొఫెసర్ కొల్లూరి సూర్యనారాయణ చెప్పారు.

1952లో మొదటిసారి జరిగిన ఎన్నికల్లో విజయనగరం నియోజవర్గ ప్రజలు పూసపాటి రాజ వంశీయుడైన పూసపాటి విజయ గజపతి రాజును గెలిపించారు.

జాతీయ కాంగ్రెస్‌ హవాలో కూడా పీవీజీ రాజు సోషలిస్టు పార్టీ అభ్యర్ధిగా బరిలోకి దిగి భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. తరువాత 1956లో జరిగిన ఎన్నికల్లో మళ్లీ పీవీజీ రాజు ప్రజా సోషలిస్టు పార్టీ తరఫున విజయం సాధించారు.

మళ్లీ 1960, 1971లలో ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు ఎన్నికై, మంత్రిగా పని చేశారు.

విశాఖ పార్లమెంట్ స్థానం నుంచి రెండు సార్లు, బొబ్బిలి పార్లమెంట్ స్థానం నుంచి రెండు సార్లు ఎంపీగాకూడా గెలిచారు.

అశోక్ గజపతిరాజు
ఫొటో క్యాప్షన్, అశోక్ గజపతిరాజు

అశోక్ గజపతిరాజు హవా

1978లో రాజకీయ అరంగేట్రం చేసిన పీవీజీ రాజు కుమారుడు పూసపాటి అశోక్ గజపతిరాజును విజయనగరం ఓటర్లు వరుసగా ఆరు పర్యాయాలు గెలిపించారు.

1978లో జనతా పార్టీ తరఫున గెలిచాక, 1983లో నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించడంతో అశోక్‌ ఆ పార్టీలో చేరారు. అనంతరం 83, 85, 89, 94, 99 ఎన్నికల్లో వరుసగా విజయాలు సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత 2004లో ఓటమి పాలయ్యారు.

2009లో వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో ఏపీలో కాంగ్రెస్‌ హవా సాగినా, ఆ ఎన్నికల్లో కూడా టీడీపీ తరఫున అశోక్‌ విజయం సాధించారు. ఇలా అశోక్‌ ఏడు పర్యాయాలు విజయనగరం ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో విజయనగరం ఎంపీగా గెలిచి, కేంద్ర మంత్రిగా పనిచేశారు. తిరిగి 2019లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.

అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి గజపతి రాజు 2019 ఎన్నికల్లో తొలిసారి పోటీచేశారు. ఆమె విజయనగరం అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు.

2024 ఎన్నికల్లో మరోసారి విజయనగరం అసెంబ్లీ స్థానం నుంచి అదితి బరిలోకి దిగారు.

‘’ఇప్పుడు రాజకీయంగా విజయనగరం రాజులకు ఇది చివరి అవకాశంగా భావించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఈ సారి ఆదితి గజపతిరాజు గెలిస్తే రాజకీయ పరంపర కొనసాగే అవకాశం ఉంది. లేదంటే విజయనగరం రాజులు రాజకీయాలను వీడి కోటకే పరిమితమయ్యే పరిస్థితులు ఉంటాయి’’ అని పొలిటికల్ ఎనలిస్ట్ యుగంధర్ రెడ్డి చెప్పారు.

బొబ్బిలి

ఫొటో సోర్స్, lakkojusrinivas

మద్రాస్‌ను శాసించిన బొబ్బిలి రాజులు

1652లో మొఘలులు కళింగదేశంపై దండెత్తారు. మొఘల్ బాదుషాల తరపున సేనాని షేర్ మహమ్మద్ ఖాన్ ఈ దండయాత్ర చేశారు. షేర్ ఖాన్ ఆనాటి చికాకోలు (శ్రీకాకుళం) నవాబుగా ఉండేవారు. ఈ షేర్‌ఖాన్ కళింగ సీమపై దాడి చేసినప్పుడు ఆయనకు వెంకటగిరి సంస్థానానికి చెందిన పెదరాయుడు సహాయం చేశారు.

ఈ యుద్ధంలో మొఘలులు విజయం సాధించడంతో, అందుకు సహకరించిన పెదరాయుడికి మొఘలులు రాజాం ఎస్టేటును షేర్ ఖాన్ ద్వారా బహుమతిగా ఇచ్చారని కొల్లూరు సూర్యనారాయణ చెప్పారు.

ఆ తర్వాత ఈ ఎస్టేట్‌లో పెదరాయుడు కోటను నిర్మించి దానికి పెద్దపులి అని పేరు పెట్టారు. అదే కాలక్రమంలో పెబ్బులి, బెబ్బులిగా, ప్రస్తుతం బొబ్బిలిగా స్థిరపడింది. బొబ్బిలి పేరు చెప్పగానే తెలుగు వారందరికి గుర్తొచ్చేది బొబ్బిలి యుద్దమే.

బొబ్బిలి

ఫొటో సోర్స్, lakkojusrinivas

తెలుగు నేలపై ఎన్ని యుద్దాలు జరిగినా బొబ్బిలి యుద్ధానిది ప్రత్యేక స్థానమని కొల్లూరి సూర్యనారాయణ తెలిపారు.

బొబ్బిలి సంస్థాన రాజైన ‘రావు శ్వేతా చలపతి రామకృష్ణ రంగారావు’ 1932లో జస్టిస్ పార్టీ నుంచి మద్రాస్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎన్నికై 1937వరకు మద్రాస్ ప్రెసిడెన్సీకి ముఖ్యమంత్రిగా పనిచేశారు.

ఆ తర్వాత రామకృష్ణ రంగారావు కుమారుడైన ఎస్ఆర్కే రంగారావు కూడా 1967లో శాసనసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత బొబ్బిలి వంశీయులు రాజకీయాల్లో పెద్దగా ఆసక్తి చూపలేదు.

2004 వ‌ర‌కు రాజకీయాలకు దూరంగా ఉంటూ మ‌ద్రాస్‌లో వ్యాపారాలు చేసుకున్న బొబ్బిలి రాజులు... 2004 ఎన్నిక‌ల్లో మళ్లీ రాజ‌కీయాల్లోకి వ‌చ్చి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి, ఎమ్మెల్యేలు అయ్యారు. సుజ‌య్ కృష్ణ రంగారావు 2004, 2009లో కాంగ్రెస్ నుంచి 2014లో వైసీపీ నుంచి గెలిచారు. అనంతరం అధికార టీడీపీలో చేరి మంత్రి పదవి పొందారు. అయితే, 2019 ఎన్నికల్లో పరాజయం పొందారు.

ప్రస్తుతం సుజయకృష్ణ రంగారావు సోదరుడు బేబినాయన (రాజా కృష్ణ రంగారావు) టీడీపీ తరపున బొబ్బిలి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్నారు.

కురుపాం పోర్టు

ఫొటో సోర్స్, Lakkojusrinivas

ఫొటో క్యాప్షన్, విజయనగరం జిల్లాలోని కురుపాం, మేరంగిలు గిరిజన ప్రాంతాలు.

గిరిజన రాజుల ప్రభావం ఎలా ఉంది?

విజయనగరం జిల్లాలోని కురుపాం, మేరంగిలు గిరిజన ప్రాంతాలు. ఈ రెండు సంస్థానాలు కూడా కురుపాం నియోజకవర్గం పరిధిలోకే వస్తాయి. ఇక్కడ రాజులుగా, జమిందార్లుగా ఉన్న వంశీయులు ఇప్పుడు రాజకీయాల్లో కూడా కొనసాగుతున్నారు.

కురుపాం రాజవంశానికి చెందిన వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్ దాదాపు రెండు దశాబ్దాలకు పైగా పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు. అరకు, పార్వతీపురం పార్లమెంట్ స్థానాలలో ఎంపీగా గెలిచారు.

1977లో మొదటిసారి ఎంపీగా గెలిచిన నాటి నుంచి 5 సార్లు లోక్‌సభ, ఒకసారి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. కేంద్ర మంత్రిగానూ చంద్రదేవ్ బాధ్యతలు నిర్వర్తించారు.

కురుపాం సంస్థానం

ఫొటో సోర్స్, Lakkojusrinivas

ఫొటో క్యాప్షన్, కురుపాం సంస్థాన వారసుడిగా వైరిచర్ల వీరేష్ చంద్ర దేవ్ ప్రస్తుతం టీడీపీ పార్టీలో పని చేస్తున్నారు.

కిశోర్ చంద్రదేవ్ 2014, 2019 ఎన్నికల్లో వరుసగా కాంగ్రెస్, టీడీపీల నుంచి అరకు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. అయితే, ప్రస్తుతం రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన చేశారు. కురుపాం సంస్థాన వారసుడిగా వైరిచర్ల వీరేష్ చంద్ర దేవ్ ప్రస్తుతం టీడీపీ‌లో ఉన్నారు.

మరో సంస్థానం చినమేరంగిలో శత్రుచర్ల కుటుంబం కూడా కురుపాం నియోజకవర్గం రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటోంది.

శత్రుచర్ల విజయ రామరాజు కాంగ్రెస్ పార్టీలో మూడుసార్లు ఎంపీగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై...మంత్రి పదవులను చేపట్టారు.

పుష్ప శ్రీవాణి

ఫొటో సోర్స్, lakkojusrinivas

ఫొటో క్యాప్షన్, కురుపాం నుంచి పుష్పా శ్రీవాణి వైసీపీ పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్నారు.

ఆ తర్వాత శత్రుచర్ల వంశానికి కోడలిగా వచ్చిన పాముల పుష్ప శ్రీవాణి గత ఎన్నికల్లో కురుపాం నుంచి గెలిచి, డిప్యూటీ సీఎంగా పదవి చేపట్టారు.

ఇప్పుడు శత్రుచర్ల వంశ రాజకీయ వారసురాలిగా కురుపాం నుంచి పుష్పా శ్రీవాణి, వైసీపీ పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్నారు.

పోటీ ఎందుకు చేయడం లేదు?

ఉత్తరాంధ్రలోని రాజ కుటుంబాలు రాజకీయాల్లోకి వచ్చిన కొత్తల్లో వీరికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అయితే ఆ తర్వాత క్రమంగా వీరికి పోటీగా సామాన్యులే ఎదురు నిలిచి విజయాలు సాధించారు.

“వారసత్వ రాజకీయాల్లో ఆ కుటుంబాల మధ్య ఉన్నటువంటి భేదాభిప్రాయాలు ఒక కారణమైతే, మరోకటి ఆయా రాజకుటుంబాలు పోటీ చేస్తున్న నియోజకవర్గాలు ఇతర కులాలకు కేటాయించడంతో రాజ కుటుంబీకులకు అవకాశం ఉండటం లేదు.’’ అని ఈ పరిణామాలను బీఆర్ అంబేద్కర్ యూనివర్సీటీ జర్నలిజం విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లీలా వరప్రసాద్ విశ్లేషించారు.

రాజ కుటుంబాల నుంచి వచ్చిన వీరు రాజకీయాల్లో మాస్ లీడర్లుగా ఎదగలేకపోవడం కూడా మరో కారణమని లీలా వరప్రసాద్ బీబీసీతో చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)